Chai Bisket’s Story Series – గోవిందరాజులు (EP01)

జరిగిన కథ – రాధే గోవింద

“బావా…నాకు తెలీకూడదు అనుకున్నావ్. నువ్ లేకపోయినా, నేను ఆనందంగా ఉండాలి అనుకున్నావ్ కదా. ఆ విషయం విన్నప్పుడు, జీవితంలో మొదటిసారి నీ మీద కోపం కలిగింది బావ. నువ్వు ‘నా ప్రాణం – నా బతుకు – నా మనుగడ – నా సుఖం’ గురించే ఆలోచించావ్ కానీ, నువ్ లేకుంటే నేను కేవలం కాలిపోడానికి సిద్ధంగా ఉన్న కట్టెనని గుర్తురాలేదు కదా నీకు. ఏ బావా… మరి అంత పరాయిదాన్ని ఐపోయానా. నేను పుట్టగానే చూసింది నిన్నే కదా, నన్ను నడిపించింది నువ్వేకదా, నీ వెనకె తిరిగాను, నీతోనే పెరిగాను, నేను బతికింది – బతుకున్నది అనుకున్నది అంతా నీతోనే కదా. మరి ఏ బావా! నా జీవితం ఖరీదు నీ ప్రాణం అనగానే ఇచ్చేస్తావా. ఏ నన్నొక్క మాట అడగకూడదా! నీకే తెలీకుండా…నువ్వు తప్పు చేసి, నాకు శిక్షవేసావు కద బావ. నీ ఆఖరి క్షణాలు చూసేంత పాపం నేనేం చేసాను బావ. నిజానికి నువ్ చేసింది ప్రపంచానికి గొప్ప పనేమో కానీ, నాకు మాత్రం అది నువ్వు చేసిన ఒకే ఒక్క తప్పు. ఇదంతా నీకు ఆ రోజే చెప్పాలనిపించింది కానీ, నా కళ్ళలో నీళ్లు చూస్తే నువ్వెక్కడ ఏడుస్తావోని భయమేసి గుండెపగిలేల గొంతులోనే ఏడ్చాను, కన్నీళ్లకు సంకెళ్లేశాను, దుఃఖాన్ని దేహంలోపలే దాచేసాను. చాలు బావా, చాలా ఆనందంగా ఉంది. కాలగమనంలో కనుమరుగైపోయిన మన కథని నీకు తెలియపరిచాను. నీకింక హారిశ్చంద్రవేదిక గురించి ఆతురత ఉండదనే భావనే నాకెంతో ప్రశాంతతనిస్తుంది. మరి నేనిక వెళ్తాను బావ…!”. అని చెప్పి వెళ్లిపోతున్న రాధను…”రాధమ్మా… వెళ్లొద్దు, నువ్వు లేకుండా నేనుండలేను. రాధమ్మా…” అంటూ అరుస్తూ ఆపాలని ప్రయత్నిస్తున్న నేను(గోవింద్ రాజు) ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను.

టైం తెల్లవారు జాము 3.43, ac 19 ఉంది, నా శరీరం మొత్తం స్వేదంలో తడిసిపోయుంది, నా బెడ్ మీద నేను కప్పుకున్న దుప్పటిలోనే నా పక్కాగా ఓ అమ్మాయి, ఆ అమ్మాయికి ఓ జానా దూరంలో క్యాప్ తీసి ఉన్న పెన్ను, ఆ పెన్నుకు రెండు జానాల దూరం లో ఓపెన్ చేసి ఉన్న ఒక పెద్ద నోట్ బుక్. లేచి కూర్చున్న కొద్దిసేపటి తర్వాత “మళ్ళీ అదే కలా ? I think, its time to consult a psychiatrist. Seriously రాజ్. నాకు భయమేస్తుంది నిన్ను చూస్తుంటే. ఈ మధ్య మరీ ప్రతీ రోజు అదే కల, ఇలానే లేస్తున్నావ్ నిద్రలోనుండి. రేపు మనం psychiatrist దగ్గరకి వెళ్లకుంటే, నేను మా ఇంటికి వెళ్లాల్సివస్తుంది ఇక నీ ఇష్టం.” అని ఓ వార్నింగ్ ఇచ్చి పడుకుంది అనురాధ(గోవింద్ రాజ్ భార్య). తను పడుకోగానే, ఆ బుక్ తీసుకొని చూసాను. “నీకు కావాల్సింది అంతా తెలిసింది కదా, ఇక సంతోషంగా ఉండు బావా” అని రాధ చెప్పే లైన్ రాసుంది. నాకేం అర్ధం అవ్వలేదు, పడుకున్నాను. కళ్ళు మూసుకోగానే, రంగయ్య మావ ఇంటి వెనుకకి వచ్చేసాను. రాధ నాకు ఎదురుగా వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ నా నోటి నుండి, నా ఆధీనంలో లేకుండా అవే మాటలు “రాధమ్మ…వెళ్లొద్దు, నువ్వు లేకుండా నేనుండలేను. రాధమ్మా…” అంటూ పలుకుతున్నాయి.

కళ్ళు తెరిచాను, టైం 9.15, బెడ్ పక్కాగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి జుట్టు ముడేసుకుంటుది అనురాధ. పక్కనున్న టేబుల్ మీదున్న కళ్ళజోడు తీస్తుంటే, ఆ పక్కనే ఉన్న గ్లాస్ కిందపడింది. ఆ శబ్దానికి ఓరగా వెనక్కి తిరిగి, “లేచావా! 11 కి appointment బుక్ చేసాను. ఒక్కడివే వెళ్తావా, నేను రానా.” అంటూ క్లిప్ పెట్టుకుంటుంది అను. ఎందుకు ? “నేనా? appointment ఆ?”. రెండోదే. “నీకు గుర్తులేకపోతే నేను మళ్ళీచెప్తాను కానీ, నీకు రావాలని లేకపోతె మట్టుకు నేనిప్పుడే వెళ్ళిపోతాను.” సరే… సరే వెళదాం. ఓక టీ ఇవ్వచ్చు కదే. “నువ్ రెడీ అయ్యి వచ్చేసరికి టిఫిన్, టీ పెట్టేస్తాను త్వరగా వెళ్ళు” అంటూ నన్ను బాత్రూం వైపు తోస్తుంది అను. బాత్రూం లో బ్రెష్ చేస్తూ, అద్దంలో చూస్తుంటే… అప్పటి వరకు రాధే గోవిందా బుక్ లో రాసిన కథంతా కళ్ళకు కట్టినట్టు కదలాడుతుంది. రాధ నా కలలో ఎందుకు కనపడుతుంది ? రోజు నాకే అదే కల ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తుంది ? రాధ నాకింకేదైనా చెప్పాలనుకుంటుందా ? ఇలా ఆలోచిస్తుంటే… డబ్ డబ్ డబ్ అని బాత్రూం డోర్ సౌండ్ “ఇంకా ఎంతసేపు ? అరగంట అయ్యింది లోపలకి వెళ్లి.” అంటూ అరుస్తుంది అను బయటనుండి. రాధ లోకం నుండి బయటకి వచ్చి, రెడీ అయ్యి, psychiatrist దగ్గరికి వచ్చాము. టైం 10.57, డాక్టర్ అప్పుడే మా ముందు నుండి ఆయన రూమ్ లోకి వెళ్లారు. మేము ఆయన వెనుకే లోపలకి వెళ్లాం.

“హాయ్, I am Rishi. You are Govind right ? ” అని అడిగాడు డాక్టర్ రిషి. అను ని బయట వెయిట్ చేయమని పంపించేశాడు. అను వెళ్తుండగా, టేబుల్ మీద ఉన్న డాక్టర్ ఫోన్ రింగ్ అవుతుంది, మాయ కాలింగ్ అని కనిపిస్తుంది. “మీ ఆవిడను పంపించానో లేదు, మా ఆవిడ కాల్ చేస్తుంది. కొన్ని వేల రకాల చెట్లు, వాటి జాతులు అంతరించిపోయాయి కానీ, చెట్లను అతుక్కుని ఉండే జిగురు మట్టుకు అంతరించలేదు. భార్యలు కూడా అంతే, భర్త అనే చెట్టుని వీడని జిగుర్లు. ఈ Wives మనల్ని వదలరండి. Excuse me for a moment” అంటూ పక్కకి వెళ్ళాడు డాక్టర్. నేను ఆ రూమ్ అంతా చూస్తున్నాను, పెద్ద పెద్ద బుక్స్, రకరకాల ఫొటోస్, అవార్డ్స్ తో పాటు ఓ వింతైన నోటీసుబోర్డు కనిపించింది. ఆ బోర్డు మీద కాలిపోయిన అగ్గిపుల్లలతో రక రకాల పేర్లు 8 వరుసల్లో అమర్చబడి ఉన్నాయి. ఆ బోర్డు చివరలో మాత్రం, ‘రియ’ అనే పేరు కాల్చని అగ్గిపుల్లలతో అమర్చబడి ఉంది. నేను రియ ని ముట్టుకోబోతుంటే, “careful…” అంటూ డాక్టర్ వెనక్కి లాగారు. నన్నో కూర్చోమని, “వాటి గురించి పట్టించుకోకండి, అవి నేను టేకప్ చేసిన పేషెంట్స్ కు నేను పెట్టుకున్న మారుపేర్లు అంతే. పేషెంట్ కు cure అవ్వగానే వాటిని అలా కాల్చేయడం ఓ చిన్న హాబీ.” మరి రియ ?. “రియ ఇప్పుడు చూస్తున్న పేషెంట్, నా గురించి అంత ఆసక్తికర విషయాలేమి ఉండవు, మీ గురించి చెప్పండి”.

నా గురించి తెలీకుండానే, మీరు నాకోసం సమయం వెచ్చిస్తున్నారంటే నమ్మలేను. “మీ గురించి మీ కంటే ఖచ్చితంగా ఎవ్వరు చెప్పలేరు కదా”. నా భార్య ఏం చెప్పిందో నాకు తెలీదు కానీ, తనేం చెప్పినా అది నిజమే. “ok. అంటే మీరు మీ కథని నిజమని నమ్ముతున్నారా ?”. అది కథ కాదు డాక్టర్. “మీరు రిషి అనొచ్చు పర్లేదు.” మా ఊర్లో జరిగిన యదార్ధ సంఘటననే నేను ప్రపంచానికి తెలియచేయాలని చూస్తున్నాను. “అంటే…మీ ఊర్లో హరిశ్చంద్ర వేదిక ఉందంటారు.” ఉంది. “రాధ, గోవింద్, డాక్టర్ గురించి మీరు రాసింది నిజంగా ఒకప్పుడు జరిగినదే అంటారు”. ఖచ్చితంగా. ” మీరంత గట్టిగ చెపుతున్నారంటే జరిగే ఉంటుంది లెండి. మీ రాధే గోవింద డ్రాఫ్ట్ చదివాను నాకు బాగా నచ్చింది, రిలీజ్ కోసం వెయిటింగ్. అందుకే కొంచెం ఎక్కువ అడిగాను. సరే, ఇప్పుడు నార్మల్ procedure ని follow అయ్యి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీ పేరు ? “. గోవింద్ రాజు. “తండ్రి పేరు ?”. ఆనంద్ రాజు. “పుట్టిన స్థలం ? ” స్తంభాద్రి. ” భార్య పేరు ?” అనురాధ. “Thank You. ఇప్పుడు ఈ స్వింగింగ్ డాలర్ ని చూడండి. మీ పేరు ?” గోవింద్ రాజు. “తండ్రి పేరు ?”. ఆనంద్ రాజు. “పుట్టిన స్థలం ? ” స్తంభాద్రి. ” భార్య పేరు ?” అనురాధ. “మీ చిన్నతనంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగిందా ?”. లేదు. “Unforgettable incidents, accidents ఏమైనా జరిగాయా ?”. లేదు. “Ok. Thank You. మీకు ఒకే కల మళ్ళీ మళ్ళీ వస్తుంది కదా, దాని గురించి ఏమైనా చెప్పగలరా ?” రాధమ్మ రోజు నా కలలోకి వచ్చి ఏదో చెప్పి వెళ్ళిపోతుంది. నేను వెళ్లొద్దు అని తనని ఆపేలోపు నాకు మెలుకువ వచ్చేస్తుంది. “ఎప్పటి నుండి జరుగుతుంది ఇలా ?”. ఒక సంవత్సరం నుండి నా లోపల జరుగుతున్న కథ. “One Year! ముందే రావాల్సింది మీరు”. నాకు ఏదైనా సమస్యా ? అని అడిగాను నేను. డాక్టర్ ఏమి మాట్లాడలేదు. ఇలానే ఆ తర్వాత వారం రోజులు, డాక్టర్ ని కలవడం, అతను అడిగిన వాటికి సమాధానాలు ఇవ్వడం, అతను చెప్పిన వారితో మాట్లాడడం, అతను కావాలన్న ప్రతీది చేసాను. ఒక వారం తర్వాత, అతని గదిలో. “గోవింద్ గారు, నా కెరీర్ లో ఇదే మొదటిసారి ఇంత స్ట్రేంజ్ పేషెంట్ ని చూడటం.” ఏమైంది రిషి ? “మీకేం అవ్వలేదండి, మీరు మరీ కధ మీద ఎక్కువ ఆలోచించడం వలన అలా జరుగుతుంది అంతే. వీలైనంత త్వరగా మిగిలిన కథ రాసెయ్యండి సరిపోతుంది.” ఓహ్! అంతేనా! ఇదే విషయం కాస్త మా అనుకి కూడా చెప్పు రిషి. “తనకు ముందే చెప్పేసానులెండి. కానీ, చిన్న సమస్య.” ఏంటి ? “Deep Hypnotic state లో మీరు, చాలా సార్లు గోవింద్ గురించి ఎదో చెప్పాలని ప్రయత్నించారు. కానీ చెప్పలేకపోయారు. నా సలహా ఏమిటంటే, మీరు ఆ గోవింద్ వైపు నుండి ఓ సారి ఆలోచిస్తే బావుంటుంది.” Ok. Thanks రిషి. అని చెప్పి వెళ్లిపోతుంటే, “ఇంకో ముఖ్యమైన విషయం” ఏంటి ? “రాధే గోవిందా మొత్తం కధ ఫస్ట్ కాపీ నాకు పంపడం మట్టుకు మర్చిపోకండే!” అయ్యో, తప్పకుండ.

ఆ తర్వాత రోజు నుండి, అప్పటివరకు రాసిన రాధే గోవింద కథ మొత్తం ఓ 1000 సార్లు చదివాను. ఏదైనా దొరుకుతుందేమో అని, ప్రతిరోజు రాత్రి ఆ కల మట్టుకు నన్ను వదలలేదు. ఒకరోజు కల వలన మధ్య రాత్రి లేచి, రాధ వెళ్లిపోతున్నా అని చెప్పినది అంతా రాసి చదువుతుంటే అప్పుడు తెరుచుకుంది రాధే గోవింద్ కధలో మరో తలుపు. పడుకోగానే… కలలో అప్పటివరకు వెళ్లిపోతున్న రాధని ఆపలేక, ముందుకు కదలలేక ఆగిపోయిన నా కాళ్ళు నడవడం మొదలెట్టాయి. పరిగెత్తుకుంటూ రాధ దగ్గరికి వెళ్లాను, ఈ లోపు నా పక్కాగా ఓ జట్కా బండి వచ్చి ఆగింది. రాధ నా మాటలు వినకుండా, జట్కా ఎక్కబోతుంటే, జట్కాలోపలి నుండి ఓ చేయి రాధని లోపలకి లాగింది. ఎవరా అని నేను తొంగి చూడబోతుంటే… లోపల నుండి ఒక శబ్దం “ఏంటండీ! ఇట్టా వచ్చారు ?”

మిగిలిన కథ తర్వాతి భాగం లో

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,