An Emotional Story About A Farmer & His Struggles

 

Contributed by Rakesh Kumar Gudisa

 

ఓ పూరిగుడిసెలో!
కటికచీకటిలో,
చిన్న లాంతరు కాంతిలో
తన కన్నీళ్లకు, కలము చేత రాయు అక్షరాలను బాసటగా చేసుకుంటూ,
తను స్వయంగా చూసిన ఓ దుస్థితిని తన ప్రాయానికి మించిన పదాల రూపంలో ఇలా ఓ డైరీలో రాసుకుంటుంది ఓ చిన్నారి.

ఉషోదయం కాకముందే, తాను ఉన్నాననే ఉనికిని చాటి చెప్తూ,
నాగలి పట్టుకుని, నేలమ్మను దున్నుతూ, నలుగురికి బువ్వ పెట్టడానికి తాను కష్టపడుతూ,
తన రోజును మొదలుపెట్టే రైతు మా నాన్న!

 

రోజూ సూర్యుడు నా కన్నులను తాకేవరకు నిదురలేవని నేను!
ఆ రోజు వెన్నెలమ్మ అస్తమించక మునుపే, పొలానికి పయనమవుతున్న నాన్న అలికిడి విని లేచి కూర్చున్నా…
అది చూసిన నాన్న నా దగ్గరకు వచ్చి, ఏంటమ్మా ఇంత త్వరగా లేచేసావు? నిద్ర పట్టట్లేదా? అని అడిగాడు…
అంటే నాన్న, అది… మరి… ఎల్లుండి నా పుట్టినరోజు కదా! కొత్త బట్టలు తెమ్మని నిన్ను అడగాలా వద్దా అని ఆలోచనలో నిద్ర పట్టలేదు నాన్న… అని నసుగుతూ చెప్పేసా

అప్పుడు నాన్న నా తల పై చేయి పెట్టి, అయ్యో పిచ్చి తల్లి నా బంగారం పుట్టినరోజు నాకు గుర్తులేదు అనుకుంటున్నావా?
ఈరోజు మన పచ్చి మిరప కోతకు వచ్చింది,
అది పట్టణానికి తీసుకెళ్లి అమ్మేసి వచ్చేటప్పుడు నీకు పట్టులంగా తీసుకొస్తా అని చెప్పగా,
ఆ మాట విన్న ఆనందంలో నాన్నను గట్టిగా కౌగిలించుకొని, నీతో పాటు పట్టణానికి నేనొస్తా నాన్న అని అడిగా.

అయ్యో ఎందుకు తల్లి నీకు ఆ కష్టం. దారిలో చాలా ఇబ్బందులు ఉంటాయి.
నువ్వు ఇంటిదగ్గరే ఉండు. నేను మాపటేలకు ఇంటికొచ్చేస్తా అని సర్దిచెప్పడానికి ప్రయత్నించినా…
నాన్న కూతుళ్ళ మధ్య యుద్ధంలో, ఎపుడు కూతురే గెలుస్తుంది కాబట్టి నాన్న ఒప్పుకోక తప్పలేదు.
అంటే నాన్నే గెలిపిస్తాడు అనుకోండి కూతుళ్ళని, అది తెలిసిన విషయమే అందరికి.

 

అలా నాన్న వెంట పొలానికి, అటునుండటే పట్టణానికి బయలుదేరా…
కానీ అలా నాన్న వెంట అడుగుల్లో అడుగులు వేస్తూ ఆ దారిలో వెళుతున్నప్పుడు…
నాన్న ఓ కుటుంబాన్ని మోస్తూ ఒకొక్క అడుగు ముందుకు వేయడానికి ఎంత వ్యధ అనుభవిస్తాడో ఆ రోజు కళ్ళకు కనిపించింది…

ఆప్యాయంగా పలకరించే పిలుపులు పోయి,
అప్పు తీర్చమంటూ వినిపించే ఆరుపులే ఎక్కువయ్యాయి.

తినడానికి మేము అడిగినదల్లా తెచ్చిపెడ్తున్నాడు అనుకున్నా,
కానీ ఆ అప్పు తీర్చడానికి తాను కొట్టు వాడి దగ్గర తిట్లు తింటున్నాడని ఆ రోజే తెలిసింది.

పంటలోని పురుగులను చంపటానికి అప్పుగా ఎరువు మందులు కొన్నాడు.
ఇప్పుడు ఆ షాపు యజమాని పురుగుకంటే దారుణంగా చూస్తున్నాడు.

 

నాన్న కనపడితే ఒకప్పుడు నవ్వుతూ పలకరించే మొహాలు,
నేడు కనిపిస్తే ఏ సాయం చేయమని అడుగుతాడో అని, చేతుల వెనకాల దాగి వెళ్లిపోతున్నాయి.

ఇదంతా నాన్న చేసిన తప్పా?
ముమ్మాటికీ కాదు.

నమ్ముకున్న నేలను అమ్ముకోలేక,
భూదేవి ఒడినుండి వచ్చినదాన్నే ప్రసాదంలా స్వీకరిస్తూ,

తను ఒడిదుడుకులు ఎదుర్కొంటూ,
తన పంటను నలుదిక్కులా ఉన్న ప్రజలకు అందజేస్తూ,
తన చేతి పంట పది మంది కడుపుమంటను తీర్చాలని ఆశిస్తూ,

ఎంత నష్టమొచ్చినా, ఇంకెన్ని అవమానాలు ఎదుర్కున్నా,
తాను నమ్మిన వ్యవసాయం నుండి సన్యాసం తీసుకోకుండా,

తన చెమట చిందించి, పండించిన పంటను, పది మంది తిని చెమట పట్టకుండా ఏసీ లో పని చేసుకునేందుకు తోడ్పడుతున్నాడు.

 

ఇవ్వన్ని చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే…
“పరిస్థితులు ఎలా ఉన్నా,
పుట్టెడు దుఃఖం జీవితాన్ని కమ్మేస్తున్నా,
మన కోరికలు ఆ కన్నీటి కడలిలో కొట్టుకుపోకుండా,
మనల్ని తన భుజంపై మోస్తూ ఒడ్డుకు చేర్చేవాడు నాన్న అని”

ఆ క్షణం ఆవేదనతో పాలుపోక, అక్కడే ఆగిపోయిన నాన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి వేలు పట్టుకుని తనకు మేమున్నాం అనే ధైర్యాన్ని గుర్తుచేస్తూ ముందుకు తీసుకెళ్ళా.

ఇవే కాదు
పండించిన పంటను మార్కెట్ కు చేర్చడానికి ఒక రైతు పడే ఇబ్బందులను, ఆ రోజు చూసిన నా కళ్ళు చెమర్చాయి.

దేశానికి వెన్నముక అనే రైతు
తన వెన్నుపై మోసుకొచ్చిన మూటను బస్సులో వేసుకోమని కండెక్టరును ప్రాధేయపడాల్సిన పరిస్థితి!

 

తీరా మార్కెట్ కు చేరాక,
దేశానికి బువ్వ పెట్టే రైతు
దళారి దోచుకుంటున్నాడని తెలిసినా ఎదిరించలేక,
దోసెడు చాచి తన కష్టానికి తగ్గ పైకము ఇవ్వమని అర్థిస్తాడు.

ఆడంబరమైన వస్తువులను ఫిక్సెడ్ ధరలకు కొనే మనము
ఆకలి తీర్చే రైతుకు తన పంటను నచ్చిన ధరకు అమ్ముకోవడానికి స్వాతంత్ర్యం లేకుండా చేశాం.

ఇన్ని అవరోధాలను ఎదుర్కొంటూ,
అయినవాళ్ళ ఆశలను తీర్చడానికి,
కన్న బిడ్డలను ఆనందంగా చూసుకోవడానికి,
ఆకలితో అలమటించే రైతులు ఎందరో!

 

ఇవ్వన్ని చూసిన నేను
రైతే రారాజు అన్న దేశంలో, వారికేంటి ఈ దుస్థితి అని ఆవేదనకు లోనవ్వాలో?

రైతుల పట్ల ప్రజల చులకనభావాన్ని చూసి
వారికి విసుగెత్తి వ్యవసాయం మానేస్తే లోకం పరిస్థితి ఏంటా? అని ఆలోచన కూడా లేని ప్రజల మూర్ఖత్వాన్ని చూసి నవ్వాలో తెలియలేదు.!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , , ,