మన life ని Bus Stand తో compare చేస్తే? – A Short Story

 

Contributed by ManikantaReddy Gopu

 

అది చలికాలపు ఉదయం, మార్కాపురం బస్టాండు. ముందు రోజు రాత్రి కప్పిన మంచు పొర అలాగే ఉంది. సూర్యుడు బద్దకంగా కదులుతున్నాడు. బస్టాండు పక్కన చలి మంట వేసి చలి కాచుకుంటున్నారు కొంతమంది. స్ట్రీట్ లైటు ఇంకా వెలుగుతూనే ఉంది. కొన్ని బస్సులు పాయింట్ లోనూ, మిగతావి రాత్రి పార్క్ చేసిన ప్లేస్ లోనూ ఉన్నాయి. అప్పటికే బస్టాండు ప్రయాణికుల తో నిండిపోయింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు,ప్రభుత్వోద్యుగులు,కార్మికులు, చిరు వ్యాపారులు, సొంత ఊళ్ళకీ వెళ్ళేవాళ్ళు, వేరే ఊళ్ళకీ వెళ్ళేవాళ్ళు. కొంతమంది భుజాలకి బ్యాగులు, మరి కొంతమంది చేతుల్లో లంచ్ బాక్సులు,ఇంకొంతమంది చేతుల్లో లగేజీ, కొంతమంది కూడా బుట్టలు, పారలు, పనిముట్లు ఉన్నాయి. బస్టాండు కి ఎదురు గా చాలా దుకాణాలు, హోటళ్లు ఉన్నాయి. టీ కొట్టు దగ్గర కొంతమంది టీ తాగుతున్నారు, వారిలో డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఉన్నారు. టీ మాస్టర్ చేతులు ఏ మాత్రం ఖాళీ లేవు. ఒకతను చక్కెర ఎక్కువ వేయమంటున్నాడు, ఒకతను తక్కువ వేయమంటున్నాడు, ఇంకొకతనైతే అసలే వేయకుండా సుగర్ లెస్ టీ అడుగుతున్నాడు. వాళ్ళందరికీ కావలసిన విధంగా టీ చేసి ఇస్తున్నాడతను. పక్కనే ఉన్న బడ్డీ కొట్టు దగ్గర ఒకతను సిగరెట్ కొని, చిల్లర లేదని న్యూస్ పేపర్ కూడా తీసుకుంటున్నాడు. బస్టాండు లో ఒక పిల్లాడు కారు బొమ్మ కొనివ్వమని మారం చేస్తుంటే, ఊరెళ్ళాక కొనుక్కుందామని నచ్చజెపుతుంది ఆ పిల్లాడి తల్లి. మాసిన బట్టలతో ఉన్న ఒక పెద్దాయన బీడీ కాలుస్తున్నాడు. బస్ డిపోలో డ్యూటీ జాయిన్ అవుతున్న డ్రైవర్లు, కండక్టర్లతో సంతకాలు చేయిస్తున్నాడు డిపో మేనేజర్. ఇంకో ఐదు నిమిషాల్లో కదలాల్సిన ఒంగోలు ఎక్స్ప్రెస్ బస్సు, ప్యాసింజర్లు ఎక్కాక కూడా కండక్టరు కానీ డ్రైవరు కానీ బస్ దగ్గర కనిపించకపోవడంతో డిపో మేనేజర్ వేడి మీదున్నాడు.

 

హోటళ్ళో ఇడ్లీ సాంబారు పొగలు కక్కుతుంటే ఊదుకుంటూ తింటున్నాడు కండక్టరు సుబ్బారావు. అతనికెదురుగా డ్రైవరు రాంబాబు తన ప్లేట్లో మసాలా దోశె తినేసి సుబ్బారావు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ హోటల్ పొయ్యి వెలిగించి చాలా సేపయింది కాబోలు, పూరీలు నూనెలో వేయగానే పొంగుతున్నాయి. వంట మాస్టర్ ఆ పూరీలతో పాటు, ఆర్డర్లు తీసుకుని దోశెలు కూడా వేస్తున్నాడు. సర్వరు తన రెండు చేతుల్లో మూడేసి టిఫిన్ ప్లేట్లతో టేబుళ్ళ దగ్గర ఆర్డర్లు సర్వ్ చేస్తున్నాడు. కౌంటర్ లో కూచున్న హోటల్ ఓనర్ బిల్లు కట్టించుకుంటూనే, ఏ టేబుల్ క్లీన్ చేయాలో, ఏ టేబుల్ దగ్గర చట్నీ అడుగుతున్నారో గమనిస్తూ సర్వర్లని ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకతను లగేజీ బ్యాగు పక్కన పెట్టి, పళ్ళపొడితో మొహం కడుక్కుంటున్నాడు. హోటల్ వెనక ఒక ముసలాయన కట్టెలు కొడుతుంటే, సర్వరు ఆ కట్టెలు తీసుకునివెళ్లి పొయ్యి మంట తగ్గకుండా చూస్తున్నాడు. ఐదో టేబుల్ దగ్గర సర్వర్ తో తన పెసరట్టు ఆర్డరు గురించి వాకబు చేస్తున్నాడో కస్టమరు. పెసరట్టుకి ఒక పది నిమిషాలు టైం పడుతుంది సార్, ఇంకేదైనా తెమ్మంటారా అని అడుగుతున్నాడు ఆ సర్వర్. లేదు నాకు పెసరట్టే తీసుకురా అని పంపించడా కస్టమర్. సుబ్బారావు, రాంబాబు చేతులు కడుక్కుని డిపోలో సంతకం పెట్టడానికి వెళ్ళారు. ఇప్పటికే పావుగంట లేటయింది తొందరగా బస్సు స్టార్ట్ చేయండని వాళ్ళిద్దరినీ అరిచి పంపించాడా డిపో మేనేజర్. తల మీద రెండు బస్తాలు ఒకదానిపై ఒకటి వేసుకుని బస్సు పైకి ఎక్కుతున్నాడో ఆర్టీసీ కూలి. లేటవుతోందని ఆ కూలీని తొందర చేస్తున్నాడు సుబ్బారావు.
పక్కన ఆటో స్టాండ్ లో “రేల్వే స్టేషన్!రేల్వే స్టేషన్!” అరుస్తున్నాడో ఆటో డ్రైవర్. అప్పుడే తీసిన కిరాణా షాపు ముందు చీపురుతో ఊడుస్తున్నాడా షాపు ఓనర్. సినిమా పోస్టర్ హోర్డింగ్ లో, పాతది చించేసి కొత్త సినిమా పోస్టర్ అంటిస్తున్నారు. ఒక ముప్పయ్యేళ్ళు పైబడ్డ వ్యక్తి ఉద్యోగం చేస్తున్న తన భార్యని బస్టాండ్ లో దించి బైక్ మీద వెళ్లిపోతున్నాడు. ఒకటికైతే డబ్బులేం తీస్కోకుండా, రెంటికైతే రెండు రూపాయలు వసూలు చేస్తున్నారు బస్టాండ్ లో ఉన్న పబ్లిక్ టాయ్ లెట్ దగ్గర.టాయ్ లెట్ సరిగా క్లీన్ చేయలేదంటూ లోపలి నుండి కంప్లైంటు.

 

బస్సు మీద లగేజీ వేయడం అయిపోగానే, డ్రైవర్ రాంబాబు బస్సు స్టార్ట్ చేసాడు . బస్సు ఊరు దాటుతోంది, స్పీడు పెరుగుతోంది. చలిగాలి ఎక్కువవటంతో, విండో గ్లాసు మూసేయడానికి ప్రయత్నిస్తుంది కిటికీ దగ్గర కూచున్న ఓ అమ్మాయి. అది కదలకపోవడంతో మానేసి, తన చున్నీతో కప్పుకుంది. ఒక పల్లెటూరు దగ్గర కొంతమంది విద్యార్దులు, విద్యార్దినులు బస్సు ఎక్కారు. వాళ్ళందరూ స్కూల్ యూనిఫామ్ నిక్కరు వేసుకున్నారు కానీ, చెప్పులు మాత్రం వేస్కోలేదు. వాళ్ళెవరూ ప్యాంటు వేసుకోకపోవడం వల్ల, చలికి చర్మం పొడిబారి కాళ్ళు పగిలాయి. స్కూలు బ్యాగు కూడా, వాళ్ళందరి దగ్గరా లేదు. చాలామంది పుస్తకాలు, లంచ్ బాక్సు చేత్తోనే పట్టుకుని ఉన్నారు. ముందు నుంచున్న అమ్మాయిల్లో కూడా చాలామంది పుస్తకాలు చేత్తోనే పట్టుకుని ఉన్నారు. కండక్టర్ వాళ్ళందరి బస్ పాస్ లు చెక్ చేస్తున్నాడు. నిలబడి ఉన్న ఒక పిల్లాడికి తను అడ్జస్ట్ అయి కొంచెం సీటు ఇచ్చాడు ఒక ప్యాసింజర్. ఒక పెద్దాయన న్యూస్ పేపర్ చదువుతుంటే, నిల్చొని ఉన్న ఇద్దరు పిల్లలు పేపర్ బ్యాక్ సైడ్ లో స్పోర్ట్స్ న్యూస్ చదువుతున్నారు. రోడ్డు మీదున్న మంచుని చీల్చుకుంటూ, పొగని వదులుతున్న ఆ బస్సు, దూరం నుండి చూస్తే రాహు కేతులని తలపిస్తోంది.

 

లాస్ట్ ట్రిప్ అయిపోయాక బస్సుని పార్క్ చేసి, వాళ్ళ వాళ్ళ ఇంటికి బయల్దేరారు రాంబాబు, సుబ్బారావు. బస్టాండు ప్రాంగణం అంతా ఖాళీ అయింది.షాపులన్నీ మూసేసి ఉన్నాయి. కొన్ని గంటల క్రితం టికెట్ కోసం బారులు తీరిన రిజర్వేషన్ క్యూ దగ్గర ఇప్పుడు ఒకరూ కూడా లేరు. బస్ లో ఒక్క సీటు కోసం చొక్కాలు పట్టుకుని గొడవ పడ్డ జనం, ఇప్పుడు బస్సు అంతా ఖాళీ అయినా పట్టించుకోవట్లేదు. ఊరంతా నిద్ర పోతున్నా, మళ్ళీ తనకు వైభవం తీసుకొచ్చే ఉదయం కోసం ఎదురు చూస్తుందా బస్టాండ్!జీవితం కూడా బస్టాండు లాగానే. ఈ నిమిషం బావుందనిపించినా, బాధొచ్చిందనిపించినా ఏదీ శాశ్వతం కాదు. రేపనేది రాకుండా ఆగిపోదు. మనకు ఇష్టమైన వాళ్ళందరూ మనతో పాటు జీవితాంతం ఉండాలని కోరుకోవడం స్వార్థం కాదు, అసంభవం.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,