This Book Describing The Beauty Of Simplicity & The Crazy Story Behind It’s Author Is A Must Read

 

మోహమాటమనో నేను పెద్దవాడినయ్యాననో అని ఆపకుండా మళ్ళీ కూని రాగాలు తీయ్యండి, ఇష్టమైన వ్యక్తుల దగ్గర అలగండి, అన్నీ గమనించండి, అపరిచితులను కూడా ఆత్మీయంగా బాబాయ్ గారనో, పిన్ని గారనో బందువుల్లానే పలుకరించండి. నచ్చిన పని చేస్తూ భూమికి ప్రకృతికి దగ్గరగా బ్రతకండని కందుకూరి రమేష్ బాబు గారు చెబుతూ ఉంటారు. ఈ “సాధారణ మాటలు” కూడా ఎందరో సామాన్యులతో కలిసి జీవించడం వల్లనే. జర్నలిస్ట్ గా, ఫోటోగ్రాఫర్ గా రమేష్ గారు ఏ పని చేసినా ఆయన హీరో ‘సామాన్యుడు’. సమాజంలో ఎన్ని గౌరవాలు అందుకున్నా, లేదంటే కటిక పేదరికంలో ఉన్నా అతనికి అవ్వేమి పట్టవు, సామాన్యుడు ఐతే చాలు. సామాన్యుడే అతని హీరో.

 

మీరు సామాన్యులు కావడం ఎలా?” పుస్తకం ఉందాండి.?
‘మీరు సామాన్యులు కారు’ అనే బుక్ ఉంది,
‘మీరు అసామాన్యులు కావడం ఎలా’ అనే బుక్ ఉంది.
‘మీరు చెప్తున్న పుస్తకం మాత్రం తెలియదు.’

హైదరాబాద్ లో కందుకూరి రమేష్ బాబు గారి పుస్తకం కోసం వెతకని షాప్ లేదు. ఆఖరికి అబిడ్స్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కూడా ట్రై చేశా. ఎక్కడ వెతికినా కానీ నా చేతికి చిక్కదే. అన్ని దార్లలో నడిచాను.. ఇలా నడుస్తూ నడుస్తూ చివరికి మూల విరాట్ నే కలవగలిగాను.


 

రమేష్ గారి నవ్వు సామాన్యమైనది, పలకరింపు మనల్ని డామినేట్ చెయ్యదు. అతను కూర్చునే కుర్చీ మనకు వేసే కుర్చీ ఒకేరకమైనవి. మెడలో కెమెరా వేసుకొని ఫ్లైట్ లో కూర్చుని ఎక్కడికో ఆయన వెళ్ళరు. హాయిగా బస్సులో కూర్చుని, బస్సు ఉయ్యాలలో మధ్య మధ్యలో నిద్రపోతూ పల్లెకు వెళ్తారు. మనకోసం ఆహారం తయారుచేస్తున్న పంటపొలాలకు వెళ్లారు. వాళ్ళింటికి వెళ్లి, వాళ్ళతో పనులు చేస్తూ మాట్లాడతారు. రోడ్డు పక్కన అరటి పళ్ళాయన, కొబ్బరి బొండాలాయన కనిపిస్తే ఆయన ఫోటోలు తీస్తారు. వారితో మాట్లాడతారు. ఈ ప్రయాణంలో అతను ఎందరో సామాన్యులను కలిశారు. సామాన్యుల జీవన శైలి వారి ఉదాహరణలు మనకు చెబుతూ మన బలుపు తీసి మనల్ని అతి సామాన్యుడిగా మలుచగలుగుతున్నారు.


 

1.

ఆ మనిషి శుభ్రంగా ఉంటాడు చురుగ్గా ఉంటాడు. మనం ఊహించిన దానికన్నా అతడి వయస్సు తక్కువే. అతడికి పెంపుడు జంతువు ఉంటుంది. అతడి వలే ఆ పెంపుడు జంతువు కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది.


 

2.

తాను మాట్లాడితే మాటనే. వింటే వినికిడే. ఏదైనా నూటికి నూరు శాతం. ప్రార్ధన చేస్తే ప్రార్ధనే. భగవంతుడు ప్రత్యక్షమైనా, ప్రార్ధన పూర్తయ్యాక దర్శనం చేసుకోవలసిందే! అంత పూర్తి మనిషి తాను.


 

3.

తన ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా వుండే మనిషి. పరుల ఆస్తులను నిర్భయంగా సద్వినియోగం చేయడానికి వెనుకాడని మనిషి. ప్రారంభంలోనే ముగింపు ఉంటుందని ఎరిగిన మనిషి కూడా.


 

4.

అతడికి స్పష్టమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటై. వాటిని అమలులో పెట్టడానికి అతను ఎంత మాత్రం వెనుకాడడు.
అతడు తన కష్టంతో దేన్నైనా అందంగా మలుచుకోగల స్థితిమంతుడు.
భవిషత్తు అంటే తన వ్యక్తిగత జీవిత సుఖసంతోషాలకు సంబంధించింది మాత్రమే కాదని తనకు తెలుసు.


 

5.

అతడి పని ఎంత సత్యంగా, సుందరంగా ఉంటుందీ అంటే అది ప్రకృతిలో భాగంగా, అబ్బురపాటుకు అసలే తావు లేకుండా అత్యంత సహజంగా ఉంటుంది. ఆత్మశాంతి, మానసిక ఔన్నత్యం, కృషి, దీక్ష – ఇవన్నీ అతడి సుగుణాలు.


 

6.

‘నేను సహాయం చేయనా?’ అని మీరు గనుక అడిగితే, ‘ఇది నా పని’ అని సున్నితంగా తిరస్కరించే మనిషి. ఎవరన్నా లేకపోయినా, ఎవరేమి అనుకున్నా కూడా తాను చేయదలుచుకున్న పనిని వంచన తల ఎత్తకుండా నిరాడంబరంగా చేసుకుంటూ పోతాడాయన.


 

7.

అతడు. నిరక్షరాస్యుడే కావచ్చు. కానీ, ప్రకృతిని అధ్యయనం చేస్తాడు. దేనికీ బద్ధుడై ఉండడు. ప్రకృతికి నిబద్ధుడై జీవిస్తాడు. అతడు జీవితాన్ని నిర్వచించే పొరబాటు చేయడు.


 

8.

అతడు మంచికి సంతోషిస్తాడు. చెడుకు బాధపడతాడు. నేను సర్వస్వతంత్రుడిని అన్న అహంభావం అతడికి ఏనాడు ఉండదు. బతుకు పొడవునా అంగీకారం తప్ప అతడికి జీవితాన్ని సాధించడం తెలియదు. అతడు అదృష్టం గురించి ఆలోచించడు. అది తన తలుపు తడుతుందని మాత్రం తెలుసు. తాను ఇబ్బందికరమైన పరిస్థితిల్లో పడితే ఎవరినీ వ్యక్తిగతంగా నిందించడు. తన ‘గాచారం’ బాగోలేదని ఊరుకుంటాడు.


 

9.

“బాగున్నారా”
‘బాగున్నానయ్య. మీ దయ’.

‘అంతా మంచిదేనా?’
‘మీ దయ’.

దయ! అవతలి వ్యక్తి దాయదక్షిణ్యాలపై ఆధారపడనప్పటికి ఓ మనిషి ‘మీ దయ’ అనడంలో ఎంతటి ఔదార్యం! జీవితానుభవం నుంచి వ్యక్తమయ్యేదే తప్పా తెచ్చిపెట్టుకున్నది కాదు. మోహమాటానికి పోయి చెప్పేది కూడా కాదు. నిజానికి ‘ ఈ దయ’ సాటి మనిషిని తృప్తి పరచడానికో, మచ్చిక చేసుకోవడానికో కాదు. ఇచ్చి పుచ్చుకోవడంలో ఇరువురి మధ్యా అత్యంత సహజంగా వ్యక్తమయ్యే ఒక సహానుభూతి. ఒకరితో ఒకరు తులతూగే పరిస్థితి ఉన్నా లేకపోయినా తగ్గి పెరిగే ఒక సహృదయత. ‘మీ దయ’ ఒక తులసీ దళం వలే మనిషిని అమాంతం తేలిక చేసే తులాభారం.


 

10.

అలిగిన వారందరికీ తెలుసు. అలకకు కారణం ఒక్కటి కాదని! అన్నీ కలిస్తే అలక. అన్నీ వీడితే అలక మాయం. దంపతుల మధ్యే కాదు, అది బాల్య స్నేహితుల మధ్య, బంధువుల మధ్య – మొత్తంగా మానవీయ అనుబంధాల్లో అలక నెరిపే అపారమైన బాంధవ్యం అపూర్వమైనది. మహాత్ముడు అహింసను ఆయుధంగా చేసుకున్నట్లుగా సామాన్యులు అలకను ఆయుధంగా చేసుకుని సాధించినవేమిటో లెక్కతీస్తే, జనసామాన్యం తన దైనందిన జీవితాన్ని సాఫీగా గడపడంలో ఎంత కఠినాత్ములుగా జీవించినారో, మనసును కష్టపెట్టుకుని కూడా జీవితాన్ని ఎలా సఫలం చేసుకున్నారో తెలిసి వస్తుంది. మనకు అంతుపట్టవుగానీ, జీవన వికాసంలో చాదస్తంగా అనిపించేవి నెరిపే ప్రయోజనం అపారం. అభినందించు, అలిగిన వారిని!


 

11.

ఎందుకో పాదాభివందనం అంటే ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. కాళ్ళు మొక్కడం అంటే తలవని తలంపు. ఏదో తలంపుగా ఉంటుంది. పెద్దలు చెబుతారు, కనీసం వయసుకైనా గౌరవం ఇవ్వమని! కానీ అమ్మనాన్నలు, అత్తమామలు, గురువులను తప్పించి మరొకరి ముందు ప్రణమిల్లడం కొందరికి కష్టమే! కానీ, వారికి తెలుసు. రెండు చేతులతో నమస్కరించడం అంటే అవతలి వాళ్లకు దాసోహం కావడం కాదని! భయభక్తులతో ప్రణమిల్లడం అంటే ఇవతలి వారి బలహీనత కాదు, బలోపేతం కావడం అని! పెద్ద మనుషులు మరి! వారికి తెలుసు. “తల వంచడం అంటే అవతల తలెత్తే అహంకారాన్ని సంహరించడమే అని”! మొకరిల్లడం అంటే అవతలి వ్యక్తిని సాధువు చేసే ప్రమానమే అని! ఇటు నుంచి అటు సామరస్యం. ప్రమాణం. అవతలి వారు మంచి చేయకపోయినా వారిలో చేడు భావన తలెత్తకుండా చేసే అద్భుత అనుష్టానం.


 

12.

సీక్రెట్ లైఫ్ గడిపే స్థోమత ఎవరికి అధికంగా ఉందో అతడే సామాన్యుడు. విశేషం ఏమిటంటే ఇదంతా తాను “నా స్వార్ధం” అన్న ప్రైవేట్ ఎఫైర్ ఉండదు. ఎవరితో నిమిత్తం లేకుండా తనకోసం తాను గడిపే అతడి జీవితం మనకు సీక్రెట్ లైఫ్.


 

13.

మనుషులు రెండు రకాలు..
‘శాంతితో స్థిరంగా ఉండేవాళ్ళు. అశాంతితో రగిలిపోయేవాళ్ళు’. మొదటి రకం వారు స్వయంగా పాట. రెండో రకం వారు పాడుతూనే ఉంటారు. వారి పాట పూర్తవ్వాలంటే సాధన మానేయడమే పరిష్కారం. నిజం. విజయం సాధించగలమో గానీ అశాంతితో జీవితాన్ని సాధించడం అసంభవం. – పూసవేర్లామే.


 

14.

‘నేను నా జీవికకు సరిపోయే పని వెతుక్కున్నాను. కానీ, అవతలి వాడి జీవికను దెబ్బ కొట్టే పని, అది ఎంత చిన్నదైనా సరే.. చేయను’. నాలాగే ఎంతో మంది విజ్ఞతతో ఉన్నారు. అందుకే మేం ఒక్కరం కాదు. ఒక్కరం ఇద్దరమై – పదుగురై, వందలు వేలై, లక్షలై ఇలాగే బతుకుతున్నాం’. ‘ఈ దేశంలో సామాన్యజనం నా వలే హాయిగా జీవిస్తున్నారు అంటే మేమంతా ఎవరి పరిధిలో వాళ్ళం బతకడం వల్లే’. -పాన్ షాప్ సామాన్యుడు.


 

15.

హైదరాబాద్ లోని ప్యారడైజ్ హోటల్ సమీపంలోని మార్వాడీ ధర్మశాల దగ్గర ఆమె అన్నం పెడుతుంది, చవగ్గా. ఆమె ఉదయమూ సాయంత్రమూ నడిపే ఆ వీధి హోటలే అక్కడి వందలాది మంది ఫుట్ పాత్ వాసులకు ప్యారడైజ్ హోటల్.

ఏడేళ్ల క్రితం సంగతి అది. ఆమె పై ఒక కథనం ప్రచురించాక తన మొబైల్ ఫోన్ కు ఒక కాల్ వచ్చింది. ‘నేను రాజశేఖర్ ని అమ్మా.. క్యాంప్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా’ అని! ‘ఏంది బిడ్డా’ అందామె. ‘ఒకసారి క్యాంపు ఆఫీసుకు వస్తావా? నీకేం కావాలో చెప్పు. చేసి పెడతా’ అన్నాడాయన. ఇటువైపు నుంచి ఇలా సమాధానం: ‘నాకేం పనుంది బిడ్డా. నేనెక్కడికీ రాను..’
‘అది కాదమ్మ. నేను సీఎం రాజశేఖర్ రెడ్డిని మాట్లాడుతున్నా..’
‘అయ్యో. నువ్వెందుకు తెల్వదు బిడ్డా. గుర్తు పట్టిన. కానీ, నాకు వందలాది బిడ్డలు. వాళ్ళను కాదని ఒక్కపూట పొయ్యి రాజేయకున్నా ఆకలితో నకనకలాడి పోతారు. సమయానికి వండి వడ్డిస్తేనే నాకు తృప్తి. అయినా నాకు కొడుకులున్నారు బిడ్డా. నాకే సహాయము అక్కర్లేదు.
ఆ తల్లి సున్నితంగా తిరస్కరించింది నిజమే. తమ పరిధిలో అవసరాలు తీర్చేవాళ్లకు పెద్ద అవసరాలేమి ఉంటాయి?
సామాన్యులు మరి! అడిగారు కదా అని అంగలార్చరు. సున్నితంగానే తిరస్కరిస్తారు.


 

16.

అంతెందుకు? అతడి వల్ల ఆ నేలకొక సార్ధకత ఏర్పడుతుంది. అతడితో కలిసి ఉండటంలో మనకు ఒక విధమైన శాంతి లభిస్తుంది. ఒక్క మాటలో అతడు సృష్టికర్త సందేశాలను మోసుకు వచ్చేవాడిలా కనిపిస్తాడు. వీటన్నిటికీ మించి ఆనందంగా జీవించడాన్ని కనుగొన్న మనిషి అతడే అని మనకు నిదానంగా తెలిసి వస్తుంది. చివరగా, అతడు ప్రశాంతంగా చనిపోతాడానే నమ్మకమూ మనకు కలుగుతుంది.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , ,