స్వర్ణ కమలం సినిమా లోని “ఘల్లు ఘల్లు” పాట లోని అందమైన భావం – A Short Note

 

Contributed by Sowmya Uriti

 

కళకి ప్రాధాన్యమిస్తూ విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన చిత్రాల్లో స్వర్ణకమలం ఒకటి. కథానాయకుడు చిత్రకారుడు. కథానాయిక నృత్య కళాకారిణి. ఆధునిక ప్రపంచంలో ఈ కళలకు ఎటువంటి విలువ లేదని నమ్మి, వాటిని పక్కన పెట్టి భౌతిక ఆనందాల కోసం కలలు కనే యువతి. కళని ఆరాధించే మనిషిగా, ఇంతటి ప్రతిభ ఉన్న ఆ అమ్మాయి సాధారణ జీవితంలో ఉండిపోకూడదనే ఉద్దేశ్యం కథానాయకుడిది. ఇలా వీరిద్దరి మధ్యన జరిగే సంభాషణ సీతారామశాస్త్రిగారు ఎంత చక్కగా వివరిచారంటే, అతడు అనే ఒక్కో వాఖ్యానికి ఆమె ప్రతివాఖ్య చేస్తుంటుంది పాట ఆధ్యాంతం.

 

పల్లవి:
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు..
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు..
నల్ల మబ్బు జల్లనీ చల్లని చిరు జల్లు..
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్లు..

 

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్ళు..
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు..
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు..
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు..

 

మెరుపులా నాట్యమాడు..ఆకాశం పరవశించిపోయి మేఘామృతమై చినికులు కురిపించి భూమికి పచ్చదనాన్ని అందిస్తుంది.. నీ నృత్యానికి అంతటి శక్తి ఉంది అని కళాత్మకంగా చెప్తాడు అతడు..

 

మెరుపు వేగంతో తుళ్ళితే ఆకాశం పరవశించి చిరు జల్లు కాదు జడి వాన కురవాలి.. ఏ పరిమితి లేకుండా సాగాలి అన్నది ఆమె భావన.. ఈ వాఖ్యం స్వేచ్చని కోరుకునే ఆమె స్వభావాన్ని తెలుపుతుంది.. ఇక్కడ ఇద్దరూ మెరుపు అనే అంశం నుండే మొదలుపెట్టినా ఇద్దరి ఆలోచనలలో వ్యత్యాసం గమనించవచ్చు..

 

చరణం:
లయకే నిలయమై నీ పాదం సాగాలి..
మలయానిల గతిలో సుమబాలగ తూగాలి..

 

వలలో ఒదుగునా విహరించే చిరుగాలి.. సెలయేటికి నటనం నేర్పించే గురువేడి..
తిరిగే కాలానికి తీరొకటుంది..
అది నీ పాఠానికి దొరకను అంది..

 

నటరాజాస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సుర గంగకు విలువేముంది.. విలువేముంది..”నీ పాదం లయబద్ధంగా సాగాలి.. చల్లని పిల్లగాలికి ఊగే పూవులా సున్నితంగా నువ్వు ఆడాలి.. అంతే తప్ప నామమాత్రంగా చేయకూడదు..” అని అతడు అంటే, ఆమె ఇలా అడుగుతుంది “ఇది ఇలానే జరగాలని ఎవరు చెప్పారు? వీచే గాలిని వలలో పట్టి ఉంచలేం కదా.. ప్రవహించే నదికి ఆ నడక ఎవరూ నేర్పించలేదుగా..ఐనా అందంగానే ప్రవహిస్తుందిగా.. అది ప్రకృతి.. అలాగే నా నడకలను శాసించే హక్కు నీకెక్కడిది? ” అప్పుడు అతడు ” ప్రవహించే గంగకైనా శివుని జటలోనికి చేరుకోకపోతే విలువుంటుందా? శివుని చెంత ఉంటేనే కదా గంగకి విలువ.. అలాగే ఇవ్వాల్సిన స్థానం ఇస్తేనే నీ కళకి విలువ.. ” అని సమాధానం ఇస్తాడు.

 

చరణం:
దూకే అలలకు ఏ తాళం వేస్తారు..
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు..
అలలకు అందునా ఆశించిన ఆకాశం..
కలలా కరగడమా జీవితాన పరమార్ధం..

 

వద్దని ఆపలేరు ఉరికే ఊహనీ..
హద్దులు దాటరాదు ఆశల వాహిని..
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే విరి వనముల పరిమళముల విలువేముంది..విలువేముంది..

 

ఎగసే కెరటాలు తాళం ప్రకారం నడుచుకుంటాయా? కనే కలల పాట ఏ రాగంలో ఉందని చెప్పగలరు? ఇక్కడ ఎగసే అలలు,కమ్మని కలలు అనేవి ఆమె ఆశలు.. వాటిని అదుపు చేయగలరా? అని ప్రశ్నిస్తోంది ఆమె. దానికి అతడు సమాధానంగా “అలలు ఎంత ఎగసినా ఆకాశాన్ని తాకగలవా? లేదుగా.. కలలాగా కరిగిపోవడం కాదుగా జీవితానికి అర్ధం.. ఆశలుండవచ్చు కానీ పరిమితిని మించకూడదు..” అని చెప్తాడు. ఆమె దానికి ప్రతిగా ” వసంతానికే అడ్డు చెపితే అది తెచ్చే కొత్త పూల సుగంధాలను ఆస్వాదించలేం కదా.. ఆశలకు అడ్డుపడితే జీవితంలో ఆనందాలే ఉండవు కదా.. ” అని ముగిస్తుంది.

 

ఈ పాటలో గమ్మత్తు ఏంటంటే..మొదటి చరణంలో కళ ఏ విధంగా ఉండాలన్నది అతడు తన అభిప్రాయం చెప్తుంటే ఆమె అతడిని వ్యతిరేకిస్తూ ప్రశ్నిస్తుంది.ఆ ప్రశ్నలకు సరైన వాఖ్యం ఆఖరిది..రెండవ చరణంలో ఆమె యొక్క భావాలు చెప్తూ ఉంటే అతడు ప్రశ్నిస్తుంటాడు.. వాటికి సమాధానమైన ఆఖరి వాఖ్యం ఆశలు ఉండడం కూడా అవసరమే అన్న భావన తెస్తుంది. ఇక్కడ ఎవరి వాదనని తప్పు అని చెప్పలేం అన్నట్టు ఉంటాయి పదాల సమాహారం. ఒక పాటలోనే ఇద్దరి స్వభావాలు, ఆలోచనలు అర్ధమైపోతాయి వినేవారికి. అంత చక్కగా రాసిన సీతారామశాస్త్రి గారికి ,ఎంతో మంచి సంగీతాన్ని అందించిన ఇళయరాజా గారికి కృతజ్ఞతలు..

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,