Meet The Man Who Started Daawat Without Daaru, A Campaign To Prevent Alcohol Consumption

 

నాకు స్వతంత్రం కావాలా, మద్య నిషేధం కావాలా అని అడిగితే నేను మొదట మద్య నిషేదానినే కోరుకుంటాను. -మహాత్మాగాంధీ

 

“తాగురా!! మందుతాగని వాడు అసలు మగాడే కాదు, పార్టీకి వచ్చి మాజా తాగుతావా.? నీ అబ్బ నువ్వేం మగాడివిరా!! ఆపరా నీ సోది, ఇది నేను ఇస్తున్న పార్టీ నువ్వు మందు తాగాల్సిందే లేదంటే నా మీద ఒట్టు!! రేయ్ వీడి చేతులు పట్టుకొండ్రా!! ఒక్కసారి మందు గొంతులో పడితే ఆ కిక్కుకు వీడే కావాలి కావాలని అడుగుతాడు!! “ ఇదిగో ఇలానే కదా మనలో చాలామందికి(నేను మందు మానేసి ఐదు సంవత్సరాలవుతుంది) మొదటి అనుభవం ఒక పార్టీలోనో, ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తోనో జరిగి ఉంటుంది!! 99% మందికి మందు అలవాటు అయ్యేది ఇలాంటి పార్టీలోనే తప్ప వాడంతట వాడు మొదటిసారి ఒంటరిగా తాగే సందర్భాలు చాలా చాలా తక్కువ. ఇప్పుడు జరుగుతున్న అనేక చెడు సంఘటనలకు మూలం “అల్కాహాల్ తీసుకోవడం”, ఈ అలవాటు ఎక్కడ మొదలవుతుందంటే ఇదిగో మనం పైన చెప్పుకున్న ఒకానొక పార్టీలో!! ఐతే ఇక్కడి నుండే మన క్యాంపైన్ మొదలుపెట్టాలి.. “దావత్ విత్ అవుట్ దారు” పార్టీ చేసుకోండి కానీ మందు తాగకండి, అని చేగొండి చంద్రశేఖర్ గారు సంవత్సరం క్రితం ప్రారంభించారు.


 

1925 మార్చ్ 24th నా మహాత్మాగాంధీ గారు మద్య నిషేధంపై ఓ సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు, నేను దావత్ విత్ అవుట్ దారు ను 2018 మార్చ్ 24thన మొదలుపెట్టాను. ఫలానా రోజుల్లోనే మొదలుపెట్టాలనే నేను అనుకోలేదు, కాకతాలియంగానే జరిగింది. -చంద్రశేఖర్ గారు.

 

అన్నిటికీ కారణం మందు:
చేగో(చేగొండి చంద్రశేఖర్) గారికి జిందగి ఇమేజస్ అనే ఫేస్ బుక్ గ్రూప్ ఒకటి ఉంది. అందులోని మెంబర్స్ వారి పనులను, వారి జీవితాన్ని తెలిపే ఫోటోలను షేర్ చేసుకుంటారు. ఇదొక గ్రూప్ లా మాత్రం ఉండకుండా, దీని నుండి ఏదైనా మంచి జరగాలనే ఉద్దేశ్యంతో వివిధ రకాల మీటింగ్స్ కండక్ట్ చేసేవారు. రైతుల సమస్యలు, మహిళల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలు ఇలాంటి టాపిక్ ల మీద మెంబర్స్ ని పర్సనల్ గా కలుస్తూ మీటింగ్స్ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది దీనిని ఎలా పరిష్కరించగలం అనే సందర్భాలలో సభ్యులలో వచ్చిన మొదటి మాట సమస్యలన్నింటికి మూలం మందు. మొదట మందు మానిపించగలగాలి అని..


 

“నేషనల్ క్రైమ్ బ్యూరో చేసిన ఒక సర్వే ప్రకారం 70% నుండి 85% జరిగే క్రైమ్ మద్యం మత్తులోనే జరిగాయి. అదీ కాక రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలోను మద్యం కూడా ఒక కారణం. వారి పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనూ అల్కాహాల్ అలవాటు కూడా ఉందని తేలింది”

 

మనిషి కూడా ఒక జంతువే!! ఐతే కాస్త కామన్ సెన్స్, కాన్షియస్ ఉండడం వల్ల వచ్చే బాధలను, కోపాలను, సంతోషాలను నిగ్రహించుకోగలుగుతున్నాడు. మందు తాగితే కనుక నిగ్రహించుకునే శక్తి నశిస్తుంది. 40 స్పీడ్ లో వెళ్లే వాడు 100 లో వెళ్లి వాడితో పాటు సామాన్యులను చంపేస్తున్నాడు, మాటలతో కాపురం చక్కదిద్దుకోవాలనే వాడు భార్యను చావగొడుతున్నాడు, సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన సందర్భంలో ఒక క్వార్టర్ బాటిల్ కోసం నిర్ణయాన్ని మార్చుకుంటున్నాడు. డిప్రెషన్ లో స్ట్రాంగ్ గా ఉండాల్సిన వ్యక్తి కూడా ముందుకు అలవాటు పడి దానిని వ్యసనంగా చేసుకుని విలువైన జీవితాన్ని కోల్పోతున్నాడు. అల్కాహాల్ వల్ల కుటుంబ వ్యవస్థ కూడా చిన్నబిన్నమవుతుంది!! తండ్రి తాగి వచ్చి అమ్మను ప్రతిరోజూ కొడితే వారిని చూస్తూ పెరుగుతున్న పిల్లల మానసిక ఎదుగుదలపై అది తీవ్ర ప్రభావము చూపిస్తుంది, డబ్బులు లేకపోయినా కానీ భార్యతో పిల్లలతో నాలుగు మాటలు మాట్లాడినా వారి ఆనందం వర్ణనాతీతం. ఇలా చెప్పుకుంటూ పోతే మద్యం వల్ల జరిగే అనర్ధాలు కోకొల్లలు.


 

మన హీరోలు, సినిమాలు కూడా ఈ పాపంలో భాగస్వాములు. మందు తాగుతూ, పాటలు పాడుతూ తాగుడం ఒక చెడు లక్షణంలా కాకుండా అదొక ఎంజాయ్ మెంట్ గా, హీరోయిజంలా చూపిస్తున్నారు. ఇంతకన్నా గోరం సెన్సార్ వారిది, అమ్మాయిని బికినిలో నిల్చోబెట్టి మీరు చూడకూడదు. అన్నట్టు ఉంటుంది సినిమాకు ముందు వేసే మద్యపానం దూమపానం అనారోగ్యానికి కారణం అని వేసే ప్రకటనలు.


 

ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.?
ముల్లును ముల్లుతోనే తీయాలి. మద్యానికి అలవాటు పడిన వారికి స్వామి వివేకానంద సూక్తులు, బుద్ధుడు అంబెడ్కర్ గారి మాటలు బుర్రకు ఎక్కవు. వారికి త్వరగా రీచ్ అయ్యేలా సోషల్ మీడియాలో మేమ్స్, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ తో పాటలు, గ్రామాలలో నివసించేవారి కోసం ఒగ్గుకథలు, దావత్ విత్ అవుట్ దారు టీ షర్ట్స్.. అన్నిటికీ ముఖ్యంగా #DWD తో మేము పార్టీ చేసుకుంటున్నాము కానీ మందు తాగడం లేదు అని సోషల్ మీడియాలో వివిధ వ్యక్తుల పోస్ట్ లు.. మొదలైన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే వివిధ గ్రామాల సర్పంచ్ లతో మాట్లాడి వారి గ్రామాలలోను మద్య నిషేధం పాటించాలని అందుకు తగిన విలువైన సూచనలు ఇస్తుంటారు.


 

చేగో గారు చేస్తున్న కార్యక్రమాల వల్ల ప్రజలలో మార్పు కనిపిస్తుంది, చాలామంది వ్యక్తులు మందు మానేస్తున్నామని చెప్పడంతో పాటుగా సమాజంలో ఒక buzz create అయ్యింది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రతి సంవత్సరం వేల కోట్ల ఆదాయం లభిస్తుంది. వాటిని మళ్ళీ ఆరోగ్యశ్రీ అనో వెల్ఫేర్ స్కీమ్ లకు మళ్ళిస్తుంది. నోట్లో భోజనం పెట్టి వెనుక నుండి వాతలు పెట్టడం అంటే ఇదే. ప్రతి ఊరిలో మద్యం షాపులు ఉన్నట్టుగానే ప్రతి ఊరిలోను డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఒకేసారి మద్యం మానేయ్యాలి అంటే తాగుబోతులకు కూడా కష్టమే, విడతల వారిగా అల్కాహాల్ ను అదుపు చెయ్యాలి. యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే డ్రైవింగ్ లైసెన్స్ ఫైన్ లు, క్రైమ్ పెరుగుతుందంటే చట్టాలు ఎన్ కౌంటర్లు కాదు సమస్య మూలం తెలుసుకుని వాటిని అరికడితే చాలు. అల్కాహాల్ ఒక్కటి బ్యాన్ చేస్తే చాలు మునుపటి భారతదేశం మన కళ్లముందుకు వస్తుంది. 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , , , , , ,