An Introspection Of A Guy About His Love & His Parents

 

Contributed by Ravi Teja Ayyagari

పౌర్ణమి

RK బీచ్… విశాఖపట్నం…

పున్నమి వెన్నెల రాత్రి. నిండు చంద్రుడిని చూసి, చుక్కలు సిగ్గుతో మెరిసిపోతుంటే, ఆ మెరుపుకి ఆకాశం కళకళలాడిపోతుంటే, భూమి మీద ఆ వెన్నెల అందం గురించి మనుషులు మాట్లాడుకుంటే అది ఎలా ఉంటుందా అన్నట్టు, ఆ వెన్నెల తన అందం తాను చూసుకోవడానికి సంద్రాన్ని అద్దంలా ఉపయోగించుకుంటూ, మురిసిపోతున్న పున్నమి చంద్రుడి రాత్రి. ఇవేమి అర్థం కాక అక్కడే ఇసుకలో కూర్చున్న ముగ్గురు అపరిచితులు. ఒక యువకుడు, ఒక మధ్య వయసు తల్లి, ఒక పెద్ద వయసు గల తండ్రి.

పెద్దాయన: బాబు, నా ఫోన్ లో ఛార్జ్ అయిపొయింది. ఒక సారి నీ ఫోన్ లో ఈ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేసి ఇస్తావా?

అబ్బాయి: అలాగే అండి.

పెద్దాయన: ఎమ్మా! బాగున్నావా? అల్లుడుగారు ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు టైం ఎంతయ్యింది? పిల్లలు ఎలా ఉన్నారు? సరే నాన్న, ఉంటాను. జాగ్రత్త.

చాల థాంక్స్ బాబు.

అబ్బాయి: పర్లేదు సర్.

పెద్దాయన అక్కడే కూర్చున్నారు.

పెద్దాయన: నా కూతురు బాబు. అమెరికాలో ఉంటుంది. తల్లి లేదు కదా, చాలా గారాబంగా పెంచాను. దేశం కానీ దేశంలో భర్త తనని బాగా చుస్కుంటున్నాడో లేదో. దాని తల్లి చనిపోయినప్పుడు దానికి తొమ్మిది రోజులు. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎక్కడ ఆ వచ్చిన భార్య దీన్ని సరిగ్గా చూస్కొడా అని తల్లి తండ్రి నేనే అయ్యి చాలా గారాబంగా పెంచాను. 3 సంవత్సరాల క్రితం పెళ్లయింది. ఇంక నా బాధ్యత తీరిపోయినట్టే. అయినా పిల్లలు బాగుంటేనే కదా మనం బాగుండేది. సరే బాబు. ఉంటాను. చీకటి పడిపోయిందిగా, ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారేమో. బయలుదేరు.

అలా చెప్పి, ఆ పెద్దాయన వెళ్లిపోయారు. ఆ అబ్బాయి కూడా అక్కడ నుంచి వెళ్దాం అనుకునే సరికి, ఒక ఆవిడని ఒక ఇద్దరు వెంట తరుముతూ ఉంటారు. ఆ అబ్బాయి ఆవిడని కాపాడి, ఆవిడకి తోడుగా వెళ్లి ఆవిడా ఉండే చోట దిగపెడతాడు. ఆవిడ ఉండేది ఒక వేశ్య గృహం. అది గమనించిన ఆ అబ్బాయి అక్కడ నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. ఈ లోపులో ఆవిడ,

ఆవిడ: బాబు! నేను చేసే పని ఇదా అని నీకు నా మీద అసహ్యం కలగొచ్చు. నన్ను కట్టుకున్న భర్త ఇక్కడ అమ్మేశాడు. నాకు 9 సంవత్సరాల బాబు ఉన్నాడు. హాస్టల్ లో ఉంది చదువుకుంటున్నాడు. వాడి కోసమే నా బ్రతుకు. ఇక్కడ నుంచి వెళ్లే స్వేచ్ఛ నాకు లేదు. నేను అంటూ ఉన్నాను అని వాడికి తెలియదు. కానీ వాడి చదువు కోసం, వాడి సుఖం కోసం ఈ పని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ, వాడిని చదివించుకుంటున్నాను. వాడు ఒక ప్రయోజకుడు అవ్వాలన్నదే నా కోరిక. నువ్వు చేసిన ఈ సహాయానికి నీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.

అని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అటు నుంచి వెనక్కి వెళ్తున్న ఆ అబ్బాయి కళ్ళల్లోంచి నీళ్లు కారడం మొదలుపెట్టాయి.

అబ్బాయి (తనలో తాను): భార్య లేకుండా జీవితం అంత బ్రతికిన ఒక భర్త. భర్త మూలంగా వేశ్య అన్న ముద్ర పడ్డ ఒక భార్య. కట్టుకున్న పెళ్ళాం దూరం అయినా కూతురి కోసం జీవితం గడిపిన భర్త. భర్త ద్రోహం చేసినా కొడుకు కోసం బ్రతుకు బండిని నడిపిస్తున్న భార్య. చివరి రోజుల్లో ఒంటరి జీవితం బ్రతుకుతున్న ఒక మగడు. కోరుకున్న బాట కాకుండా క్రూరమైన మార్గంలో తప్పికుపోయిన ఒక స్త్రీ.

ఒక తండ్రికి కూతురుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే అవకాశం లేదు. ఒక తల్లికి కొడుకుని చూసుకునే అదృష్టం కూడా లేదు. అయినా కానీ, వాళ్ళ ప్రేమలో ఎటువంటి కల్మషం లేదు. కొడుకుని చూసుకోలేను అని తెలిసినా కూడా, కొడుకు బాగు కోరుకునే ఒక తల్లి. కూతురు దూరంగా ఉన్నా ఎప్పటికప్పుడు బాగోగులు చూసుకునే ఒక తల్లి. ఆ ఇద్దరు పిల్లలో ఒకరికి తల్లి లేదు, ఒకరికి తండ్రి లేదు. కానీ ఇద్దరి ప్రేమ చూపించే తల్లి ఒకరికి, తండ్రి ఒకరికి ఉన్నారు.

అలాంటిది ఇద్దరు ఉండి, ఇద్దరి ప్రేమ పొందగలిగే అదృష్టం ఉన్నా నేనేమో సంవత్సరం క్రితం వదిలేసి వెళ్లిపోయిన ఒక అమ్మాయి కోసం, ప్రపంచంలో అన్నిటి కంటే స్వచ్ఛమైన ప్రేమ అందించే అమ్మ, నాన్నల గురించి ఆలోచించకుండా ఇలా కృంగిపోతున్నానా?ఒంటరిని అని చెప్పుకోడానికి అస్సలు వీలు లేదు. ఆ ఆవిడ లాగా నీచమైన బ్రతుకు కూడా కాదు. అసలు నేను బాధ పడాల్సిన కారణం ఒక్కటి కూడా లేదు. జీవితంలో ఆనందం మనదగ్గరే ఉంటుంది అని తెలుసుకోవడానికి సంవత్సరం పట్టిందా? ఛా! నా మీద నాకే అసహ్యం వేస్తోంది.

అలా ఒక ఘడియ తన వొంట్లో పశ్చాత్తాపం అంత కళ్ళల్లో నీళ్ల రూపంలో బయటకి వచ్చింది. చిన్నప్పుడు సైకిల్ తోకేటప్పుడు 2-3 సార్లు కింద పడతాం. ఆలా అని సైకిల్ తొక్కడం మానేసామా? జీవితం కూడా అంతే. జీవితంలో మనకి తగిలే గాయం ఎప్పటికైనా నయం అవ్వాల్సిందే. సైకిల్ ప్రయాణం లాగా పడుతూ లేస్తూ ముందుకి సాగడమే. అప్పుడు ప్రతి మనిషి జీవితం పౌర్ణమే. ఈ వసుదైక కుటుంబంలో నా తోటి కుటుంబీకులైన ప్రతి ఒక్కరికి నా ఈ కథ అంకితం. జై హింద్!

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: ,