Chai Bisket’s Story Series – గోవిందరాజులు (EP05)

జరిగిన కథ – రాధే గోవింద, GREP01, GREP02, GREP03, GREP04

ప్రకృతి వైద్యశాలలో ప్రధానాచార్యుడిని కలుసుకొని, మా ఊరిలో సమస్యలను వివరించాం. వీలుంటే ఆయన్నే ఓ నెల రోజులు మా ఊరిలో ఉండమని కోరినా, ఆయనకు కుదరని కారణంగా వారి ప్రియశిష్యుడైన ప్రకాశాన్ని తీసుకెళ్ళమని చెప్పారు. ప్రకాశం అనే ఇరవై రెండేళ్ళ కుర్రాడు విద్యలో గురువును మించిన శిష్యుడు. రూపంలో మచ్చలేని చంద్రుడు. మాట తీరులో వివరం తెలిసిన యువకుడు. అతన్ని చూడగానే, మా ఊరి సమస్యలను తీర్చే మార్గదర్శి దొరికాడని మాకో నమ్మకం కలిగింది. అతని గురించి, అతని కుటుంబం గురించి వాకబు చేసాం ఓ రెండు రోజులు అక్కడే ఉండి. అతనో అనాధ, ప్రధానాచార్యుల వారికి ఏడేళ్ళ పిల్లోడిగా దొరికాడట. అప్పటి నుండి దగ్గరే ఉంచుకొని, సొంతబిడ్డలా చదువు, సంస్కారాలు నేర్పించారు ఆయన. అతని మీద ఎటువంటి ఫిర్యాదులు లేవు. పిల్లలతో, ఆడ వాళ్లతో, పెద్ద వాళ్ళతో, రోగులతో, సాటి వారితో అతని ప్రవర్తన కళ్ళారా చూసిన మాకు అతని వ్యక్తిత్వంపై గట్టి గురి కుదిరింది. ఇతను మా ఊరిలో ఉండడం వలన మాకు వేరే ఏ విధమైన సమస్యలు వచ్చే అవకాశం లేకపోగా, మా ఊరు ఆరోగ్యంగా మారిపోతుంది అనే నమ్మకం బలపడింది అందరికి. మా ఊరికి వచ్చి, మా సమస్యలు తీర్చమని అతన్ని అడిగాం. అతను మొదట రానున్నాడు, అయ్యవారిని విడిచి తాను మా ఊరి వచ్చి ఉండిపోవడం కుదరదన్నాడు. అతనికి ఏమి చెప్పాలో మాకు అర్ధమవ్వలేదు. మా ఊరిలోనే ఉండే వైద్యుడు దొరికితే, ప్రతీ ఆరు నెలలకు ఓ కొత్త వైద్యుడిని వెతికే సమస్య ఉండదని మా ఆశ. మా ఊరిలోనే ఉండేలా వచ్చేస్తే అందరికీ మంచి జరుగుతుంది, మాసానికి ఓ మారు అయ్యవారిని చూడడానికి రావచ్చు మీరు, మీకోసం ఓ ప్రత్యెకమైన ఇల్లు, అవసరమైన సామగ్రి అన్నీ మేమే సమకూరుస్తాం, మీరు కోరినంత మాకు కుదిరినంత జీతంగా ఇస్తాం, మా ఊరిలో సమస్య మరీ తీవ్రంగా ఉందండీ, అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను, ఇంత కన్నా ఎక్కువ చెప్పి మిమ్మల్ని ఇబ్బందిపెట్టలేను. ఇక మీ అభిప్రాయం పైన ఆధారపడి ఉంది మా తర్వాతి గమ్యం.

ఆ తర్వాత ఓ గంటసేపు ప్రధానాచార్యులతో సంభాషణ జరిపాడు ప్రకాశం(ఆయుర్వేద వైద్యుడు), నన్ను లోపలకు పిలిచారు. ప్రధానాచార్యులు “మీరు అంతగా అడుగుతున్నారు కనుక, మీకీ విషయం చెప్తున్నాను. మా పెద్దోడికి(ప్రకాశం) రెండే కోరికలు. ఒకటి నేనున్నంత కాలం నాతో ఉండాలని, రెండు బాగా డబ్బు సంపాదించాలని. మీకోసం, మీ ఊరికోసం నన్ను విడిచి వచ్చేలా నేను సర్దిచెప్పగలను, కానీ డబ్బు మట్టుకు వాడి ఇష్టం. మీరు ఇందాకా జీతం గురించి ఏదో అన్నారట, ఎంత ఇవ్వగలరో చెప్తే అప్పుడు ఓ నిర్ణయం తీసుకోగలను అంటున్నాడు.” జీతంగా రెండు వందలు పోను, తిండి ఖర్చు మొత్తం మాదే. ప్రతీ నెల ఓ రోజు మీ దగ్గరకి వచ్చి వెళ్లేందుకు అయ్యే ఖర్చులు మావే. ఇక, మందు బిళ్ళలు, కాషాయాల తయీరికి అయ్యే ఖర్చు అంతా మేమే భరిస్తాం. “ఏమంటావ్ రా మరి ?” అని ఎదురుగా ఉన్న ప్రకాశాన్ని అడిగారు ఆచార్యులు. “ఊరిలో తిరిగేందుకు ఓ సైకిలు, జీతంగా మూడు వందల రూపాయలు, నాకొక్కడికే ఓ ప్రత్యేకమైన ఇల్లు ఇచ్చేట్టైతే వెళ్తానండి”. “మీరేమంటారు గోవిందరాజులు గారు ?”. ఇస్తాము, కానీ ఒక్క షరతు. “ఏంటి ?”. మీరు అందరు రోగులతో ఒకేలా ప్రవర్తించాలి, ఎవ్వరి దగ్గరినుండి ఒక్క పైసా కూడా తీసుకోకూడదు. మీ దృష్టికి ఆరోగ్యవంతులు, జబ్బుచేసినవారు అనే రెండు వర్గాలే తప్ప పేద, ధనిక, తన, మన అనే భేదాలు ఉండకూడదు. “అందులో ఎటువంటి వ్యత్యాసం జరగదు. అది నా పూచి.” అని ఆచార్యుల వారు హామీ ఇచ్చారు. అందరం ఊరికి వచ్చాం కొత్త వైద్యుడితో, డబ్బు కూసింత ఎక్కువే అవుతున్నా, ఊరు ఆరోగ్యంగా ఉంటుందని ఒప్పుకున్నాను నేను. ఊరి మొదట్లో ఖాళీగా ఉంటున్న మా ఇంటిని, శుభ్రం చేయించి వైద్యుడిని అందులో ఉంచాం. అతనికి కావాల్సిన సామగ్రి అంతా అందుబాటులోకి తీసుకొచ్చాం. అతను వచ్చిన మొదటి రోజు నుండే వైద్యం ప్రారభించాడు, అతని ప్రవర్తన, చికిత్సా విధానం అందరికి బాగా నచ్చింది.

ఊరు, జనం, ఆ సమస్యల్లో పడి రాధమ్మను, తాతగారిని పట్టించుకోవడం కుదరడంలేదు. తాతగారిని ఎప్పుడు కలిసిన ఒకే మాటా. పెళ్ళెప్పుడు చేసుకుంటావ్ అని. ఆయనకు గుర్తు ఉండక అడగుతారో, నేను మర్చిపోయాననుకొని అడుగుతారో తెలీదు కానీ, నెలకో రెండు మూడు సార్లు ఈ వాదన జరుగుతూనే ఉంటుంది మాకు. రాధమ్మకు వచ్చే ఏడాదితో పద్దెనిమిది నిండుతాయి, అప్పుడు తన అభిప్రాయాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుందని ఎన్ని సార్లు చెప్పినా ఆయన వినరు. చాలా రోజులతర్వాత కొద్దిగా ఖాళీ సమయం దొరికి, రంగడితో పాటుగా అమ్మ, నాన్నల దగ్గరికి వెళ్లాను. అమ్మా… నువ్వు అడిగినట్టే రాధమ్మను ప్రాణంలా చూసుకుంటున్నాను. తాతగారు పెళ్లి చేసుకోమని పలుమార్లు అడుగుతున్నారు. చిన్నపిల్లని ఎలా చేసుకోను, దానికి కనీసం ఓ పద్దెనిమిదేళ్ళయినా రావాలిగా, లోకం పోకడ తెలియాలిగా, మనుషుల ప్రవర్తన అర్ధం చేసుకునే ఇంగితం కలగాలిగా, దానికంటూ ఓ ఆలోచన పెరగాలిగా. తాతగారికి ఇవన్నీ తెలీదని కాదు, మా పెళ్లి చూడాలని ఆయన కోరిక. కోరికలదేముంది ఖర్చు లేదు, కష్టంలేదు కాబట్టి ఎన్నైనా కోరవచ్చు. నాకూ కోరికలుంటాయిగా, నా పెళ్ళిలో మీరుండాలని, మీ కళ్ళముందు నా పెళ్లి జరగాలని, మీ చేతులు దీవించాలని, మీ కళ్ళు ఆనందించాలని నాకు ఉంటుంది కదమ్మా, అదెవరికి చెప్పాలి. ఏడుపొస్తుందమ్మా…చిన్నప్పుడు ఏదైనా నీకు నచ్చని పని చేసుంటాను, దానికే కదా ఈ జీవితకాలపు శిక్ష. నేనంటే ఇష్టం అంటావే, మరి ఎందుకమ్మా ఈ కష్టాల కాష్టంలో వదిలేసి వెళ్లిపోయావ్. మీ దగ్గరికి వచ్చేయాలని, మీతో ఉండాలని అనిపిస్తుందమ్మా అప్పుడప్పుడు, కానీ… ఆ రోజు నీకిచ్చిన మాటని బ్రతికించడంకోసం నేను ప్రతిక్షణం మరణిస్తున్నాను. నాన్న గారు…మీరు చెప్పినట్టే చేస్తున్నానండి. మీ జనాలకు ఎటువంటి సమస్య లేకుండా చూస్తున్నానండి. ఐనా నా పిచ్చిగాని, మీకు ప్రత్యేకంగా ఇవన్నీ చెప్పాలా. మీరు చూస్తూనే ఉండుటారుగా.

ఇలా రాస్తుండగా, ఉన్నట్టుండి ఎవరో కదిలించునట్టుగా అనిపించింది. మళ్ళీ, ఈ లోకంలోకి వచ్చి చూస్తే, నా చుట్టూ ఎవ్వరు లేరు. టైం చూస్తే, నేను రాయడం మొదలెట్టి చాలా సమయం గడిచిపోయినట్టు అనిపించింది. కొద్దిగా ఆకలిగా అనిపించి, ఏదైనా తిందామని చూస్తే, బాగ్ లో ఏమి లేవు. సరే అని, దగ్గర్లో ఏమైనా ఉందేమో అని వెళ్లాను. కొద్దిదూరం ప్రయాణం తర్వాత, ఓ చిన్న డబ్బీ కొట్టు దగ్గర ఆగి టీ తాగుతూ చూస్తున్నాను. అక్కడి వాతావరణం, ఆ ప్రదేశం, ఆ మనుషులు, వారి వేషధారణం, మాటతీరు అంతా కొత్తగా ఉంది. నేనా ప్రదేశానికి రావడం మొదటిసారి, దగ్గర్లో ఉన్న మైలురాయి పైన చూస్తే మా ఊరు చాలా దూరం ఉన్నట్టు అర్ధమైంది. చాలా దూరం వచ్చానని అర్ధమైంది. ఆ ఊరిలోనే ఎందుకు ఆగాను ? ఆ సరస్సు దగ్గరే ఎందుకు కూర్చున్నానో తర్కానికి అందలేదు. వెనక్కి వెళ్లి మళ్ళీ ఆ సరస్సు దగ్గర కూర్చొని రాయడం మొదలెట్టాను.

అమ్మా, నాన్న సమాధుల దగ్గర కూర్చొని రంగడితో మాట్లాడుతున్న గోవిందుకు ఆ దగ్గర్లో ఎదో పెద్ద రాయి కిందపడిన అలికిడి వినపడింది. ఎవర్రా అంటూ లేచి ఆ వైపుగా పరిగెత్తాడు, అతని వెనుకనే రంగడు. స్మశానం చివర ఉన్న పాడుబడిన ఎండిపోయిన బావి ఆ వైపుగా, గోవిందుకు వీపు కనిపించేలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఓ అమ్మాయి, అబ్బాయ్. గోవింద్… ఎవరది ? జయమ్మ ? అని అడగ్గానే, ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగారు వాళ్ళు. గోవిందుకు ఎదురుగా ఉన్నది జయమ్మ, రాజయ్య అని తెలిసింది. గోవిందుని చూడగానే రాజయ్య మొహంలో ఏమవుద్దో అనే భయం, జయమ్మ కంట్లో ఏమంటాడో అనే ఆందోళన. మీరేంటి ఇక్కడ, ఏం చేస్తున్నారు. తప్పమ్మా, పెళ్లికాని ఆడపిల్ల ఇలా రాకూడదు. అదికూడా స్మశానానికి. పదా, ఏదైనా ఉంటె ఇంటి దగ్గర మాట్లాడకుందాం పదండి. ఇద్దరినీ తీసుకొని, ఇంటికి బయలుదేరాడు గోవిందు. దారిలో, వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, చెప్తే ఏమంటారో అని ఇంట్లో చెప్పే ధైర్యం లేదు, పెళ్లి జరగకపోతే బతికుండాలనే కోరిక లేదు, ఎటువంటి సమస్య లేకుండా ఎలా అయినా వాళ్ళ పెళ్లి జరిపించాలని తెలుసుకున్నాడు గోవిందు. వాళ్ళిద్దరిని ఇంటికి వెళ్ళమని చెప్పాడు. వాళ్ళు వెళ్లిన తర్వాత, జయమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.

గోవిందుని చూసి వాళ్లంతా ఎంతో సంతోషపడ్డారు. “ఏంటి బాబు, మీరు మాలాంటి వాళ్ళ ఇంటికి రావడమా. కలో, నిజమో తెలీడంలేదు. కూర్చోండి బాబు, కూర్చోండి.” అని అమితానందంతో మాట్లాడుతూన్నాడు జయమ్మ వాళ్ళ నాన్న. ఈలోపు వాళ్ళు ఇంట్లో తాగే గ్లాసులో నీళ్లు తీస్కొని వచ్చి ఇవ్వబోయింది జయమ్మ. ఆ గ్లాసుని వెనక్కి లాక్కొని, “బుద్దుందా, బాబుకి మనం వాడే గ్లాసులో నీరిస్తావా.” అని ఇంకేదో అరవబోతుంటే… బాబాయ్, ఆకలిగా ఉంది కొంచెం గంజి పోస్తావా అని అడుగుతాడు గోవింద్. “మీరు మా ఇంట్లో తింటారా…” అని కళ్ళలో నీళ్లతో పరుగున వెళ్లి గంజి, ఉప్పు మిరపకాయలు ప్రత్యేకమైన పాత్రలో తెచ్చి ఇస్తాడు జయమ్మ నాన్న. “బాబాయ్ అన్న తర్వాత కూడా ప్రత్యేకంగా చూస్తారేంటి బాబాయ్, మీరు తినే పాత్రల్లో తెండి. రండి అందరం కలిసి తిందాం. రండి బాబాయ్… జయమ్మ కూర్చొ…” అంటూ అందరికి వడ్డించి వాళ్ళతో తింటుంటాడు గోవిందు. “చాలు బాబు, ఈ జన్మకు ఇది చాలు.” ఊరుకో బాబాయ్… అని ఏవేవో మాట్లాడుతూ జయమ్మ పెళ్లి దగ్గరికి వస్తాడు గోవిందు. ఏంటి బాబాయ్, జయమ్మకు ఏవైనా సంబంధాలు చూస్తున్నారా ? “ఎక్కడ బాబు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. మీకు తెలియనిది కాదుగా.” నాకు తెలిసిన ఓ సంబంధం ఉంది బాబాయ్, మాట్లాడమంటారా ? చాలా మంచి కుర్రాడు, వెనక బాగా ఆస్తులు లేవుకాని మంచి మనసుంది. పువ్వుల్లో పెట్టి చూసుకోలేకపోవచ్చు, పరమాన్నాలు పెట్టకపోవచ్చు కానీ ప్రాణంలా తోడుగా ఉంటాడనే నమ్మకం ఉంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలనే బాధ తనకు లేకుండా మనకు దగ్గర్లోనే ఉంటాడు. మీకు సమ్మతమైతే ఇప్పుడే సంబంధం మాట్లాడడానికి వెళ్దాము. అయ్యో! మీ అభిప్రాయం అడగకుండానే తొందరపడుతున్నాను, చెప్పండి బాబాయ్. ఏమంటారు ? జయమ్మ వాళ్ళ నాన్నకు కళ్ళనిండుగా నీరు నిండిపోయింది. గోవిందు కాళ్ళమీద పడిపోయాడు. “తండ్రిగా నాకు ఆలోచన రాకముందే మీరే ఇంతమంచి సంబంధం వెతుకుంటూ వచ్చి మరి చేస్తానంటే కాదనగలమా. ఎందుకు బాబు మా మీద ఇంత దయ. ఏమిచ్చి మీ ఋణం తీర్చోగలను.” అని ఏడుస్తుంటే గోవిందు పక్కకు జరిగి, ఆయన్ని పైకి లేపి. మీరు నాకు బాబాయ్ అంటే తాను నా చెల్లెలు కదా. ఆ మాత్రం చేయడంలో గొప్పేముందండి. మీరు సిద్ధంగా ఉండండి, నేను అబ్బాయి వాళ్ళని తీసుకొని వస్తాను. రాజయ్య, వాళ్ళ ఇంట్లో మాట్లాడి, కట్నంగా రాజయ్యకు ఓ కుంట భూమి, రెండు సవరలు బంగారం ఇస్తానని మాటిచ్చి, జయమ్మ వాళ్ళింటికి తీసుకొచ్చాడు అందరిని. జయమ్మకు, రాజయ్యకు ఆ తర్వాత ఘనంగా పెళ్లి జరిపించాడు గోవింద్.

గొప్ప పనులు చేస్తూ, గొప్ప పేరు తెచ్చుకునే ప్రయాణంలో కొంతమంది శత్రువులు మనకు తెలీకుండానే తయారవుతారు. ఊరిలో కష్టమున్న ప్రతీ ఒక్కరికి సాయం చేసే దేవుడుగా గోవిందు ఎదిగే క్రమంలో ఆ ఎదుగుదల నచ్చని కొంతమంది నాస్తికులు పెరిగారు. ప్రతీ సమస్య పరిష్కారం తర్వాత ఆ సమస్య సృష్టించిన వాడికి పగవాడుగా గోవిందు మిగిలిపోయేవాడు. గోవిందనే రగిలే జ్వాలను ఆర్పివేసే తుఫాను కురిపించడానికి సరైన సమయంకోసం ఉరుముతు, మెరుస్తూ ఎదురుచూస్తున్నారు చాలామంది. ప్రతీ వాడి సమస్య తీర్చే గోవిందుకు, సమస్యోస్తే ఎదురు నిలిచే గుండె ధైర్యం ఉన్న మనుషులు సంఖ్యా చాలా తక్కువ. ఒకప్పుడు సాయం పొందినవాడైనా, తిరిగి సాయం చేయడానికి ముందుకు వచ్చే రకం కాదు చాలామంది. నేను, నాది, నావాళ్లు బావున్నారా లేదా అనే మనస్తత్వం లోతుగా నాటుకుపోయి ఉన్న మనుషుల కోసం గోవింద్ చాలా సమస్యలు నెత్తిన తెచ్చిపెట్టుకున్నాడు. ఈ విషయాలన్నీ గోవిందుకు తెలుసు కానీ, ఉడుకు రక్తం, కుర్రతనం, కన్నీరు చూస్తే కరిగిపోయే తత్వం వలన పెద్దగా పట్టించుకోలేదు. అప్పటివరకు జనం సమస్యలు చూసిన గోవిందుకు, తనే తెచ్చిపెట్టుకున్న వ్యక్తి వలన ఊహించలేని సమస్య ఎదురవబోతుందని తెలీదు. ఆ సమస్య పేరు ప్రకాశం(ఆయుర్వేద వైద్యుడు).

మిగిలిన కథ తర్వాతి భాగం లో… 19 10 2016

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,