ఎన్ని జ్ఞాపకాలని దాచిందో అమ్మ చీర కొంగు – A Short Note On Our Mother’s Saree

Contributed By Gopinath Vaddepally
మా బస్తి బజారులో ఓ బుడ్డోడు
అమ్మ చేతుల్లో సామాన్ల సంచి మోస్తుంటే,
అమ్మ చీర కొంగు పట్టుకుని
నడుస్తూ వెళ్ళడం చూసి,
నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ
నా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి,
ఎన్ని జ్ఞాపకాలని దాచిందో
అమ్మ చీర కొంగు..
నన్ను ముస్తాబు చేసేప్పుడు,
మొహానికి పౌడర్ వేయడానికి,
వర్షంలో తడిసొస్తే తల తుడవడానికి,
అమ్మ చేతిలో ఎప్పుడు సిద్ధంగా ఉండేది.
ఎండలో గొడుగై నాకు నీడనిచ్చేది,
ఆప్యాయతల అమ్మ చీర కొంగు..
నాన్న కొట్టిన దెబ్బలకి ఎక్కెక్కి ఏడుస్తుంటే,
నా కన్నీళ్ళను తుడిచింది.
నాన్న కొట్టడానికి వస్తుంటే,
నన్ను కనపడకుండ దాచింది.
గోరు ముద్దలు తిన్న మూతిని తుడిచింది.
ఆప్యాయతల అమ్మ చీర కొంగు.
అన్ని గుర్తున్నాయి అమ్మ.
ఆ రోజులు బాగుండేవి అమ్మ.
తెలియని వ్యక్తి ఇంటికొస్తే,
వచ్చి చీర కొంగుని చుట్టుకుని,
నిన్ను గట్టిగా పట్టుకుని,
కనిపించకుండ దాక్కునే వాణ్ణి.
ఇప్పుడేంత కష్టమొచ్చిన,
నీ చీర కొంగులో దాక్కోలేను,
ఎన్ని కన్నీళ్ళోచ్చిన,
నీ చీర కొంగుతో తుడుచుకోలేను
If you wish to contribute, mail us at admin@chaibisket.com