ఒక వ్యక్తిగా కన్నా సమూహానికి ఉండే శక్తి అధికం.. దీనిని గుర్తించి జహీరాబాద్ కు చెందిన 30 మంది కోడళ్లు కలిసి 'సంఘం ఆర్గానిక్స్' అనే గ్రూప్ గా ఫామ్ అయ్యి 42 రకాల పిండి వంటలు తయారు చేసి అమ్ముతున్నారు. ఇందులో ఉపయోగించే ఆహారపదార్ధాలన్ని కూడా ఆర్గానిక్ గా పండించినవే. ప్రతి ఒక్క వ్యక్తికి Financial Independence చాలా ముఖ్యం. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఒక ఇంటికి కోడలిగే వెళ్లే మహిళకు మరీ ముఖ్యం. వారు చదువుకున్నారా.? లేదా అని కాకుండా ఎవరి సామర్ధ్యానికి తగినట్టుగా వారు పని ద్వారా డబ్బు సంపాదించుకుంటే ఆ మహిళకు కొండంత ఆత్మవిశ్వాసం, సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందనడానికి వీరి విజయ ప్రయాణం ఒక ఉదాహరణ.
ఇక్కడ పనిచేసే మహిళలందరు చిన్న, సన్నకారు రైతులు వీరికి ఎకరం, లేదంటే అంతకన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉంది. వీరికున్న మరో గొప్ప లక్షణం ఏమంటే.. ఒక్క ఎకరంలోనే 30 రకాల పంట పండిస్తారు. ఇంటి అవసరాలకు సరిపడా ఆహారపదార్ధాలన్ని ఇందులోనే పండిస్తారు.. వరి, కూరగాయలు, మసాలా దినుసులు, పప్పులు, నూనె, ఇలా ఒక్క ఉప్పు తప్ప అన్నింటినీ వారి పొలం ద్వారానే పొందుతున్నారు. జహీరాబాద్ పట్టణంలోనే వీరి కిచెన్ రన్ అవుతుంది. తయారుచేసిన ఫుడ్ ఐటమ్స్ ను హైదరాబాద్ లోని బేగంపేట 'డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ' కేంద్రానికి తీసుకువచ్చి అమ్ముతుండడం వల్ల ఆశించిన లాభాలను పొందుతున్నారు. మన పండుగలకు చేసే పిండివంటలు, కేక్స్, మిల్లెట్స్ తో చేసిన కుకీస్, మిక్సర్స్, అప్పడాలు, చిల్లీ హల్దీ పౌడర్ ఇలా 42 రకాల నాణ్యమైన ఫుడ్ ఐటమ్స్ తయారుచేస్తున్నారు.
సంగారెడ్డిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలు అనేమియాతో బాధపడుతూ ఉండేవారు. అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్ గారి ప్రోత్సాహంతో 'సంఘం ఆర్గానిక్స్' నుండి పోషక విలువలతో కూడిన కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అక్కడికి మూడు నెలల పాటు అందించారు. మెడిసన్ ట్రీట్మెంట్ తో పాటు, వీరు పంపిన ఫుడ్ ఐటమ్స్ ఆ పిల్లలకు ఎంతోగానో హెల్ప్ చేసింది, వారందరూ మళ్ళీ ఆరోగ్యవంతులు అయ్యారు. ఆర్గానిక్ ఇండియా కౌన్సిల్ నుండి ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నిటికీ PGS ఆర్గానిక్ సర్టిఫికెట్ లభించడం వల్ల వీరి ప్రోడక్ట్స్ గురించి ఇంకో ఆలోచన అవసరం ఉండదు..
సంఘం ఆర్గానిక్స్ లో పనిచేస్తున్న మొగులమ్మ అనే మహిళకు పిల్లలు కలిగిన తర్వాత భర్త చనిపోయారు. ఏమి చెయ్యాలో తెలియని దిక్కుతోచని పరిస్థితులలో కొందరి మంచి వ్యక్తుల ప్రోత్సాహంతో ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యారు. డబ్బు సంపాదిస్తూ పిల్లలను పోషించుకోవడమే కాకుండా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా UN అవార్డుతో పాటు, నారిశక్తి పురస్కారాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా కూడా అందుకున్నారు. భర్త తాగి వచ్చి ఇంట్లో భార్యను ఇబ్బంది పెట్టడం, ఆర్ధిక అవసరాల మూలంగా పిల్లల చదువులకు ఇబ్బందిపడడం, ఇలాంటి కష్టాలు ఇక్కడి మహిళలపై ఇంతకు మునుపు ఉండేది, కానీ ఎప్పుడైతే సంపాదించడం మొదలయ్యిందో అప్పుడే ఇంటి వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది.
మీకు కూడా వీరి ప్రోడక్ట్స్ కావాలనుకుంటే: 040 2776 4577. Information Source: Bhargavi garu. Image Source: Shyam Mohan garu.