Here Are Some Instances From The Book “Dosita Chinukulu” Written By Prakash Raj Garu, Which Tells Reality Of Life

 

నియంతలు పోయి, ఫిలాసఫర్లు దేశాధ్యక్షులుగా ఎన్నికైన దగ్గర నుండే అసలైన అభివృద్ధి ప్రారంభమైందని ఓ రచయిత అంటారు. దీనిని అన్నిరంగాలకు అన్వయించుకోవచ్చు. మనకు ఎంతోమంది గొప్పనటులు ఉన్నా వారిని ఇంకో మెట్టుకు ఎదిగించేది వారి వ్యక్తిత్వం. ప్రకాష్ రాజ్ గారి వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. ఐదు జాతీయ పురస్కారాలు, ముప్పైకి పైగా రాష్ట్రీయ అవార్డులు, సామాజిక సేవ, ఆధ్యాత్మిక చింతన, విద్యా సేవ, సేవ్ టైగర్ అభియాన్ కు గౌరవ రాయబారిగా ఉన్నారు. ఇలా పలు రంగాలలో రాణిస్తున్న ప్రకాష్ రాజ్ గారు రాసిన ఈ ‘దోసిట చినుకులు’ పుస్తకంలో తన జీవితంలో జరిగిన సంఘటనలు తద్వారా తన ఆలోచనలు, విలువైన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

 

ప్రకాష్ రాజ్ గారు పుస్తకం ద్వారా పంచుకున్న కొన్ని అనుభవాలు:
1. నేను నా తల్లిని అలా చూడకూడదు, చూడకూడదు:
మిత్రుడొకడు కొత్త ఇల్లు కట్టించాడు. ‘రావోయ్ వచ్చి చూడు’ అంటే వెళ్ళాను. జబర్దస్త్ ఇల్లు, ఇంటిని చూస్తూ ఉంటే ఓ మూల గదిలో ఒకావిడ కనిపించారు. ఎవరని అడిగితే ‘అమ్మ’ అన్నాడు. మనసు బరువైంది. మా అమ్మ గుర్తొచ్చింది, నేను కూడా అమ్మ పట్ల ఇలా మారిపోతానేమో అని మనస్సుతో పదే పదే జగడానికి దిగింది. ‘లేదురా నువ్వు బాగా చూసుకుంటావు’ అనే జవాబు వచ్చేదాకా మనసులో అలజడి. అతడి తల్లిని చూసిన తర్వాత మిత్రుడి మీద గౌరవం పోయింది. ఉద్యోగం కోసం పిల్లలు విదేశాలకు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతారు, కన్నవారి కోసం ఎంతో కొంత డబ్బు పంపిస్తారు. సంవత్సరానికొకసరి వచ్చి ఉండటానికి పెద్ద బంగాళా కడతారు. చివరికి దానిని చూసుకోవడానికి వాచ్ మెన్లలా పెట్టేది ఈ తల్లిదండ్రుల్నే. ఈ అపార్ట్మెంట్ జీవితం ఉందే.. ఇది మనుషుల్ని చూడక కేవలం గోడల్ని మాత్రమే చూసుకుంటూ సాగించే బ్రతుకు. దాన్ని చూస్తూ ముదిమి వయసువాళ్ళు తమ ఒంటరితనాన్ని గడుపుతారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో జీవించి అవసాన దశలో పిల్లలతో గడపాలి అని వచ్చి, ముక్కూమొహం తెలియని మనుషులతో, అర్ధం కాని ఊళ్లలో ఊపిరాడటమే కష్టమై, నవ్వుతూ మాట్లాడటానికి మనుషులే లేక బాధపడుతున్నారు. మన పెద్దవారు వృద్ద్యప్యాన్ని పొగడకపోవటం ఒక విషాదం. ఇలాంటి విషాదంలో ఒక రాష్ట్రం మునిగిపోయిందనటానికి ఇప్పుడు పెరుగుతున్న వృద్ధాశ్రమాలే సాక్ష్యం.


 

2. నా కొడుకు సమాధి:
చాలా సంవత్సరాల క్రితం చెన్నై మహాబలిపురంలో ఒక చిన్నతోట కొన్నాను. ఉద్దేశ్యమంటూ ఉంది. ‘నేను తినే భోజనాన్ని నేనే వ్యవసాయం ద్వారా పండించుకోవాలి’. అక్కడికి వెళితే ఈ ప్రపంచాన్ని మరచి అదే నాకు ప్రపంచమవుతుంది. ఈ తోట నా పాలిట ఏడుస్తూ పరిగెడుతూ వచ్చే చిన్నారికి దొరికే అమ్మ ఒడి లాంటిది. చుట్టూ ఏ బిల్డింగ్స్ లేవు. గుడిసె ఇల్లు; గదుల్లేవు. కొబ్బరి ఆకుల నీడ. రంగు రంగుల పూలు. మొక్కలు, చెట్లు, కాయలు, పళ్ళసంత జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ నన్ను చూసి నవ్వుతుంటోంది తోట. నా కొడుకు సిద్ధార్ధుడి సమాధి కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ ప్రకృతితో మాట్లాడుతూ ఒంటరిగా అనుభవించే సుఖమే వేరు. ఇక్కడికొస్తే చాలు ఎన్నో దుఃఖాలు దొర్లుకువస్తాయి. ఒకరకమైన పేగు సంబంధం లాంటిదనుకోండి. అందుకే నా కొడుకు సిద్ధార్ధుడి పార్థివ దేహాన్ని కూడా ఇక్కడే తెచ్చి దహనం చేశాను. ఇలాంటి స్థలాన్ని వెలకట్టగలమా? వెల కట్టాడో మహానుభావుడు. ఈ మహానుభావుడు ఒక మాట చెప్పాడు, దానిని ఈ జన్మలో మర్చిపోలేను. “ఏం సార్ మీరు. అంతమంచి తోట పెట్టుకుని, అందులో మీ అబ్బాయి సమాధి కట్టారే, ఈ సమాధి కనుక లేకపోతే మీ తోట ధర రెట్టింపయ్యేది. ఆతుర పడ్డారు” అంటూ నా మీద ప్రేమ ఒలుకబోస్తూ బాధపడ్డారు. అతడిని చూసి నాకు అయ్యో పాపం అనిపించింది. అతడి భార్య పిల్లల్ని మనుషుల్లా చూస్తాడో లేదో. వాళ్ళు ఇతడి కళ్లకు తోటల్లా, భూముల్లా, బిల్డింగుల్లా కనిపిస్తారేమో అని. జీవితంలో అతడికి అన్నింటినీ డబ్బు, ఆస్తులతో కొలవడం అలవాటైపోయింది. అతడికి తాజ్ మహల్ చూపిస్తే దాని సౌందర్యాన్ని చూసి ఆస్వాదించకుండా అక్కడున్న మార్బల్ కు డబ్బులెన్ని రావొచ్చోని లెక్కలేస్తాడేమో.
(ఈ క్రింది ఫోటోలు తన రెండో కొడుకు వేదాంత్ తో తను పెంచుకున్న ఆ తోట లో ఉన్న ఫోటోలు)
 


3. వంద వ్యక్తుల్లో ఒక్కడు విజయం సాధిస్తాడు:

మొన్న ఒక బుక్ స్టోర్ కు వెళ్ళాను. మంచి పుస్తకాన్ని వెతకడం అనేది ఒక గొప్ప అనుభవం. గదంతా రకరకాల టైటిల్స్ తో ఉన్న పుస్తకాలతో కిక్కిరిసి ఉంది. ‘పరీక్షల్లో విజయం సాధించడం ఎలా?’ అనబడే మన తలరాతను మార్చే పెద్ద పుస్తకం అక్కడుంది. దాన్ని చదవకుండా టెక్స్ట్ బుక్స్ సరిగ్గా చదివి పాస్ కావచ్చు. ‘ఈతకొట్టడం ఎలా?’ నీటిలో పడ్డాకే నేర్చుకునే ఆ విద్యను పుస్తకంగా రాశాడు ఒక మహానుభావుడు. అరె, చెత్తలా తమకు తోచిందంతా రాయడం మొదలుపెట్టారే అని అనుకుంటూ ఉండగానే ‘చెత్తతో రసం’, చెత్తను ఉపయోగించడం ఎలా? అనే పుస్తకం కనపడింది. జీవితంలో నెంబర్ వన్ అవ్వడం ఎలా?, మీ ఆత్మస్థైర్యానికి టానిక్, విజయం ఖాయం ఇలాంటి కొన్ని టైటిల్స్. మనిషి పుట్టిన తర్వాత విజయం సాధించి తీరాలని బోధించే విధానాన్ని టైటిల్స్ చూసి తెలుసుకోవచ్చు. టెన్షన్ తగ్గించే యోగ, మనసు విడుదల, గడపమీద నిలబడ్డ విజయం.. వీరినంత చూస్తుంటే రేసులో గెలిచి తీరాలి అని గుర్రానికి కల్లుతాగించిన వారు గుర్తుకొచ్చారు. వంద వ్యక్తులలో విజయం సాధించిన ఒక వ్యక్తిని ఏ ప్రశ్న అడగకుండానే పొగుడుతూ రాసిన వ్యాసాలు అవి. ఇలా ఒక్కడిని ఉదాహరణగా చూపించి, మిగితా తొంభై తొమ్మిది మంది విజయం సాధించవచ్చనే ప్రచారం చేయడం కన్నా వేరే మోసం ఏది లేదనిపించింది. ఈ విజయం అనబడే అంటువ్యాధి మన స్కూళ్ల నుండే ప్రారంభమవుతుంది. ఆ కారణంతోనే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే చాలు ఆ ఓటమిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్లారు.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,