ప్రతి తండ్రి కూతుళ్ళ అనుబంధం ఎప్పటికి పదిలం: ఈ కథ, ఆ అనుబంధానికి చిన్ని ఉదాహరణ – A Short Story

 

Contributed By Masthan Vali

 

‘ నాన్నా ఎక్కడ… అరగంట నుంచి వెయిటింగ్… ‘ అరుస్తూ అడిగాను.
‘ వచ్చేసానే, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఎంతకూ తేమలట్లే. ఇంకో 10 నిమిషాల్లో అక్కడుంటా’ అంటూ కట్ చేశాడు ఇవతలేం చెప్పేది వినకుండా.! ఎప్పుడు ఇంతే, ఈయన చెప్పేది వింటే చాలనుకుంటాడు… అంటూ హెడ్ ఫోన్స్ తగిలించుకున్నాను. మ్యూజిక్ ప్లే అవుతోంది…
నా మనసులో ఆలోచనలు ఏడాది వెనక్కు వెళ్ళాయి…సరిగ్గా ఏడాది.!

 

———————————
‘రెండ్రోజులుగా మాట్లాడాలి మాట్లాడాలి అంటున్నావ్, ఈ రోజు చెప్పమంటే రేపు చెప్తా అంటావేంటి…?’ రాత్రి భోజనం దగ్గర తప్పించుకోడానికి వీల్లేకుండా డిస్కషన్ పెట్టాడు నాన్న.
‘ ఏంటి…? తండ్రీకూతుళ్ళు రెండ్రోజులుగా నా దగ్గర ఏదో దాస్తున్నారన్నమట ‘ నాన్న నన్నడిగిన ప్రశ్నను అమ్మ తన అనుమానాన్ని జోడించింది.
‘ ఏమేవ్, నీకు తెలుగు రాదా లేకా చెవుడొచ్చిందా.? రెండ్రోజులుగా తను చెప్పకుండా ఉందని నేనంటే, మేమేదో దాస్తున్నావంటావేంటి…!’ నా వైపు చూస్తూ అమ్మను కసురుకున్నాడు.
‘ ఏమో, ఆల్రెడీ చెప్పేసి ఇప్పుడు నాకు రివీల్ చేయడానికి తండ్రి కూతుళ్ళు డ్రామాలడుతున్నారని డౌట్ నాకు…! ‘ అది అమ్మకు మా పై ఉన్న నమ్మకం, తన గత అనుభవాల దృష్ట్యా!
‘ అబ్బో … నువ్వంటే నాకు భయం మరి…! ‘ వెక్కిరిస్తూ అన్నాడు నాన్న
‘ అయినా ఈ ఇంట్లో నాకెవరు భయపడతారు లెండి… ‘ నా వంక చూస్తూ అంది.
‘ అబ్బబ్బ, ఆపండి మీ గొడవ… నన్ను చెప్పనివ్వరా.!? ‘ నాకు కోపం వస్తోంది వీళ్ళ టామ్ & జెర్రీ ఫైట్ చూసి!
ఇద్దరూ సైలంట్ అయ్యారు… ఓ 10 సెకన్ల తర్వాత,
‘ హా చెప్పు మరీ… ‘ నాన్న వడ్డించుకుంటు అడిగారు శాంతంగా.
‘ ఏం లేదు నాన్న, నేను మాస్ కమ్యునికేషన్ చేయాలనుకుంటున్నా…’ అని చెప్పేసి నోట్లో అన్నం ముద్ద పెట్టేసుకున్నాను ఇంకేం మాట్లాడకూడదని.!
‘ ఏంటదీ…? తింటున్న అమ్మ ఆపేసి అడిగింది. నాన్న ఏం మాట్లాడలేదు. నేనూ అమ్మకు సమాధానం ఇవ్వలేదు.
‘ నిన్నేనే, ఏంటది…?’ చెప్పకుంటే అమ్మ అన్నం తినేలా లేదు.!
‘ అది మాస్ కమ్యూనికేషన్ మా… అంటే జర్నలి…’
‘ ఎన్నేళ్ళు మరి…? ‘ నాకు అడ్డు తగిలి అడిగారు నాన్న.
‘ ఏంటి నాన్న…? ‘ నాకు సరిగా అర్థం కానట్టు అడిగాను.
‘ ఎన్నెళ్ళూ చదివించాలి ఇంకా అనడుగుతున్నారు… ‘ అని నాతో చెప్పి, ‘ సంబంధాలు చూడడం మొదలెట్టండి అంటే ఇంకా చదివిస్తారట కూతుర్ని…’ మాకు వినబడేలా గొణుక్కుంటోంది అమ్మ…!
‘ అది ఓ 2 Years నాన్న, 1-Year Course తర్వాత Internship 1-year ఉంటుంది… ‘
‘ నాకో విషయం చెప్పు ఇప్పుడు ను చదివిన చదువుకు చదవబోయే దానికి ఏంటి సంబంధం…? ‘
నాకేం చెప్పాలో తెలియలేదు… మౌనంగా కలిపిన అన్నాన్ని కలుపుతూ ఉన్నా…
‘ పోనీ, రేపు ను చేయబోయే ఉద్యోగానికి ఇప్పుడు ను చదవాలి అనుకునే దానికి సంబంధం ఉంటుందా…? ‘
‘ ఉంటుంది నాన్న, జర్నలిస్ట్ కావాలనే దానికి సంబంధించినదే చదవాలనుకుంటున్నాను… ‘ ఉత్సాహంగా అన్నాను…
నా ఉత్సాహం నాన్నకి కనిపించినా… కాసేపాగి,
‘ నాకు నిన్ను చదివించడం ఇష్టం లేకనో, తొందరగా పెళ్ళి చేసి పంపించాలనో ఈ మాట చెప్పట్లేదు… తెలిసో తెలియకో అందార్లానే నిన్నూ ఇంజినీరింగ్ జాయిన్ చేసాను…నువ్వు బాగానే చదువుకున్నావ్. కానీ ఈ నాలుగేళ్ల తర్వాత నీకు తెలిసొచ్చింది నీకేది ఇష్టమో…హ్మ్మ్ తప్పులేదు, ఇప్పటికైనా తెలుసుకున్నావ్. కానీ, నాలుగేళ్ల క్రితం చేసిన తప్పు మళ్లీ చేయకూడదని చెబుతున్నాను… ఇంకొంచెం టైమ్ తీసుకో సంధ్య… ఎందుకంటే మనిషి గడిచిన కాలాన్ని కొలవ కలిగే సాధనాన్ని కనిపెట్టాడే గానీ ఆ గడిచిన కాలాన్ని కొనగలిగే ధనాన్ని కనిపెట్టలేదు. టైం తీసుకుని ఇంకోసారి ఆలోచించుకుని చెప్పు…సరే నా…’ అంటూ భోజనం ముగించారు…
——————————-

 

మ్యూజిక్ వలనో, ఆలోచనల వలనో నేను ఈ లోకంలో లేను. పక్కనున్న వ్యక్తి నన్ను తట్టి పిలిచేంతవరకు…
ఎవరా అని చూస్తే, ‘ మిమ్మల్నెవరో పిలుస్తున్నారు… ‘ అని రోడ్డుపైకి చేయి చూపించాడా వ్యక్తి. చూస్తే నాన్న, ‘రా తొందరగా…’ అంటూ బైక్ పై నుచి చెయ్యుపుతూ పిలుస్తున్నాడు. రెండడుగుల్లో వెళ్లి వెనుక సీట్లో కూర్చున్నాను.
‘ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే చాలు ప్రపంచం అంతమైనా పట్టించుకోవు… ఎందాకట్నుంచి పిలుస్తున్నా తెలుసా… పక్కన ఆ అబ్బాయ్ లేకుంటే నేనే ఈ ట్రాఫిక్ లో దిగొచ్చి పిలవాల్సొచ్చేది…’ బండి నడుపుతూ అరుస్తూనే ఉన్నాడు…
‘ ఆపు నాన్న, నేను అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను, దానికి దీనికి సరిపోయింది… అమ్మలా అరవకు నువ్వుకూడా. ‘
‘మధ్యలో అమ్మనెందుకు లాగుతావ్, అనడానికి తానొకటి దొరికింది నీకు.’
‘అబ్బో ఏంటో ఉమా దేవి గారినంటే, రాజశేఖర్ రావు గారికి కోపం…’
‘చూడు పేర్లు పెట్టి పిలుస్తోంది అమ్మా నాన్నల్ని, మీ అమ్మ చెప్పేది తప్పేం కాదు నేనే నిన్నిలా చేసాను… ‘
‘అదొక్కటే నువ్వు చేసిన మంచి పని ‘ అని ఠక్కున అనేసాను. నాన్నకి ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.
ఇంతలో ‘నాన్న నీ పైన చినుకు పడిందా…?’ నా చేతి పై పడ్డ చినుకు బొట్టు ని తుడుస్తూ అడిగాను.
‘ఇంత ఎండలో చినుకులేంటే … ‘ అంటుండగానే అతని పై ఒక చినుకు రాలింది. ‘ ఆ పడింది ఇప్పుడే ‘ అంటూ ఆకాశం వైపు చూసాడు. సూర్యుడిని మేఘాలు కమ్మేస్తున్నాయ్.
‘వర్షం పడేలా ఉంది నాన్నా… రోజులాగే కాలేజ్ అవగానే నా పాటికి నేను బస్సు లో ఇంటికి వెళ్లిపోదును. ఇక్కడే ఉన్నా, పక్కనే ఉన్నా అని వెయిట్ చేయించి చేయించి ఇప్పుడు సరిగ్గా వర్షం పడే సరికి వచ్చావ్.!! ‘
‘ ఇప్పడు ను చేసేదేంటి, అరవడం కాదా… నేనేమన్నా కాల జ్ఞానినా వర్షం పడుతుందని ముందే తెలియడానికి…ఓ తడిసిపోతుందట ‘
‘ రేపు ఫైనల్ ఎక్సామ్, తడిసి జ్వరమొస్తే నీదే బాధ్యత…’
అలా మాటల్తో పోట్లాడుకునేలోగానే వర్షం మొదలయ్యింది.

‘. . . . . . . . . . . ‘
‘ఏంటి ఎం మాట్లాడవు …? ‘
‘. . . . . . . . . . . ‘
‘నిన్నే ‘
‘కాసేపుంటావా… ‘ అంటూ బైక్ ని పక్కనే ఉన్న CCD దగ్గర ఆపాడు.
‘పద లోపలి తొందరగా…. ‘ అంటూ నా చెయ్యి పట్టుకుని వడి వడి గా లోపలికెళ్ళాడు.
బయట వర్షం కనిపించేలా అద్దానికి పక్కగా ఉన్న టేబుల్ ఎంచుకున్నారు.
వీక్ డే కావడం తో కస్టమర్లు తాకిడి కూడా వీక్ గా ఉంది
‘ పోన్లే నాన్న వర్షం వలన మంచే జరిగింది… ‘
‘ఏంటి? కాఫీ షాప్ కి రావడమా…?’
‘హా, నేనే మీకు ట్రీట్ ఇవ్వాలి, ఎక్కడికి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉన్నా … ‘ చెప్పి నాన్న రియాక్షన్ కోసం చూస్తోంది.
‘ ట్రీటా, దేనికో ‘ ఉత్సాహాన్ని ఆపుకుని అడుగుతున్నది అర్థమయింది సంధ్యకి.
‘దేనికో దానికి… ‘ కాసేపు చెప్పకుండా ఆడుకుందామని అంది.
‘దేనికో దానికి అయితే…సర్లే నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు… ముందు కాఫీ చెప్పు … ‘ నా దగ్గరా నీ ఆటలు అని నవ్వుకున్నాడు లోపల.
‘అంటే దేనికో తెలుసుకోవాలని లేదా… ‘
‘ఉంది కాబట్టేగా అడిగాను… నువ్వే చెప్పలేదు…’
‘నేను చెప్పకుంటే, ఇంకోసారి నువ్వడగవా … ‘ అని అలిగాను.
‘ సర్లే దేనికో చెప్పరా… వర్షం తగ్గిపోతే కాఫీ తాగకుండానే వెళ్లిపోవాలి… ఆ తర్వాత నీ ఇష్టం.’ అని చేతులు పట్టుకుని నవ్వుతూ బ్రతిమాలి బెదిరించాడు నన్ను.
‘ నేను అనే దాన్ని గా ఇండియన్ ఎక్సప్రెస్ లో Internship కోసం చూస్తున్నా అని…అది OK అయ్యింది…’ కనుబొమ్మల ని ఆడిస్తూ చెప్పాను.
‘ మొత్తానికి నా కూతురివి అనిపించుకున్నావ్… ‘
‘ఓ హలో హలో… కాస్త ఆగుతావా… దీనికి నీ క్రెడిట్ ఏంటి పెద్ద…?’
‘అదేంట్రా అంత మాటన్నావ్, మీ అమ్మ తో ఫైట్ చేసి నిన్ను చదివించింది నేనే గా… ఆ మాత్రం క్రెడిట్ కూడా లేదా నాకు …’ ఈ సారి నాన్న బుంగ మూతి పెట్టుకున్నాడు.
‘ నాన్న, మాట…’ అంటూ దగ్గరికి పిలిచాను
ఏంటా అని దగ్గరికెళ్తే, మెల్లగా ‘నువ్వలా బుంగ మూతి పెట్టకు నాన్న, నేను నవ్వలేను’ అని గట్టిగా నవ్వేసాను .
నన్ను చూసి తాను నవ్వేసాడు.
ఇంతలో కాఫీ ఆర్డర్ ఇచ్చారు, వచ్చింది.
సిప్ చేస్తూ, “ఇప్పుడు చెప్పు, ఏంటి ప్లాన్స్. Internship 1 Year అన్నావ్ కదా …?”
“హా నాన్న, నచ్చితే వాళ్ళే ఉద్యోగం లోకి తీసుకుంటారు. తర్వాత బాగుంటే అక్కడే కంటిన్యూ అవుతా, లేకుంటే వేరే చోట ట్రై చేస్తా …”
“సంధ్యా, నువ్వు జర్నలిజం చేస్తా అన్నపుడు టైం తీసుకో అన్నాను, తీసుకుని ఎస్ అన్నావు. అప్పుడు నువ్వు ఏం ఆలోచించావో తెలీదు కానీ… జర్నలిజం అన్ని ఉద్యాగోల్లాంటిది కాదమ్మా…”
“తెలుసు న్నాన్న, ఫీల్డ్ లో ఉండాలి, ఎండలో తిరగాలి, టైం కి భోజనం ఉండదు , వీకెండ్స్ ఉండవు… కొంచెం కష్టమే… అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను, అయినా ఇందులో కూడా అన్ని జాబ్స్ లాగే 9 To 5, Weekly 5 days చేసే అవకాశాలు కూడా ఉన్నాయ్, సో నువ్వేం కంగారు పడకు…”
“అది కాదు రా నేను చెప్పేది…. జర్నలిజం అనేది సులువా కష్టమా అని పక్కన పెడితే, అదేంతో బాధ్యత తో కూడిన ఉద్యోగం…”

 

“. . . . . . .”
“ఇప్పడున్న పరిస్థితుల్లో అన్ని వ్యాపారమైపోతున్నాయ్. మనం చేసే పని వలన మనకు గుర్తింపు రావాలి గాని గుర్తింపు కోసం అదే పనిగా పని చేస్తున్నాం మనమంతా. అది వేరే ఏ రంగం లో అయినా పర్లేదు, కానీ మీడియా లో ఉండకూడదు. అలా ఉండబట్టే మన చానళ్లు టి.ఆర్.పి కోసం ఎగబడి దేన్ని చూపాలో దేన్ని దాచాలో అన్న Basic Ethics ని మర్చిపోతున్నాయ్.”
“తప్పేముంది నాన్న, ప్రజలు చూస్తున్నారు కాబట్టే గా వాళ్ళు చూపిస్తున్నారు… ఐ మీన్, నేనేదో ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతున్నా అని చెప్పట్లేదు, అందులో తప్పేముంది అని నా పర్సనల్ ఒపీనియన్ …”
“మనుషులు దేవుని గుడికి వెళ్ళినప్పుడు ఎన్నో కోరికలు కోరుకుంటారు. కానీ దేవుడు అన్నీ తీర్చెయ్యడుగా. వాళ్లకు నిజంగా కావలసినవి, అవసరమైనవి మాత్రమే తీరుస్తాడు. అన్నీ తీరిస్తే దేవుడికి ఇంకేం విలువుంటుంది అనుకోకు, అలా చేస్తే వాళ్ళ కోరికలకు హద్దులుండవు…”
“……..”
నా మౌనాన్ని చూసి, “నువ్వు దేవుడ్ని నమ్మవని తెలుసు…” అన్నారు .
“అలా ఏం కాదు నాన్న…. ఆలోచిస్తున్నాను.”
“పోనీ మమ్మల్నే తీసుకో, మీ అమ్మా నేను. ను చిన్నప్పుడు చాలా అడిగేదానివి. కొనివ్వకుంటే ఏడ్చేదానివి. లేదంటే ఒక్క మాటా వినేదానివి కావు. అలా అని మేం నువ్వడిగినవన్నీ ఇవ్వలేదు. నీకు ఏది ఏ వయసులో అవసరమో అది మాత్రం తప్పకుండా చేసాం. అంతెందుకు, మొన్ననువ్వు చదువుకుంటానంటే మీ అమ్మ నీ ముందు అంత అరిచింది కదా. తాను కూడా గారం చేయకూడదని అలా అంది, అంతే గాని తనకి ఇష్టం లేక కాదు. అలా కొన్ని సార్లు నువ్వు బాధ పడ్డా నీ బాగు కోరుకునే చేస్తాం ఏదైనా… మీడియా కూడా లానే ఉండాలి. చూస్తున్నారు కదా అని చూపించేయడం కాదు. ఏది అవసరమో ఏది అనవసరమో నిర్ధారించుకోవడం రిపోర్టింగ్ చేసేటప్పుడు మీ Prime Responsibility కావాలి, గుర్తుంచుకో…”
“అంటే ఇన్నాళ్లు నేను తప్పుగా ఆలోచించాను నాన్న…”
“తప్పేం కాదు రా. అది నిజమే, ఇది నిజమే. జనం చూస్తున్నారని వాళ్ళు , వాళ్లే చూపుతున్నారని జనం, ఇలా ఒకరికి మీద ఒకరు చెప్పుకోవడమే. కానీ ఇక్కడ కావలసింది నిజం కాదు, దీనికి పరిష్కారం. అసలు చూపించక పోవడం కన్నా మంచి పరిష్కారం ఏముంది చెప్పు, ఒకడు చూపించకపోతే లక్షల మంది చూడరు… ఇది తెలియనిదేం కాదు మీడియాకి. అందుకే అన్నాను ఇదో వ్యాపార సూత్రం అయ్యిందని.”
“. . . . . . . . .”

 

“ఎక్కువగా ఆలోచించకు. ఒకటి మాత్రం గుర్తుంచుకో. ఇందాక చెప్పినట్టు, దేవుడి ప్రభావం ఒక మతం పైనే ఉంటుంది. తల్లి తండ్రుల ప్రభావం ఒక కుటుంబంపైనే ఉంటుంది… కానీ మీడియా ప్రభావం ఒక సమాజం పైన, ఒక దేశం పైన ఉంటుంది.”
ఎందుకో ఇప్పటివరకు నాన్న నా కోసం ఎన్ని చేసినా ఎప్పుడు తనతో చెప్పని మాట ఇప్పుడు చెప్పాలనిపిస్తోంది…
“I Love You నాన్న” వెంటనే చెప్పేసాను.
నాన్న సన్నగా నవ్వి, బయటకు చూస్తూ “వర్షం తగ్గినట్టుంది…” వెల్దామా అన్నట్టు అడిగాడు.
నేను నవ్వుతూ లేచాను.
తెరపినిచ్చిన వర్షపు వాతావరణంలో తడిచిన రోడ్డు పై బైక్ మీద చల్ల గాలికి వెళ్తుంటే ఆలోచనలు మొదలయ్యాయి… నాన్న చెప్పిన ఆ మాటలు పదే పదే వినపడుతున్నాయి.
“దేవుడి ప్రభావం ఒక మతం పైనే ఉంటుంది. తల్లి తండ్రుల ప్రభావం ఒక కుటుంబంపైనే ఉంటుంది… కానీ మీడియా ప్రభావం ఒక సమాజం పైన, ఒక దేశం పైన ఉంటుంది…”
‘ఫోన్ లో ఏ మాట పూర్తిగా వినని నాన్న, జీవితంలో నాకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని ఇంత సులభంగా విడమరిచి అర్థం అయ్యేలా చెప్పడం…’
మనసులో ఇంకోసారి అనుకున్నాను, “Love you నాన్న…”

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , , , , , ,