అంతర్యుద్ధం – A Short Story of a Common Man’s Struggle to Adapt Societal Rules

మధ్యాహ్నం ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వెళ్ళాలి. ఇంకో 5 నిమిషాలలో ట్రైన్ కదులుతుంది, అంతలో పక్కనే ఉన్న ముసలితాత భుజాన చిన్న పాపని ఎత్తుకుని బన్లు అమ్ముతున్నాడు. మనవరాలి ఆకలి బాధ ఆయన కళ్ళలో చూసాను , ఎట్టకేలకు ఒకడు ప్యాకెట్ కొని పది రూపాయలు నోటు కిటికిలోనుండి చేతిలో పెట్టాడు. మొదట్లో చిన్న నవ్వు కనిపించిన ఒక సెకను లోనే ఆ నవ్వు ఆవిరి అయిపొయింది. చిరిగిన పది రూపాయల నోటు చూసి కంగారుపడిన ముసలాయన భయం తో మార్చమని కొన్న వాడిని అడిగాడు. 2 నిమిషాలలో ట్రైన్ ఎలా అన్న కదులుతుంది అనే ధైర్యం తో ఆ కొన్న వ్యక్తి పట్టించుకోడం మానేసాడు. నోటు వదిలించుకోవాలనే తెలివి ఆ కొన్న వ్యక్తిది , కానీ ఆ పది రూపాయలు , తన మనవరాలి 2 పూట్ల పాల భోజనం. కోపంతో ఊగిపోయి , గొడవాడ సాగాడు. ఆ మాట,ఈ మాట చెప్పి దాటేస్తూ ట్రైన్ కదలడానికి ఎదురు చూస్తున్నాడు ఆ కొన్న వాడు. కోపం , బాధ రెండు కలిపి వస్తున్న కేకలు చివరికి అందరి చెవిన పడ్డాయి. అందరి కళ్ళు వాడి మీద పడడం తో అప్పటిదాకా వదిలేసిన సిగ్గు , అప్పటిదాకా తీసి పక్కన పెట్టిన సమాజపు పరువు , రంగు మెల్లిగా మళ్లీ అంటుకుని ,
“సర్లే గోల చేయకు ! ముష్టి పది రూపాయల గురించి ఏడుస్తునవ్ , చిరిగిందని తెలిస్తే అసలా ఇచ్చేవాడినే కాదు ” అని అరుస్తూ జేబు లో నుండి ఇంకో మంచి నోటు తీసి కరెక్ట్ గా ట్రైన్ కదిలె టైం కి కావాలని ఆ నోటు నలిపేసి మొహానికి కొట్టాడు .అది మొహానికి తాకి , ముసలాయన పట్టుకునే లోపే పట్టాల కింద పడి, ఆ వేగంలో ఎగిరిపోయింది.లోకం లో అన్నిటికంటే క్రూరమయినది నిస్సహాయత , తాత కన్నుల్లో ఆ నిస్సహాయత వాళ్ళ జారిన కంటి బొట్టు చాలా స్పష్టంగా బుర్ర లో నాటుకుపోయింది.
ఆ ఆలోచనలతోనే ఇంటర్వ్యూ కి వెళ్ళాను. వాడు అడిగే ప్రశ్నలకి , నా చదువుకి ఎం మాత్రం సంబంధం లేదు . కానీ కూర్చోవాలి , సమాధానాలు చెప్పాలి . కారణం జీతం , డబ్బు – సమాజం లో మర్యాదని కొనే ఇంధనం. రూపాయి ఉన్నవాడికి వంద కావాలి , వంద ఉన్నవాడికి వెయ్యి , అలా లక్ష కి కోటి , కోట్లు ఉన్నవాడికి పదవి. కిందోడు పైనోడ్ని ఎపుడు అడుగుతూనే ఉంటాడు , ఆ పైనోడు కిందోడ్ని వాడి అహం తీర్చుకోడానికి వాడుకుంటూనే ఉంటాడు , అలానే ఈ ఇంటర్వ్యూ చేసే వాడు కూడా వాడుకున్నాడు. సెలెక్ట్ అయ్యానో లేదో తెలీదు , కానీ నచ్చలేదు , ఈ పద్దతి అసలా నచ్చలేదు. అసలా గౌరవం ఏమైపోయింది , ఏదన్నా సాధిస్తేనే గౌరవిస్తారా ? మనిషిని మనిషిలా చూడడానికి ఏమంత సాధించాలి ? ఈ అహం , పలుకుబడి ,తేడాలు , బేధాల కన్నా ముందు మనుషులమే కదా ? మర్చిపోయామా?
వీడేంట్రా సోది చెప్తున్నాడు , ఇవన్నీ చెప్పడానికి , వినడానికి బాగుంటాయి , బయటికి వచ్చి బ్రతికితే తెలుస్తుంది లోకం గురించి అనే కదా మీ సందేహం . ఎంతో మంది ఎన్నో సార్లు చెప్పారండి . కానీ ఏమో ఏదన్నా సంఘటన కదిలించిన ప్రతి సారి తిరిగి వచ్చే ప్రశ్నలు ఇవి, వాటికి ఎపుడో బానిస అయిపోయా .
ఇంటర్వ్యూ అయిపోయి , తిరిగి బయల్దేరాను , స్టేషన్ లో దిగగానే ఆ ముసలితాత , పక్కనే ఆ చిన్ని పాప , ఆ బన్ను ప్యాకెట్ నుండి తీసుకున్న ఒక బన్ను తింటున్నారు. పాపం పళ్లు కూడా లేని పిచ్చిది , నాలుకతో నములుతుంది. టక్ తీసేసి తాత దగ్గరికి వెళ్లి ఆ మిగతా బన్నులు కొని అక్కడే కూర్చున్నా. ఆ బుడ్డిదాన్ని నా చేతికి ఇచ్చి గబా గబా వెళ్లి పాలు కొనుకొచ్చాడు. అవి పట్టిస్తుండగా నేను ఒక టీ తీస్కొని అక్కడే బన్నులు తింటూ భోజనం కానిచ్చేసాను.
చీకటి పడి ఇక ఇంటికి బయలుదేరగా ఆ బుడ్డిది చిన్న నవ్వు తో పక పక నవ్వింది. పొద్దున్న నుండి ఉన్న బాధంతా పోయింది . అలానే నడుచుకుంటూ ఇంటికి స్టార్ట్ అయ్యాను . అపటిదాకా తిరిగిన సమాజపు ఆలోచనలు , బేధాలు , స్థాయి , అవమానాలు ఏవి గుర్తురాలేదు. కానీ దారి పొడుగు ఒక చిన్ని చిరునవ్వు , మనసంతృప్తి , మరి ముఖ్యంగా ఒక ప్రశాంతపు అల తాకాయి. అన్ని సంపాదించినా , ఎంత స్థాయి పెరిగినా సంతోషం , సంతృప్తి లేని జీవితం , జీవితమేనా?
ఇలాంటి కబుర్లు నిజాలు ఈ రాత్రి మాత్రమే చెప్పగలను , రేపటి నుండి మళ్లీ నేనా సమాజపు గీతాలు లో బ్రతికే సగటు మనిషిని. బేధ, విబేధాలు లేకుండా ఉండగలమనే ఆశకి , ఉండలేము అనే నిజానికి మధ్య తేలుతున్న సగటు మనిషినే.
If you wish to contribute, mail us at admin@chaibisket.com