Presenting Part 1 of Chai Bisket’s Vintage Stories’ Series – Missamma

ఇప్పుడు చెప్పబోయేది…
కథా – కథనం లాంటి మాటలకు కొన్ని వేళ మైళ్ళ దూరంగా, హీరోయిజం, వెకిలి హాస్యం, భారీ సెట్టింగులు, కోట్ల రూపాయలు ధారపోసే అర్ధంకాని ఆలోచనలను ఆలింగనం చేసుకొని నడుస్తున్న సినిమా గురించి కాదు. కేవలం డబ్బులు మాత్రమే కాదు, సినిమా మీద అంతులేని అభిరుచి గల నిర్మాత నమ్మిన కథని, కళ మీద గౌరవం ఉన్న ఓ దార్శనికుడు తీసిన అద్భుతమైన అచ్చ తెలుగు కదిలే బొమ్మల చిత్రం గురించి.
 
1955 లో అంతర్ కులలా మధ్య పెళ్లి జరగటమే కల, అలాంటిది అంతర్ మతాల మధ్య ఓ ప్రేమ కథని నడిపించిన తీరుకి, ఆధునిక యువతి, యువకుల భావాలను ఆవిష్కరించిన తెలివికి, దానిని ప్రేక్షకులు మెచ్చుకునేలా చేసిన నేర్పుకి ఇప్పటి తరం కూడా ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా మిస్సమ్మ. అప్పట్లో చక్రపాణి, నాగిరెడ్డి గారి విజయ వాహిని స్టూడియోస్ నుండి వస్తున్న సినిమా అంటే…ఇప్పుడు రాజమౌళిగారి సినిమా ఎలానో, అప్పుడు విజయ వాహిని సినిమా అలా అన్నమాట. కాదు కాదు, అంతకుమించే. విజయ వాహిని స్టూడియోస్ ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు, అందులో ముఖ్యంగా చెప్పుకోవలసిన చిత్రాల వరసలో ముందు ఉండేది “మిస్సమ్మ”.
 
ఈ కదిలే బొమ్మల కూర్పు గురించి కొన్ని విశేషాలు:
1. రబీంద్రనాధ్ మైత్రా గారి ‘Manmoyee Girls School’, శరదిందు భందోపాధ్యాయ్ గారి ‘Detective’ అనే రెండు కథలను కలిపి చక్రపాణి గారు స్వహస్తాలతో రచించిన కథ ఇది.
2. తెలుగు – తమిళ్ లో ఏక కాలంలో, ఆ తర్వాత హిందీలో(Miss Mary) కూడా L.V. ప్రసాద్ గారే దర్శకత్వం. తెలుగు – తమిళ్ లో ఇప్పటికీ చెప్పుకునే గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలబెట్టారు.
3. మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం. ఆయన గురించి తెలీనివాళ్ళు లేరనుకుంటా. తెలీనివాళ్ళు మాయాబజార్ లాహిరి లాహిరి పాట చూడండి. పేరు గుర్తుందిగా… బార్ట్లే… మార్కస్ బార్ట్లే.
4. మొదట ‘పాలువాయి భానుమతి రామకృష్ణ’ గారిని కథానాయికగా పెట్టి, 4 రీళ్ల సినిమా తీసారట. ఆ తర్వాత చక్రపాణి గారికి, భానుమతి గారికి మధ్య మనస్పర్ధల వలన సావిత్రిగారిని(అంతకుముందు సావిత్రి గారిని, జమున గారు చేసిన సీత పాత్రకోసం ఎన్నుకున్నారు) మిస్సమ్మగా మార్చారు చక్రపాణి గారు. నిర్మాతకి తిక్కరేగితే అప్పట్లో అంతే మరి.
5. సాలూరి రాజేశ్వర రావుగారి పాటలు ఇప్పటికి వినసొంపుగా ఉంటాయ్ అనటం అతిశయోక్తి అణుమాత్రం కూడా కాదు.Volume peaks లో పెట్టి వినండి, repeats guaranteed.
6. పింగళి నాగేంద్రరావు గారి సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, కావాలంటే ఇస్తాలే, తెలుసుకొనవే యువతి(చెల్లి), సీతారం సీతారం, ధర్మం చెయ్ బాబు, రావోయి చందమామ – ఈ పాటలు ఓ సారి శ్రద్దగా వినండి, వాటి స్థాయి తెలుస్తుంది.
7. పింగళి నాగేంద్రరావు గారి సంభాషణలు తెలుగువారి వ్యవహారికంలో చెరగని స్థానం సంపాదించుకున్నాయి. తైలం అనేది డబ్బుకి పర్యాయంగా చేరింది, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ఒక జాతీయ్యంలా మారింది. నిజానికి సంభాషణల గొప్పతనం గురించి కాని, వాటి స్థాయి గురించి కాని చెప్పే అర్హత, రాయగల సామర్ధ్యం, విశ్లేషించగల ఆలోచనా శక్తి, విమర్శించగల అనుభవం ఏవి నాకు లేవు.
 
సినిమా చూడాలనుకునే వారి కోసం కొన్ని…
 
గుమ్మడి గారు ఓ సందర్భం లో చెప్తారు ఈ మాట. ఇప్పటికీ ఉపయోగపడుతుందంటే పింగళి గారి ఆలోచనను మెచ్చుకోవాలా ? మన సమాజ దుస్థితిని తిట్టుకోవాలా ?
 
1 copy
 
అక్షర సత్యం. కానీ, చెప్పటం వృధా అని నా అభిప్రాయం. ఎందుకంటే, ఈ విషయం అర్ధం చేసుకోగలవారికి చెప్పాల్సిన పనిలేదు, అర్ధం చేసుకోలేని వారికి చెప్పినా ఒరిగేది ఏమి ఉండదు కదా.
 
7 copy
 
ఎప్పుడో ఒకసారి, ఎవడికో ఒకడికి అంటే చేయగలం. కానీ, చేస్తున్నాం కదాని వెంటపడితే ఎలా ?
 
2 copy
 
హిందూత్వం అనేది మతం కాదు, సనాతన ధర్మం. ధర్మ బద్దమైన జీవితం ఎలా గడపాలో చెప్పే మార్గదర్శి.
 
3 copy
 
యటకారం మా రక్తంలోనే ఉంది. అన్నీ తెలుసు, అంతా తెలుసు కాని…
 
4 copy
 
జాబు ఇవ్వాలంటే అనుభవం కావాలంటారు, అనుభవం రావాలంటే ఒక్కడైనా జాబు ఇవ్వాలి కదా. ఎప్పటి నుండో నడుస్తున్న వ్యవహారమే అన్నమాట…
 
5 copy
 
రావోయి చందమామ… ఇక్కడ మతం అంటే దేవుడికి సంబంధించినది కాదు. తన గురించే తప్ప ఎవ్వరి గురించి పట్టించుకోదని.
 
6 copy
 
టీవీ లో చెత్త వార్తలు వినలేక, ఫోనులో సొల్లు చాటింగ్ ఎట్టలేక, సిస్టంలో రొట్ట సినిమాలు చూడలేక, ఎండలో బయటకి వెళ్ళలేక, ఇంట్లో ఏం చేయాలో తోచనప్పుడు మీ దగ్గర మిస్సమ్మ DVD ఉంటె(లేదా ? జై uTorrent/YouTube) చూసెయ్యండి. చెప్తే నమ్మరు గురూ… ఒక రెండు పాటలు తప్ప సినిమా మొత్తం ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చూసేస్తాం.
 
స్వచ్చమైన చల్లని పైరు గాలి తెల్లారిందని మేల్కొలిపినప్పుడు, పచ్చని పైరు మధ్యలో రాజసంగా నిల్చున్న మంచె మీద కూర్చొని, నిద్ర కమ్మేసిన కళ్ళతో ఉదయిస్తున్న సూర్యుడ్ని చూస్తే కలిగే పరవశం పొందొచ్చు ఈ సినిమా చూస్తూ. అందుకే…
“మిస్సమ్మ కేవలం ఎప్పుడో తీసిన సినిమా మాత్రమే కాదు, ఎప్పుడూ కావాలనిపించే మధురమైన అనుభూతి, ఎప్పటికీ మర్చిపోలేని సుమధుర స్వప్నం”.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,