దేవుడే నీకు ఫోన్ చేస్తే?: An Intense Phone Call Between Man & God

 

Contributed By Sarveswar Reddy Bandi

 

ఎలాగో ఈ మధ్య రోజుల్లో మనం లేచేసరికి ఎనమిది, తొమ్మిదో అవుతుంది, ఇక ఆదివారాల్లో అయితే ఏకంగా మధ్యాహ్నం దాకా పడుకుని టిఫిన్ ను కూడా త్యాగం చేస్తున్నాం కదా, అదేదో ఇంకొంచెం ఆలస్యం గా లేచి, మంచి నీళ్ళు కొన్ని తాగి మళ్ళీ సాయంత్రం దాకా పడుకుని ఈ ఉపవాసం కాస్త కానిస్తే పుణ్యం సంగతి పక్కన పెడితే అమ్మ నుంచి ఒక బాధ తగ్గిపోతుంది అనుకుంటూ, ఆదివారం రాత్రి పడుకునే ముందు కార్తీక సోమవారం గురించి ఒక పెద్ద తీవ్రవాది తరహా పన్నాగాలు (plans) వేసుకున్నా..

 

ఇంతలో అమ్మ నుండి ఫోన్ కాల్, ” పొద్దున చెప్పడం మర్చిపోయా, ఉపవాసం చేసే రోజు ఉదయం 6 గంటలకు లేచి చన్నీళ్లతో స్నానం చేశాక మళ్లీ సాయంత్రం 7 గంటల దాకా నిద్రపోవడం కాదు కదా, కనీసం ఆ మంచంలో కూడా ఉండకు, కావాలంటే కాసేపు ఎప్పుడైనా నేల మీద అలా పడుకో (అది కూడా నిద్ర పోకుండా) ఇక ఆకలి అనిపించిన ప్రతిసారీ కొన్ని నీళ్ళు తాగు పర్లేదు. అయితే సెంచరీ చేసిన క్రికెటర్ లాగ పెద్ద మొత్తంలో కాకుండా, గుళ్ళో తీర్థం లాగ కొంచెం మాత్రమే తాగు. మరీ ఆకలేస్తే పూజ గదిలో ఉన్న పళ్లలో ఏదో ఒక్కటి మాత్రమే తీసుకో.. గుర్తుందిగా ఈ ఒక్క పని సక్రమంగా చెయ్యి అంటూ చాలా పద్ధతిగా ఫోన్ పెట్టేసింది..

 

ఇక చేసేదేమీ లేక 5 గంటలకు అలారం పెట్టుకుని లేచి 6 గంటలకు గుడికి వెళ్లా.. సినిమాల్లో చూపించినట్లు అక్కడ పెద్ద కలరింగ్ లేకపోవడంతో అలాంటి సీన్లు పెట్టి నాకు లేని పోని ఆశలు పెట్టిన ఆ డైరెక్టర్లను మనసులో తిట్టుకుంటూ మళ్ళీ ఇంటికొచ్చి భక్తి మూడ్ లోకి రావడానికి ఫోన్లో యూట్యూబ్ లో కొన్ని శివుడికి సంబంధించిన సినిమాలు వేతికా, అయితే అవి మరీ పద్యాలు ఎక్కువ మాటలు తక్కువ ఉండటంతో కాసేపటికే వెనక్కి వచ్చి ఈ మధ్య ఉన్న సినిమాలు చూసా, శ్రీ మంజునాథ సినిమాలో ఉన్న కొన్ని ఫేవరెట్ సీన్లు మళ్ళీ మళ్ళీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నా.. అందులో సాక్షాత్తు పరమ శివుడు ఇంటికి వస్తే అర్జున్ గుర్తుపట్టలేక తిట్టి పంపించే సీన్ పదే పదే చూసా.. మొత్తానికి సాయంత్రానికి ఉపవాసం పూర్తి చేసుకుని అప్పుడెప్పుడో చిన్నప్పుడు లాగ 8 గంటలకే నిద్రలోకి జారుకున్నా..

 

అయితే పడుకునే ముందు “కేవలం ఒక్క రోజు దీక్షకే ఇంత కష్టంగా ఉంటే ఇక నెలల తరబడి మాలలు వేసే స్వాముల దీక్షను తలుచుకుంటే ఎందుకో వాళ్ళ మీద ఒక గౌరవంతో కూడిన అభిమానం అనిపించింది” ఇదంతా ఆలోచిస్తూ చిన్నగా నిద్రలోకి వెళ్ళిపోయాను..

 

ఇంతలో నా నిద్ర భంగం చేయడానికి వచ్చినట్లు ఒక ఫోన్ కాల్..

 

“హలో ! ఎవరూ.? ” అన్న నా ప్రశ్నకు సమాధానంగా ” నేనే దేవుడిని, తెలుసా “ అని ఒక ప్రశ్న వినిపించింది..

 

” అబ్బే తెలియక పోవడం ఏంటండీ.. మన తమిళ డైరెక్టర్ బాల తీసిన సినిమా కదా, చాలా బాగుంటుంది.. ఆయన తీసిన వాటిలో శివ పుత్రుడు, వాడు – వీడు నాకు బాగా నచ్చిన సినిమాలు కూడానూ” అంటూ బదులిచ్చాను..

 

” ఓహో.. ఎగతాళి చేస్తున్నావా! తప్పు నీది కాదులే..
ఒకటి గుర్తుంచుకో, అందరూ కళ్ళు మూస్తే అబద్దం, తెరిస్తే నిజం మొదలవుతాయి.. కానీ ఈరోజు నీకు కళ్ళు మూస్తే నిజం, తెరిస్తే అబద్దం ఉంటుంది “
అంటూ ఉదయం చూసిన పాత సినిమాలో పద్యంలా అర్థం కాకుండా చెప్పాడు..

 

” ఇప్పుడు శ్రీ మంజునాథ సినిమాలో అర్జున్ లాగ నేనూ అదే తప్పు చేయడం కంటే తనకి సహకరించడం మంచిదని మనసులో అనుకుని, ఇప్పుడు ఏం కావాలి నీకు” అని అడిగా..

 

” హలో ఇదేంటీ, నేను అడగాల్సిన మాట అడుగుతున్నావ్, ముందు నీకేం కావాలో చెప్పు” అన్నాడు..

 

” కొన్ని సందేహాలకు సమాధానాలు కావాలి చెప్తావా?”

 

” తప్పకుండా చెప్తాను, కానీ తేరగా దొరికాను కాదా అని కోడి ముందా? గుడ్డు ముందా? భూమి గుండ్రంగా, ఆకాశం నీలంగా ఎందుకున్నాయ్ లాంటి వ్యర్థ ప్రశ్నలు అడిగితే ఫోన్ పెట్టేస్తా ముందే చెప్తున్నా..”

 

” సరే, మంచి ప్రశ్నలే అడుగుతా.. ముందుగా ఒకేసారి రెండు ప్రశ్నలు..!
1. అసలు మీకోసం ఈ ఉపవాసాలు ఎందుకు చేయాలి
2. పైగా ఉపవాసం చేస్తే పుణ్యం అంటారు, అదెలా.? ” రెండిటికీ చెప్పండి ప్లీజ్

 

” నేను మొదటి ప్రశ్నకి మాత్రమే చెప్తా, కానీ నీకు రెండో సందేహం కూడా తీరిపోతుంది..
ఈ ఉపవాసాలు మాకోసం కాదు..మీకోసమే ! “

 

” అదెలా..??”

 

” పేదవాడి పొట్ట అర్థం కావడానికి, ఈ దేశంలో 30% మందికే కార్లు ఉంటే, మిగిలిన 70% మంది కోరుకుంటారు, అది దొరక్క పోయినా పెద్ద నష్టం లేదు..
60% మందికి మాత్రమే బైకులు ఉంటే మిగిలిన 40% మందికి పెద్ద అవసరం లేదు..
కానీ 80% మాత్రమే తిండి ఉంది, అంటే ఆ 20% కూడా మందికి అది చాలా అవసరం..
మీరు పని మీద వెళ్తున్నపుడు చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు భిక్షాటన లో మీకు కనపడితే చాలా సార్లు చూడనట్లుగానే వెళ్ళిపోతారు, అక్కడ జేబు నుండి రూపాయి తీసి ఇవ్వడానికి పట్టే ఆ 10 సెకన్లు కూడ సమయం లేనంత బిజీ అయితే కాదూ అని మీ మనస్సాక్షికి కూడా తెలుసు, కానీ ఎందుకో అలా వెళ్ళిపోతాం..
కారణం మనం టైం చూసుకుని కాకుండా నిజంగా ఆకలి చూసుకుని తినే రోజులు లేవ్ ఇప్పుడు..
అందుకే ఈ ఉపవాసాలు..
ఈరోజు మధ్యాహ్నం నిన్ను ఎవరైనా బిక్ష అడిగితే రూపాయి కాదు, ఆస్తిలో వాటా ఇచ్చే వాడివి..
ఇక పుణ్యం ఎలా వస్తుంది అనే నీ రెండో సందేహం కూడా తీరింది అనుకుంటా..”

 

” నిస్సందేహంగా, కానీ ఒక మాట.! అసలు నువ్వు ఈ ఆకలి అనేదే లేకుండా తీసివేస్తే ఇంకా బెటర్ కదా..”

 

” ఆకలి అనే పదం లేకపోతే మీరందరూ దేవుళ్లు అయినా అవుతారు, లేదా రాక్షసులు అయినా అవుతారు, మనుషులు మాత్రం కారు “

 

” స్వామీ! పక్కింట్లో వాళ్ళు లేస్తారు అని ఆలోచిస్తున్నా గానీ లేకపోతే ఈల కొట్టేసే వాడ్ని, క్యా బాత్ హై ..!!
కానీ.. మీరు దేవుడు కాబట్టి అలా మాట్లాడుతున్నారు గానీ మనిషి అయ్యుంటే తెలిసేది ఆకలి ”

 

” మీ మనుషులకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికే కదయ్యా.. పది సార్లు మనిషిలా పుట్టాను “

 

” ఆ పుట్టావ్ లే..దశరథ మహారాజు కొడుకుగా, అందులోనూ నీకు ముగ్గురు తల్లులు, ఇక నీకేం లోటు..?? ”

 

” ఆ తర్వాత జన్మలో జైల్లో పుట్టా కదయ్యా.. యశోదమ్మ అనే మారు తల్లి దగ్గర కూడా పెరిగా “

 

” నిజం చెప్పు.. నువ్వు దేవుడివి కాబట్టి రావణాసరుడి లాంటి శక్తి వంతున్ని చంపావ్..ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం మేము చంపగలమా..!? ”

 

” ఆ తర్వాత జన్మలో ఆయుధం కూడా పట్టకుండా అయిదు మందితో అంత పెద్ద సైన్యాన్ని గెలిపించా కదా “

 

” ఆ గెలుస్తారు.. అవతల ఎంత సైన్యం ఉంటే ఏంటీ.? ఇవతల నువ్వు అవతార పురుషుడివి మరి..”

 

” ఆ యుద్ధంలో నేను వాళ్లకి కనపడింది అవతార పురుషుడి గా కాదు, ఆత్మ విశ్వాసం గా..అది ఉంటే మీరు కూడా ఎంత పెద్ద సైన్యం (కాంపిటీషన్) మీద అయినా గెలవచ్చు..

 

” నిజమే కానీ, అది మీ కాలంలో.. ఇప్పుడు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు ”

 

” ఈ కాలంలో కూడా అలా గెలిచిన వారు ఉన్నారు కదా, మీ దౌర్భాగ్యం ఏమిటంటే వాళ్ళు పక్కన ఉన్నపుడు ఎగతాళి చేస్తారు, గెలిచాక ఫోటో పెట్టుకుంటారు.. వాళ్ళూ మనుషులేనయ్యా.. “

 

” నిజమే.. కానీ…”

 

” ఏయ్..ఆపు.. ఏంటీ అన్నిటికీ కానీ..కానీ..కానీ..

 

మొదట నేను దేవుడిని కాబట్టి గెలిచా అన్నావ్.. మనిషిగా ఉన్నపుడు గెలిచా అన్నాక..

 

మీ కాలంలో కాబట్టి గెలిచారు అన్నావ్.. ఈ కాలంలో కూడా గెలుస్తారు అన్నాక..
మళ్ళీ కానీ.. అంటున్నావ్..ఇక నీ సమయం అయిపోయింది..
ఆఖరిగా ఏదైనా ఒక్కటే చెప్పు “

 

” ఏ పని అయినా మొదలు పెట్టినపుడు సులభంగా ఉంటుంది, నిదానంగా కష్టం అవుతుంది.. సక్సెస్ కి దగ్గర అయినప్పుడు ఇంకా కష్టం అవుతుంది..నా వ్యక్తిగత జీవితంలో ఉన్న సమయంలో సగం ఇక్కడే పోతుంది, అసలు నాకు ఈ సక్సెస్ అవసరమా అనుకునేంత.. ” అందుకే కొన్ని మొదలు పెట్టలేను, కొన్ని మధ్యలో ఆపేస్తాను..ఇప్పుడు చెప్పండి ”

 

” ప్రతి తల్లి కడుపులో మొదట బీజం పడినపుడు ఏ నొప్పి ఉండదు..
పిండం పెరిగే కొద్దీ బరువు పెరుగుతుంది, అది పెరిగీ పెరిగీ తనలో ఒక భాగం అవుతుంది, తన వ్యక్తిగత తిండిలో సగం పిండానికే పోతుంది. ఇక డెలివరీ అయ్యేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, ఎంత అంటే అసలు నాకు ఈ బిడ్డ అవసరమా అనేంత.. కానీ ఆ చివరి క్షణం ఓర్చుకున్నాక ఒక కొత్త అద్బుతం జరుగుతుంది,అదే నువ్వైనా.. నేనైనా..” ఇక నీ ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటా చివరగా ఒక్క మాట ఈ ప్రశ్నకు వేరే ఉదాహరణ అయినా చెప్పి ఉండొచ్చు, కానీ ఈ ఉపవాసంతో నిన్ను నాకు దగ్గర చేసిన మీ అమ్మకి కృతజ్ఞత కోసం ఇలా చెప్పా..

 

ఆ మాట అయిపోగానే కాల్ కట్ అయిపోయింది.. అంతా నిశ్శబ్ధం.. నోటి నుండి మాట రాలేదు.. ఒక్క క్షణం కళ్ళు తెరిచేసరికి రాత్రి పడుకున్న దగ్గరే ఉన్నా..
అప్పుడు అర్థం అయింది..ఉపవాసం చేసి మనస్ఫూర్తిగా అకలితో తిన్న నేను మనస్ఫూర్తిగా పడుకున్నా అని..
 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,