Chai Bisket’s Story Series – యెచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి! (Part – 5)

జరిగిన కథ… (Parts 1, 2, 3, 4)

 
అడిగేశాను, కార్తీ గాడిని అన్నయ్య అన్న కొన్ని రోజుల తర్వాత నా ఇష్టాన్ని గురించి తన అభిప్రాయం అడిగేశాను. తనేం మాట్లాడలేదు, మౌనం గా వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా రోజులు నా వైపు కూడా చూడలేదు, తనకు కష్టం కలిగించటం నాకు ఇష్టం లేదు, అందుకే తనని గట్టిగా అడగలేదు. మొదటి సంవత్సరం గడిచిపోయింది అంటే నాలుగు నెలలు అయ్యింది తను మాట్లాడక. ల్యాబ్ లో నా పక్కనే ఉండేది, కార్తి తోనే మాట్లాడేది. స్టాప్ లో మాతోనే ఎక్కేది, బస్సు వచ్చే ముందు వచ్చేది. చెప్పినప్పుడు కొన్ని రోజులు ఆతురుత ఆపుకోలేక అడిగేద్దాం అనుకున్నాను, కాని అడగలేకపోయాను. ఇష్టం ఉంటె చెప్పేది, లేకపోయినా ఏదోటి చెప్పాలి కాని ఇదేంటి ఏమి చెప్పకుండా, నాతో మాట్లాడకుండా నా వెంటే తిరుగుతుంది, నా గురించి ప్రతీ విషయం తెలుసుకుంటుంది కాని మాట్లడేది కాదు. కార్తీ తో అడిగిద్దామా !? వద్దు అది పద్దతి కాదు, అయినా ఒకప్పుడు నేనే కదా వాడికి చెప్పింది ఎవడిది వాడే చూసుకోవాలని ఇలాంటి విషయాల్లో. దేవుడా ఏంటి నాకీ దుస్తితి, నేను అడిగానా నిన్ను, నాకో లవ్ స్టొరీ రాయవయ్యా అని, లేదే… మరి ఎందుకు నాతో ఆడుకుంటున్నావ్, కనీసం తన మనసులో మాటేంటో చెప్పొచ్చు కదా, నువ్వైనా చెప్పించొచ్చు కదా, ఐనా నువ్వెందుకు చెప్పిస్తావ్ లే నీకు సరదా కదా నాతో ఆడుకోవటం. చినప్పుటి నుండి నాలో విపరీతమైన ఇష్టం కలిగించి, దాన్ని దూరం చేసి, నేను ఏడుస్తుంటే చూడటం నీకు సరదా కదా.
 
రెండోవ ఏడాది మొదలయ్యి కొన్ని రోజులు అయ్యింది, నేను తనని పట్టించుకోవటం మర్చిపోయాను అని చెప్పానంటే అది అబద్దం అవుతుంది, కాని పట్టించుకోకుండా ఉండేదుకు ప్రయత్నం మాత్రం చేసాను, ఎక్కువుగా బాస్కెట్ బాల్ కోర్ట్ లోనే ఉండేవాడిని, నాకు బస్సు లో రావటం నచ్చలేదు, అందుకే అప్పుడప్పుడు నాన్న బైక్ తీసుకు వచ్చేవాడిని. అలా నాన్న బైక్ మీద వచ్చిన ఒక రోజు, బాస్కెట్ బాల్ ఆడుతూ 6 వరకు ఉన్నాను, అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కడినే ప్రాక్టీసు చేస్తున్నాను, వెళ్దామ అని ఎవరో పిలిచినట్టు అనిపించింది. అంతా నిశబ్ధం, బాస్కెట్ బాల్ శబ్దం తప్ప ఇంకేం వినపడటం లేదు, ఎవరా అని వెనక్కి తిరిగాను, హరి ఎదురుగా నిల్చుంది. దాదాపు ఆరు నెలల పైన అయ్యింది తను మాట్లాడక నాతో, ఇప్పుడు ఒక్కసారిగా వెనక వచ్చి నిల్చుంది. ఎవ్వరు లేరు నేను తను, బాస్కెట్ బాల్ తప్ప. తనని కోర్ట్ పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చోమని చెప్పి, ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. అంతసేపు వెళ్ళకుండా ఎందుకు ఉందొ అర్ధం అవ్వలేదు, కాని అడిగే ధైర్యం రాలేదు నాకు. కూర్చుంది కాని తనేం మాట్లాడటం లేదు, చల్లటి గాలి వస్తుంది, కాషాయ రంగులోకి మారిపోయింది, ఆకాశం మధ్యలో ఎర్రగా వెలుగుతున్న సూరీడు, నేలను ముద్దాడటానికి తయారుగా ఉన్నాయి మేఘాలు, ఆ రంగులో తెల్ల చుడిదార్ వేసుకున్న తను వెలిగిపోతుంది. మొదటి సారి కవిని కానందుకు తిట్టుకున్నాను నన్ను నేను, ఎందుకంటే తన అందం చూడటం తప్ప మాటల్లో చెప్పలేక పోతున్నాను అనే ఆవేదనలో. ఏవయ్యా అసల బుద్దుందా నీకు, ప్రేమ కథ రాసినోడివి అందులో హీరోకి(అంటే నాకు) అన్ని కళలు తెలిసేలా చేయాలి కాని ఇలా చేసావేంటి !? ఇప్పుడు ఎలా వర్ణించను తను, తను నిజంగా అందంగా ఉందొ నాకు మాత్రమె అలా కనపడుతుందో అదైన చెప్పి చావు. “రేయ్…ఇది చాలా ఎక్కువ రోయ్! వెధవ ప్రశ్నలు ఆపి కథలోకి రా ” అన్నాడు దేవుడు.
 
ఆ మౌన ప్రయాణం ఎక్కువసేపు చేయలేక, తనతో ఎలా మాట్లాడాలో తెలీక వెళ్దామా అన్నాను నేను. కొద్దిసేపు ఉందాం అనట్టు ఏమి మాట్లాడలేదు తను. నేను పక్కగా బెంచ్ చివరిలో కూర్చున్నాను. అంతా నిశబ్ధం, ఆకులు కదిలిన శబ్దం కూడా వినిపిస్తుంది. “ఆ రోజు తర్వాత ఎందుకు మాట్లాడలేదు ” అని అడిగింది తను నాకు దగ్గరగా జరిగి. నేనా…తనే నన్ను దూరం పెట్టి, నేరం నాది అనట్టు అడిగింది. తనకు ఏం సమాధానం చెప్పానో గుర్తులేదు కాని, చాలాసేపు ఏవేవో అడిగింది అన్నిటికి నాదే తప్పు అన్నట్టు మౌనంగా ఉండిపోయాను నేను, కాని తనకు నేనంటే ఇష్టం అని మాత్రం అర్ధం అవుతుంది. కొద్ది సేపటి తర్వాత ఏవైందో తెలీలేదు కాని ఒక్క సారిగా నా ముందున్న ప్రపంచం అంతా మారిపోయింది. అంతా శూన్యం, దిక్కులు కనిపించని వెలుగు కమ్ముకుంది, ఎక్కడున్నానో గుర్తుపట్టటం కష్టం గా ఉంది. నేనో సుందర ప్రపంచం లోకి వచ్చిపడ్డాను.
 
మరిచిపోయాను, అంతా మరిచిపోయాను, నన్నే నేను మర్చిపోయాను. తన నీలి కనులలోకి చూస్తూ ఆ సుందర ప్రపంచం లోకి వచ్చిన దారి మరిచిపోయాను, తన అధరాలు పరిచయం చేసిన మధురాలు ఆస్వాదిస్తూ అప్పటివరకు జరిగినది అంతా మరిచిపోయాను, తన చెక్కిలి తాకినా క్షణం కలిగిన గిలిగింతల మత్తులో అంతు తెలీని వింతలలో మునిగి మైమరిచిపోయాను, తన ముక్కు పుడుక మెరుపు అంత దగ్గరిగా చూసేప్పటికి శ్వాసించటం మరిచిపోయాను, ఊహకు అందని ఆనందాన్ని పొందేప్పటికి ప్రాణం ఒకటి ఉందన్న సంగతే మరచిపోయాను. నా మనసులో తన ఊహలు, నా హృదయం లో తన ఇష్టం, నా పెదవి పై తన నవ్వు, నా కన్నుల్లో తన రూపం, నా ముఖం పై తన ప్రేమ అనుభవం కలిగిన సమయాన, నన్ను నేనే గుర్తుపట్టలేనంత గా మరచిపోయాను. కలలో కూడా కలగనని కవ్వింత మదిని పులకింతలో తడిపిన క్షణం…నేనేనా భూమి గురత్వాకర్షణ శక్తిని తప్పించుకొని గాలిలో తేలుతున్నది !? ఏమని వర్ణించను ఆ సంఘటనని, అప్పుడు నేను పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. రాదు…ఆ అనుభూతి ఇంకేప్పటికి రాదు. ఇందుకా ప్రాణాలు కూడా లెక్క చేయనిది, అంత వరకు కొందరు చెప్తుంటే, వాళ్ళది వెర్రేమో అనుకునేవాడిని, కాని కాదు ఈ మోక్షాన్ని అందించిన మనిషి కోసం ఒక్క సారి కాదు, చావటం కోసమే లక్ష సార్లు జన్మించవచ్చు. ఎన్ని కష్టాలైన పడొచ్చు. ఎంత మందిని అయినా ఎదిరించవచ్చు.
 
ఏం సృష్టించావయ్య, చెప్పలేను వర్ణించి చెప్పలేను, ఒక్క స్పర్శతో అన్ని పరవశాలు ఎలా పుట్టించావ్ స్వామీ…బాబోయ్ నువ్వు సూపర్ అంతే…ఇన్ని రోజులు నువ్వు నా ప్రేమకథ ని ముందుకు తీసుకువేల్లవేమో అన్న ఖంగారు లో నీతో కొద్దిగా దుర్భాశలాడాను క్షమించేసేయ్ యే…క్షమిస్తావ్ లే ఎందుకంటే నువ్వు నా బెస్టు ఫ్రెండ్ వి కదూ.”వీడొకడు, ఆనందం బాధ కోపం ఏది వచ్చినా లోపల ఉంచుకోలేడు అన్ని నాతోనే, అన్నిటికి నాపైనే ! తర్వాత ఏమైందో చెప్పరా… “. ఎంత సేపు గడిచిందో తెలీలేదు, ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. తనకు నా మీద ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేక, ఇలా చెప్పింది తను. అదే పరవశం ఓ వారం పాటు ఉండింది. తను కొత్తగా కనిపించింది ఆ తర్వాత రోజు నుండి. బహుమతులు, గంటలు గంటలు మాట్లాడుకొవటాలు, వేరే ఫ్రెండ్స్కి దొరకుండా వెళ్లటాలు, దొంగచాటుగా సినిమాకు వెళ్ళటం లాంటివి ఏవి జరగలేదు మా మధ్య. ఆ తర్వాత నుండి నేను హరి కార్తీ ముగ్గురం ఇంతకు ముందు లానే ఉన్నాం. కార్తి గాడికి చెప్పాను, నాకు తనంటే ఇష్టం అని, వాడు చాల హ్యాపీ గా ఫీల్ అయ్యాడు, తన అభిప్రాయం కనుక్కోమంటావా అని అడిగాడు, తనకి నేనంటే ఇష్టం అని చెప్పాను. అందరి ప్రేమికులులాగా నేను హరి పెద్దగా మాట్లాడుకునే వాళ్ళం కాదు, మిగతా వాళ్ళు అంత సేపు ఏం మాట్లాడుకుంటారో అర్ధం అయ్యేది కాదు. మేమిద్దరం కలిసేది కూడా కాలేజి లోనే, బయట కలవటం కుదిరేది కాదు, ఎందుకంటే ఒక్కటే ఏరియా కదా.
 
తన గురించి తెలుసు కాని, వాళ్ళ కుటుంబం గురించి తెలీదు నాకు అప్పటివరకు. హరి వాళ్ళు ఆర్ధికంగా మాకంటే ఎన్నో రెట్లు ఎక్కువ, ఎంత అంటే నేను మా నాన్న హీరో హోండా CD100 లో ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాడిని, తనకోసమే కొన్న ఆక్టీవా లో అప్పుడప్పుడు వచ్చేది తను. కూతురంటే వాళ్ళ నాన్నకు ప్రాణం, కులం అంటే గౌరవం, వాళ్ళమ్మ కు కులం అంటే ప్రాణం, కూతురంటే ఇష్టం. తనకో అన్నయ్య ఉన్నాడు వాడికి చెల్లలంటే ప్రేమ, కులం అంటే పిచ్చి. హరి కి కూడా కులం అంటే గౌరవం ఎందుకంటే వాళ్ళ నాన్న అంటే తనకు ప్రాణం కనుక. ఇవేం మేము పెద్దగా తీసుకోలేదు, తను నేను కాలేజి లో కాకుండా కలిసే చోటు, మా ఏరియా కు రెండు కిలో మీటర్ల దూరం లో ఉండే రోడ్లో. ఆ రోడ్ ఏ ఎందుకంటే ఆ వైపు వాళ్ళ నాన్న రాడు, మా నాన్న కూడా. ఇద్దరం ఆ రోడ్ లో తన బైక్ మీద దగ్గరలో ఉన్న ఊరి వరకు వెళ్లి తిరిగి వచ్చేవాళ్ళం సాయంత్రం టైం లో అప్పుడప్పుడు, ఎందకంటే చీకట్లో పెద్దగా ఎవరు గుర్తుపట్టారు కదా. నేను తనూ ప్రేమతో కలిసి తిరిగామే కాని బరితెగించి కాదు ఏంటి తేడా అంటారా !? బరితెగింపు లో రెండు దేహాలు ఉంటె, ప్రేమతో కలిసి తిరగడంలో రెండు మనసులుంటాయి. నాకు తన మీద ఉన్నది ప్రేమ, తనకు నేనంటే విపరీతమైన ఇష్టం, మాకేప్పుడు వేరే ఆలోచనలు రాలేదు, తను డ్రైవ్ చేస్తుంటే నేను వెనక కూర్చునేవాడిని, తను చెప్తుంటే వినేవాడిని, నేను డ్రైవ్ చేస్తుంటే తను అంతే. తను డ్రైవ్ చేస్తునప్పుడు నేను తనని హాగ్ చేసుకొని కూర్చునే వాడిని, ఆ సంతోషం లో తను చెప్పేది ఒక్క ముక్కా చెవినపడేది కాదు. కాని ఒక రోజు మేము ఊహించని సంఘటన జరిగింది…
 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,