This Story Sums Up Every Problem That is Faced By Common Middle Class Girl Around The Society

Contributed By Guna Vardhan Pulagam

“ఏంట్రా, నిజమా…?” లో ‘ఏంట్రా’కున్న సహజమైన అరుపుకి ఉలిక్కిపడి లేచింది చలన. “చెయ్ కోసుకోడమేంట్రా..?” అని వెంటనే మరో అరుపు. “పొద్దున్నే ఏంట్రా ఆ మాటలు.!?” అని వంటిట్లోంచి అమ్మ కేక. “ఏం కాదులేమ్మా..” అని మాట దాటేసినా ఏంటో తెలుసుకుందామని అమ్మే గదిలోకి వచ్చింది. “ఇప్పుడు నేను లేచినట్టు తెలిస్తే ఈ విషయం మాట్లాడతాడో లేడో” అనుకుని పడుకున్నట్టే ఉండి వాళ్ళ మాటలు వింటోంది చలన.

“ఏంట్రా ఏమైంది..?” -అమ్మ’

అదేనమ్మా.. మన రాములు లేడు.., మూడేళ్లనుంచి వాడు గీత ప్రేమించుకున్నారు… విషయం గీత వాళ్ళింట్లో తెలిసి గీతకి వేరే పెళ్లి ఖాయం చేశారు… రాములు కృంగిపోయి ఆత్మహత్య చేసుకోబోయాడు… ఇప్పుడు బానే ఉందంటలే…

కానీ ఆ గీత మాత్రం చూడ్డానిక్కూడా రాలేదు కనీసం..’ అని బూతులేవో సనుగుతుంటే… “అయ్యో..” అని నిట్టూర్చింది అమ్మ.”అయినా ఈ అబ్బాయిలందరికీ ఇదో ఫ్యాషన్ అయిపోయింది… ప్రేమకి ఒప్పుకోకపోతే చావు.. పెళ్ళి కి తప్పుకోకపోతే చావు… ఆ గీతని కూడా ఏమీ అనలేము లే.. అందర్లాగా వాళ్ళ నాన్న కూడా ‘నీకు వాడు బ్రతికుండాలో, భర్తగా ఉండాలో తేల్చుకో’మనుండొచ్చు.. ఎవరికి తెలుసు..!” అంది అమ్మ.

“హ్మ్మ్.. అయిన పరిచయం లేని వాళ్ళతో మాట్లాడకుండా పెంచినోళ్ళు, చివరికి వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తుంటారు ఏంటో..” అన్న కొడుకు మాటలు విని… “అయినా ఆడదంతేలేరా.. స్వార్థపరురాలు.. ఇంటినీ, ఇంట్లోళ్లనీ దాటి ఇష్టాలుండవు, ఉన్నా.. వాటికి మన సమాజం లో న్యాయం లాగా.. బ్రతికే అవసరాల కన్నా.. చచ్చే అవకాశాలే ఎక్కువ” అంటూ ముగించింది అమ్మ.

మొత్తమంతా గొంతెత్తి పాడుతున్న వెర్రిగాలి చాటు వేణువులా విన్న చలనకి ‘ఆడదంతేలేరా..’కి తప్ప మిగతాటంతటికీ ‘అయ్యో..’ తప్ప వేరే స్పందన లేకపోయినా.. ఆ ఒక్క మాట మాత్రం గట్టిగా పట్టేసింది. వెర్రిగాలి పాట గోలై ఉడికిస్తుంది”.

“ఆ మనిషికి ఆడతనం కన్నా అమ్మతనం ఎక్కువైపోయిందా.. లేదా నిజంగానే మాది స్వార్థమా..?” అనుకుంటూ వుండగానే.. “అవున్లే.. అయినా ఇల్లు దాటనిదాని ఆలోచనలూ, ఇష్టాలూ ఇంటినెలా దాటతాయ్..? వాటికిళ్లే జననం, ఇంటిజనమే గగనం..” అని సంజాయిషీ లాంటిదేదో చెప్పుకుంది. ఆ వెంటనే అదిచ్చిన్న మనశ్శాంతి.

ఆ వెంటనే ఇల్లు దాటలేదనే అసంతృప్తి,

ఆ వెంటనే మళ్ళీ ఒకప్పటి జీవితం,

అది మాయమవ్వక గాయమై,

జ్ఞాపకమవ్వక వ్యాపకమై,

మది గది లో వెలిగిస్తున్న ఉజ్వల గతం.

ఇప్పుడంటే ఇలా, నాలుగ్గోడల గోడులు వింటూ మిగిలిపోయింది కానీ..,

ఇప్పుడంటే ఇలా, కుక్కరువిజిళ్ళ గజల్-లు వింటూ మిగిలిపోయింది కానీ..,

ఇప్పుడంటే ఇలా,

చిక్కని చక్కెరెక్కువ చిక్కులకు బెరక్క

టక్కున చిక్కి-న ఆవు-పాలతో

చక్కని టీపొడి పరిమాణాలతో

చిక్కని టీ-సడి పరిమళాలతో

మక్కువ తక్కువ వారుకూడా

మరొక్కటడక్క వెళ్లకుండా

చుక్కని చెక్కిన చుక్కను మెచ్చుకుంటే

ఉలక్క పలక్క పడుండకుండా

చెవులు చింపేసే కరతాళధ్వని తరంగాలను గుమ్మం బయటే ఆపేసే గోడల మధ్య మిగిలిపోయింది కానీ..,

ఒకప్పుడు,

ఇప్పట్లా వికృత గిన్నెల సడిలో కాకుండా..

ప్రకృతి వన్నెల ఒడిలో పెరిగింది చలన.

ఒకప్పుడు,

‘మార్కులు బాగా రాలే’దని నాన్నప్పుడో,

‘పద్ధతి బాగాలేద’ని అమ్మన్నప్పుడో,

అందర్లాగా “ఆడదానికి మార్కులెందుకు?” అనే ప్రశ్నలోనో,

“పద్ధతంటే ఇంటి బానిసత్వం” అన్న నిజంలోనో కాకుండా..,

పచ్చి పైరుగాలి పంచామాల్లోనూ, గగనవీధి గాంధారాల్లోనూ, సుందర నందన సరిగమల్లోనూ ఓదార్పు వెతుక్కుంటుంటే…

పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి తానేమో అనిపించేది చలనకు.

ఇదంతా గుర్తుకురాగానే సముద్రమంతా తన కన్నుల్లో కన్నీటి అలలవ్వలేదు కానీ,

చెమ్మగిల్లిన కళ్ళవలనో ఏమో.. చుట్టూ ఒక మహాసముద్రముధ్బవించింది…

ఎడారి అంతా తన గుండెల్లో నిట్టూర్పు సెగలవ్వలేదు కానీ,

సొమ్మసిల్లిన బుర్రవలనో ఏమో.. మళ్ళీ ఆ పాత ఒడినీ, ఆ పాత బడినీ ఒక్కసారి చూడాలనిపించింది.

ఒక్కరోజు సాయంత్రం నాన్న ఆఫీసు నుంచి రాగానే ఎప్పటిలాగా “కొంచెం టీ పెట్టివ్వమ్మా..” అనకుండానే అమృతం కాసిచ్చింది చలన. అది చూసి పొంగిపోయిన తండ్రి, “ఏంటి సంగతులు.. ఏమైనా కావాలా..?” అని అడిగాడు. “ఆ.. అదీ… ఏం లేదులే నాన్నా..” అంటూ కూతురు తడబడడం చూసి “పర్లేదు చెప్పమ్మా… ఏమిచ్చుకోవాలి నాకు పుట్టిన మా అమ్మకి నేను..!?” అనడం విని కొంచెం ధైర్యం తెచ్చుకుని “అదే నాన్నా., బయటకెళ్ళి చాలా రోజులైంది కదా.., ఈ ఆదివారం ఎక్కడికైనా వెళ్తాన్నాన్నా…” అంటూ అడిగింది ముద్దుగా.

అది వినగానే.. “న్యూస్పేపర్ లోనూ, టీవీ ఛానళ్లలోనూ చూస్తున్నావ్ కద చలనా రోజులెలా ఉన్నాయో… జరగరానిది ఏమైనా జరిగితే..!?, నా పరువుకన్నా, నీ స్వేచ్ఛ కన్నా, మన మనశ్శాంతే నాకు ముఖ్యం… ఈ గడప బయట దానికంతా శత్రువులే.., వద్దు గాక వద్దు.., ఈ విషయం మళ్ళీ నువ్వడగనూ వద్దు, మన మధ్య రానూ వద్దు..!” అని అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు.

అలా వెళ్ళాడో లేదో.. ఇలా మొదలైంది మహా సముద్రోద్భవం.. ఈసారి ఆ సాగరఘోష పక్కనే ఉన్న అమ్మను ఇబ్బంది పెట్టింది. “సర్లే ఊర్కోమ్మా.. మీ నాన్నకి చెప్పకు.. రేపు వెళ్దూలే.. కాలనీ పార్కు దాటావంటే మాత్రం నేనే నీ కాళ్లిరక్కొడతా..” అంటూ అమ్మ భరోసా ఇచ్చింది.

ఆ మరుసటి రోజు నాన్న ఆఫీస్కి వెళ్ళగానే, తల్లి ఒడివైపు పాకే చిన్నపిల్లలా.. అడుగులు మోపింది గడప వైపుగా…

ఇన్నాళ్లూ “హిస్స్…”మన్న కుక్కరు విజిలు,

ఆ ఒక్కరోజు మాత్రం తమ కలకాల స్నేహతురాలికి పలికే చిరకాల వీడ్కోల్లా వినిపించింది.

ఇన్నాళ్లూ కళ్ళు చెమ్మగిల్లడంవల్ల వింపించిన సాగరఘోష,

ఆ ఒక్కరోజు మాత్రం గుమ్మంబయటి కరతాళతరంగాల వల్ల వినిపించింది.

ఇన్నాళ్లూ గడపలోపలి జనాభా పెంచిన రాములందరికీ,

ఆ ఒక్కరోజు ఓటమి బాధనివ్వని గెలిచే అవకాశాన్ని మరొకటిచ్చింది.

బయటకొచ్చిన చలన కాసేపు నడవగానే ఏవో గుచ్చుకున్నాయి. తమ ‘గెలిచే అవకాశం’ వైపు ఆ రాములందరూ గుచ్చి గుచ్చి చూస్తున్నారు. వాళ్ళు నిజంగానే అలా చూస్తున్నారో, లేదా తనకే అలా అనిపిస్తుందో తెలియట్లేదు చలనకు. వంటింట్లో అంట్లకూ, నెట్టింట్లో పెయింట్లకూ కళ్ళు లేవు కాబోలు..! గడప దాటిన శరీరం కిందనుంచి మీద్ధాకా చూపులకత్తులు దిగుతూ ఉంటే.., చూపుల ఒత్తులు తగలెడుతూ ఉంటే.., ఆ అర్హత నేలమీదిముళ్లకు లేదన్నట్లు కిందకు చూస్తూ నడుస్తోంది చలన.

ఈ తతంగాన్నంతా తట్టుకొని పార్క్లో కూర్చుంది చలన. కానీ ఒకప్పట్లా కాకుండా..,

చూపులు కత్తులు దూస్తున్న గాలిలో పంచామాలన్నీ వంచనాలయ్యాయి.

గగనవీధి గాంధారాలన్నీ దిగ్భ్రాంధకారాలయ్యాయి.

ఈసారి అదే ప్రకృతి ప్రసవించిన పచ్చని ఆడ-ఆకృతి పురిట్లోనే చచ్చిపోయిందేమో.

ఆ తల్లి ఒడిలో తొలి చావుకు తనివితీరా బాధపడకుండానే దూరంగా ఉన్న ఒక గుంపు నుంచి ఒక కుర్రాడు తనవైపు పరిగెత్తుకుంటూ రావడం గమనించింది చలన. ఆ దృశ్యం తన కళ్ళకి మాత్రం, నాన్న చెప్పిన ఆ వార్తలూ, వాంఛలూ తనవైపు పరిగెత్తుకొస్తూ ఆ వార్తల సుడిగుండం లోకీ, చెడుగండం లోకీ ఈడ్చుకెళ్తున్నట్టు కనపడింది.

కాసేపటికి ఆ కుర్రాడు తన దగ్గరకొచ్చి “నీ పేరేంటి చెల్లీ..?” అని అడిగాడు. ‘చెల్లీ’ అనే పిలుపువల్ల సుడిగుండదృశ్యాలన్నీ అదృష్టం కొద్దీ అదృశ్యమయ్యాయి. కొంచెం తేరుకొని “చ..చలన..” అని చెప్పింది చలన. వెంటనే ఆ మృగం, తన పుట్టింటి గుంపుకి వినపడేలా “చలన అంట రాములూ…!” అని అరిచింది. ఆ అరుపందుకున్న అడవి నుంచి “వస్తున్నా ఉండు బావా…!” అని ఇంకో అరుపు. చలనకి కాళ్ళూ చేతులూ ఆడట్లేదు. ఒక్కసారిగా ఎన్నో ఆలోచనలు గిర్రున తిరిగేలోపు ఆ రాములు వీళ్ళ దగ్గరకొచ్చాడు.

సరిగ్గా వాడు చలనతో ఏదో మాట్లాడబోతున్న సమయంలో ఆ మొదటివాడు వీడి చెవిలో ఏదో సనిగాడు. అది వినగానే ఇద్దరూ చెరోదిక్కుకూ పరిగెత్తారు.

ఆలోచనలన్నీ ఇంకా తిరగనే లేదు,

సమస్య ఇంకా మొదలవ్వనే లేదు,

ఈలోపే అంతా ముగిసిందనే సంబరం, ఆశ్చర్యం ముంచెత్చగా.,

మెల్లగా ఆ మృగాలు పరుగందుకోక ముందు చూసిన ఆఖరి చూపు దిశ వైపు కళ్ళొత్తులెలిగించగా ఆ జ్యోతులన్నీ వాళ్ళ అన్నయ్య దగ్గర ఆగాయి.

‘గోదారి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఈదగలిగినోడికి పిల్లకాలవాలోలెక్కా’ అన్నట్లు

కంగారు పడకుండా వాళ్ళ అన్నయ్య దగ్గరకెళ్ళి “ఇంకా వెళ్దాం పద” అన్నట్లు తలూపింది.

‘బ్రతికుండగానే చచ్చిన కోరికకు సమాధులెందుకు’ అన్నట్లు

వాళ్ళన్న కూడా మౌనంగానే సరేనన్నాడు. “నాన్న వెళ్ళొద్దని చెప్పాడా…!?” అంటూ గర్జిస్తున్న ఆ మౌనాన్ని భరించలేక కాసేపు కాలక్షేపం కోసం గిర్రున తిరిగిన ఆ ఆలోచనలన్నీ నెమరువేసుకుంది చలన.

ఒకవేళ వాడొచ్చి ‘ప్రేమిస్తున్నా’ననుంటే..,

ప్రేమ ఇవ్వడానికీ-అడుక్కోడానికీ తేడా తెలీక,

నన్ను మళ్ళీ ఆ నాలుగ్గోడల మధ్యే నిలబెట్టేవాడేమో..!

ఒకవేళ వాడొచ్చి ‘ప్రేమించకపోతే చస్తాననుంటే..,

ప్రేమొప్పుకోకపోవడం కూడా ప్రాథమికహక్కేనని తెలీని ఈ ‘రాము’ల మద్యలో తిరగనివ్వకుండా,

నన్ను మళ్ళీ ఆ నాలుగ్గోడల మధ్య నిలబెట్టేవాడేమో..!

ఒకవేళ వాడొచ్చి ‘ప్రేమించకపోతే చంపేస్తా’ననుంటే..,

రాక్షసత్వంలో కూడా ప్రేమని వెతికిస్తూ

నన్ను మళ్ళీ ఆ నాలుగ్గోడల మధ్య నిలబెట్టేవాడేమో..!

ఒకవేళ వాడొచ్చి చేతుల్తోనో, బోతుల్తోనో నీచంగా ప్రవర్తించుంటే..,

అత్యాచారాల్నే నిత్యావార్తలుగా మలుచుకున్న ఈ జనాల బుర్రలకి దూరంగా

నన్ను మళ్ళీ ఆ నాలుగ్గోడల మధ్య నిలబెట్టేవాడేమో..!

ఒకవేళ వాడొచ్చి యాసిడ్ పోసుంటేనో..,

ప్రేమలోకి లాగేసుంటేనో..,

స్నేహంలాగో, పరిచయం లాగో దగ్గరవాలి అనుకుని ఉంటేనో..,

అమ్మో.. మొదటి పరిచయం కాబట్టి..

ఆ గండాలకి పరిణామాలు ఆలోచించక్కర్లేదు..,

ఈ గూండాలకి మూల్యాలూ చెల్లించక్కర్లేదు..!

అయినా ఇన్ని జరిగేవంటావా…?

ఏమో ఎవరికి తెలుసు..!?

టీవీల్లోకి, వార్తల్లోకి ఎక్కకముందు అందరూ ఇలాగే అనుకున్నారేమో..!

అయినా ఏది జరిగినా…

నాకోసం కొవ్వొత్తి తరంగాలుద్భవింపచేయడానికి ఒక దేశం మొత్తం ఉండేది.,

నాకోసం ఉత్తుత్తి నీతుల తరం-గాలుధ్భవింపచేయడానికి ఒక వర్గం మొత్తం ఉండేది.,

కానీ..,

మనిషికైనా మనసుకైనా మరణమొక్కటే..!

బ్రతికుండగానే చచ్చినవారికి సమాధులెందుకు..!?

చస్తున్నా మారని ఈ రాములందరికీ విరోధులెందుకు..!?

ఇదివరకూ పుట్టబోయేది మగబిడ్డ కావాలని కోరుకునేవారట..,

ఆడ పిండాన్ని పురిట్లోనే తెంచకపాయినా..,

ఎదిగాకా తుంచడానికి పనికొస్తారనేమో..!

సరిగ్గా ఈ ఆలోచనలన్నీ జీర్ణమయ్యేసరికి ఇల్లొచ్చేసింది.

కానీ ఇదివరకటిలా ఈసారి..

గుమ్మం బయట చప్పట్లూ లేవు..

గోడల లోపల ఘోషా లేదు..

నాన్నకి చెప్పకుండా పంపానన్న దిగులు అమ్మకీ లేదు..

ఏమీ జరగకముందే ఇంటికి తెచ్చానన్న గర్వం అన్నకీ లేదు..

కానీ అన్నిటికన్నా ముఖ్యంగా లేనిదేంటో తెల్సా..?

తల్లి ఒడిని చేరాలనుకున్న ఓ అనాథ కోరిక.

ఇలా ఎందరో చలనలు నిశ్చలనంగానే మిగిలిపోతున్నారు..

ఎందరో చెంచలలు చంచలంగానే మిగిలిపోతున్నారు..

ఎందరో సీతలు గీతకివతలే మిగిలిపోతున్నారు..

చరిత్ర తిరగరాసే మగోడ్ని రోజుకొకడ్ని పుట్టిస్తున్నప్పటికీ..,

చరిత్ర సృష్టించే ఒక ఝాన్సీ రాణీనీ, ఒక రాణీ రుద్రమదేవినీ,

తరతరాలకు సరిపెట్టేస్కున్న మన సమాజం లో…

ఎందరో కిరణ్ బేడీలు స్లామ్బుక్స్ దగ్గరే ఆగిపోతున్నారు..

ఎందరో మదర్ థెరిస్సాలు మదర్స్ గానే మిగిలిపోతున్నారు..

ఎందరో గమ్యాన్వేషికులు గుమ్మాల దగ్గరే చెదిరిపోతున్నారు..

కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో..

గీత దాటిన తర్వాతే…,

సీత – సీతాదేవి అయింది,

రావణుడు – రావణాసురుడు అయ్యాడు,

రాముడు – శ్రీ రాముడయ్యాడు,

వాళ్ళ ప్రయాణం – పురాణమయింది..!

కానీ ఇక్కడ రాముడికన్నా రాములే ఎక్కువ..

ఆ మంద మద రాబందులందరూ,

“అడివి లో వదిలేసే వాడికన్నా

ఇష్టం లేకుండా తాకని నేనే నయం”

అని మోరుగుతూ మెదడు పీక్కుతుంటారు.

పీక్కుతింటారు.

కానీ..

నువ్వు గీత అవతల కూడా సీతవే అనుకో…

నీదీ రామాయణమే…

అదీ రమణీయమే..!

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , ,