పాట లోని పాఠం; జల్సా లో ని “ఛలోరే ఛలోరే ఛల్ ” పాట లో అంతరార్థం – A Short Note

 

కొన్ని పాటలు వింటుంటే ఏవో ఆలోచనలకి వెళ్ళిపోతాం. “ఏంట్రా మనం” అని ఆత్మాన్వేషణ చేసుకుంటాం. అలా విన్న ప్రతిసారి నేను ఆత్మాన్వేషణ చేసుకునే పాట, జల్సా సినిమాలో DSP సంగీతం లో సిరివెన్నెల గారు రాసిన పాట“ఛలోరే ఛలోరే చల్”. ఈ పాట గురించి ఒక పుస్తకమే రాయచ్చు. అంతలా ఏముంది అంటే, మనిషి తనకు తానూ తెలియకుండా నటిస్తున్న జీవితం గురించి ఉంది. జీవిస్తున్న నటన గురించి ఉంది. మొత్తానికి నేటి మనిషి పరిస్థితి ఉంది.

 

ఈ పాట వచ్చే సన్నివేశం
అల్లరి గా అందరిని ఆటపట్టిస్తూ సరదాగా ఉండే, సంజయ్ సాహు అనే వ్యక్తి వెనుక ఒక భయంకరమైన గతం ఉంది. ఆ గతం లో తను వేసిన ఒక తప్పటడుగు ని సరిదిద్దు కోవడానికి తన జీవితం ఒక దారిని చూపిస్తుంది. ఆ దారిని తను ఎంచుకునే క్రమం లో వచ్చే పాట ఇది.

తనతో పాటు ఒక పోలీస్ ఉన్నాడు. ఆ పోలీస్ ని చంపేసి కొట్టేసి తాను పారిపోవచ్చు. అలా చేస్తే ఎప్పటికి తాను ఒక దుర్మార్గుడు అంటే చెడ్డ మార్గాన్ని ఎంచుకున్న వాడిగానే మిగిలిపోతాడు. మరి మంచి మార్గం ఏంటి.. ఈ ప్రశ్న తో ఈ పాట మొదలవుతుంది. (ఇదేదీ సినిమాలో విపులంగా వివరించారు కానీ సరిగ్గా చూస్తే మాత్రం తప్పకుండ అర్ధమవుతుంది).


 

పల్లవి
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛల్

నీ పయనం ఎక్కడికో నీకు తెలియలిగా
ఈ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

 

ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా నడవడం మొదలు పెట్టడం లో అర్ధం ఏముంది. నీ గమ్యం సుదూర తీరాలే కావచ్చు, పక్క నున్న కిరాణా కొట్టు కావచ్చు.. చిన్నదైనా పెద్దదైనా ప్రతి పయనానికి ఒక లక్ష్యం ఒక అర్ధం ఉండాలి కదా.. ఆలా కాకుండా అర్ధం లేని ఆవేశం తో చేస్తున్న తప్పేమో ఈ సమరం, అది తేల్చుకో ముందు అని ఈ పదాల సారాంశం. మనం కూడా లక్ష్యం లేని ప్రయాణం చేస్తుంటాం. అలా వేసే ప్రతి అడుగు ప్రతి పని వృధా.


 

ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛల్

చంపనిదే బతకవని, బతికేందుకు చంపమని
నమ్మించే అడివి అడిగేం లాభం బతికే దారెటని

 

మనలో ప్రశ్న రావడం ఎంత ముఖ్యమో? ఆ ప్రశ్న ని ఏ వ్యక్తి ని అడుగుతున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. తెలుగు మాష్టారు దగ్గరికి వెళ్లి ఫిజిక్స్ ఫార్ములాస్ ని అడగలేం గా.., అడివి లో ఉండే జంతువుల నుండి, మనుషుల దాకా వాళ్ళు బతికేది ఇంకో ప్రాణిని చంపే. అలాంటప్పుడు ఆ అడివి ని బతకడం ఎలా అని అడిగితే, చంపడమే అని సమాధానమిస్తుంది కానీ, నీకనిపించింది చేయడమే బతకడం అంటే అని ఎలా చెప్తుంది..


 

ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛల్

సంహారం సహజమని సావాసం స్వప్నమని
తర్కించే తెలివికి తెలిసేనా తానె తన శత్రువని

 

ఇతరులని నమ్మడం కాదు , వాళ్ళని బాధించడం వాళ్లపై అధికారం చూపించడమే నిజమైన మానవత్వం అని గుడ్డిగా నమ్మే వాళ్లకి మానవత్వపు నిజమైన అర్ధం ఎంత చెప్పిన ఏమర్ధమవుతుంది.


 

ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛల్

నీ పయనం ఎక్కడికో నీకు తెలియలిగా
ఈ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

ధీరులకి దీనులకి అమ్మ ఒడి ఒక్కటే
వీరులకి చోరులకి కంట తడి ఒక్కటే…

 

మనలో ధైర్యవంతులు ఉన్నారు, చిన్న బొద్దింకకు కూడా భయపడే భయస్తులు ఉన్నారు. వారందరికీ ఈ భూమి ఒక్కటే కదా? నువ్వైనా నేనైనా ఏడిస్తే వచ్చేవి కన్నీళ్లే కదా? మరేముంది వ్యత్యాసం మనిషికి, మనిషికి మధ్య?. చిన్న ఆలోచన వ్యత్యాసం అంతే., అదే ఒక మనిషి నుండి ఇంకో మనిషి కి తేడాని చూపిస్తుంది.


 

ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్
ఛలోరే ఛలోరే ఛల్ ఛల్

అపుడెపుడో ఆటవికం, మరి ఇపుడో ఆధునికం
యుగ యుగాలుగా ఏ మృగాలా కన్న ఎక్కువ ఏమెదిగాం.

 

ఒక మనిషికి, ఇంకో మనిషికి అంత అలొచన వ్యత్యాసం ఉన్నప్పుడు, ఎంత ఎదిగాడు మనిషి? ఏమి ఎదిగాడు మనిషి. అప్పుడు ఒకరి చావు మీదే ఆధార పడ్డాడు. ఇప్పుడు కూడా ఇంకొకరి పతనం మీదే ఆధార పడుతున్నాడు.


 

ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్

రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం.
రక రకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం.

హేయ్… తారలనే దించగలం తలుచుకుంటే మనం. రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం.

 

మన బుద్ధికి ఎంత శక్తి ఉందంటే, ఆ బుద్ధి సరిగ్గా వాడితే రాముడిలాంటి రాజు అవ్వగలం, లేదా రాక్షసులని మించిన కౄరత్వాన్నీ చూపించగలం. కానీ మనం ఏం చేస్తున్నాం? నిజానికి మనలా మనం కూడా ఉండట్లేదు. ఒక్కొక్కరి దగ్గరా ఒకలా ఉంటూ.. మన సొంత వ్యక్తిత్వాన్నే మనం పోగొట్టుకుంటున్నాం, నిజానికి నిజాయితీ మాయమైంది మన అందరిలో…

కానీ ఆ నిజాయితీ, నీ పై నీకున్న నమ్మకం తో చేసే ఒక్క ప్రయత్నం అయినా మాహాద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒక మనిషి సూర్యుడు నుండి రంగులని వేరు చేసే spectrum ని కనిపెట్టాడు.., అదే భూమి మీద ఉన్న ఇంకో మనిషి కల కంటూ ఉన్నాడు…, ఏదైనా మన ప్రయత్నం, మన బుద్ది మన ఆలోచన మీదే ఆధార పడుంటుంది..


 

ఈ పాట అయ్యేలోపు ఇది గ్రహించిన సంజయ్ సాహు, ఆ పోలీస్ ని కొట్టకుండా చంపకుండా అలా అని వదిలేయకుండా, తెలివి గా తన పగ ని సాధించుకుని, అంతే తెలివి గా తిరిగి మామూలు మనిషిగా బతకడం మొదలు పెట్టాడు.. ఈ చివరి వాక్యం పూర్తయ్యే లోపు ఎవరి ఆలోచన ధోరణి అయినా మారి మంచి వైపు కి లాగితే అదే ఈ పాట కి ఈ పాటని సిరివెన్నెల గారికి నేనిచ్చే కానుక.. ఇప్పుడు ఇంకోసారి ఈ పాటని వినండి.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , ,