A Word To ‘The Genius Online Reviewers’ From A Hardcore Telugu Movie Devotee!

 

బాధకి – నొప్పికి, శోకానికి – ఏడుపుకి, శృంగారినికి – సంభోగానికి, దృష్టికి – చూపుకి, ప్రేమకి – కామానికి, కాలానికి – గడియారానికి, సమీక్షకి – అభిప్రాయానికి …. ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష తెలుగు పదాలకు తేడా తెలీని పిచ్చి కొత్తిమీర గాళ్ళు కూడా తెలుగు సాహిత్యాన్ని సమీక్షించేస్తుంటారు. ముఖ్యంగా సినిమా సాహిత్యాన్ని విమర్శించే వాళ్ళు వాన చుక్కల్లా లెక్కలేనంతమంది. “కూరొండటం రాపోతే కూర బాలేదని చెప్పకూడదా, కమోడ్ క్లీన్ చేయడం రాపోతే రెంటికి వెళ్లకూడదా ఏందీ! అంటూ ” తొక్కలో సమర్ధనలొకటి మళ్ళీ ఈ బొంగుపేలాల గాళ్ళకి. ‘ల’-‘ళ’, ‘జ’-‘ఝ’… దేని ఉచ్ఛరణ ఎలా పలకాలో తెలీని పులిసిన పరోటా గాళ్ళు కూడా, తెలుగు లో ఇలా అలా అంటూ ఉచిత సలహాలు ఇచ్చేస్తుంటారు.

 

ఏంటి బాబాయ్! సమస్య, సందర్భం చెప్పకుండా సునామీలా విరుచుకుపడుతున్నావ్…ఎవరి మీదో, ఏంటో కాస్తా స్పష్టతివ్వచ్చు గా అంటారా… ఏం లేదు గురు! ఈ సామాజిక అనుసంధాన వేదికలున్నాయే అవి మన అభిప్రాయాలు, ఆలోచనలు, ఆవేదనలు, అభ్యుదయాలు, సొల్లు, మట్టి…ఇలా ప్రతీది చెప్పుకునే అవకాశం, అధికారం మనందరికి ఇచ్చింది. ఐతే, కొంతమంది ‘అండపిండబ్రహ్మాండా ఉద్దండ పండితులు'(వాళ్ళకి వాళ్ళు అలా అభిప్రాయపడతారో లేక అంతకు మించో ఏమో!) స్థాయి, అర్హత, విచక్షణ, అనుభవం లెక్కపెట్టకుండా విచ్చలవిడిగా విమర్శలు చేసేస్తుంటారు. మార్స్ రోవర్ నుండి మూసి నదిలో కంపు వరకు ప్రతీ విషయం పై ఏదొక వ్యాఖ్య(కామెంట్) వదిలిపడేస్తారు.

 

సూది గుచ్చడం రానోడు Open Heart Surgery మీద విమర్శపెడితే ఎట్టా ఉంటది ? స్కేల్ తో తిన్నగా ఓ రేఖ గియ్యలేనోడు ఈఫిల్ టవర్ నిర్మాణాన్ని సమీక్షిస్తే ఎట్టా ఉంటది ? సైకిల్ తొక్కడం రానోడు F1 Racer కి సలహాలు ఇస్తే ఎట్టా ఉంటది ? 50 పెట్టి పాటల సీడీ, 100 పెట్టి బాల్కనీ టికెట్ కొని సినిమా గురించి చేతికొచ్చినట్టు పోస్ట్-లు పెడితే అచ్చం అట్టే ఉంటది. నీకు సినిమా/పాటలు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, ఎందుకు నచ్చలేదో ఓ పెద్ద వ్యాసం రాసుకో అంతే కానీ ఇలా తీసుండాలి, అలా రాసుండాలి, పాటలు బాలేవు, సాహిత్యం సప్పగా ఉంది లాంటి సొల్లు సలహాలు ఇయ్యమాక. సమీక్షలు, విమర్శలు రాసే వాళ్ళని అనే అధికారం, అర్హత, స్థాయి నాకుందో లేదో తెలీదు కాని తెలుగు భాషంటే అభిమానాన్నేస్థాయిగా, తెలుగు సాహిత్యం మీద గౌరవమే అధికారంగా, తెలుగు సినిమా మీద ప్రేమే అర్హతగా భావించి ఓ మాట చెప్పాలనిపిస్తుంది.

 

“ఇదిగో బాబాయ్… నువ్ చదువుతున్నావ్ అని తెలుసు. నీకు ఎప్పటికీ అర్ధం అవ్వదని తెలుసు. కానీ… విమర్శించే ముందు, సమీక్షించే ముందు ఒక్కసారి నిన్ను నువ్వుపరీక్షించుకో, నువ్వు సమీక్షించగల సమర్ధుడవేనా ? ఓ పాటలో సంగీతాన్ని విమర్శించే ముందు ఓ రాగాన్ని సృష్టించడంలో ఉన్న కష్టాలు తెలుసుకో, ఓ పాటలో సాహిత్యాన్ని సమీక్షించే ముందు ఆ పల్లవి లో మొదటి లైన్ రాయడానికి ఆ కవి ఎంత తపన, ఎంత మానసిక ఒత్తిడికి లోనయ్యాడో ప్రయత్నం చేసి అనుభవించు, ఓ కథని రొట్ట అనేముందు పిట్టకథ ఒకటి రాయడానికి ప్రయత్నించు, ఓ దర్శకుడి కళని అవమానించే ముందు ఒక్క సన్నివేశాన్ని ఊహించే సాహసం చేసి చూడు. అప్పుడు నీకే తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నచ్చలేదని చెప్పడం – తప్పులు ఎత్తిచూపడం తప్పు కాదు, విమర్శించడం తప్పు. ఏంటి తేడా? అంటావా… పెళ్ళికి ముందు ప్రేమకి, పెళ్ళి తర్వాత ప్రేమకి ఉన్నంత.”

 

ఈ article ని మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న అలాంటి ‘అండపిండబ్రహ్మాండ ఉద్దండ పండితులు’ అందరికీ షేర్, టాగ్, పోస్ట్, వాట్సాప్ ఏది కుదిరితే అది చెయ్యండి.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , ,