‘సత్యం శివం సుబహనల్లాహ్’ – A Hindu Muslim Camaraderie!

(Written by Saif Ali Syed)

నేను ముస్లిం అయితే ఏమిటి?
నువ్వు హిందువైతే ఏమిటి?
నీ గుడిముందు బిచ్చగాళ్ళు హిందువులే అయినా నువ్వు గుండెలకు హత్తుకోవు
మసీదు ముందు ఫకీర్లు ముస్లిములే అయినా నేను హత్తుకోను.
.
నువ్వు ఎన్ని వ్రతాలు చేసుకున్నా
నేను ఎన్ని రోజా లు పాటించినా
నువ్వు టాక్స్ ఎగ్గోట్టెందుకు ఏ సెక్షన్లు వెతుక్కుంటావో
నేను అవే సెక్షన్లు ఫాలో అవుతాను.
.
నీ మంత్రాలు సంస్కృతం అయినా
నా సూరాలు అరబ్బి అయినా
మన పిల్లల్ని ఇంగ్లీషు మీడియం మానిపించే ధైర్యం నీకు లేదు
నాకూ లేదు.
.
నువ్వు గుడికెళ్ళే దారిలో
ఏ గుంతల రోడ్డులో ధక్కా ముక్కీలు తింటూ వెళ్తావో
నేను అదే కంకర తేలిన నాసిరకం రోడ్డులో మసీదు కు వెళ్తాను.
.
నీ పండగలకు ఏ వెజ్ వంటలు చేసుకోవాలన్నా
నా పండుగులకు ఏ నాన్ వేజ్ వంటలు వండుకోవాలనుకున్నా
కిరాణ కొట్టులో ధరల పట్టికలు ఇద్దరికి భయపెడుతూనే ఉంటాయ్.
.
నువ్వు కళ్ళ మధ్య ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నా కానీ
నేను కళ్ళ లో ఏ సుర్మా పూసుకున్నా కానీ
ఎవరి కళ్ళు కూడా
ఏ కల్తీని గుర్తుపట్టలేక జిందగీలు మోసపోతూనే ఉంటాయ్ .
.
నువ్వు నదులలో పుణ్య స్నానం ఆచరించాలన్నా
నేను నదుల ఒడ్డున ఏ దర్గామసీదు లో వజూ చేసుకోవాలన్నా
కలుషితమై ఎండిపోతున్న ఈ బురదనీళ్ళే మనకు దిక్కవుతుంటాయ్ .
.
నువ్వు ఏ పానకం చేసుకోవాలనుకున్నా
నేను ఏ పాయసం చేసుకోవాలనుకున్నా
ఇద్దరి వి నీళ్ళ క్యాను కొనుక్కునే బతుకులై నిరీక్షిస్తుంటాయ్.
.
నువ్వు వాస్తు చూసి ఇల్లు కట్టుకున్నా
నేను వాస్తు లేక ఇళ్ళు కట్టుకున్నా
మన ఇంటి ముంగిట డ్రైనేజులు మన సహనాల్ని పరీక్షిస్తూనే ఉంటాయ్ .
.
పవిత్ర దేశం అని నువ్వేదో అనుకోవడం
సారే జహాసే అచ్చా అని నేను పాడుకోవడమే కానీ
స్వేచ్చగా ఊపిరి తీసుకోలేక
పోల్యూషన్ కు ఇద్దరం ముక్కులు మూసుకోని తిరుగుతూనే ఉంటాం .
.
రోజూ గోమూత్రం తాగినందుకు నీకు ఎవడూ జీతం ఇవ్వడు
పవిత్ర జం జం నీళ్ళు తాగినందుకు నాకు ఎవడూ తనఖా ఇవ్వడు
నేను ఏ గడ్డం అరబ్ వాని వద్దకు వెళ్ళినా
ఇదే స్వర్గాదపి గరియసి నువ్వు అనుకున్నా
మనం చెమట చుక్కలు చిందించనిదే మనకెవడూ బువ్వ పెట్టడు.
*
నువ్వే పండుగ నవరాత్రులు చేసుకున్నా
నేను ఏ పండుగ మాసాలు చేసుకున్నా
బ్లాక్ మనీ దొంగల్ని ఏ దేవుడు కూడా పూర్తిగా పట్టుకోలేడు అని ఒప్పుకుంటాము
.
నీ సంప్రదాయం లో పిల్ల పెళ్ళిచేసినా
నా తరీఖా లో బేటి పెళ్ళి చేసినా
మా లో మంచోడు దొరుకుతాడొ లేదో అనే ఇద్దరం భయపడుతూ వెతుకుతుంటాం.
.
మనిద్దరికి తెలుసు
వర్షాకాలం వస్తుందంటే కాగితం పడువల ఆనందం పోయి
మన అపార్ట్మెంట్లు ఎప్పుడు మునుగుతాయో ఫికర్
నీకు ఉంది నాకు ఉంది
.
మనిద్దరికి తెలుసు
నా గజల్ ఖవ్వాలి లాగే
నీ తియ్యని ఆలాపన ఏదో ప్రమాదం లో ఉంది .
మనమిద్దరి గొంతుల్ని ఏదో రాజకీయం కబ్జా చేసేస్తుంది.
*
మనిద్దరికి తెలుసు
నేను ముస్లిం అయితే ఏమిటి ?
నువ్వు హిందువు అయితే ఏమిటి?
మేం ఇద్దరం ఒప్పుకునే నిజం మాత్రం ఒకటున్నది
నువ్వు అమెరికా పోయినా
నేను ఏ అరబ్ కు వెళ్ళినా
we know where is our home అనే
సత్యం . శివం . సుబహనల్లాహ్ అది.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments