This Book About ‘World Of Cinema’ Can Change Your Perspective Towards Movies

 

Contributed by Chaitanya Singoju

ప్రపంచ సినిమాని మన హృదయాలకు హత్తుకునేలా పరిచయం చేసే తోలి ప్రయత్నం “సినిమా ఒక ఆల్కెమీ“. మామూలు లోహాలను కూడా బంగారంలా మార్చే విద్య రసవాదం (Alchemy). ఈ రసవాదాన్ని ప్రతి అక్షరంలోనూ నింపుకుని మిల మిల మెరిసిపోయే మేలిమి బంగారు తునకల్లాంటి సినిమాలను పరిచయం చేసి ఎంతో అందంగా, వివరంగా విడమర్చి చెప్పే గ్రంధమే సినిమా ఒక ఆల్కెమీ. సో కాల్డ్ హై బడ్జెట్ సినిమాలను, యాక్షన్ సినిమాలను, సూపర్ హీరో సినిమాలను మాత్రమే ప్రపంచ సినిమా అని గుడ్డిగా నమ్మి ఆ నమ్మకంతోనే నిద్రపోతున్న నన్ను గట్టిగా వీపుపైన తట్టి, మెల్లగా తలపైన మెట్టి, మెలకువలోకి రప్పించి గొప్ప గొప్ప సినిమాలను నాకు పరిచయం చేసిన నేస్తం ఈ పుస్తకం.


 

సినీ రసవాదంలోకి:

రచయిత చెప్పినట్టుగా మనిషిని ఇంకో మనిషితో కనెక్ట్ చేసే 30 ప్రపంచ సినిమా వ్యాసాల సమాహారం. జీవితాల్లోని పరమార్ధాల తీరం ఈ పుస్తకం. ఇందులోని వ్యాసాలు రచయిత గిరిగీసుకుని రాసినవి కావు. అన్ని గీతలను చేరిపేసుకుని ఆకాశంలోని పక్షిలా, సముద్రంలోని చేపలా స్వేచ్ఛగా వేటికవే తమ ప్రత్యేకతలను చాటుకుంటూ అలా సాగిపోయిన కథనాలు ఇవి. రచయిత జీవితాన్ని, సినిమాని వేరుగా చూడలేదు. అందుకేనేమో ప్రతీ వ్యాసమూ సినిమాను దాటి జీవితంలోకి ప్రవేశించి జీవితంలోని ఎన్నో విషయాలను సృశిస్తూ ఎంతో హృద్యంగా సాగుతుంది.

 

ఇక పుస్తకంలో వివరించిన సినిమాల విషయానికొస్తే..

అనగనగా ఒక నిరుద్యోగి, అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతను ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని ఫలితం లేదు. ఒకానొక రోజు అతనికి అదృష్టం కలిసివచ్చింది, ఉద్యోగం వచ్చింది. కాని ఆ ఉద్యోగంలో చేరాలంటే సైకిల్ ఖచ్చితంగా ఉండాలని అధికారులు చెప్పటంతో కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడంతో ఒకప్పుడు తాకట్టు పెట్టిన సైకిల్ ను విడిపించేందుకు ఇంట్లోని దుప్పట్లు తాకట్టు పెడతాడు. తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో సైకిల్ ను తెచ్చుకుంటాడు. గోడలకు సినిమా పోస్టర్లు అంటించే ఉద్యోగం అతనిది. ఒకరోజు ఉద్యోగానికి వెళ్తూ తన వెంట కొడుకును కూడా తీసుకువెళ్లాడు. ఒక పెట్రోల్ బంక్ దగ్గర తన కొడుకును ఉంచి పనిచేసుకుని సాయంత్రానికల్లా తిరిగివస్తానని చెప్పి ఒక నిచ్చెనేసుకుని గోడకు పోస్టర్లు అంటిస్తుండగా అక్కడే పక్కన గోడకానించి ఉంచిన అతని సైకిల్ ని ఎవరో వ్యక్తులు తీసుకుపోవడం గమనించి ఆ దొంగలను వెంటాడుతాడు. కాని వాళ్ళు దొరకరు. ఆ తర్వాత సైకిల్ కోసం అతను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఒక సందర్భంలో సైకిల్ దొరికినట్టే అనిపిస్తుంది కాని దొరకదు. చివరికి తనే ఒక సైకిల్ దొంగలించే ప్రయత్నం చేసి దొరికిపోయి జనాల చేతుల్లో చావుదెబ్బలు తింటాడు. పోలీసులకు కూడా పట్టించాలనులుంటారు. కాని అతనితో ఉన్న అతని కొడుకుని చూసి జాలిపడి వదిలేస్తారు. అతను సిగ్గుతో తలదించుకుని బాధపడుతూ కంటతడి పెట్టుకుని తన కొడుకు చేతిని పట్టుకుని ఇద్దరూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంతే అక్కడితో సినిమా ముగుస్తుంది.

సమాజంలో ప్రతిరోజూ జరిగే విషయాలనే ఎంతో హృదయవిధారకంగా చూపిస్తుంది ఈ సినిమా. ఈ సినిమా పై రచయిత రాసిన వ్యాసం చదివితే సంగతి తెలిసొస్తుంది. మనకూ అనిపిస్తుంది “ఇదే కదా మనం రోజూ చూసేది, వినేది”, మనందరి జీవితాల్లోనూ జరిగేది.. ఆగిపోకుండా సాగిపోయేదే కదా జీవితం ఎన్నో కష్టాలు, సుఖదుఃఖాలు, ఒడిదోడుకులతో చివరి మజిలీ వరకూ సాగుతుందీ జీవితం. అందులో నుండి బయటపడడం అసాధ్యం. అందుకే ఈ సినిమా గురుంచి చెప్తూ రచయిత అంటాడు “జీవితమొక పద్మవ్యూహం” అని.


 

మరో కథలో(సినిమాలో) తన తల్లిని కోల్పోయి, తన చెల్లెలే సర్వస్వమై, తన చెల్లికి అన్నీ తనే ఐన అన్న గురుంచి చెప్తాడు రచయిత. తన చెల్లి ఆకలి తీర్చడానికి ఆ అన్న ఎంత కష్టపడతాడో, చివరికి తన చెల్లిని కూడా కాపాడుకోలేక ఎంత క్షోభ అనుభవిస్తాడో ఆ తర్వాత అతను ఎంత దీనమైన స్థితిలో మరణిస్తాడో కళ్ళకు కడతాడు. అప్పుడు మన కళ్ళు చెప్పినా వినకుండా కన్నీళ్లయిపోతాయి. ఇంకో కథలో అన్నయ్య తన చెల్లెలి షూస్ అనుకోకుండా పోగొడతాడు. చెల్లెలి కొత్త షూస్ కోసం రన్నింగ్ రేస్ లో పాల్గొని ఎలా గెలిచి ఓడాడో వివరిస్తూ “అన్నీ ఉండడమే ఆనందం కాదు, ఏది అవసరం లేదో తెలుసుకోవడం కూడా ఆనందమే అని మనసుకు హత్తుకునేలా చెప్తాడు”.

 

ప్రేమించిన అమ్మాయి తననూ, తన జ్ఞాపకాలనూ మర్చిపోయే చికిత్స చేయించుకుందని తెలిసిన ఆ క్షణంలో బాధతో, కోపంతో, ఆవేశంతో తను కూడా ఆ చికిత్స చేయించుకోవడానికి పూనుకుని తన ప్రేమను చంపుకోలేక తను ప్రేమించిన అమ్మాయిని కనీసం ఒక్క జ్ఞాపకంలోనైనా దాచుకోవాలనే ఓ పిచ్చి ప్రేమికుడి కథ గురుంచి ఎంతో అందంగా అక్షరాలల్లుతాడు. తన ప్రియురాలిని కలుసుకునేందుకు 4,000 కి.మీ.లు నడిచి సముద్రాన్ని ఈదుతూ మధ్యలోనే ప్రాణాలను వదిలేసిన ఓ అమర ప్రేమికుడి కథను ఆర్ధ్రతతో చెప్తూ వినమంటాడు. తన స్నేహితుని చివరి కోరిక తీర్చే నిస్వార్ధ మనిషిని, తను చచ్చిపోయాక పూడ్చి పెట్టమనీ తన కార్లో ఎక్కే ప్రతి వ్యక్తినీ అడిగే విచిత్రమైన మనిషినీ పరిచయం చేస్తాడు.

నేను మెలకువగానే ఉన్నాను. ఇది మెలకువేనా.?” అని ప్రశ్నిస్తాడు.
సత్యం అన్వేషిస్తే దొరికేది కాదు, అన్వేషణే సత్యం” అనే నిజాన్ని చాటి చెబుతాడు.
అంతా శూన్యమే, మనిషీ శూన్యమే” అనే వేదాంతాన్ని ప్రబోధిస్తాడు..


 

ఇలా రచయిత పరిచయం చేసే ప్రతి సినిమా కూడా జీవితానికి అద్దం పడుతుంది. ప్రతి సినిమా జీవితంలోని అన్ని కోణాలను ఆవిష్కరిస్తుంది.. కనులను తడిపేస్తుంది. గుండెలను మెలిపెడుతుంది. నిద్దురలో కలవరపాటుకు గురిచేస్తుంది. రచయిత కథకుడు కూడా అవ్వడం వల్ల ప్రతి వ్యాసమూ ఒక అందమైన, అద్భుతమైన కథలా ప్రతి వ్యాసమూ రూపుదిద్దుకుంది. అందమైన అక్షరాలతో అణుకువైన పదాలతో, ఆకర్షణీయమైన వాక్యాలతో తెలుగుదనం ఉట్టిపడేట్టు ప్రతి వ్యాసాన్ని తీర్చిదిద్దాడు రచయిత. పుస్తకం చదవడమే అసాధ్యమవుతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకం చదవడం మొదలుపెడితే అనివార్యం అవుతుంది. ఈ పుస్తకమంతా చదివాక మనం కూడా ఖచ్చితంగా రచయిత అభిప్రాయంతో ఏకీభవిస్తాం “సినిమానే జీవితం, జీవితమే సినిమా” అని..

 

ఈ పుస్తకం కావాలనుకునేవారు ఇక్కడ కొనుగోలు చేయవచ్చు: Click Here

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , ,