"నేను తెలుగువాడ్ని మహాప్రభో, అడ్రెస్ తెలియడం లేదు ఎవరికైన తెలిస్తే కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి నాయనో".. అని ఎక్కడ మొత్తుకున్న "ఓహ్ మీరు తెలుగువారేనా, దారి తప్పి పోయారా".. అని ఆత్మీయంగా సాటి తెలుగువాడు మనల్ని పలుకరిస్తాడు. తెలుగువాడు ప్రపంచమంతా తిరుగుతున్నాడు ఉన్నాడు.. కొంతమంది వారి పూర్వీకుల నుండి జన్మభూమిని, భాషను గుర్తుపెట్టుకుని వారసత్వ సంపదగా వారి పిల్లలకు అందిస్తే మరికొందరు కాలంతో పోటీపడలేక విస్మరించిపోయారు. విదేశాలలో ఉన్న తెలుగువారందరు ఒకవైపు ఇదిగో మారిషస్ ఉన్న తెలుగువారు మరోవైపు..
మారిషస్ వైశాల్యం పూర్తిగా 2040కి.మీ, దాదాపు 12లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ దేశంలో మన తెలుగువారు 30,000 వరకు ఉన్నారు. ఇక్కడికి వారి రాక 1835వ సంవత్సరంలోనే ప్రారంభమయ్యింది. మారిషస్ లో వ్యవసాయ కూలీలుగా పనిచేయడం కోసం వెంకటపతి, అప్పయ్య, కిష్టమ్ అనే ముగ్గురు తెలుగువారు ఇక్కడ మొదటిసారి అడుగుపెట్టారు. ఆ తర్వాతి సంవత్సరం మరో 30 మంది, ఆ తర్వాతి కాలంలో మరో రెండువందల మంది ఇక్కడికి చేరుకున్నారు. కాకినాడ కోరంగి రేవు నుండి రావడం వల్ల వీళ్ళని మొదటి "కోరంగి వాళ్ళు" అని పిలిచేవారు. నాడు తెలుగువారు తక్కువమంది ఉన్నా కాని ఒక కుటుంబంలా ఉంటూ తెలుగు భాషను, సంస్కృతి, సాంప్రదాయాలను ఆచరిస్తూ తెలుగు నేల పై ఉన్నట్టుగానే జీవిస్తున్నారు.
మారిషస్ లో క్రియోల్ భాష మాట్లాడుతారు ఐనా గాని తెలుగును నిర్లక్ష్యం చూపించరు, ఎంతో గౌరవంతో దైవంలా తెలుగుభాషను నేర్చుకుంటారు, మాట్లాడుతారు కూడా. రాను రాను మారిషస్ లో తెలుగువారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వాలు కూడా తెలుగు భాషకు, సంస్కృతికి ప్రాధాన్యతను ఇవ్వడం మొదలుపెట్టాయి. మీకో విషయం తెలుసా మారిషస్ లో మనం శిశు తరగతి నుండి యూనివర్సిటీ విద్య వరకు తెలుగు మాధ్యమంలోనే హాయిగా చదువుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. తెలుగులోనే ప్రత్యేకంగా డిగ్రీ, డిప్లొమో పూర్తిచేసుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా అధికం.
తెలుగు నేలపై ఉన్న లోపాలలో మారిషస్ లో లేని మరో లోపమే "కులం". అవును ఇక్కడ తెలుగువారికి ఏ కులం ఉండదు.. కులాలు లేకపోవడంతో వారందరిలో ఐక్యత ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. తెలుగునేలపై పుట్టిన కూచిపూడి నాట్యాన్ని వీరు నేర్చుకుంటారు, ఆత్మీయ కలయికలో కూచిపూడి నాట్యం తప్పక ఉండాల్సిందే.
ఒక్కసారి వీరి మాటలను వినండి. ఉచ్చారణ, భావానికి తగ్గ ముఖ కవలికలు ఎంత స్పష్టంగా పలుకుతున్నారో..
Source: BBC Telugu