పాటలోని పాఠం: సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని “ఛల్ ఛలో ఛలో” పాటలోని అద్భుతమైన భావం – A Short Note

కొన్ని పాటలకి శక్తులు ఉంటాయి. ఎలాంటి శక్తీ అంటే మనలో ఉన్న నిరాశ ని పోగొట్టి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చే శక్తీ.., ఏదైనా సాధించగలం అని ఆత్మస్థైర్యాన్ని నింపే శక్తి. అలాంటి కొన్ని పాటలలో ఒక పాట సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని “ఛల్ ఛలో ఛలో”…
హీరో తన కుటుంబం లో అందరికంటే చిన్నోడు…, అందరికంటే తక్కువ బాధ్యతలే తనకి ఉంటాయి. జీవితం అంటే అప్పటివరకు ఆనందం, సంబరాలే తనకి, కానీ తన నాన్న మరణం తన అన్నయ ఆరోగ్య పరిస్థితి ఒక్క సారి గా తనపై ఎక్కడలేని బాధ్యతలని తెచ్చి పెడుతుంది, ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతుంది. ఈ కష్టాలు వచ్చింది తను చేసిన తప్పు వల్ల కాదు. తను నమ్మిన నీతి వల్ల. కాబట్టి వాటిని కూడా తను స్వీకరించాడు, ఎదురీదడానికి సిద్దమయ్యాడు. అప్పుడు వస్తుందండి ఈ పాట.,
రాజ్యం గెలిచినోడు రాజావుతాడు.
రాజ్యం విడిచినోడే రామచంద్రుడు.
యుద్ధం గెలిసేటోడు వీరుడు సూరుడు,
యుద్ధం ఇడిసెటోడే దేవుడు.
ఉన్న ఆస్తి ని వైభోగాన్ని విడిచి వెళ్లడం తప్పు కాదు, రాముడు చేసింది కూడా అదే,
యుద్ధం చేయకపోవటం తప్పు కాదు, కృష్ణుడు కూడా యుద్ధం చేయలేదు గా..,
యుద్ధం ఎప్పుడు అవసరం ఎప్పుడు అనవసరం, ఏది నీతి ఏది సత్యం ఏది అనంతం అనే విచక్షణ ఉండాలి. ఈ సినిమాలో హీరోకి తన నాన్న నేర్పింది అదే, హీరో నమ్మింది అదే, ఆ నమ్మకం తో జీవితం తో తన పోరాటాన్ని మొదలు పెడతాడు.
పల్లవి:
ఛల్ ఛలో ఛలో
లైఫ్ సే మిలో
ఇదో కొత్త చాఫ్టర్
జస్ట్ సే హలొ
ఛల్ ఛలో ఛలో
చలించు దారిలో
ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరో.
కొన్ని పర్వాలు కలిపితే, మాహాభారతం. కొన్ని సమస్యలని, కొన్ని సవాళ్లు కలిపితే జీవితం. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటు, వాటిని జీవితం లో ఒక కొత్త అధ్యాయంగా స్వీకరిస్తూ ముందుకువెళ్ళాలి…,
తీపితో పాటు ఓ కొత్త చేదు
అందించడం జిందగీకి అలవాటే
కష్టమే రాదనే గ్యారంటీ లేదు
పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే
అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని..,
జీవితం అంటే ఒకేలా ఉండదు, కొన్ని సార్లు ఏడిపిస్తుంది, ఆ ఏడుపు ఇంకిపోయే లోపు నవ్వే మార్గాన్ని చూపిస్తుంది. కష్టమే రాదూ అనుకుంటే ఎలాగా?, పడేసి, లేచి పరిగెత్తేలా చేస్తుంది జీవితం. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం ఏ సుఖం వైపుకు నడిపిస్తుందో ఎవరు చూసొచ్చారు.., నువ్వే చూడాలి. కాబట్టి లేచి నడవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు మనకు.
చరణం1:
కన్నీలెందుకు ఉప్పుగుంటాయి
తీయగుంటే కడదాకా వదలం కనక
కష్టాలెందుకు బరువుగుంటాయ్
తేలిక బతుకంతమోస్తూ దించం కనక
బెదురే లేని నీకు కాక
ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక
చూద్దాం అంటూ నీ తడాఖా
వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాక
పడ్డ వాడే కష్టపడ్డ వాడే పైకి లేచే ప్రతోడు
ఒక్కరైనా కాన రాడే జీవితాన్ని పోరాడాకుండా గెలిచినోడు.
ఇష్టపడే వాటిని ఎప్పుడు మనతో నే ఉంచుకోవాలి అనుకుంటాం. అందుకే కష్టాలని మనం ఇష్టపడం. ఈ పాట వినే చాలా మంది చాలా సమస్యలని ఎదురుకుంటూ ఉంటారు, ఆ సమస్యలని వాళ్ళు తేలికగా భావించేలా చేయడానికి, ఈ పదాలు రాశారు , రామ జోగయ్య శాస్త్రి గారు. చిన్నప్పుడు మనకు దెబ్బ తగిలినప్పుడు, “ఎం లేదు నాన్న చిన్న దెబ్బ” అని అమ్మ అంటూ మందు రాస్తే, నొప్పి తగ్గినా భావన వచ్చేస్తుంది, ఈ పదాలతో అలాంటి భావన వినేవాళ్ళలో కలిగించారు. కష్టం ఎప్పుడు సమవుజ్జి నే ఎంచుకుంటుంది. నువ్వు కష్టపడుతున్నావంటే గెలుస్తున్నావనే అర్ధం. అలా గెలిచిన కథలు నీ చుట్టూ చాలా ఉన్నాయి.
చరణం2:
మడతే నలగని షర్టు లాగ
అలమర లో పడిఉంటే అర్ధం లేదు
గీతే పడని కాగితం లా
పుట్టి చెదలు పట్టిపోతే ఫలితం లేనే లేదు.
పుడుతూనే గుక్క పెట్టినాక
కష్టమన్న మాటేమి కొత్తెం కాదు.
కొమ్మలో పడి చికుక్కుకోక
ఆకాశం అంచులో ఏ గాలిపటం ఎగరలేదు..,
ప్లస్సు కాదు, మైనస్సు కాదు, అనుభవాలే ఏమైనా
ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ
సాగిపోరా నీదైన గెలుపు దారిలోనా…
షర్టు మడత పోతుందని వేస్కుకోక పోతే ఆ షర్టు కొని లాభేముంది. ఒక కాగితం కవిత్వం గానో, చిత్రం గానో, పిల్లోడి చేతిలో పుస్తకం గానో మారకుండా, కాలిగా చెదలు పడితే అర్ధం ఏముంది. కష్టం మనం పుట్టినప్పటినుండి మనతో ఉన్న నేస్తం. అది మనకు మంచే చేస్తుంది, ఎంత కష్టపడితే అంత సుఖ పడతావు, ప్రతి ఒక్క క్షణాన్ని పాఠంగా మొలుస్తుంది కష్టం. వాటిని సహనం తో నేర్చుకుంటూ సాగితే గెలుపు నీ సొంతం..
ఎన్ని సార్లు విన్నానో తెలీదు కానీ, విన్న ప్రతి సారి నాతో నేను చెప్పుకున్న మాటలను, ఈరోజు మీతో చెప్పాను. ఒక ప్రశ్న తో ఈ పాటని మొదలెడితే పాట పూర్తయ్యే సారికి జావాబు దొరికే మార్గం కనిపిస్తుంది.. కొత్త ధైర్యాన్ని ఇస్తుంది ఈ పాట. అంత ధైర్యాన్ని నింపే పదాలు రాసిన రామ జోగయ్య శాస్త్రి గారికి, చెవుల్లో నుండి మెదడులోకి వెళ్లిపోయేలా పాడిన రఘు దీక్షిత్ గారికి, మన rockstar DSP కి నమస్సులు…
If you wish to contribute, mail us at admin@chaibisket.com