These Musings Of New Born Baby About His Mother, Father and Future Is Very Emotional

 

Contributed By Sarveswar Reddy Bandi

 

“డ్రైవర్ స్పీడుగా పోనివ్వు, వద్దొద్దు లే మెళ్లగానే పో,కాదు కాదు జాగ్రత్తగా పోనీ” నెలలు నిండిన అమ్మను హాస్పిటల్ కు తీసుకెళ్లే కంగారులో ఆటో డ్రైవర్ తో ఏదో చెప్తున్నాడు నాన్న

“ఏం కాదు సాబ్, అన్నిటికీ అల్లాహ్ ఉన్నాడు” అంటూ ట్రాఫిక్ సిగ్నల్స్ సైతం లెక్కచేయకుండా వెళ్తున్నాడు డ్రైవర్ అంకుల్

 

“నవ్వు తప్ప అమ్మ ఏడుపు చూడని నాన్న ఆరోజు పెద్ద పెద్ద అరుపులు చూసి కంగారు పడి అమ్మకు ధైర్యం చెప్పడానికి నవ్వు నటిస్తూ ” మన పందెం గుర్తుందా..! మగ పిల్లాడు పుడితే మా తాతయ్య పేరే పెట్టాలి, మరీ మొరటుగా ఉంటే నువ్వేదైనా ముద్దుపేరు పెట్టుకో పర్లేదు ” అంటూ నా గురించే ఏదో చెప్తున్నాడు..

 

“రోజూ అమ్మతో ఎంత మంది మాట్లాడినా పెద్దగా పట్టించుకోను, కానీ రాత్రి పడుకునే ముందు అమ్మ, నాన్న నా గురించి మాట్లాడుకునే మాటలు మాత్రం దొంగచాటుగా పెద్ద చెవులు చేసుకుని మరీ వినేవాడిని”

 

కానీ ఈరోజు ట్రాఫిక్ సౌండ్ వల్లనో, టెన్షన్ తో అమ్మ గుండె చప్పుడు పెరగడం వల్లనో నాన్న మాటలు పెద్దగా వినపడకపోతే, పేగుల మధ్య అటూ ఇటూ కదిలి అమ్మని ఇంకా బాధపెట్టకుండా కాళ్ళు దగ్గరికి ముడుచుకుని హాస్పిటల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నా..ఇంతలో నిద్ర పట్టేసింది..

 

కాసేపు తర్వాత రోడ్డు శబ్దాలు, నాన్న గొంతు వినిపించటం లేదు, అమ్మ గుండె నుండి చెవులు కొంచెం దూరం ఉంచి వింటుంటే, “భయపడకు, కళ్ళు మూసుకో, నువ్వే భయపడితే వాడు ఇంకా భయపడతాడు”అనే మాట వినగానే నాకు ఎక్కడ లేని సంతోషం, ఎందుకంటే అమ్మకు ప్రతి నెల ధైర్యం చెప్పి, నా బలానికి మందులిచ్చే డాక్టరు గారి గొంతు అది. నేను భయపడతానని చెప్పగానే అమ్మ గుండె నెమ్మదిగా కొట్టుకోవడం చూసి తనకు నేనంటే ఎంత ప్రేమో తెలిసింది, బయటకు వచ్చాక డాక్టరుకు థాంక్స్ చెప్పుకోవాలి అనుకునెలోపే నా తల పట్టుకుని లాగడం మొదలెట్టింది. అమ్మ తర్వాత నన్ను తాకిన రెండో స్పర్శ, కాసేపట్లో బయటికి వచ్చేస్తానని తెలియగానే స్పీడుగా ఒకసారి ఇన్నాళ్లూ నేను చేయాలని మనసులో రాసిపెట్టుకున్న లిస్టు ఒక్కొక్కటీ గుర్తుచేసుకోవడం మొదలెట్టా..

 

” నవ్వితే దరిద్రంగా ఉంటుంది నీ మొహం అని రోజూ అమ్మ నాన్నను ఏడిపించడం నిజమా..అబద్దమా..నాన్న నన్ను ఎత్తుకోగానే చూడాలి”

“వీడు ఎవరి పోలిక ఉంటాడని రోజూ కాలక్షేపం కబుర్ల యుద్దం చేసే తాతయ్య, అమ్మమ్మ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి”

అన్నట్టు చూడాలి అంటే గుర్తొచ్చింది, రోజూ ఉదయం కళ్ళు తెరవగానే అమ్మ దేవుడిని చూస్తుంది, అప్పుడే పుట్టిన నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలీదు కాబట్టి అమ్మ దగ్గరకు తీసుకెళ్లే దాకా కళ్ళు తెరవలేదనీ నర్సు నన్ను గట్టిగా గిల్లినా, అరికాళ్ళు రుద్దినా, ఆఖరికి డాక్టర్ వచ్చి తలకిందులు చేసి పిర్రల మీద కొట్టినా అమ్మ దగ్గరకు తీసుకెళ్ళే వరకూ కళ్ళు బలవంతంగా మూసుకుని ఉండాలని అనుకునేలోపే డాక్టర్ మొత్తం నన్ను బయటకు తీసింది..

 

ఆ నిమిషం డాక్టర్ అరచేతిలో ఉన్న నాకు తొమ్మిది నెలలు వెచ్చని కడుపులో ఉన్నందుకేమో చాలా చలిగా అనిపించింది, ఇన్నాళ్లు అమ్మ చెవులతో వినడం వల్లనేమో నర్సులు మామూలుగా మాట్లాడే మాటలు కూడా పెద్ద పెద్ద శబ్దాల వలే వినిపిస్తున్నాయి, ప్రతి బిడ్డలా నేను కూడా కళ్ళు తెరవకుండా గట్టిగా అరిచేసరికి, నర్సు నన్ను తీసుకుని వెళ్ళడం గమనించిన నా ఆనందానికి అవధులు లేవు, కారణం అమ్మను కాసేపట్లో చూడబోతున్నా..

 

ఇంతలో చిన్న సందేహం పక్కనే ఉన్న అమ్మ దగ్గరకు ఇంతసేపు ఎందుకు తీసుకెళ్తున్నారని, ఏదైతేనేం అమ్మ స్పర్శ తాకగానే ఒక్కసారి కళ్ళు తెరిచి చిన్నగా నవ్వాలని అనుకునేెలోపు నన్ను ఒక బెడ్ మీద పడుకోబెట్టడం గమనించా, కానీ నా పక్కన అమ్మ స్పర్శ, వాసన లాంటివి ఏమాత్రం తెలియట్లేదు సరి కదా, నర్సు కూడా అక్కడి నుండి వెనక్కి వెళ్తున్నట్లు అర్థమవుతుంది, భయంతో ఇంకొంచెం గట్టిగా కళ్ళు మూసుకుని ఉన్నా, ఇంతలో దూరంగా ఒక నర్సు ఇంకో నర్సుతో మాట్లాడటం వింపించింది..

 

ఊపుకుంటూ వెళ్లకు, మూతికి మాస్కు తొడుక్కో..

ఏమైందీ, ఏం కేసు అక్కా..

ఆ..ఇంకేం కేసు..కరోనా..ఇన్నాళ్లూ ఆ దిక్కు మాలిన రోగం మన ఆస్పత్రిలో లేదు అనుకున్నా, ఇక్కడికి కూడా వచ్చింది ఈ దరిద్రం కాన్పు వల్ల..

ఆ మాట వినగానే ఒక్క క్షణం చాలా భయమేసింది,చిన్నగా వొంట్లో ఒణుకు పుట్టింది, చలి ఇంకా పెరిగింది, ఇక్కడ నేను మాత్రమే ఉన్నానా..లేదా తను ఇంకెవరైనా వేరే వాళ్ళ గురించి చెప్తుందా, కళ్ళు తెరిచి చూడాలనిపించింది..కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మనే మొదట చూడాలి కాబట్టి అలాగే కళ్ళు మూసుకుని ఉన్నా..

 

“గత పది రోజులుగా రోజూ నాన్న అమ్మతో ఈ రోగం గురించి చెప్పినప్పుడు చాలా భయమేసి అమ్మ పేగులని గట్టిగా కౌగలించుకునేదాన్ని, తాతయ్య సాయంత్రం టీవీలో వార్తలు పెట్టినపుడు కూడా ఈ రోగం గురించి వినగానే ఉక్కిరిబిక్కిరి అయిపోయి, ఇంకొన్ని రోజులు కడుపులోనే ఉండాలి అనుకున్నా, కానీ నెలలు నిండాక దేవుడు కూడా ఆపలేడు కదా”

 

ఏదేమైనా ఈ రోగం అమ్మకు వచ్చి ఉండదు, వేరే ఎవరి గురించో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆపరేషన్ కోసం అమ్మకు ఇచ్చిన మత్తు తగ్గిపోగానే అమ్మ వచ్చేస్తుందని గట్టిగా నన్ను నేను సమర్థించుకున్నా..

 

కానీ ఇంతలో ఇంకో నర్సు వచ్చి ” ఆ డెలివరీ అయిన ఆవిడకు కరోనా ఖరారు చేశారట, బిడ్డను కూడా వార్డుకు తీసుకుని రమ్మన్నారు” అనే మాటలు వింటున్నప్పుడు చేతులు మొత్తం తడిగా ఐపోయి, గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది..కళ్ళు తెరవాలి అనుకున్నా, కానీ ఏదేమైనా ముందు అమ్మనే చూడాలని అలాగే ఉన్నా..

 

దూరం నుండి నడుచుకుంటూ వస్తున్న నర్సు అడుగులు దగ్గర అయ్యేకొద్ధీ “వీళ్ళు మాట్లాడేది అమ్మ గురించి కాదు, నా పక్కన ఉన్న వేరే పిల్లల గురించి అని ఎంత సర్దిచెప్పినా భయం మాత్రం ఎక్కువ అయిపోతుంది, పోనీ కళ్ళు తెరుద్దామా అంటే అమ్మను మాత్రమే ముందు చూడాలని బలమైన కోరిక”

 

అడుగులు నా దగ్గరకు వచ్చి ఆగిపోయేసరికి బాధ ఎక్కువైంది, పక్కన ఏదో చిన్న చిన్న శబ్దాలు, ఇక మనసులో దేవుడికి దండం పెట్టుకునే లోపు నా మీద చెయ్యి వేసి, పైకి ఎత్తుకొని ” ఆ కరోనా పేషంట్ పాప ఇదేనా??”

” అవునే తల్లీ, రమ్యకృష్ణ బాహుబలి బిడ్డను ఎత్తుకున్నట్టు ఆ ఫోజ్ ఏంది, ముందు ఆ మొకానికి ఏమైనా అడ్డం పెట్టుకో..”

 

అప్పటి దాకా దూకే కన్నీళ్లను గట్టిగా రెప్పలు మూసి దాచిపెట్టిన నేను ఒక్క క్షణం ఏడ్చేసాను, బహుశా దేవుడు నన్ను తప్పుడు అడ్రస్ కు డెలివరీ చేసినందుకు మళ్లీ వెనక్కి తీసుకుంటున్నట్లు ఉన్నాడని అర్థమయ్యింది..కానీ ఒక్కసారి పంపాక మహా అయితే శరీరాన్ని తప్ప బంధాన్ని తీసుకెళ్లే శక్తి వాడికెక్కడిది,తను మాత్రం తల్లి బిడ్డడు కాదా.. తెరిచిన మొదటి క్షణం అమ్మను మాత్రమే చూడాలి, చూస్తా అనే అపారమైన నమ్మకంతో అక్కడే కళ్ళు మూసుకుని ఎదురుచూస్తున్న”

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,