All That You Need To Know About The Great Ramappa Temple Near Warangal!

అధ్యాత్మిక పరంగా, చారిత్రక నేపధ్య పరంగా, శిల్ప సౌందర్య పరంగా, దేవాలయ మహిమ పరంగ రామప్ప దేవాలయం ఉన్నత దేవాలయంగా మన్ననలు అందుకుంటున్నది. ఓరుగల్లు అంటేనే కళలకు, ఉద్యమాలకు, విద్యకు, గొప్ప దేవాలయాలకు నెలవు. ఇలాంటి ప్రదేశంలో నెలకొని ఉన్న మరో గొప్ప దేవాలయమే రామప్ప దేవాలయం. వరంగల్ నగర కేంద్రం నుండి సుమారు 70కిలోమీటర్ల దూరంలో గల పాలంపేట అనే గ్రామం సమీపంలో ఈ పురాతన గుడి ఉంది. ఈ దేవాలయంలో ప్రధానంగా పరమేశ్వరుని కొలుస్తారు. భారతదేశంలో చారిత్రిక శిల్ప సౌందర్యం ఉన్న గొప్ప దేవాలయాలలో రామప్ప కూడా ఒకటి.

ప్రధానంగా ఈ గుడిలో శివుడు పూజలందుకుంటున్న కాని ఈ దేవాలయాన్ని పరమేశ్వరుని నామంతో కాక ఈ ఆలయాన్ని అద్భుతమైన శిల్పాలతో చెక్కిన రామప్ప అనే శిల్పి పేరు మీదుగా ఈ గుడిని పిలవడం విశేషం. ఇక్కడి శిల్ప సౌందర్యానికి పరవశించిపోయిన భక్తులు ఈ దేవాలయాన్ని రామప్ప గుడిగా పిలవడం ప్రారంభించారు. అలాగే “రామప్ప, ఈశ్వర” పేర్లను కలుపుతూ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని కూడా ఈ కోవెలను పిలుస్తారు. ఈ క్షేత్ర నిర్మాణం వెనుక సుమారు 800 సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీ.శ1213 సంవత్సరంలో కాకతీయ రాజైన రేచర్ల రుద్రుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ గుడిని నిర్మింపజేశారు. చరిత్రలో నిలిచిపోయిన మహాశిల్పి రామప్ప మరియు అతని శిష్యబృందం కలిసి చాలా సంవత్సరాల పాటు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ ఆలయాన్ని సుందర రమణీయంగా నిర్మించారు.

సాధారణంగా చాలా దేవాలయాలు పరిమితమైన ప్రదేశంలో నిర్మితమై కాస్త ఇరుకుగా ఉంటాయి.. దీని మూలంగ భక్తులలో దైవంపై ఉండే ప్రేమ, అధ్యాత్మిక భావనకు భంగం కలిగే అవకాశం ఉంది. కాని రామప్ప దేవాలయం 20ఎకరాల సుందర పచ్చని ప్రకృతిలో నిర్మించడం మూలంగ భక్తులు ఇక్కడ శిల్ప సౌందర్యాన్ని తనివితీర దర్శించడంతో పాటు, దైవ దర్శనం కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి రాతిలో శిల్పం కనిపిస్తుంది అలాగే ఆ ప్రతి శిల్పంలో జీవం కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

అంతేకాకుండా ఇక్కడున్న శిల్పాలలో కొన్ని సప్తస్వరాలు పలికించడం మరో విశేషం. ఈ దేవాలయాన్ని ఆనుకుని రామప్ప సరస్సు ఉంది. ఈ సరస్సు కాకతీయుల కాలం నాటిది అని చరిత్ర. అప్పటి నుండి ఇప్పటికి ఎన్నో వేల ఎకరాల పంటలకు ఆధారంగా ఉంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.
If you wish to contribute, mail us at admin@chaibisket.com