These Musings Of A Little Girl Who is Stuck In A Bore Well Will Convey Many Unfair Scenarios Happening In Our Society

Contributed By Rakesh Kumar Reddy Gudisa
పసి అడుగులు వేసే ఆ చిన్న ప్రాణం,
అడుగులు తడబడి, కాలు జారి
కానరానంత లోతుకు దిగబడిపోయి,
ఊపిరాడక మట్టిపెళ్ళల మధ్య మూలుగుతూ…
ఎక్కడున్నాడో తెలియక,
తను చిక్కుకున్నది ఊపిరిని కూడా లోపలికి రానివ్వకుండా
కమ్ముకున్న కారు చీకట్లో అని
తెలుసుకునేంత ఈడు లేని ఆ చిన్నోడు
ఏడుస్తూ అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ…
“అమ్మ, నేను ఏడుస్తుంటే తానెక్కడున్నా పరుగున వచ్చేసేది,
మరెందుకో ఈసారి ఎంత పిలిచినా పలకట్లేదు.
వినిపించలేదేమో, ఇంకాస్త గట్టిగా పిలుదామనుకున్నా
ఊపిరి అందక గొంతు కూడా ఆడట్లేదు.
ఊపిరి ఆగేలోపు నాకు ఊపిరిపోసిన అమ్మ వచ్చి మళ్ళీ ఊపిరి పోస్తే బాగుండు!
అమ్మా, నేను ఇళ్లంతా పరుగెడుతున్నా వెంట పడి మరీ గోరుముద్దలు తినిపించేదానివి,
ఇప్పుడు నేను వేలు కూడా కలిపేందుకు అవకాశం లేక ఇక్కడే ఇరుక్కుపోయా,
ఆకలేస్తుంది వచ్చి తినిపించవ అమ్మా..!!
అమ్మ ఎంత పిలిచినా పలకట్లేదు అంటే ఏదైన పనిలో ఉందేమో..!!
పోనీ నాన్నను పిలుద్దామా…
అమ్మో నాన్న, ఎందుకు వెళ్ళావురా అంత లోపలికి అని అరుస్తాడేమో!
కానీ, నాన్న నిజంగా నా తప్పేం లేదు నాన్న.
గొంతెండిపోయి దప్పికతో నోరు తెరిచి ఆశగా ఎదురుచూస్తున్న ఈ బోరుబావి,
బహుశా నా రక్తంతో దాహాన్ని తీర్చుకోవాలని అనుకుందేమో..!!
అందుకే అమాంతం నన్ను మింగేసింది.
ఇంకెప్పుడు నీకు చెప్పకుండా బయటకు వెళ్ళను నాన్న.
భయమేస్తుందంటే నీ భుజాల పైకి ఎక్కించుకొని ప్రపంచానికి
నేనే రాజు, నేను భయపడకూడదు అంటూ ధైర్యాన్ని చెప్పేవాడివి కదా,
మరి ఇప్పుడు నీ భుజాలపై నన్ను ఎక్కించుకొని నన్ను బయటకు తీసుకోపో నాన్న..!!”
అంటూ విలపిస్తున్న ఆ కేకలను వినెదెవరు?
ఆ కుటుంబం కోతను కనెదెవరు??
గంగమ్మ కోసం గుంత తవ్వి
తను అనుగ్రహించలేదనే ఆగ్రహంతో ఆ గుంతను అలానే వదిలి…
ఆయువు తీరాక, ఆరడుగుల గోతిలోకి వెళ్లాల్సిన ఓ ప్రాణాన్ని…
ఆయువు తీరక ముందే వందల అడుగుల గుంతలోకి పంపి ప్రాణం తీసేస్తున్నాము..!!
ఈ తప్పెవరిది ??
If you wish to contribute, mail us at admin@chaibisket.com