This Heart Warming Letter Will Tell You the Journey Of Every Fan Of Sirivennala Garu With His Songs

Contributed By Bharadwaj Godavarthi

మనం పుట్టామనిమనకి ఎవరో చెప్తే తెలుస్తుంది, మన మరణం మనకు తెలియదు, మధ్యలో ఉన్న “జీవితం”  మాత్రమే మనది!!

సిరివెన్నెల గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇవి,

బహుశా, మీకు పరిచయంఎరుగని ఈ శిష్యుడు మీకు రాస్తుంది మీకు చేరకపోవచ్చు,

బహుశా ఇది నేను రాసే సమయానికి “పరమ శివుడు”  మీతో

శివుడు: ఏంటండీ శాస్త్రిగారు నా మీద ఆ నిందాస్తుతి!

సిరివెన్నెల గారు“ఆయన శైలిలో బిగ్గరగా నవ్వుతూ”, నేనేమి రాసాను శంకరయ్య!!

నారదుడునారాయణ, నారాయణ!!

శివుడు: రావయ్యా నారద, సరైన సమయానికి వస్తావు కదయ్యా!! చూడు నారద, మన సిరివెన్నెల నా మీద నిందాస్తుతి రాయలేదు అని అన్నాడు??

నారదుడు: పరమ శివ, నాకేమి తెలుసు?? మళ్ళీ ఏమైనా అంటే “కలహభోజనుడు” అని నాకు అపకీర్తి, కానీ మొన్ననే వచ్చిన మీకు అత్యంత ప్రీతి వంతుడు అయిన ఆ బాలసుబ్రమణ్యం తన ప్రాణ స్నేహితుడు అయిన ఈ “చేంబోలు సీతారామశాస్త్రి మరణ వార్త వినగానే” ఒకింత దుఃఖంతో మీకు వినపడకుండా ఒక పాట పాడారు, మీరు అంటుంది ఆ పాట గురించి కాదు కదా??నారాయణ, నారాయణ!!

శివుడు: దొరికావు “మిత్రమా“, నువ్వు పాడు నారద.

నారదుడు: పాడుతాను, కానీ ఆయన నా మీద మళ్ళీ నేను మీకు ఇది మోసాను అన్న కోపంతో “అగ్నిగోళాలు లాంటి అక్షరాలు వదలకుండా ఉంటే చాలు”

శివుడు: నాది హామీ, నువ్వు పాడు??

తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది

తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది

తరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది

ఏది కోరేది | వాడినేది అడిగేది”

ఆది భిక్షువు వాడినేది కోరేది,

“తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది

బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది

ఏది కోరేది | వాడినేది అడిగేది

ఆది భిక్షువు వాడినేది కోరేది,

బూడిదిచ్చేవాడినేది అడిగేది”

అని అలా నారదుడు పాడుతుంటే, ఆ తన ప్రాణ మిత్రుడు అయిన శంకరయ్య వైపు కవ్విస్తూ చూస్తూ  గట్టిగా నవ్వారు సిరివెన్నెల,

శివుడు: ఏంటయ్యా నాతో ఈ పరాచికాలు, అయినా నువ్వంటే నాకు ఎందుకు అంత ఇష్టం తెలుసా?? బలే ప్రశ్నిస్తా వయ్యా, “మీ మనుషులను, వ్యవస్థను, హక్కుని, ఆఖరికి తప్పు చేస్తే దేవుడైన నన్ను కూడా!! అదేలే నీ తిక్క శంకరుడైన నన్ను కూడా!! “

ఇలా ఒక సంభాషణ మన ఊహకి అందని లోకంలో, “ఊహ లోకంలో” జరుగుతోంది,

అదే సమయంలో మళ్ళీ మనం భూలోకంలోకి వస్తే!!

“ఆయన మొదటి వాక్యంలో చెప్పినట్లు, చావుకి, పుట్టుకకు మధ్య ఉన్న జీవితంలో మనకు మొదటి జ్ఞాపకం అనేది ఒకటి ఉంటుంది.”

అలా మీతో నా మొదటి జ్ఞాపకం!బహుశా అది 1993 ‘గాయం’ సినిమాకి వెళ్ళాము, అప్పుడు సినిమా నాకేమి అర్థం కాలేదు, కానీ ఒక పాట నాన్న ఇంటికి వచ్చాక కూడా పాడుతూనే ఉన్నారు, బహుశా అప్పటికే  ఆయన సమాజంలో ఒక కీలుబొమ్మ అయ్యాడు కాబోలు, పాడటమే కాదు అందులో సిగరెట్ తాగుతూ నటించిన, పాట పాడిన బక్కపలుచని మనిషి గురించి పదే పదే చెబుతున్నారు,

నాన్న: “ఏమి రాశారు సీతారామశాస్త్రి గారు”!!

నాకు అప్పట్లో సంబంధం లేని, ఇప్పుడు ఆ సిగ్గులేని సమాజాజీవత్సవం లో ఒక అణువంత పాత్ర అయిన  ఆ పాట

“వేట అదే, వేటు అదే, నాటి కథే అంతా

నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా!!

బలవంతులె బ్రతకాలని,  సూక్తి మరవకుండా

శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ!!

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని,

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని,

మారదు లోకం,  మారదు కాలం!

దేవుడు దిగి రాని ఎవ్వరు యేమై పోని,

మారదు లోకం మారదు కాలం!!”

కొన్నాళ్లు గడిచాయి, మనం ఎప్పుడు స్కూల్లో ‘ బి’ గ్రేడ్, ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చేటప్పుడు దెబ్బలు తినడం పెద్ద విషయం కాదు, ఆ ప్రోగ్రెస్ కార్డు బాగ్ లో నుండి తీసి నాన్నకి చూపించడం పెద్ద విషయం.

అలా స్కూల్ నుండి ఎదవిదిగా ఇంటికి వచ్చాక, ఎలాగో నాన్న తిడతారు ప్రిపేర్ అయిపోయిన నేను టీవీ పెడితే, అప్పట్లో జెమినీ టీవీలో సాయంత్రం ఒక సినిమా వచ్చేది, సరిగ్గా స్కూల్ నుండి ఇంటికి వచ్చాక పెట్టంగానే ఒక పాట వచ్చింది

“చిరుపుంజిలోని చినుకెంతైన తడుస్తుంద నీ జుట్టు

ఆరెడారి గోలెందుకుర గోదారి ఒడ్డునుండు

వీరప్పన్ కొట్టేసుంటాడు అశోకుడెప్పుడొ నాటిన చెట్లు

పాత డేట్లు బట్టీ వేస్తు అసలేంటి కుస్తీ పట్లూ

ఐ క్యు అంటే అర్ధం తెలుసా అతి తెలివికి తొలి మెట్టు

ఆడె పాడె ఈడుని దానికి పెట్టకు తాకట్టూ

పనికిరాని చెత్తంత నింపకు మెదడు చెదలు పట్టు

ఓరి ఇన్నోసెంట్ స్టూడెంటు

—–

చదువు సంధ్య వదిలిపెట్టి సన్నాసివి కమ్మంటు

సలహా ఇస్తున్నానుకుంటే అదే రాంగు రూటు

బతుకు బాటలో ముందుకు నడపని బరువు మోయ వద్దు

ఓరి ఇన్నోసెంట్ స్టూడెంటు”

ఆ పాట ఆ సమయానికి నాకు బాగా ధైర్యం ఇచ్చింది, సాధారణంగా సినిమా అంటే ఇష్టం ఉన్న నాన్న, నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్న ఒకింత వింటూ ఉంటారు!ఆ రోజు సాయంత్రం నాన్న ఇంటికి వచ్చాక భోజనం చేసే సమయంలో,  కావాలని ఆ పాట, ముఖ్యంగా ఆ చరణం పాడుతూ కూనిరాగాలు తీసాను, అప్పుడు ఆయనకు అది విని “సిరివెన్నెల గారు బలే రాస్తారు, చాలా మంచి పాట” అని తనలో తాను అనుకున్నారు, ఆ రాత్రి నేను ప్రోగ్రెస్ కార్డు చూపించలేదు!!

మరుసటి రోజు నాన్నకి, నేను ప్రోగ్రెస్ కార్డు చూపించాను. సాధారణంగా నాకు వచ్చిన మార్కులకు, చెంప చెల్లు మంటుంది, నన్ను నాతో పాటు టీవీని, స్నేహితులను, నిన్నరాత్రి పాడిన పాటని,  అందరినీ ఏకేయాలి,  కానీ నాన్నకి ఆ సమయంలో కోపం కన్నా ముందు ఏదో తలంపు వచ్చింది, ఒక గంభీరమైన చూపుతో సంతకం అయిపోయింది, ఆ తలంపు నిన్న విన్న సిరివెన్నెల సాహిత్యం ఏమో!!

అప్పటికి ఆ పాట నా దెబ్బలు తప్పించుకోడానికి ఒక సాకు మాత్రమే, కానీ ఇంకా ఆ పాట తాలూకు రచయిత కానీ, ఆ పాటలోని ఆత్మ కానీ ఇంకా నా పై పూర్తి స్థాయి ప్రభావం చూపించని రోజులు. కానీ ఏ మూలనో ఒక ఆలోచన మాత్రం మొదలైంది “బ్రిడ్జి కింద నదిలా రహస్యంగా

అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నాను కాబోలు!!అప్పుడప్పుడే తోటి స్నేహితుల వలన, కుటుంబం వలన, సమాజం వలన, కులం అనే కనబడని గీత నాలో ఏర్పడుతున్న వేల, ఎప్పటిలానే ఒక ఆదివారం పొద్దున్నే ట్యూషన్ తర్వాత ఇంటికి వచ్చా, అప్పట్లో ఆదివారం అంటే సాయంత్రం ట్యూషన్ ఉండదు, ఇంటికి రాగానే పంచతంత్రం,ఒక పక్కన మహాభారతం, ఒక ఛానల్ లో సినిమా వస్తూ ఉండేది. జెమినీలో కొత్త సినిమా, ఈటీవీలో కొంచెం పాత సినిమాలు వచ్చేవి, అలా నేను ఇంటికి వచ్చేసరికి నాన్న ఒక సినిమా పతాక సన్నివేశాలకు వచ్చేసింది. నాన్నకి చాలా ఇష్టమైన సినిమా.  ఆ సినిమా పేరు “రుద్రవీణ“. 

అప్పటికే సమరసింహారెడ్డిఇంద్ర అలవాటు పడిన గుండె అలాంటి పాత సినిమాలు చూడ బుద్ధి కాలేదు, సరే సాయంత్రం మనం టీవీని ఆక్రమిద్దామని అలా మంచం పై పడుకున్నప్పుడు ఒక పాట మొదలైంది. ఆ పాటలోని మాటల శక్తి అలాంటిది!! పరధ్యానంగా ఉన్నా, నా దృష్టి తెలియకుండానే ఆ పాట పైకి వెళ్ళింది??

“ఏటి పొడవునా వసంతమొకటేనా కాలం

ఏదీ మరి మిగితా కాలాలకి తాళం

నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు

కంటినీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు

మంచు వంచనకు మోడై గోడు పెట్టువాడొకడు

వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదేరాగం

అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం

అని అడిగిన నా ప్రశ్నకు అలిగినాప్త కోకిల

కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా

నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం

కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది”

“కాలాలతో కుల వ్యవస్థను పోల్చి సంధించిన బాణాలు అవి, ఆ బాణం ఆ వ్యవస్థలో అప్పుడే ఒక కనపడని గీతని మనసులో గీస్తున్న నాకు “గాయం లేని నొప్పిలా” గుచ్చుకుంది, కంటికి కనపడని మార్పుకు అది పునాది అయింది”

అప్పటికే ఆ భావం నన్ను ప్రభావితం చేసింది కానీ, ఆ రచయిత పై ఇంకా పూర్తి ధ్యాస మరల్చలేదు!! అప్పటికి నా వరకు సినిమా అంటే హీరో, అప్పటికే  సినిమా పైన ఇష్టం ఏర్పడింది  కాబట్టి దర్శకుడు గురించి ఆరా తీసే సమయం. కానీ అలాంటి గొప్ప “దర్శకుడు” కల వెనకాల ఆయన కలంబలం గురించి నాకు నిజంగా పరిచయం అయిన రోజు??

2005లో  అనుకుంట, నేను 10వ తరగతి, జెమినీలో 24 ఫ్రేమ్స్ అని దర్శకులని,  హీరోలని, ఇంటర్వ్యూలు చేసేవారు, మనకి ఇప్పుడు ‘OPEN HEART With TNR ” లాగ అందులో “చంద్రబోస్-సిరివెన్నెల” గారి ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ అంతా “జగమంతా కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది” పాట గురించి. ఆ ఒక్క ఇంటర్వ్యూ సినిమా పట్ల నా అభిరుచిని మార్చేసింది, ఆ రచయిత మీద ఎల్లలు లేని అభిమానాన్ని పెంచేసాయి. ఒక కొత్త కోణం పరిచయం అయింది.

ఆ పాట విన్నాక సినిమా చూసినప్పుడు, ఆ సినిమా పతాక సన్నివేశాలు ట్రైన్ లో కృష్ణవంశీ గారు తీసిన విధానం, ఒక పాటలోని మాటలు లోతు ఎంత వరకు సమాజానికి హితం చేస్తాయి, ఒక పాట ఎంత గాఢతని కోరుకుంటుంది, తెలుసుకోవడం నాకు తెలియని excitement అది. స్నేహితులతో చెప్తున్నప్పుడు తెలియని ఆనందం, ముక్కున పట్టి పరీక్షలు రాసే నేను, ఒక విషయం మీద, ఒక కళ మీద లోతుగా విశ్లేషించడం “నన్ను నాకు కొత్తగా పరిచయం చేశాయి”

అది 2008 అప్పటికి ‘సినిమా‘ పట్ల పూర్తి అభిమానం ఏర్పడిపోయింది. హీరో కన్నా అభిరుచి వున్న సినిమాలు చూసే సమయం. అప్పటికే ‘బొమ్మరిల్లు, ఆర్య,” లాంటి సినిమాలు తీసిన బ్యానర్ నుంచి వస్తున్న సినిమా “కొత్త బంగారు లోకం”. సినిమా ఫ్యామిలీతో చూసా.  ఫ్యామిలీలో కొంత మందికి నచ్చలేదు! ఎక్కడ అస్లీలత లేకపోయినా ఏదో యుక్తవయసు ప్రేమను సపోర్ట్ చేసారని, అది కరెక్ట్ కాదని వాళ్ళ భావన. కానీ నాకు బాగా నాటుకు పోయిన సందర్భం, పదాలు

మన కోసమే తనలో తను రగిలే రవి(నాన్న) తపనంతా, కన్నుమూసిన తరువాతనే పెను చీకటి(నాన్న లేని కొడుకు) గుర్తించిందా”ఒక పాట రాయడం అంటే అందులో కథ మొత్తం కనపడాలి, పాట సందర్భం మాత్రమే కాదు, అని నేర్పించిన పాట!! అప్పటి నుండి నేను ఆయనని వదలలేదు, కాదు ఆయన నన్ను ఒక గురువులా నన్ను కాచుకొని ఉన్నారు!!

ఉద్యోగం గురించి బెంగ పడిపోతున్నప్పుడు, చీకటి మదిలో ఒంటరిగా దిగులు పడుతున్నపుడు,  ఎక్కడినుండో వినపడ్డాయి కొన్ని మాటలు. ఆ మాటలు ఇచ్చిన ధైర్యం విలువ “భవిష్యత్తు”

“నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున

నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ” అన్నారు

డబ్బు గురించి కాతరు చేయనప్పుడు, ఆయన ఇలా మదిలో పాట రూపంలో చమత్కరిస్తారు!!

ఇంటద్దె కట్టావ నా తండ్రి నో ఎంట్రీ విధి వాకిట్లో,

దొంగల్లే దూరాలి సైలెట్లీ నీ ఇంట్లో చిమ్మచీకట్లో,

అందుకే పదా బ్రదర్ మనీ వేటకీ

రోటీ కపడా రూము అన్నీ రూపీ రూపాలే

సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా

దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా”

ప్రేమవిఫలమైనస్నేహితుడిని ఓదార్చడానికి

“ఆశలు రేపిన అడియాశలు చూపినా, సాగే జీవితం అడుగైనా ఆగదుగా,

నిన్న రాత్రి పీడకల, నేడు తలచుకుంటూ, నిద్రమానుకోగలమా!!

ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ, లేవకుండా ఉండగలమా??

కలలుగన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా

కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మా!!”

అమ్మతో ఎప్పుడైనా తగువుకు దిగితే ఆయన కోపంతో అంటారు

“ఆలైనా బిడ్డలైనా ఒకరు పొతే ఇంకొకరు,

అమ్మ పదవి ఖాళీ అయినా, అమ్మ అవరు ఇంకెవరూ,

అమ్మంటే,  అమ్మంటే విరమించని వట్టి వెట్టి చాకిరీ

అమ్మంటే రాజీనామా ఎరగనీ ఈ నౌకరి”

ఒంటరిగా బాధపడుతున్నప్పుడు, ఆ ఒంటరితనానికి సన్నిహితంగా ఆయన అక్షరాలు కదులుతూ

“ఉదయం కాగానే, తాజగా పుడుతూ ఉంటా,

కాలం ఇపుడే నను కనగా,

అనగనగా అంటూ నే ఉంటా, ఎపుడు పూర్తవనే అవకా, తుది లేని కథ నేనుగా!!

గాలి వాటం లాగా,ఆగే అలవాటే లేక,

కాలు నిలవదు యే చోటా,నిలకడగ !!!

యే చిరునామా లేక, యే బదులు పొందని లేఖ..

ఎందుకు వేస్తుందో కేక, మౌనంగా.”

అని, ఓరి పిచ్చోడా ఆ సూర్యుడు కన్నా నువ్వు ఒంటరి వాడివా అంటాడు!!

అమ్మాయిని పొగడానికి మాటలు రాన్నపుడు

మల్లెల మాసమా,మంజుల హాసమా,

ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా”  అని ఒక స్నేహితుడిలా ప్రేమలేఖకి పదాలు అందిస్తారు!!

బాధ్యతల బరువుతో అలసిపోయినప్పుడు

బరువు అంటే బరువు,

సులువు అంటే సులువు,

బ్రతుకెలా వుండాలో నువ్వే తేల్చుకో!!

అనుకున్నవన్నీ అవవు

ఎప్పుడూ ఏదో కరువు

అందుకీ కమ్మని కలలు

సరిచూసుకో” 

అని ఒక అన్నయ్యలా సర్దిచెప్పారు.

సమాజం కోసం నాలోని నన్ను కోల్పోతున్నప్పుడు

రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం”  అని నా వ్యక్తిత్వంపై ప్రశ్న వేస్తారు!!

జీవితం అంటేనే సందర్భాల సమూహం, అలా జీవితంలో ఎదురైన ప్రతి సందర్భంలోనూ మీరు ఒక ప్రశ్నగా, ఒక సమాధానంగా, ఒక గమ్యాన్ని చేరే క్రమంలో, ఆ గమనాన్ని మనసుకు చేరువగా మలుచుకునే నిర్దేశాన్ని అందించిన సంతోషనాప్త కవిగా ఉంటూ,మరణంలేని అక్షరంలో సంతోషంగా జీవిస్తున్న మా గురువుగారు “చేంబోలు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి”  నా ఆత్మీయ అక్షర  నివాళి.

ఓం గురుభ్యో నమః                                                                                               

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: