ములుగు ప్రాంతానికి చెందిన విఘ్నేశ్వరి చిన్నప్పుడే పోలియో వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయి.. నోటి మాట సరిగా రాదు, అయిన మొక్కవోని ధైర్యంతో ట్రై సైకిల్ సహాయంతో పాఠశాలకు వెళ్ళి చదువుకుంటుంది. విఘ్నేశ్వరికి మరింత అండ కావాలన్న ఉద్దేశ్యంతో పూర్తి బాధ్యతలు తస్లీమా గారు తీసుకుంటూ పుట్టిన రోజు సందర్భంగా వైకల్యం కుదుటపడి సంపూర్ణ ఆయురారోగ్యలతో సిద్ధించాలని శివాలయంలో ఘనంగా పూజలు జరిపించారు.
రాజేశ్వరరావుపల్లి గ్రామంలో ఇటీవల నిరుపేద యాదవ కులానికి చెందిన ఒజ్జల రవి మృతి చెందగా ఆతని కుటుంబాన్ని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా గారు పరామర్శించి అతని ఇద్దరు చిన్న పిల్లలను చూసి చలించిపోయి అతని భార్య మమతను ఓదార్చి రూ.5000 ఆర్ధిక సహాయం అందించి ఆ కుటుంబాన్ని తన వంతుగా అన్ని విధాలా ఆదుకుంటామని అభయమిచ్చారు..
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ప్రతి రోజు ఒక మాట సహాయం కావచ్చు, ఆర్ధిక సహాయం కావచ్చు, లేదంటే నేను ఉన్నాను అనే రేపటి కోసం ధైర్యం కలిగించడం కావచ్చు, ఏ ఆపదలోనైనా ములుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా గారు ముందుకు వస్తారు. ఒక సబ్ రిజిస్ట్రార్ గారు తలుచుకుంటే ఇన్ని పనులు చెయ్యొచ్చు.. అనే తపన వారికి ఏమాత్రమూ లేదు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉండే హృదయం వారిది, దాని మూలంగానే తెలంగాణ రాష్ట్రమంతటిలో ఒక విశిష్టమైన అధికారిగా ప్రత్యేకతను చాటుతున్నారు.
ములుగు జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన ఫాతిమా, సర్వర్ ల నాలుగో సంతానంగా తస్లీమా గారు కలిగారు. తస్లీమా గారు ఈ భూమి మీదకు వచ్చిన రెండు సంవత్సరాలలోనే నాన్న గారు చనిపోయారు. అమ్మ ఫాతిమా గారు ఊహకుమించిన కష్టాలతో పిల్లలను చదివించి ప్రయోజికులను చేశారు. తస్లీమా గారు కూడా అమ్మ కష్టాన్ని గౌరవించి చిన్నతనం నుండి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో చదువుకుని గ్రూప్ 2 స్థాయి ఉద్యోగం పొందారు, ప్రస్తుతం ఏ జిల్లాలో ఐతే చదువుకోవడానికి కష్టాలు అనుభవించారో అదే జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు.
కోవిడ్19 లాక్ డౌన్ నేపథ్యంలో.. జిల్లాలో వివిధ ప్రాంతాలలో విస్తృతంగా తిరుగుతూ కోవిడ్19 ను ఎదుర్కోవడానికి మాస్కుల పంపిణీ, అవేర్ నెస్ కార్యక్రమాలతో పాటుగా ఎంతోమంది ఆకలిని కూడా తీరుస్తున్నారు. దేశమంతటా రోడ్డుకిరువైపుల వలస కార్మికులు ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ సిద్దిపేట జిల్లా నుండి ఛతీస్ ఘడ్ కు చెందిన వలస కార్మికులు కాలినడకన సొంత ఊరికి వెళ్ళడానికి పయనమయ్యారు. ఐతే సరైన మార్గం తెలియక 130 కిలోమీటర్లు అదనంగా నడిచి దరితప్పిపోయారు. వారిని చేరదీసిన ఫాతిమా గారు ప్రత్యేకంగా వంటలు వండించి భోజనాలు ఏర్పాటుచేశారు. మీరు ఈపాటికే గమనించి ఉంటారు మాజీ నక్సలైట్ ఎమ్మెల్యే సితక్క గారితో తస్లీమా గారు చేస్తున్న సేవా కార్యక్రమాలను.. ములుగు జిల్లా పేనుగోలు గ్రామం సుమారు 20 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. ఈ 20 కిలోమీటర్ల వరకు రోడ్డు మార్గం ఉండదు, దాదాపు ఐదు గుట్టలు వాగులు దాటుకుంటూ పోతే తప్ప ఆ గ్రామానికి చేరుకోలేరు, అలాంటి గ్రామానికి సీతక్క గారితో కలిసి కిలోల బరువు గల ఆహారం ఎత్తుకుని నడిచి, అక్కడి గ్రామస్థుల ఆకలిని తీర్చగలిగారు.
Information source: Social Media