Chai Bisket’s Story Series – యెచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి! (Part – 6)

జరిగిన కథ… (Parts 1, 2, 3, 4, 5)
 
మా కాలేజి వాళ్ళు కొంతమంది ఎదురయ్యారు, తనకి భయం వేసింది, ఎంతైనా ఆడపిల్ల కదా ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని తన బాధ. అదృష్టవశాత్తు వాళ్ళు మమ్మలని చూడలేదు, సో ప్రాబ్లం ఏం రాలేదు. ప్రేమలోని ఆనందం లో రెండవ సంవత్సరం, మూడో సంవత్సరం మొదటి సెం కూడా అయ్పోయాయ్. రెండవ సెం లో మొదటి సారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను, ఆ రోజు తన పుట్టినరోజు, తనకు కూడా తెలీదు నేను వచ్చినట్టు. వాళ్ళది పెద్ద ఇల్లు, వెనక పూల చెట్లు పెంచుతున్నారు, ఆ రోజు రాత్రి వెళ్లి ఆ మొక్కల మధ్యలో వికసించిన రోజా పువ్వుల మొక్కలు పెట్టాను తన పేరు ఆకారం లో. ఆ రోజు రాత్రి 2 తర్వాత వాళ్ళ ఇంటి గోడ వెనుక నిల్చొని తనకు ఫోన్ చేసాను, తను నా ఫోన్ కోసం ఎదురుచుస్తునట్టు ఉన్నది, టక్కున లిఫ్ట్ చేసింది, ఒక్క సారి ఇంటి వెనక్కి వెళ్లి చూడమని చెప్పాను. ఆ పువ్వుల్లో తన పేరు చూసినప్పుడు తన ముఖం లో కలిగిన ఆనందం మరిచిపోలేను. వెంటనే వచ్చి ఆ పూలన్నీ కోసేస్తుంది, ఇంట్లో వాళ్ళకు అనుమానం వస్తుందేమో అనే భయంతో.
 
నేను అక్కడే ఉన్నట్టు తనకు తెలుసు, రమ్మని చిన్నగా పిలిచింది, ఇద్దరం కలిసి ఆ పూలు పీకేసాం, ఆ తర్వాత హగ్ చేసుకొని అలానే ఉండిపోయాను. తను వెళ్ళాలి అన్నప్పుడు కాని తెలీలేదు గంట దాటిందని హగ్ చేసుకొని. ఆ తర్వాత రోజు పార్టీ అని చెప్పి వాళ్ళ నాన్న పెద్ద హడావిడి చేసాడు, క్లాస్స్ లో కొంతమందిని పిలిచింది తను, వాళ్ళతో పాటు నేను కార్తి వెళ్ళాం. మొదటి సారి వాళ్ళింటి లోపలికి వెళ్ళాను. వాళ్ళ పేరెంట్స్ కు పరిచయం చేసింది అందరిని. నా గురించి కొంచెం ఎక్కువుగా చెప్పింది, వాళ్ళ నాన్నకు అర్ధం అవ్వలేదు కాని వాళ్ళమ్మ కు మాత్రం కొద్దిగా అనుమానం వచ్చినట్టు ఉంది. అందుకే అవసరం లేకపోయినా హరి పెళ్లి గురించి చెప్పింది మాకు. తనతో నేను కలిసి దిగిన మొదటి, చివరి ఫోటో ఆ రోజే. అలా అని ఫోటోలో తను నా పక్కనేం లేదు, టెక్నికల్ గా చూస్తె ఇద్దరం ఒకే ఫోటో లో ఉన్నది ఆ ఒక్క ఫోటోలోనే.
 
నేను హరి కార్తీ కాంటీన్ లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే వచ్చింది అంజు, ఏదో బాధ కనపడుతుంది తన ముఖంలో. నాని(హరి కాకుండా అంజు ఒక్కతే నన్ను అలా పిలిచేది) నీతో కొద్దిగా మాట్లాడాలి వస్తావా అని అడిగింది. హరి కార్తీ వెళ్లిపోబోతుంటే, బయటకు వెళ్దామా అని అడిగింది అంజు నన్ను. హరి అప్పటికే అదోలా చూస్తుంది నన్ను, తనని పిలవకుండా నేను ఒంటరిగా వెళ్తున్నాను అనే బాధ, అంజు తో ఎక్కడికి వెళ్తున్నాడు అని ఓ చిన్న అనుమానంతో. నేను అంజు ఇద్దరమే కలిసి బయటకి వచ్చాం. అంజు వాళ్ళ ఇంటికి. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు టీచర్స్, అంజు ఒక్కతే కూతురు, సో ఆ టైం లో ఎవ్వరు లేరు ఇంట్లో. ఏంటే ఎప్పుడు లేనిది ఇంటికి తీసుకోచ్చావ్, అంత సీరియస్ విషయమా, ఏంటో అదోలా ఉన్నావ్ అని అడిగాను. ఒక్కసారిగా తను ఏడుస్తుంది. నాకు ఏదో పెద్ద విషయం జరిగిందని తెలుస్తుంది, ఏమైందో చెప్పు అని అడిగాను. తను ఏడవటం చూసింది అదే మొదటిసారి, చాలా ధైర్యం ఉన్న అమ్మాయి. అర్జున్ గాడు తనని మోసం చేసాడట, అర్జున్ నా సీనియర్, హరితో పరిచయం కోసం నాకు హెల్ప్ చేసాడని, అంజు కి వాడిని పరిచయం చేసింది నేనే. వాడు చెడ్డవాడు కాదు కాని ఎందుకు ఇలా చేసాడో అర్ధం కాలేదు.
 
నాకు తెలీదు అంజు కి వాడంటే ఇష్టం అని, వాడికి అంజు దొరకటం చాలా గొప్ప, తన ముందు వాడు బిస్కెట్ అనట్టు, ఎందులోనూ సరిపోడు, కాని అంజు కి ఎలా నచ్చాడు ? హరి నాకు కలిసిన తర్వాత వీళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోలేదు నేను. అంతకముందు రోజు కలిసేవాళ్ళం అంజు నేను అర్జున్. వాడు తనకి లైన్ వేస్తునట్టు తెలుసు కాని, అంజు ఇష్టపడుతుంది అనుకోలేదు నేను. అర్జున్ కూడా ఎప్పుడు చెప్పలేదు నాకు. అర్జున్…నాకెందుకు అంత సాయం చేసాడో అర్ధమయ్యింది అప్పట్లో. వాడు నాకు సాయం చేయలేదు, వాడి అవసరం కోసం నన్ను వాడుకున్నాడు. అంజుకి నాపై ఉన్న అభిమానం వాడుకున్నాడు. మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ తో వాడి రిలేషన్ బిల్డ్ చేసుకున్నాడు. నిజానికి వాడ్ని అనటానికి నాకు అర్హత లేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే వాడ్ని అడ్డం పెట్టుకొని హరి కి నేను దగ్గరయ్యాను కదా. అంజు బాధలో నాకూ భాగం ఉంది, తన ఆవేదనకు నేనూ ఓ కారణం, తన కన్నీటికి నేనూ సమాధానం చెప్పాలి. అర్జున్ నేను ఇద్దరం చేసింది తప్పే, కాని నా తప్పు హరి ని ఆనందంలో ఎగరేస్తుంటే, వాడి తప్పు అంజు ని ఆవేదనలో ముంచేస్తుంది. అంజు కళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది వాడి పై ఎంత ప్రేమ పెంచుకుంది అనేది. పాపం అమ్మాయిలు చాలామంది ఇంతే, నిజమైన ప్రేమని గుర్తించరు, మోసం చేసేవాళ్ళ నుండి తప్పించుకోలేరు.
 
ఆ తర్వాత రోజు అర్జున్ ని అడిగాను, వాడు చెప్పిన సమాధానం, వాడి ప్రవర్తన నాకు నచ్చలేదు. మూర్కుడిలా తయారయ్యాడు, మా దగ్గర ఉనప్పుడు బావుండేవాడు. చెడు సావాసాలు ఎక్కువ అయ్యాయి, చివరికి అమ్మాయిల ఫోటోలు తీసి బెదిరించి బతికే స్తాయికి వచ్చాడు. వాడి ఫోన్ లో అంజు తో కలిసి దిగిన ఫొటోస్ తో పాటుగా ఇంకొంతమందివి కూడా ఉన్నాయి. తను ప్రేమించింది, వీడికి ప్రేమించటం తెలీదు, మూర్ఖంగా ప్రవర్తించటం తప్ప. ఇంత వెధవ అవుతాడు అనుకోలేదు. అంజుని కలవటానికి నా స్నేహాన్ని అడ్డుపెట్టుకున్నాడు అనే ఊహే నన్ను తొలిచేస్తుంది. వీడి సాయంతోనా హరి దగ్గరయ్యాను నేను, ఇలాంటి వాడా నా ఫ్రెండ్. ఎందుకు ఇలా అయ్యాడు. పెద్దాల్లందరూ చెప్పేది దీని గురించేనేమో, ఆ వయసులో ఒళ్ళు దగ్గర పెట్టుకోపోతే వీడి బతుకులా దరిద్రంగా అవుతుంది అందరిది. మన గురించి తెలీని అమ్మాయికి చేస్తే మోసం, మనల్ని ప్రేమించిన అమ్మాయికి చేస్తే ద్రోహం. వాడు మోసం ద్రోహం రెండు చేస్తున్నాడు. ఇలాంటి వాడని తెలిసాక కూడా అంజు వాడిని ప్రేమించింది కాని వాడు తనతో పాటు ఇంకో ఇద్దర్ని ప్రేమించాడు. వాడిని అదే విషయం అడిగితె, అంజుని కూడా ఇంకొకర్ని ప్రేమించమని సలహా ఇచ్చాడంట. ఆ ఒక్క మాట వంద ఫైర్ ఇంజినులు ఒకే సారి వచ్చినా ఆర్పలేని మంట పుట్టించాయి అంజు మనసులో. వాడు అంజు తో దిగిన ఫోటోలతో తనని ఇబ్బందిపెట్టటం మొదలెట్టాడు. ఎవ్వరికి చెప్పాలో తెలీక వాడి చెంప పగలగొట్టి, నాకు చెప్పాలని వచ్చింది. వదిలేయ్ అని చెప్పలేదు నేను, ఎందుకంటే వాడి మాటలు అంజు చెవికి తాకలేదు, మనసుని కమ్మేసాయి. అంజు ని ఆ ఆసంఘటన నుండి, అర్జున్ ఆలోచనల నుండి బయటకు తీసుకురావటానికి రెండు వారల పైన పట్టింది. తను నార్మల్ అయినట్టు నాకనిపించింది కాని తనకు ఎలా ఉందొ తెలీదు. ముఖం పై చిరునవ్వు తెప్పించలేదు కాని బాధ లేకుండా చేసాను.
 
అంతకు ముందు నుండే వాళ్ళ పేరెంట్స్ కు నేను తెలుసు, ఈ సంఘటన వలన ఇంకొంత అభిమానం పెరిగింది నా పైన. ఆ రెండు వారాలు అంజు వాళ్ళ అమ్మ గారు నాకు రోజు ఫోన్ చేసి కాలేజీ లో తనెలా ఉంది అని అడిగేవారు. దాదాపు రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. కొన్ని రోజులు హరి కంటే అంజు తోనే ఎక్కువ ఉండేవాడిని. ఒక రోజు అంజు వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ రేంజి లో షాక్ ఇస్తారని ఊహించలేదు. ఏదో సెలవు రోజు వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారు, నన్ను రమ్మని పిలిచారు, వెళ్ళాను, అనుకోలేదు అలా జరుగుతుందని. మా కుటుంబం గురించి అడుగుతున్నారు, ఎందుకో అర్ధం కాలేదు. మా గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. మాటల్లో మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. వినపడలేదో, అర్ధం కాలేదో కాని ఆ సమయంలో నేను ఆ మాటని పట్టించుకోలేదు. ఏవేవో అడుగుతూ మధ్యలో ఈ సారి గట్టిగా అడిగారు పెళ్లి గురించి. చేయండి మంచి సంబంధం దొరికిందా అని ఎదురు అడిగాను నేను. “సంబంధం గురించే నిన్ను అడుగుతున్నది, మాకు నువ్వంటే ఇష్టం, నీకు మా మీద గౌరవం , అంజు అంటే మాకు ప్రాణం, అంజు కి నువ్వంటే అభిమానం, అంజు నీతో ఉంటె మాకో భరోసా అందుకే నువ్వు మా అల్లుడు అయితే మాకు ఆనందంగా, అంజు కి ధైర్యంగా ఉంటుంది, ఏమంటావ్ !? “. నేను వెంటనే క్షణం ఆలోచించకుండా సరే అన్నాను…
 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,