Grand Father’s FriendShip Day – A Short Story

 

Contributed by Masthan Vali

 

‘ హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే తాతయ్యా ‘ అంటూ పేపర్ లో లీనమైన జేమ్స్ చెయ్యందుకుంది అతని మనవరాలు లిల్లీ. బోసినవ్వుతో కళ్ళజోడు సరిచేసుకుంటూ పేపర్ పక్కన పెట్టి లిల్లీ ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కడుతుంటే చూస్తున్నాడు.
‘ థాంక్స్ రా ‘ అంటూ బ్యాండ్ ను తడిమిచూసుకుంటున్నాడు.
‘ ఇదిగో, నాకు కట్టు ‘ అని ఇంకో బ్యాండ్ ఇచ్చింది తాతయ్యకు. వణుకుతున్న చేతులతో నెమ్మదిగా కట్టసాగాడు. తన చిన్ని గడ్డం కింద చెయ్యి పెట్టుకుని చూస్తోంది తాతయ్యను.
‘ తాతయ్య… నీకు ఫ్రెండ్స్ ఎవరూ లేరా…? ‘
‘ నువ్వున్నావు గా… ‘
‘ నేను ఉన్నాలే, నేను కాకుండా… ను చదువుకునేటప్పుడు నీ స్కూల్ డేస్ లో గానీ, కాలేజ్ డేస్ లో గానీ… నువ్వు మిలటరీ లో పనిచేసినప్పుడు గానీ… ఎక్కడా ఎవ్వరూ లేరా…? ‘
‘ అమ్మా నాన్నలు లేని మనిషి ఉంటాడు కానీ, ఫ్రెండ్ లేని మనిషి ఎవరుంటార్రా లిల్లీ…నువ్వన్నట్టే జీవితం మొత్తం నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు… ‘
‘ మరి ఎవ్వరూ నిన్ను కలవడానికి రారేం…? నువ్వు కూడా ఎప్పుడు ఎవ్వర్నీ కలవడానికి వెళ్ళవు… ఎందుకలా.? ‘

 

కాసేపు మౌనంగా ఉండి, ‘ ఎందుకంటే చెప్పఁడానికి ఏం లేదురా… అలా గడిచిపోతోంది కాలం. అందరూ రక రకాల ఊర్లలో స్థిరపడ్డారు. ఎవరి జీవితాల్లో వారు మునిగిపోయారు. కొత్త పరిచయాలు స్నేహాలుగా మారిపోతున్నాయి, నాకు లైబ్రరీ లో పరిచయమైన వెంకటరత్నం తాతయ్య లా. పాత స్నేహాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి…అలా అని వాళ్ళని మర్చిపోయానని కాదు, కలవడం కుదరట్లేదు. అంతే… ‘

 

‘ సరే, నేను వెళ్తా తాతయ్య … నా ఫ్రెండ్స్ వచ్చారు ‘ అని చెంగున మాయమైంది.
జేమ్స్ మళ్ళీ పేపర్ లోకి దూరబోయాడు. కానీ, మనసు స్థిమితంగా లేదు. పాత స్నేహాల మధుర జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఒకరా ఇద్దరా, చిన్నప్పుడు చెడ్డీలేసుకుని స్కూలుకెళ్లే వయసు నుంచి నూనూగు మీసాల కాలేజీ రోజుల మీదుగా యూనిఫామ్ ధరించి కవాతు చేసే సైనికుడిగా ఉన్నప్పటి వరకూ ఎందరో స్నేహితులు. వాళ్ళందరి ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాపై ఉండే ఉంటుంది. అందర్నీ కాకపోయినా కొందరినైనా కలవాలని కోరిక కలిగింది అతనికి. కానీ ఎవ్వరు కాంటాక్ట్ లో లేరు.

 

‘ జ్ జ్ జ్ జ్ … ‘
టేబుల్ పైనున్న ఫోన్ వైబ్రేట్ అవుతోంది.
‘ హలో…, చెప్పారా… ‘
‘ నాన్న, సాయంత్రం లైబ్రరీ కి వెళ్ళకండి ఇవ్వాల్టికి, మీకో చిన్న సర్ప్రైజ్ ఉంది ‘
‘ సర్ప్రైజ్ అని ముందే చెప్పేస్తున్నావ్, ఇంకేంట్రా సర్ప్రైజ్…! ‘
‘ అబ్బా, సర్లెండి… ఆ సర్ప్రైజ్ ఏంటా అని ఆలోచిస్తూ కూర్చోండి… ‘
‘ సరే సరే.. ఉంటా ‘

 

నిజమే నాకు సప్రైజ్ ఏమై ఉంటుంది.? అని కాసేపు ఆలోచించుకుని, వయసైపోయింది గా… ఆ తర్వాత తొందరగానే దాని గురించి మర్చిపోయాడు.

3 గంటలకు…
‘లిల్లీ… పొద్దునుంచి ఆడుకుంది చాలు, ఇక బుక్స్ తీయ్..’ తల్లి పురమాయిస్తున్నట్టు అంది.
‘ చూడు తాతయ్య సండే కూడా బుక్స్ అంట… ‘ తాతయ్యకు ఉన్నపలంగా కంప్లైంట్ చేసింది…
‘ ఈ ఒక్కరోజుకి వదిలేయ్ తనని’ అని మనవరాలికి మద్దతు పలికాడు.

 

కాసేపటికి కుర్చీపై నూర్చునే కునుకు లోకి జారుకున్నాడు.
సాయంత్రం 5 30…
‘ ఏంటి…? తాతయ్య కాలేజ్ లో అమ్మాయిల వెంట పడేవాడా ? ‘ గుడ్లిన్ని చేసుకుని అక్కడ కూర్చున్న ముసలాయన్ని అడుగుతోంది లిల్లీ.
‘ మరి, మీ తాతయ్యంటే ఏమనుకున్నావ్…వీడందరి చుట్టూ తిరుగుతుంటే, వాడి చుట్టూ మాత్రం ఒకమ్మాయి తిరిగేది, కానీ వాడు కావాలనే పట్టించుకునేవాడు కాదు… ‘
‘ ఎందుకలా …? ‘
‘ వాడంతే, విచిత్రమైన మనిషి, తనకి కావాల్సిన వాళ్ళని తనే ఎంచుకునే వాడు… అది స్నేహితులైనా, శత్రువులైనా. తర్వాత కొన్నాళ్ళకి ఆ అమ్మాయి వీడికి నచ్చిందనుకో… ‘ అంటూ ఆగిపోయాడు
‘ ఎవరా అమ్మాయి తాతయ్య…? ‘
గోడపైనున్న ఫోటో వైపు చూసాడు…
‘ నాన్నమ్మ…!? అంటే మా తాతయ్య నాన్నమ్మ ది లవ్ మ్యారేజ్ ఆ… ‘ అని ఆశర్యపోయింది లిల్లీ.!

 

అప్పుడే మగతలోనుంచి బయటికొస్తున్న జేమ్స్ కి ఆ మాటలు వినపడి వినపడకున్నాయ్… కానీ తన గురించే మాట్లాడుకుంటున్నారు అని అర్థమయ్యింది. కళ్లద్దాలు సర్దుకుంటూ దూరంగా సోఫాలో కూర్చుని మసక మసక గా కనిపిస్తున్నది ఎవరా అని చూస్తున్నాడు. ఒకటి తన మనవరాలు లిల్లీ . పక్కన ఎవరు, చూపుకు అనట్లేదు. ఎవరో పోల్చుకోలేకున్నాడు. అతనూ ముసలాడని మాత్రం గ్రహించాడు.
మెల్లగా లేచి వాళ్లకి దగ్గరగా నడవసాగాడు…
ఇంతలో లిల్లీ, ‘ అదిగో తాతయ్య లేచాడు… ‘ అని పరుగెత్తుకుంటూ వెళ్లి జేమ్స్ ని చుట్టేసుకుంది.

 

‘ తాతయ్య… ఎవరొచ్చారో తెలుసా…? ‘ అని చేయిపట్టుకు తీసుకెళ్తోంది అతన్ని.
‘ ఎవర్రా… ? ‘ దగ్గరయ్యే కొద్దీ అతనికి ఎవరో తెలిసిన వ్యక్తిని చూడబోతున్నాడని అనిపించసాగింది.
అవతలి నుండి ఆ ముసలాయన లేచి వీరి వైపు నడవసాగాడు…
ఇంకో రెండడుగులు వేసేసరిగి జేమ్స్ అడుగులు వేయడం ఆపేసాడు. లిల్లీ ఎంత గుంజుతున్నా కదలట్లేదు. అరుదుగా కనిపించే ఆశర్యం – ఆనందపు అనుభూతికి లోనవుతున్నాడతను.

 

ఆ ముసలాయనే వీరి దగ్గరికి చేరాడు.
ఇద్దరు ఒకర్నొకరు అలా చూసుకుంటున్నారు…
‘ తాతయ్య, ఏంటి గుర్తుపట్టలేదా… నీ ఫ్రెండ్ తాతయ్య, కాలేజ్ లో ను చేసినవన్నీ చెప్పేసాడు లే… ‘ అంటూ తాతయ్యను కదిలిస్తోంది.
అతను మాత్రం, స్థిరంగా నిల్చుని ఉద్వేగంతో చూస్తున్నాడు.
‘ ఎరా జేమ్స్… ముసలాడివైపోయావ్ రా…!’ అంటూ మొదటి మాటగా పలకరించాడా ముసలాయన.
నీళ్లు తిరుగుతున్న కళ్ళను తుడుచుకుంటూ, ‘ ఎరా రాస్కెల్, నువ్వేమన్నా పడుచుప్రాయం లో ఉన్నావా… ‘ అంటూ ఇద్దరు హత్తుకున్నారు.
వీలైనంత గట్టిగా… ముప్పయేళ్ళకు పైగా దూరంగా గడిపిన కాలమంతా మాయమయ్యేంత గట్టిగా, ఇన్ని రోజులు కలవనందుకు జీవితపు ఆఖరి క్షణాల్లోదొరికిన అవకాశానికి ఇంతకంటే గొప్పగా కృతజ్ఞతలు చెప్పే వీళ్ళేదేమో అన్నంత గట్టిగా, ఇంకాసపు అలానే ఉంటే ఆ ముసలి ప్రాణాలు ఆగిపోతాయేమో అన్నంత గట్టిగా హత్తుకున్నారు. ఈ వయసులో కొత్తగా తెలుసుకున్నట్టు, స్నేహమాధుర్యం అంటే ఇదేనేమో అనిపిస్తోంది ఇద్దరికి.
వాళ్ళనలా చూస్తూ నిల్చుండిపోయారు లిల్లీ, తన తల్లితండ్రులు. ఆశ్యర్యంగా, వారి కంటి నుండి కూడా కన్నీరు కారుతున్నాయ్.

 

స్నేహితుని కౌగిలి మాటునుంచి తన కొడుకు వైపు చూసాడు జేమ్స్… ఇదే నేనన్న సుర్ప్రైజ్ అంటూ చిన్నగా నవ్వాడతను.
ఈ ఫ్రెండ్ షిప్ డే కి తన పాత నేస్తాన్ని గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు కు థాంక్స్ చెప్పాలనిపించలేదు జేమ్స్ కి, ఒక ఫ్రెండ్ కి థాంక్స్ చెప్పక్కర్లేదు గా…

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,