Chai Bisket’s Story Series – గోవిందరాజులు (EP03)

జరిగిన కథ – రాధే గోవింద, GREP01, GREP02

గోవిందరాజులు అని వినగానే, రిషి కొద్దిగా ఆశ్చర్యపోయాడు. తను విన్నది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవడానికి, మరొక్కసారి అడిగాడు… “మీ పేరు ?”. గోవిందరాజులు ?. గోవిందరాజులు అని పలికేప్పుడు గోవింద్ స్వరంలో మార్పు స్పష్టంగా వినిపిస్తుంది, అది అతని గొంతు కాదు. గోవిందరాజులు పేరు విన్న రిషికి ఆశ్చర్యం, ఆసక్తి, ఆందోళన ఈ మూడు ఒకేసారి కలిగాయి. గోవిందరాజులు అనే పాత్ర నిజమేనేమో అనే ఆశ్చర్యం, గోవింద్ కు గోవిందరాజ్ సంబంధం ఏమిటి అనే ఆసక్తి, గోవింద్ కు లేని పాత్రలను ఊహించి, ఊహించి అవి నిజంగా ఉన్నాయనుకునే మానసిక వ్యాధి ఉందేమో అనే ఆందోళన. రిషి, ఆ తర్వాత గోవింద్ ని చాలా ప్రశ్నలు అడిగాడు, అతని నుండి ఎటువంటి సమాధానం రాలేదు, నిశ్చలంగా అలా ఉండిపోయాడు, కనురెప్పలు మూసేసినా అతని కనులు వేగంగా కదులుతున్నట్టు కనిపిస్తుంది. దాదాపు ఓ గంట తర్వాత గోవింద్ కళ్ళు తెరిచాడు. రిషితో ఏమి మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. బయట ఎదురుచూస్తున్న అనుని పట్టించుకోకుండా, వేగంగా ఏదో అత్యవసర పరిస్థితి ఉన్నవాడిలా పరిగెత్తాడు. అతని వెనుకే రిషి, అను పరిగెత్తారు. హాస్పిటల్ బయటకు రాగానే, ఉన్నపళంగా నీరసించి పడిపోయాడు గోవింద్. రిషి, అను గోవింద్ ని హాస్పిటల్ లోనికి తీసుకొచ్చి, సెలైన్ పెట్టి, ఇంజక్షన్ వేస్తున్నారు. అను ఏడుస్తుంది, ఏమైందోనని. రిషికి తెలిసిన పెద్ద పెద్ద డాక్టర్స్ ని పిలిపించారు. అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత అందరూ చెప్పిన మాట ఒక్కటే, “గోవింద్ ఓ రకమైన illusion లో ఇరుక్కుపోయాడు. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే, ప్రస్తుతం అతను కోమాలో ఉన్నాడు. ఆ illusion నుండి అతన్ని బయటకు తీసుకురావచ్చు కానీ, ఇప్పుడు అతన్ని ఎక్కడినుండి తీసుకొచ్చామో ప్రతీ రోజు నిద్రపోగానే మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాడు. మా సూచన ఏంటంటే, అతన్ని ఇలానే కొన్నిరోజులు ఉండనివ్వండి. అతనికి ఏమి తెలుసుకోవాలనుకుంటున్నాడో అది తెలుసుకున్నాక అతనే సాధారణ స్థితికి వచ్చేస్తాడు. అది ఎప్పటికి జరుగుతుందో చెప్పలేము, రేపు పొద్దునకే లేవచ్చు లేక పది సంవత్సరాలైనా పట్టొచ్చు.”

అను, గోవింద్ ని తీసుకొని ఇంటికి వచ్చేసింది. అతన్ని ఓ ప్రత్యేకమైన గదిలో ఉంచి, అవసరమైన వైద్య సదుపాయాలు అందచేస్తుంది. నిశ్చలంగా పడున్న గోవింద్ అప్పుడప్పుడు కదులుతుండే వాడు, కన్నీళ్లు ధారగా కారిపోతుండేవి, నవ్వుతుండేవాడు, కోపం, బాధ, నిస్సహాయత ఇలా అన్నిరకాల భావోద్వేగాలు అతని ముఖంలో ప్రతిబింబిస్తూ ఉండేవి. దాదాపు ఓ మూడు నెలలు ఇలానే గడిచిపోయింది. అనుకి నెమ్మిదిగా ఆశ సన్నగిల్లసాగింది. అలా జీవిచ్ఛవంలా చిత్రహింస పడుతున్న గోవింద్ ని చూసి తట్టుకోలేకపోయింది. ఇలా గడిచిపోతున్న సమయంలో, ఓ రోజు అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ప్రాణం తిరిగొచ్చినట్టుగా దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ లేచి కూర్చున్నాడు. పక్కన అలసిపోయి కూర్చొనే నిద్రపోయిన అనుని తట్టిలేపాడు. తన నోట్ పాడ్ తీసుకురమ్మన్నాడు. మా ఊరు వెళ్తాను, ఒక్క రెండు వారాలు తనని ఒంటరిగా ఉండనివ్వమని అను అనుమతి అడిగాడు. గోవింద్ లేవడమే అనుకి అంతులేని ఆనందం, ఇంకా మిగతావేమి పట్టించుకోలేదు తను. వెళ్ళమని చెప్పింది. ఆ సమయంలో స్నానం చేసి, వారానికి సరిపడా అవసరమైన సామాన్లు సర్దుకొని, బైక్ మీద బయలుదేరాడు గోవింద్. సూర్యోదయ సమయానికి స్వచ్ఛమైన నీరున్న సరస్సు దగ్గర ఆగాడు. ఆ దగ్గర్లో బైక్ పార్క్ చేసి, సమాంతరంగా ఉన్న ఓ చోట టెంట్ వేసి, తన నోట్ పాడ్, పెన్ తీసుకొని ఏదో రాయడం మొదలెట్టాడు. అతని నోట్ పాడ్ లో…

అప్పుడు నాకు ఆరేళ్ళు…
మా ఇంటి దగ్గరిలో ఉండే పెద్దావిడ పుణ్యక్షేత్రాలు అన్నీ దర్శించి తిరిగి ఇంటికి చేరింది. ఇంటి అరుగుమీద కూర్చొని ఉన్నఆమె ఆ వైపుగా వెళ్తున్న నన్ను పిలిచింది. “ఏరా అబ్బీ! ఇలా రా ?” అని పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్లాను. “మరీ దగ్గరకి రాకు, అక్కడే ఆగు. ఎవర్రా అబ్బీ నువ్వు, నీ పేరేంటి ?” గోవిందరాజులు బామ్మగారు. “అబ్బా గోవిందరాజులే, మా గొప్పగా ఉందిరా నీ స్వరం, నీ తేజస్సు. ఇంతకీ ఏవుట్లురా అబ్బీ మీరు ?” అర్ధంకాలేదండి బామ్మగారు. “అదేరా మీదే కులం రా ? మీరేవుట్లు రా”. ఓహ్ అదాండి…మనుష్యులం బామ్మగారు. ఆ సమాధానం విన్న తర్వాత ఆ బామ్మ ఇంకేదో అడగబోతుంటే, ఈలోపు గోవింద్ అని ఎవరో పిలవడంతో క్షమించండి, వస్తాను బామ్మగారు అని ఇంటివైపుకి పరిగెత్తాను. నాన్నెప్పుడూ చెప్తుంటారు, “నలుగురిని కలిపి ఉంచలేని కులం మనకి ఎప్పటికైనా బరువేకాని బలం కాదు. నీ శ్రమలేకుండా వచ్చేదేది నీది కాదు. గుణం ముందు కులం తుచ్ఛం. మనకి కులం లేదు, మనుష్యులందరు మన వాళ్ళే. మనకి తెలిసింది మా ఒక్కటే, నా తెలీదు. మన సాయం కోసం చేయిచాచే ప్రతీ వాడు, వాడు మన కులమైన, అనుకూలమైన, ప్రతికూలమైన మనవాడిగానే సాయం చెయ్యాలి. కులం కోరల్లో చిక్కుకోకు ఎప్పుడూ.” ఇంట్లో మా గొప్ప సందడిగా ఉంది. ఎందుకుండదు, మరి రేపు నా పుట్టినరోజు కదా. ఇంట్లో చుట్టాలందరు చేరారు, పలకరించిన ప్రతీ ఒక్కరు క్షేమ సమాచారాలు అడిగిన వెంటనే నీ పెళ్ళాం పుట్టబోతుంది రా, మీ మేనత్త నీకు పుట్టినరోజు కానుకగా మరదలిని ఇస్తుందిరా అని. నాకస్సలేమీ అర్ధం అవ్వలేదు, ఆఖరికి మా అమ్మ కూడ నీకోసం ఓ దేవత పుట్టబోతుంది రా అని అంటుంది. నాకు మా అమ్మే దేవత, మరో దేవత ఎందుకో నాకు తెలీలేదు. నీకో బాధ్యత రాబోతుంది, భద్రంగా చూసుకోవాలి అని చెప్పారు నాన్న. నీకో కానుక ఇస్తున్నాం, నీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం అని చెప్పారు మామ. నా పుట్టిన రోజు వేడుక మధ్యలో, మేనత్తకి నొప్పులు రావడంతో మంత్రసానిని పిలిపించారు. మేనత్తకి ఆడపిల్ల పుట్టింది. తనేనా అందరూ చెప్పిన నా పెళ్ళాం, మా అమ్మ చెప్పిన దేవత, నాన్న చెప్పిన బాధ్యత, మామ ఇచ్చే కానుక. అందరి మాటలు ఏమో కానీ, ఎందుకో తనని చూడగానే రాధమ్మ అని నా నోటి నుండి నాకే తెలీకుండా వచ్చేసింది.
అమ్మ చెప్పినట్టు దేవతో కాదో నాకు తెలీదు, నాన్న అడిగినట్టు బాధ్యతో కాదో చెప్పలేను కానీ, మామ చెప్పింది మాత్రం అబద్దం. ఔను మరి, కానుకని చెప్పి తపస్సు చేసినా దక్కని వరమిచ్చాడు మామ.

అప్పుడు నాకు పదమూడేళ్ళు…
పుట్టిన రోజని చెప్పినా వినకుండా ఈతకి బావికి వెళదాం అని పోరు పెట్టారు సవాసగాళ్ళు. అమ్మని అడిగితే, తర్వాత వెళ్లొచ్చులే అంటే, నాన్న పర్లేదు మనందరం సిద్ధమయ్యేలోపు వచ్చేస్తాడుగా వెళ్లామన్నారు. నాకు ఈతరాదని నాన్నకు తెలీదు, అమ్మకి చెప్పలేదు, సవాసగాళ్ళకి చెప్పాలనుకోలేదు . సరే, అందరు ముచ్చటపడుతున్నారు కదాని మొదటిసారి ఈత కొడదామని వచ్చాను. బావి చాలా లోతుగా ఉన్నా, నీరు మాత్రం ఐదారు అడుగులకు మించి ఉన్నట్టులేదు. అందుకే నాకు పెద్దగా భయం అనిపించలేదు. మొత్తం ఆరుగురం వెళ్లాం, ఓ ఇద్దరు పై నుండే నీళ్ళలోకి దూకేసి ఈత కొడుతున్నారు. నేను దూకుదామా వద్దా అనే సంశయంలో ఉండగానే, అంజయ్య ఒక్కసారిగా నన్ను తోసేసాడు. నీళ్లలో మూడడుగుల లోపలకి వెళ్లిన తర్వాతా తలకి బలంగా ఏదో తగిలినట్టు అనిపించింది. ఆ తర్వాత ఓ రెండు నిమిషాలు ఎదో చెడు జరగబోతున్నట్టు, ఏదో ప్రమాదం రాబోతున్నట్టు, నేనేదో కోల్పోబోతున్నట్టు సంకేతాలుగా అస్పష్టంగా కళ్ళముందు సన్నివేశాలు కదలాడాయి. వాటి నుండి బయటకి వచ్చేలోపు, సవాసగాళ్ళు నన్ను పైకి తీసుకొచ్చేశారు. నేను వెంటనే ఇంటికి పరిగెత్తాను. నేను వెళ్ళేప్పటికే అందరూ, ఏడుకొండల సామి కోవెలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. తాత గారి దగ్గరికి వెళ్లి, ఇలా ఏదో అనిపించిందని చెప్పాను. ఆయన పెద్దగా నవ్వి, మొదటిసారి ఈత కదా అలా కలవరపడి ఉంటావ్ లే. భగవంతుని దగ్గరికి వెళ్ళేప్పుడు అంతా మంచే జరుగుతుంది గోవిందా, అనవసరపు ఆలోచనలు కట్టించి నూతన వస్త్రాలు ధరించు బయలుదేరుదాం. అప్పటికీ అందరం బయలుదేరి వెళ్లబోతుంటే, కడుపుతో ఉన్న లక్ష్మి(మా గోమాత) ఎప్పుడు లేనట్టు వింతగా ప్రవర్తించింది. అమ్మ, మేనత్త వాళ్ళు కొత్తగా కొన్న మోటారు కారులో రాగా, నేను, రాధమ్మ, తాతగారు జట్కాబండిలో వారిని అనుసరించాం. ఏడుకొండల సామి కోవెలలో పూజ, దర్శనం మా గొప్పగా జరిగాయి. తిరుగు ప్రయాణం మొదలయ్యే సమయానికి దట్టంగా మబ్బు పట్టి, మోస్తరుగా గాలి వీస్తుంది. అప్పటికి, కొద్దిసేపు వేచి చూసాం తగ్గుతుందేమో అని. పెరగకుండా, తిరగకుండా అదే స్థితి కొనసాగేప్పటికీ, చీకటి పడేలోపు ఇంటికి చేరాలనే తొందరలో వేగంగా వెళ్లాలని నిశ్చయించారు నాన్న. మా ఊరికి 15 కిలోమీటర్ల చేరువుగా ఉండగా, మా వెనుకే వస్తున్న కారు నుండి ఉన్నపళంగా మంటలు మొదలయ్యాయి. మేము చూస్తుండగానే, నాన్న, అమ్మ, అత్త, మామ అందరు కారులోనుండి దూకేశారు. వాళ్ళు దూకిన క్షణం తర్వాత కారు మొత్తం మండిపోయింది. మేము వెళ్లి చూసేప్పటికీ, రాయి మీదకు దూకడం మూలాన అమ్మ తప్ప మిగతా అందరు అక్కడే మరణించారు. చెట్టుకి తగిలి ఆగిన అమ్మని తీసుకొని వైద్యశాలకు వచ్చాము. అమ్మకు ఆపరేషన్ చేస్తుండగా, నాన్న, అత్త, మామ దేహాలను వైద్యశాలకు తీసుకొచ్చారు. రాధమ్మకు ఏమి అర్ధం అవ్వలేదు, అమ్మ వాళ్లకు ఏమైంది, ఎందుకు అక్కడ పడుకున్నారు, ఇంటికి వెళ్దాము, నాకు ఇక్కడ భయంగా ఉంది అని అమాయకంగా అడుగుతుంది తాతగారిని. వారి దేహాలను మా ముందు నుండి తీసుకెళ్తుండగా, నాన్నగారి చేయి నన్ను పట్టుకుంది. దీర్ఘంగా ఊపిరి తీసుకుంటూ ఒక్కసారిగా కళ్ళు తెరిచారు నాన్న. నన్ను దగ్గరికి పిలిచి “గోవిందా… ఇక నుండి నేను లేను. నువ్వే అంతా. సాయం కోసం వచ్చినవారిని నిరాశపరచకు.” నాన్నని అలా చూస్తూ కన్నీరు కారుస్తుంటే… “కన్నీరు తుడిచే చేయి నీది కావలి కానీ, నీ కంట్లో కన్నీరు రాకూడదు. అంతా కొంతకాలమే, అందరూ వెళ్లాల్సిన వాళ్ళమే. దీని గురించి చింతించకు ఎప్పుడు. ఈ క్షణం వరకు నా వారసుడివే, ఇకపై నాయకుడివి.” అంటూ తుదిశ్వాస విడిచారు నాన్న. నా గుండెల్లో కన్నీటి సునామి ఎగసినా, కంటికి కనిపించకుండా మనసులోనే సమాధి చేశాను దాన్ని. డాక్టర్లు, అమ్మకి అంతా బావుంది, బ్రతుకుటుందని చాలా ఖచ్చితంగా చెప్పారు. నాన్నని, అత్తని, మామని కననం చేసి వచ్చేప్పుడు ఎక్కడినుండి వచ్చాడో తెలీకుండా ఎదురుగా వచ్చాడో అగోరా. తీక్షణంగా నా కళ్ళలోకి చూస్తూ… “ఫిర్ ఆయేగా…కల్ ఫిర్ ఆయేగా!” అని చెప్పిఅదృశ్యమైపోయాడు. వాడే భాషలో మాట్లాడాడో నాకుతెలీక, పక్కనున్నతాతగారిని, మిగిలిన వ్యక్తుల్ని అడిగాను వాడేం చెప్పాడని.
అందరి ప్రతిస్పందన ఒక్కటే…
“గోవిందా నువ్వు మంచిగానే ఉన్నావ్ కదా. ఎవడు ? ఏం చెప్పాడు ? అసలు నీతో ఎవడైనా మాట్లాడితే కదా !”.

మిగిలిన కథ తర్వాతి భాగంలో

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,