These Musings Will Hit All The Love Failure Guys Out There

 

Contributed By Rohith Sai

 

ఊరంతా చీకటి, దట్టంగా కమ్ముకున్న వేళ…
నిశబ్దం వాడి గదిని పరుచుకుంది కానీ,
ఎదో తెలీని శబ్దం వాడి మదిని తొలిచేస్తోంది.

 

సంవత్సరం క్రితం జరిగిన సంఘటన ఇప్పటికి
వాడితో ప్రతి రాత్రి జాగారం చెయ్యిస్తునే ఉంది.
మనస్సులో దాగి ఉన్న, భాధ అనే మబ్బులకి
“ఆమె” గురుతుల మెరుపులు తగిలి, అవి చిల్లుపడి
వాడి ప్రేమేయమే లేకుండా కళ్ళ వెంట నీళ్లు జారి…
చినుకులుతో తడిసిన నేలలా, వాడి తల క్రింద దిండుని
కన్నీళ్లు తడుపుతూనే ఉంటాయి.

 

మూడు సంవత్సరాలు పాటు వాడిని విడవని పిల్ల,
ఆ రోజు “నీకు నాకు సెట్ అవ్వదు” అని తేల్చేసి వెళ్ళిపోయింది.
ఎందుకని ప్రశ్నిద్దాం అనుకున్నాడు… కానీ తన నిర్ణయాన్ని గౌరవించి,
మౌనంగా సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయాడు.

 

వాళ్ళు కలిసి ఉన్న కాలంలో, చాలా విన్నాడు….
స్నేహితుల ద్వారా, సన్నిహితుల ద్వారా.
వాడు కూడా గమనించాడు….
ఆ పిల్ల మాట జోరు, వాడితో ప్రవర్తించే తీరు.
కానీ “నా పిల్ల, ఎం పర్లేదు” అని వాడికి వాడే సర్దిచెప్పుకున్నాడు.

 

ఏమయ్యాయో…..
తనతో కలిసి గడిపిన మధుర క్షణాలు,
సమయం మర్చిపోయేలా మాట్లాడుకున్న కబుర్లు.
పొద్దున్నే లేస్తూ వాట్సాప్ లో కొత్త కొత్త పలకరింపులు,
ఏ పని చేసిన “తను ఇప్పుడు ఎం చేస్తుందో” అనే ఊసులు,
పడుకునే ముందు కూడా ముద్దు ముద్దు సంభాషణలు.
ఏమయ్యాయో ?

 

ఏమాయ్యాయో……
తన ఆరోగ్యం బాలేకపోతే,
వీడు దేవుడికి పెట్టిన దణ్ణాలు,
చేసిన పూజలు, మొక్కిన మొక్కులు.
రోజంతా తన గురించే కలవరింపులు,
తాను బాగయ్యే వరుకు అవే తలంపులు.
ఏమయ్యాయో ?

 

ఏమయ్యాయో……..
ఇంట్లో చెప్పకుండా బైట తనని కలుసుకున్న సన్నివేశాలు,
ఇంట్లో దాక్కుని, దాక్కుని మాట్లాడుకున్న సందర్భాలు.
తను గెలిస్తే, సంబరపడి ఆనందంలో
పిచ్చిగా వీడు వేసిన గెంతులు, చిందులు,
తను ఓడిపోతే, “ఎం పర్లేదులే, నేనున్నాగా”
అంటూ మళ్ళి వీడే ఇచ్చిన చేయూత మందులు.
ఎమయ్యాయో ?

 

ఏమయ్యాయో…….
చిన్న చిన్న కొట్లాటలు,
చిలిపిగా పడిన అలకలు,
ఆనందాల చిరు నవ్వులు,
బాధల్లో కన్నీరు జల్లులు,
ఇచ్చిపుచ్చుకున్న పువ్వులు,
దాక్కుంటూ దొరికిపోవడాలు,
దొరికిపోతూ దాక్కోవడాలు,
ఎన్నెన్నో దాగుడుమూతలు.
ఏమయ్యాయో ?

 

ఇన్ని జరిగిన ఎప్పుడు వదిలిపోనీ తన తోడు,
ఆ రోజు వాడిని, ఒంటరిని చేసిపోయింది.
ఇప్పుడు తనని తలుచుకున్న ప్రతిసారి,
ఎంతో ఇష్టమైనా… గొంతు దిగడంలేదు ఏ కూడు.
మతిమరుపుని… మొదటిసారి గౌరవించాడు వాడు.

 

ఇన్నాళ్ళుగా మౌనంగా వాడితో వాడు రాత్రుళ్ళు చేసిన రణానికి,
కొన్నాళ్ళకి తెలిసింది వాడికి, తాను వీడిని వదిలేసిన కారణం…

 

వీడు సాదాగా గడిపే జీవితమే ఆ ప్రశ్నకు సమాధానాం….
అక్కర లేని హంగామా
అవసరం లేని ఖర్చులు
లేని పోని హంగులు
పైకి పోని ఆర్భాటాలు
భవిష్యత్తుకై దిగులు లేదు
ప్రస్తుతంలో జీవిస్తాడు.
అది వీడి జీవన శైలి, మారడు, మార్చుకోలేడు,
వాడి సిద్ధాంతాలకి, నమ్మకాలకి వ్యతిరేకంగా ఉండలేదు.

 

ఒక్కప్పుడు అవి నచ్చే వీడికి దగ్గరైన పిల్ల,
మళ్ళి దూరంగా జరిగిపోడానికి కారణం ??
బహుశా….
కాలంతో, వీడి వ్యక్తిత్వం మారకపోయినా,
తన అవసరాలు మారి ఉంటాయేమో.

 

వాడికి ఈ రాత్రి ఒకటి చాలా బలంగా అర్థం అయ్యింది,
ఎదురుగా గోడపైన రాసుకున్నాడు ఎప్పుడు కనపడేలా….

 

” నిన్ను ఎవ్వరు విడిచినా, నీతో పాటు వదలకుండా ఉండే, నీ నీడ,
అలానే కాలంతో ఎన్ని మారినా, అన్నిట్లోను నిలిచిపోయే ఆ మార్పు,
మాత్రమే శాశ్వతం!! ”

 

బలంగా ఊపిరి పీల్చి ఇలా అనుకుని పడుకున్నాడు…
“ఇంకా ఆమె గురించి ఆలోచించింది చాలు, రేపటి భవిష్యత్తు నాదే”.

 

అందరు అంటుంటారు పరిస్థితులే మనిషిని మారుస్తాయని… కానీ ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ఎన్నుకునే మార్గమే నీ దిశను నిర్దేశిస్తుంది. త్రివిక్రమ్ గారు అత్తారింటికి దారేదిలో చెప్పినట్టు, ప్రతి సమస్య మనిషికి రెండు దారుల్ని చూపిస్తుంది. ఒకటి నిన్ను ముందుకు తీసుకెళ్ళేది, రెండోది నిన్ను వెనక్కి విసిరేసేది, ఏ దారి ఎంచుకోవాలో నీ చేతుల్లోనే ఉంటుంది. ఆ దారిని చాలా జాగ్రత్తగా ఎంచుకోండి.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , ,