This Cute, Short Story Is A Reflection Of Present Day Lifestyle & How’s Couples Deal With It

 

Contributed by Masthan vali
” పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ” కాలర్ ట్యూన్ వినపడుతోంది అవతల… గత అరగంటలో ఇది ఆరో సారి తన కోసం ఫోన్ చేయడం.అంతకు ముందు చాలా సార్లు చేశాడు. తీయట్లేదు! ‘ ఎంత మొండిది రా ఇది ‘ అనుకుంటున్నాడు వరుణ్ మనసులో అంజలి గురించి. చేసేదేం లేక కంప్యూటర్ కట్టేసి ఇక బయల్దేరదాం అని కదిలాడు ఆఫీసు నుంచి. అప్పటికే టైం 11 కావస్తోంది.! వాళ్ళ ప్లాన్ ప్రకారం ఈపాటికి చార్మినార్ దగ్గర ఉండాల్సింది, కానీ పన్లో పడి తన గురించి మర్చిపోయాడు అతను.

 

“మధ్యాహ్నానికి ఎవరి ఆఫీసు ల నుంచి వాళ్ళు బయల్దేరి సిటీ బస్సెక్కి హైదరాబాద్ అంతా తిరిగి రాత్రి చార్మినార్ లో డిన్నర్ చేసి ఇంటికి చేరాలి… ఇది సింపుల్ గా మన ఫ్రైడే ప్లాన్..ఎలా ఉంది.!” అంజలి తో అదేపనిగా చెప్పి తనే స్వయంగా ప్రపోజ్ చేసిన ప్లాన్ ఇది. అందుకే బైక్ తేలేదు ఈ రోజు ఆఫీస్ కి. బస్టాప్ వరకు నడుచుకుంటూ వస్తుంటే అంజలి తో అన్న మాటలు గుర్తుచేసుకుని…

 

” ఛ… పని పని…ను మారవ్ రా…! ” అని గట్టిగా బయటికే తనని తానే తిట్టుకుంటున్నాడు. ఆ సమయం లో అంతగా జనం కూడా లేకపోవడం తో ఆ మాటలు గాల్లో కలిసిపోయాయి. బస్టాప్ చేరాడు. ఒక్కడే ఉన్నాడు. పదిహేను నిమిషాలు దాటినా ఒక్క బస్సూ రాలేదు. ఈ మధ్యలో తనకు మళ్లీ ప్రయత్నించాడు. లాభం లేదు!
” నేను ఇంటికి వెళ్తున్నా…” అని టెక్స్ట్ చేశాడు.
” ఓ కె ” అని వెంటనే రిప్లై వచ్చింది.

 

అది చూడగానే కొంచెం కోపం వచ్చింది అతనికి. గట్టిగా నిట్టూర్చి ఫోన్ లాక్ చేసి పాకెట్లో దోపాడు. దూరంగా బస్సు కనిపిస్తోంది. అతను ఎక్కాల్సిన బస్సే…ఒక్కడినే ఉన్నానని అపుతాడో లేదో అనుమానంతో చేయి ఊపుతున్నాడు ఆపమంటూ…! ఆగింది. ఆ సమయం లో కూడా బస్సు నిండుగా ఉంది. ఓ పది మంది వరకూ నిల్చుని ఉన్నారు. Ear Phones తగిలించుకుని పాటలు వింటున్నాడు. ” పెరిగే వేగమే తగిలే మేఘమే…” అంటూ ఆటో ప్లే లిస్ట్ లో ఉన్న పాట వినపడింది. వెంటనే Ear Phones తీసేసాడు. అతనికి ఈ సారి పాట పాడిన Sid Sriram పైన కోపంగా ఉంది! బస్సు నెక్ట్స్ స్టాప్ చేరింది. కొంతమంది దిగగా నిల్చున్న కొంతమంది కుర్చోగా…బస్సు మొత్తంమీద ఒకే వ్యక్తి మిగిలాడు నిల్చుని. అది ఇతనే.! బస్సు మొత్తం కలియజూసి… ” ఏమన్నా టైం నడుస్తోందా ఈరోజు నాకు ” అనుకున్నాడు. అతను కాస్త ఆలస్యంగా గమనించిన విషయం ఏంటంటే, ముందు నుంచి రెండో వరసలో ఒకమ్మాయే కూర్చుని ఉంది. విండో సీట్లో కూర్చుని పక్క సీట్లో తన బ్యాగ్ ఉంచింది. బస్సులో ఇంకో సీటు ఖాళీగా లేదు. వెళ్లి కూర్చుందామా వద్దా అని అతను ఆలోచిస్తుంటే… ఆ అమ్మాయి బ్యాగ్ తీసి తన ఒళ్ళో పెట్టుకుని కాస్త వెనక్కు తిరిగి చూసింది అతని వైపు…

 

“అది కుర్చోమంటూ ఆహ్వానమా…?” అర్థం కాలేదు అతనికి.! అంజలి కి మరోమారు ప్రయత్నించాడు… కట్ చేసింది వెంటనే! ఇలా కాదని వెళ్లి ఆ అమ్మాయి పక్కన కూర్చున్నాడు…!
‘ ఎంత పొగరు నా ఫోన్ కట్ చేస్తుందా…’ అనుకున్నాడు. కానీ అప్పటికి అతనికి వెలగంది ఏంటంటే ఒక్క ‘ సారీ మెసేజ్ ‘ కూడా పెట్టలేదు అతను.

వెంటనే, ” సారీ ” అని Text చేసి పంపాడు.
” అవసరం లేదు ” అని రిప్లై!

టైమ్ 12 కావస్తోంది… ” Happy Birthday Anjali ” అని Text చేసాడు. బదులు రాలేదు.

 

ఏం చేయాలా అని ఆలోచించట్లేదు అతను. పక్కనున్న అమ్మాయి వైపు చూసాడు. కిటికీ వైపు తిరిగి కూర్చుంది తను. పాటలు వింటున్నట్టుంది, తల ఆడిస్తూ బ్యాగ్ పై వేళ్ళు మీటుతోంది. ఒక చేయి అతనికి దగ్గరగా ఉంది. మెల్లగా అతని చేతిని తన చేతికి తాకించాడు. చటుక్కున చూసింది అతనికి వైపు. అతను చేతులు కట్టుకు కూర్చున్నాడు వెంటనే ఏమి ఎరగనట్టు!

 

” ఇడియట్ ” అని, సర్దుకు కూర్చుంది తను. ఈ సారి ధైర్యం చేసి బ్యాగ్ పైన మెల్లగా చేయి పోనిచ్చాడు. తను గమనించలేదు. కాసేపు అలానే బ్యాగ్ పైనే చేయుంచి, నెమ్మదిగా తన చిటికెన వేలితో అమ్మాయి చేతిని తాకాడు. తను ఎంటువంటి బదులు లేకుండా ఉంది. చొరవగా ఇంకొంచెం ధైర్యం తో తన చేతిని పట్టుకున్నాడు. వెంటనే ఉరుముతూ చూసింది అతని వైపు. మళ్లీ చేతులు కట్టుకు కుర్చున్నాడితను. కాసేపటికి తన భుజాన్ని అమ్మాయి భుజానికి తాకిస్తున్నాడు. ఆ అమ్మాయి ఇబ్బందిగా కదులుతోంది సీటు లో… ఇంకొక్క సారి ధైర్యం తెచ్చుకుని తన చేయి పట్టుకున్నాడు.

 

వెంటనే వెనక నుంచి ఒకతను…
” హేయ్ ఎవడ్రా నువ్వు… ఇందాకటి నుంచి చూస్తున్నా, ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావ్…” అంటూ వరుణ్ పై చేయి వేసి గదమాయించాడు.
” మీకు అనవసరం ” అన్నాడు వరుణ్.
” ఏమ్మా, ఇతను నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా…? అసలెందుకు కూర్చున్నావ్ రా నువ్వు లేడీస్ సీట్ లో …? ” అని ఇద్దర్నీ అడిగాడా బాధ్యత గల పౌరుడు.
” నేనే కూర్చో అన్నాను… అతనేం ఇబ్బంది పెట్టలేదు…” అంది ఆ అమ్మాయి.
” హమ్మయ్య, రక్షించింది ” అనుకున్నాడు వరుణ్.
ఆ పౌరుడు నోర్మూసుకుని వెళ్ళాడు!
వరుణ్ అదే అదనుగా మళ్లీ తన చేయి పట్టుకున్నాడు….
ఈ సారి తను వెంటనే లేచి డ్రైవర్ ను…
” ఇక్కడ ఆపండి” అంది.
“ఇక్కడ స్టాప్ లేదు” అన్నాడు డ్రైవర్
” ప్లీజ్ అన్నా… ఆపండి…” అంది.
విసుక్కుంటూ ఆపాడతను. తను దిగింది.

 

విచిత్రంగా చూస్తూ ఉండిపోయాడు వరుణ్. బస్ కదలగానే తేరుకుని తనూ దిగేసాడు రన్నింగ్ లో.
” హేయ్ మిస్, ఎంటిక్కడ దిగారు… నెక్ట్స్ స్టాప్ 2 కిలో మీటర్లు పైగా ఉంది. ఆటో లు కూడా ఉండవ్ ఈ టైం లో…”
తనని మాట్లాడించాడు.
తనే బదులు ఇవ్వకుండా వేగంగా నడుస్తోంది.
“మిమ్మల్నే అడిగేది…?”
తన నడకను అందుకోడానికి ఇతనికి పరుగెత్తాల్సి వస్తోంది.
” హేయ్…మీకు వినపడదా…!? ”
అంటూ చేయి పట్టుకుని తనని ఆపాలని ప్రయత్నించాడు. తను ఆగింది కానీ… విడిపించుకుని మళ్లీ నడుస్తోంది.
అతను కాసేపాగి, చుట్టూ చూసి… పరుగున వెళ్ళి… ఆ అమ్మాయి ముందు నిల్చున్నాడు అడ్డంగా…తను అటు ఇటు వెళ్ళడానికి వీల్లేకుండా చేతులు చాచి నిలబడ్డాడు. తను ప్రయత్నిస్తోంది అక్కడి నుంచి వెళ్లిపోడానికి. అతను దారివ్వట్లేదు.ఒక్కసారిగా గట్టిగా ముద్దు పెట్టాడు తన చెంపపై. తను నిశ్చేష్టగా ఉంది. తేరుకుని, చాచి పెట్టి కొట్టింది అతన్ని. అతను చెంప పై చేయి పెట్టుకుని అలా నిల్చుండి పోయాడు. తను అదే వేగం తో నడుచుకుంటూ వెళుతోంది. అలానే ఫాలో అవుతూ వెళ్ళాడు అతనూ. 20 నిమిషాల తర్వాత… ఒక అపార్ట్మెంట్ దగ్గరికి చేరింది తను. లోపలికెలుతోంది. అతనూ అనుసరించాడు. లిఫ్ట్ లోకి చేరి 2 వ ఫ్లోర్ నొక్కింది. ఇతగాడు రాకనే లిఫ్ట్ క్లోజ్ అయింది. మెట్ల్లెకి పరిగెత్తుతూ లిఫ్ట్ తో పోటీ పడుతూ వేగంగా వెళ్ళాడు పైకి. ఒకే సారి చేరుకున్నారు ఇద్దరు 2వ ప్లోర్ కి. 203 తలుపు తీసి ఇంటి లోపలికెళ్లింది తను… ఇతను లోపలికి రాకుండా లాక్ చేసింది లోపల్నుంచి. వెళ్లి ఫ్రెష్ అయ్యి, ఫ్రిజ్ లో ఉన్న ఆపిల్ తినేసి… బెడ్ రూం చేరింది.

 

అప్పటికే అతను బెడ్ పైన ఉన్నాడు.

” Extra కీ లేకుండా ఉండాల్సింది… ఈ రోజంతా బయటే ఉండే వాడివి…” అంటూ బెడ్ షీట్ కప్పుకుంది.

” సారీ చెప్పాను గా అంజలి…” అంటూ బెడ్ షీట్ లాగాడు.

” చూడు, ఇప్పుడేం మాట్లాడకు… నేను అలసిపోయాను…ప్లీజ్.” అంది దుప్పటి కప్పుకుంటూ…

 

అంత దూరం నడిచి వచ్చిన విషయం గుర్తొచ్చి ఊరుకుండి పోయాడు వరుణ్. అటు వైపు తిరిగి పడుకున్నాడు.
టైం 01:15 అయింది. ఏదో ఆలోచిస్తున్నాడు అతను. మెల్లగా అంజలి చెవి దగ్గరికి చేరి, తనకి వినపడి వినపడకుండా…

 

” Happy Birthday & I am sorry Anjali ” అన్నాడు. నిద్ర లోకి జారిపోయిందేపుడో. తనకు వినపడలేదు…

చార్మినార్ – వీళ్ళ ప్రేమ తాజ్ మహల్. ఎన్నో రాత్రులు అక్కడ చక్కర్లు కొడుతూ గడిపిన జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాయి వరుణ్ కి. అందుకే అంజలి Birthday అక్కడ ప్లాన్ చేశాడు, కానీ మర్చిపోయాడు.

ఇలా ప్లాన్ చేసినవన్నీ కాన్సిల్ కావడం కొత్త కాదు వీళ్ళకి.

కొత్తగా స్టార్ట్ అప్ పెట్టాడు వరుణ్…స్టార్ట్ అప్ లో ఉన్న సమస్యే ఇది. ఏడాది కావస్తోంది.అన్నిటినీ వదిలేసి పనే ప్రపంచం అనుకోవాలి. ఎంత ప్రయత్నించినా priorities మారిపోతాయి. పర్సనల్ లైఫ్ అనేది లేకుండా పోయింది.

” ప్రేమించి చేసుకున్న అమ్మాయి కూడా నన్ను అర్థం చేసుకోలేనంత, కావాలనే తనని ఇగ్నోర్ చేసేంత స్థాయికి చేరాను నేను… ఛ, ఎప్పుడు పని పని పని పని… పెళ్ళాన్ని చూసుకొలేనంత పని…! ” అంటూ గొనుకుంటున్నాడు.

 

” Thank you Varun & Am sorry too …” అంటూ అటుగా పడుకున్న అతన్ని వాటేసుకుంది అంజలి.

పడుకుందనుకున్న అంజలి గొంతు వినగానే ఉలికిపడ్డాడు వరుణ్.

” I am really sorry Anajali…నాకు తెలుసు నువ్వెంత అప్సెట్ అయ్యావో…రేపు ఏం చేద్దాం అని ప్లాన్ చేయను నేనింక… రేపంతా నీతోనే ఉంటా… ప్రామిస్…” అంటూ నుదిటి పై ముద్దు పెట్టాడు.

” నేనింత లా రియాక్ట్ అవ్వాల్సింది కాదు, I could have understood your urgency, కొత్త కంపెనీ…కొంచెం టైం పడుతుంది నా కోసం టైం కేటాయించడానికి అని నేను అర్థం చేసుకోవాల్సింది…”

 

” నువ్వర్థం చేసుకున్నావ్… కనుకే కంపెనీ stable అయ్యేంత వరకూ ఇంటి బాధ్యత నేను చూసుకుంటా అని నీకిష్టమైన fashion designing వదిలేసి నా కోసం ఉద్యోగం చేస్తున్నావ్…”

” మన కోసం వరుణ్… అయినా నేనేం పూర్తిగా వదిలేయ లేదుగా… ఇంకో రెండేళ్లలో ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావ్. అప్పుడు నేను నా boutique కలను fulfill చేసుకుంటా. ఇదేగా మనం అనుకుంది…”

” నేనూ కొంచెం Conscious గా ఉండాల్సింది. మన పెళ్లయి 1year కూడా అవ్వలేదు…నువ్వు నాతో time spend చేయాలని కోరుకోవడం లో తప్పు లేదుగా..సో రేపంతా నీతోనే…” అని ఇంకొంచెం గట్టిగా హత్తుకున్నాడు.

” Love you ”

” Love you ”

ఇద్దరూ కౌగిలిలో కరుగుతూ కలల లోకం లోకి ఒదిగారు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,