15 Classics Of Bapu Garu That Are A Gift To The Present Generation

అచ్చ తెలుగు తనాన్ని , పురాణ ఇతిహాసాల లోని మానవీయ విలువలని, తెలుగు వనిత సౌందర్యాన్ని , గోదారి అందాల్ని మొత్తంగా తెలుగు తనం ఉట్టి పడే సినిమాల్ని చూడాలంటే బాపు రమణల గారి సినిమాలా తరువాతే ఇంకెవరిదైనా.. రమణ గారు మాటలతో వాటిని వ్యక్తపరిస్తే బాపు గారు తన చిత్రాలతో వ్యక్తపరుస్తారు. తెలుగు సంస్కృతికి ఒక రూపం వారి సినిమాలు. రామాయణం లోని ప్రేమ కథ ని, మానవత్వాన్ని వారికన్న బాగా ఇంకెవరు అర్ధం చేసుకోలేరేమో… వారి సినిమాలో చాలా వరకు రామాయణ మాహాభారతాలా ప్రేరణ ఉంటుంది ఆ పాత్రల తత్త్వం ఉంటుంది. అందుకే వారి సినిమాలు ఆణిముత్యాలు తరువాతి తరాలు తెలుసుకోవాల్సిన సత్యాలు. అలాంటి ఆణిముత్యాలలో కొన్ని ఇవి.

1. బుద్ధిమంతుడు
దేవుడు గొప్ప చదువు గొప్ప. ఒక ప్రశ్న కి సమాధానం దొరకాలంటే దేవుడ్ని ప్రార్ధించాలా, కష్టపడి శోధించాలా? మనలో కొంతమంది మొదటి దానితో ఏకీభవిస్తారు కొంతమంది రెండో దానితో ఏకీభవిస్తారు. ఇలాంటి భిన్న మనస్తత్వాలు అన్నాతమ్ముళ్ళైతే వారి లో ఎవరి సమాధానం ఒప్పవుతుంది ఎవరి సమాధానం తప్పవుతుంది. అనే ఆలోచన కి చిత్ర రూపం ఈ సినిమా


2. బంగారు పిచిక
డబ్బుంటే ఏం లాభం లోకం లో అందాన్ని ఆనందాన్ని అనుభవించ లేనప్పుడు. ఒక పంజరం లాంటి ఇంట్లో పెరిగిన కోట్ల కి వారసుడైన అబ్బాయి ఆ ఇంటి నుండి పారిపోయి ఒక సామాన్య జీవితం గడుపుతూ నిజమైన ప్రేమ ని ఎలా సంపాందించాడు అనేది ఈ సినిమా కథ. బొమ్మరిల్లు సినిమా లాంటి కథ బాపు రమణ గార్ల శైలి లో తీస్తే ఇలా ఉంటుంది. ఇదే సినిమా ని నరేష్ గారితో పెళ్లి కొడుకు అని పునర్నిర్మించారు.


3. సంపూర్ణ రామాయణం
రామాయణం లాంటి ఉన్నతమైన ఇతిహాసానికి ఆ కథ లో సీత రాముల స్వచ్ఛమైన ప్రేమ కి బాపు రమణ గార్లు సమర్పించిన చిత్రాంజలి ఈ చిత్రం.


4. అందాల రాముడు
తను పుట్టి పెరిగిన గోదావరి అందాల్ని, ప్రతి ఫ్రేమ్ లో ఎంతో ప్రేమ తో చూపించారు బాపు గారు. శేఖర్ కమ్ముల గారి గోదావరి సినిమా కి ఈ సినిమానే ప్రేరణ.

5. ముత్యాల ముగ్గు
రామాయణ కథ ని ఈ తరానికి నవీకరిస్తూ ఈ సినిమా ని తీశారు. రావు గోపాల రావు గారి నటన, ఆయన మాటలు ఈ సినిమా కి ప్రధాన ఆకర్షణ.


5. గోరంత దీపం
రామాయణం లో రావణుడు సీతమ్మ తల్లి ని అపహరించాడు కానీ రాముడు వస్తాడని ఎదురు చూసింది సీతమ్మ తల్లి . రాముడు అనుమానించాడు అగ్ని ప్రవేశం చేసి తను పునీతురాలని నిరూపించుకుంది. చాకలి వాడు అన్న మాట కి మళ్ళి అడవులకు పంపాడు అయినా రాముడి ని ఒక్క మాట అనలేదు. ఇదే పరిస్థితిలో సీతమ్మ తల్లి బదులు సత్య భామ ఉంటే, బహుశా ఇదే ఆలోచనే బాపు రమణ గార్లకు వచ్చి గోరంత దీపం సినిమా తీశారెమో. అప్పటి తరం లో అందానికి ప్రతీక అయిన వాణిశ్రీ గారిని మేకప్ లేకుండా చూపిస్తూ, ముఖము లో కళ కి రంగు తో సంభందం లేదని నిరూపించారు.


7. భక్త కన్నప్ప
కృష్ణం రాజు గారి నటవిశ్వరూపం ఈ సినిమా. పాటలు అద్భుతంగా ఉంటాయి. చివరి అరగంట లో వచ్చే సన్నివేశాలు ఎవరినైనా కదిలిస్తాయి. దేవుడిని మెప్పించాలంటే తప్పస్సు చేయక్కర్లేదు స్తోత్రాలు చదవక్కర్లేదు స్వచ్ఛమైన భక్తి నమ్మకాలే తపస్సులు అని నిరూపించిన ఒక భక్తుని కథ ఈ సినిమా. తమ సినిమాల తో బాపు రమణ గార్లు కూడా అలాంటి తపస్సే చేశారు.


8. మనువూరి పాండవులు
ముత్యాల ముగ్గు సినిమా ద్వారా రామాయణాన్ని నవీకరిస్తే ఈ సినిమా ద్వారా మహాభారత పాత్రల్ని నేటి తరానికి నవీకరించారు. చిరంజీవి గారికి ఈ సినిమా నుండి మంచి గుర్తింపు వచ్చింది.


9. కృష్ణావతారం
బాపు రమణ గార్లు ఒక మాస్ పాత్రని రాస్తే ఎలా ఉంటుందంటే ఈ సినిమా లో కృష్ణ గారి పాత్ర లాగ ఉంటుంది. ఈ సినిమా చూస్తే ఖలేజా లో మహేష్ బాబు గుర్తు రావడం ఖాయం.


10. మంత్రి గారి వియ్యంకుడు
సున్నితమైన హాస్యం. చక్కని సందేశం తో తీసిన సినిమా. అల్లు రామలింగయ్య గారు, నిర్మలమ్మ గార్ల కోసం ఈ చిత్రాన్ని చూడాల్సిందే.


11. పెళ్లి పుస్తకం
బాపు రమణ లు అంటే అందరికి మొదట గుర్తొచ్చే సినిమా ఇది. ఈ సినిమాలో ని “శ్రీరస్తు శుభమస్తు” పాట లేకుండా ఏ పెళ్లి సీడి ఉండదు. దాంపత్యంలో ఒకరిని ఒకరు ఎలా అర్ధం చేసుకోవాలి సమస్యలని కలిసి ఎలా పరిష్కరించుకోవాలి లాంటి సున్నితమైన అంశాలను తమదైన శైలి లో అందరికి నచ్చే విధంగా అర్ధమయ్యే విధంగా చెప్పారు. చిన్న విషయానికి విడాకులు తీసుకుంటున్న ఈ తరం చూడాల్సిన సినిమా.


12. మిస్టర్ పెళ్ళాం
ఇంటిని చక్కపెట్ట గల స్త్రీ, ఉద్యోగిని గా కూడా రాణించగలరు అని నిరూపించిన సినిమా. భార్య భర్త ల మధ్య సమానత్వం ఉండాలి కానీ ఎక్కువ తక్కువ అనే తేడాలు ఉండకూడదని అని చెప్పడానికి ఈ సినిమా ఒక ప్రతీక.


13. రాంబంటు
ఆంజనేయుని వ్యక్తిత్వాన్ని ప్రేరణ గా ఈ సినిమాలోని రాజేంద్ర ప్రసాద్ గారి పాత్రని రూపొందించారు. తెలివి నిజాయితి ఉంటే డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు అని అంతర్లీనంగా చెప్పారు.


14. శ్రీ భాగవతం
ఈ సీరియల్ తమ తరువాతి తరానికి బాపు రమణ గార్లు ఇచ్చిన అపురూపాయమైన కానుక. రామాయణ మహాభారత ఇతిహాసాలు మొదలుకుని ఎన్నో పురాణాగాథలను ఎంతో రమ్యంగా అందరికి అర్ధం అయ్యేలా చెప్పారు. మనలో చాలామంది చిన్నతనం ఈ సీరియల్ తో ముడిపడుంది.ప్రతి ఆదివారం ఉదయం 9:30 వచ్చే ఈ సీరియల్ ని చూసిన వాళ్లు మనలో చాలా మందే ఉన్నారు.


15. శ్రీ రామరాజ్యం
బాపు రమణ ద్వయం నుండి వచ్చిన చివరి సినిమా. లవ కుశ ని తీయాలన్న తమ కోరికను ఈ సినిమా ద్వారా తీర్చుకుని, మనకు వారి సినిమాలను జ్ఞాపకాలు గా మిగిల్చి వాళ్లకెంతో ఇష్టమైన రాముడు చెంతకు చేరుకున్నారు.


వారు తీసిన 48 చిత్రాలలో 15 మాత్రమే ప్రస్తావించాను. మిగితావి మీరు గుర్తుచేసుకుని మాకు పంచండి.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , ,