What If You Look More Beautiful In The Mirror? – A Short Story : Finale

 

Contributed By Contributed By Nimmagadda Saroja

 

Part 1 Click Here
Part 2 Click Here

 

“ఇంతకు ముందు వాళ్ళు ఎందుకు ఖాళీ చేశారో తెలుసా?” అని అడిగింది వాచ్మెనుని.
“లేదండీ! మేము అనుకోటం ఆమె పోవడంతో, ఉండలేక వెళ్ళిపోయారు అని” అన్నాడతను.
“అతను ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు?”

 

“మా ఓనర్ గారికి వేరే ఇల్లు ఉంది పక్క వీధిలో. అక్కడ ఉంటున్నారు. అయినా ఇవన్నీ ఎందుకమ్మా? మనసు చెడగొట్టుకోటానికి కాకపోతే. వెళ్ళి సుబ్బరంగా పడుకోండి!” అని అన్నాడు.
రమ్య, అనూష సహజంగా ఎంతో ధైర్యంగల అమ్మాయిలే కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరికీ చెమటలు పడుతున్నాయి, ఫ్లాట్ దగ్గరకి వచ్చే కొద్దీ. రమ్య అనూష వైపు తిరిగి “ఎందుకే? మీ ఇంటికి వెళ్ళిపోదాం! నాకు ఏదో భయంగా ఉంది” అంది.
“రేపైనా చూడాలిగా! You are supposed to live here. ఏదో ఉందని అనిపిస్తుందే. చూద్దాం!” అని అనూష అంది. తలుపులు తాళం తీశారు. తీయగానే వాళ్ళిద్దరికీ ఇంట్లో నుంచి ఎవరో పాడుతున్నట్టు అనిపిస్తోంది. గుమ్మంలో నుంచునే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు.

 

“నీలోని గొప్పతనం అంతెత్తున చూపిస్తుంది…
నీకే నువ్వు కనపడనంతటి లోతుల్లో తోస్తుంది…”

 

అంటూ పాట పాడుతున్నారు ఎవరో. అనూష రమ్య వైపు చూసి వాచ్మెనుని పిలుచుకురమ్మని సైగ చేసింది. రమ్య సందేహిస్తూనే క్రిందకి వెళ్ళింది. ఫ్లాట్ తలుపులు తీసి ఉంచి గుమ్మం బయటనే అనూష నిలబడింది. పాట చాలా మధురంగా ఉంది. ఒక్కో అడుగూ వేసుకుంటూ అనూష లోపలికి వెళ్ళింది. రమ్య, వాచ్మన్ వచ్చేవరకు లోపలకి వెళ్ళకూడదు అనుకుంది. కానీ తనకే తెలియకుండా ఆ అద్దం ఉన్న గదిలోకి వెళ్ళి అద్దం ముందు నిలుచుంది. అద్దంలోని మనిషి అచ్చం అనుషలాగే ఉంది. కానీ తనకన్నా చాలా అందంగా ఉంది. తనలానే ఉంది కానీ తనలా లేదు. ఆమె అనూష వైపు దీనంగా చూస్తోంది. ఆమె కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకో తెలియదు, అంత అందమైన ముఖంలో ఆ బాధ చూసి అనూష హృదయం చలించి ఆమెకి కూడా తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి.

 

“నేను ఏడిస్తే నువ్వూ ఏడుస్తావా?” అని అడిగింది అద్దంలోని అమ్మాయి.
“నువ్వు నా బింబానివి కదా?”
“అప్పుడు నువ్వేడిస్తే నేను ఏడవాలి కానీ నేను ఏడిస్తే నువ్వు కాదు!” అని అలాగే చూస్తూ అద్దాన్ని ముట్టుకోబోయింది అనూష. ఇంతలో రమ్య వచ్చి ఆమె చేతిని లాగేసింది. ఇద్దరూ నిలబడి అద్దంలోని అమ్మాయిని చూస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు లేరు. ఒక్క అమ్మాయే ఉంది అద్దంలో. ఆ అమ్మాయి రమ్య లాగానూ ఉంది, అనూష లాగానూ ఉంది. కానీ వారిద్దరికంటే ఎంతో అందంగా ఉంది. ఇద్దరూ ఒకేసారి అనుకోకుండా “స్వర్ణ?!” అని అన్నారు. అద్దంలోని అమ్మాయి స్వర్ణ దిగులుగా నవ్వింది.

 

వాచ్మెను ఇంతలో తలుపు తట్టాడు. “ఏంటమ్మా కిందికి వచ్చారంట, మా ఆవిడ చెప్పింది” అంటూ. అద్దంలో అమ్మాయి మాయమైపోయింది. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తున్నారు. గుమ్మం దగ్గర వాచ్మెనుని చూసి ఏం చెయ్యాలో తోచలేదు ఇద్దరికీ. ‘ఏమీ లేదని అతడిని పంపేయాలా? లేకపోతే అతడికి జరిగింది చెప్పాలా? అతడు రాగానే వీళ్ళు చూసినదంతా భ్రమేనా అని వీళ్ళకే అనిపిస్తుంది. ఇక అతడు ఎలా నమ్ముతాడు?’ మనసులో ఇన్ని ప్రశ్నలతో “ఏం లేదు. షాపులు కట్టేస్తారేమో. ఒక కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకొని వస్తావా ప్లీజ్?” అని అంది రమ్య. డబ్బులు తీసుకొని అతడు వెళ్ళిపోయాక “ఏంటే ఇది? ఏం చెయ్యాలో తెలియటం లేదు! నాకు భయంగా ఉందే!” అని అంది రమ్య నిస్సహాయంగా.
“నన్ను చూసి భయపడకు రమ్య!” అని వినిపించింది లోపలి నుంచి ఒక గొంతు. అనూష, రమ్య ఒకరి చేయి ఒకరు పట్టుకొని నెమ్మదిగా లోపలకు నడిచారు. అద్దం ముందు నిలబడ్డారు. “నేను పొద్దున్న నుంచి నిన్ను చూస్తున్నదీ, నువ్వు నన్ను చూసేలా చేస్తున్నదీ నిన్ను భయపెట్టడానికి కాదు. నా కూతురు ఎలా ఉందని అడగటానికి. నా కూతురు జాగర్త అని చెప్పటానికి!”
“ఏంటి నువ్వు మాట్లాడేది..?”

 

“నా పేరు స్వర్ణ. watchman మీకు నేను అందంగా లేని రోజు లేదు అని చెప్పాడు కదా? అది అబద్ధం! నా చిన్నప్పటి నుంచి నేనేమీ పెద్ద అందగత్తెను కాను. మా అమ్మానాన్న బాధపడుతూనే ఉండేవారు. పక్కింటి వాళ్ళు, చుట్టాలు, రోడ్ మీద వెళ్ళేవాళ్ళు, అందరూ బాధపడుతూనే ఉండేవారు. పాప ఛామన ఛాయ. పాప పార పళ్ళు, కళ్ళు బానే ఉంటాయి కానీ జుట్టే మరీ ఉంగరాల జుట్టు. కొంచెం బొద్దుగా ఉంటుంది తను, స్వీట్స్ పెట్టకండి… అయినా ఆడ పిల్లలు బొద్దుగా ఉంటే ఏం బాగుంటారండీ? ఇలా నా శరీరం మొత్తం ‘అందం’ అనే కొలమానాన్ని చిన్న వయసు నుంచే అందుకోలేక అందరి పెదవి విరుపులకి కారణమైంది. నా చిన్నతనం నుంచి నాకు అద్దంలో చూసుకోవాలంటే భయం. నా మీద నాకే చిరాకు. నన్ను ఇలానే ఎందుకు పుట్టించావు దేవుడా అని ఎన్నోసార్లు అనుకునేదాన్ని. నేను చేసిన పనే నాకంటే అందంగా ఉన్న అమ్మాయి చేస్తే తనకే ఎక్కువ మెచ్చుకోలు వచ్చేది. ఈ ప్రపంచం అద్దంలో అందంగా పర్ఫెక్టుగా ఉండే అమ్మాయిల సొంతం అని అనిపించేది. దాంతో ఎలాగైనా నేను అందరూ చెప్పే ఆ పర్ఫెక్ట్ అమ్మాయి అవ్వాలని తిండి మానేసి, నాకంటూ ఉన్న ఇష్టాలన్నిటినీ వదిలేసి, సన్నబడటానికి, తెల్లగా అవ్వటానికి, జుట్టు అందంగా అవ్వటానికి, నడుము నాజూకుగా అవ్వటానికి చెయ్యనివి లేవు. అలా చేస్తూ చేస్తూ కాలేజీకి వచ్చేసరికి నేను అందగత్తెల జాబితాలో చేరాను. అలా చేరిన తరువాత హఠాత్తుగా నేను ఏ చిన్న పనిచేసినా అందరూ గమనించేవారు, పొగిడే వారు. ఎందుకంటే నేను ఇప్పుడు పర్ఫెక్ట్ అమ్మాయిని. ఈ పర్ఫెక్ట్ అమ్మాయిని లోకానికి చూపించటంకోసం నేను ఎంత disciplinedగా ఉన్నానో నాకు తెలుసు. ప్రపంచానికి నా కష్టం తెలియదు నా పర్ఫెక్షన్, నా పర్ఫెక్ట్ రూపం మాత్రమే తెలుసు. నేను ఉద్యోగంలో చేరిన తరువాత సతీష్ ని ఇష్టపడ్డాను. తనకూ నేను చాలా నచ్చాను. ఇద్దరం ఏడాది తిరగకుండానే పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళయ్యాక కానీ అతనికి తెలియలేదు పర్ఫెక్ట్ అమ్మాయిలు ఉండరని, ఉన్నా అలా ఉండటానికి వాళ్ళు ఎన్ని చేస్తారో అని. ఇలా పర్ఫెక్టుగా ఉండటానికి కష్టపడే అమ్మాయి అతనికి నచ్చలేదు. అది స్వతహాగా రావాలి అంటాడు. బయటకు వచ్చినా సలాడ్ ఎందుకు బిరియాని తినమంటాడు. కానీ నాలుగు రోజులు బిర్యానీ తింటే నేను ఎలా ఉంటానో నాకు తెలుసు. మొదట్లో అతనికి ముచ్చటేసినా తరువాత నా మీద చిరాకు వచ్చేది. పర్ఫెక్ట్ గా ఉన్న నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అతను లావైతే ప్రేమిస్తాడా? కనీసం నన్ను నేను ప్రేమించుకోగలనా? అని అనుకుంటుండగానే నా కడుపులో పాప. మొదట్లో సంతోషంగానే ఉన్నా రోజురోజుకూ నన్ను నేను చూసుకొని దిగులు పడ్డాను. నాకే నేనేంటో తెలియదు, ఇక మరో ప్రాణిని నేను పెంచగలనా అని అనిపించింది. నా దగ్గర ఉన్నదే నా రూపం. అది రోజురోజుకీ విచ్చిన్నం అవుతుంటే నా సంపద అంతా పోగొట్టుకొని నా పాపకి ఏమివ్వగలను? అది నాలానే అంద విహీనంగా పుడితే? అనే దిగులుతో ఉండగానే పాప పుట్టింది. నా పాప నాకు నచ్చింది. అది ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది. కానీ ఈ లోకానికి నచ్చుతుందా? నచ్చితే ఈ లోకం దాన్ని బతకనిస్తుందా? నచ్చకపోతే బాధపెడుతుందా? ఈ దిగులుతోనే నేను మంచం పట్టి మరణించాను. మా ఆయన్ని పాపని చూద్దామని ఇక్కడికి వచ్చాను. తను నన్ను చూసి భయపడి అద్దం పగలగొట్టి వెళ్ళిపోయాడు. తనని భయపెట్టటం నాకు ఇష్టం లేదు. తనకు నా మీద ఇంకా కోపం పోలేదు. నేను ఎలా ఉన్నా అందంగా ఉంటాను అనేవాడు. కానీ ప్రపంచం మొత్తం సన్నగా ఉంటేనే అందంగా ఉన్నట్టనీ, ఇలా ఉంటేనే అందం అని పొద్దస్తమానం చెప్తుంటే తనని నేను ఎలా నమ్మేది? అందుకే కనీసం నా కూతురుకైనా మీ నాన్న మాట విను, నా మాట విను, ఈ ప్రపంచం చెప్పే అందం భూటకమని, తన అందాన్ని అద్దంలో వెతుక్కోవద్దని, నాలాగ అవ్వొద్దని చెప్పడానికి వచ్చాను. మీరు చెప్తారు కదూ? చెప్తానని మాట ఇవ్వండి” అని అంది.

 

రమ్య, అనూషలకి కన్నీళ్ళు ఆగలేదు. అద్దంలో నుంచి బయటకు వచ్చిన చేతిలో చేతులు వేసి ప్రమాణం చేశారు.

 

“నీ స్నేహం తన ప్రాణమని నీపై ఒట్టేస్తోంది…
ఆ ప్రాణం తన గుప్పిట్లో పట్టుకు వెళ్ళిపోతుంది…”

 

ఎందుకో వాళ్ళిద్దరికీ ఈ పాట గుర్తొస్తూనే ఉంది. వాళ్ళ చేతుల్లో వేసిన చేయి మరుక్షణమే కనిపించకుండా పోయింది. అద్దంలో ఆ అమ్మాయి కూడా లేదు. ఇప్పుడు అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ ప్రతిబింబాలే ఉన్నాయి. అవి ఎప్పటి లాగానే లోపాలతోనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ లోపాలతో కూడిన ప్రతిబింబాలు కూడా అందంగానే అనిపిస్తున్నాయి. వాచ్మెను తలుపు కొట్టి పిలుస్తున్నాడు.“ఇదిగోమ్మా కూల్ డ్రింక్! ఇదుగోండి చిల్లర” అని వెళ్ళిపోతున్న అతడిని పిలిచి “సతీష్ గారు ఎక్కడుంటారో తెలుసా?” అని అడిగింది అనూష. అతడు ఫోను నెంబరు, అడ్రస్సూ చెప్పాడు.
తెల్లవారు ఝామున లేచి వాచ్మెను ఇచ్చిన నెంబరుకి ఫోన్ చేసి, అతడిని సాయంత్రం కలుస్తామని చెప్పారు. రమ్య ఎదురు చూస్తున్న ప్యాకర్స్ వ్యాను వచ్చింది. ఆమె స్నేహితులు అందరూ కూడా వచ్చి తలో చెయ్యేసి సామాను సర్దారు. రమ్య, అనూష బయటకు వెళ్ళటానికి తయారు అవుతున్నారు. రమ్య తన వ్యాక్సింగ్ strips తీసి అలవాటుగా వాడదామనుకొని ఒక్క నిమిషం ఆలోచించి వాటిని చెత్తబుట్టలో పడేసింది. అనూష ఫేస్ మాస్క్ వేసుకుందాం అనుకోని ఒక్క నిమిషం అలోచించి కేవలం ముఖం కడుక్కొని తయారై బయలుదేరింది. వాళ్లిద్దరూ ఒక్క అరగంటలో వచ్చేస్తాం అని చెప్పి బయలుదేరుతుండగా

 

“ఇస్తుందో లాక్కుంటోందో ఏమో ఆ చేయి…
చేజారే దాకా అర్ధం కానివ్వని హాయి…
తానెవ్వరు అంటే…
అద్దంలో చూస్తే తను ఓ అమ్మాయి…
నిద్దురకే తెలిసే రంగుల నడిరేయి…”

 

అంటూ మైత్రి పాడుతోంది. ఇద్దరూ వెనక్కి తిరిగి ఏం పాటే అది? అని అడిగారు ఆశ్చర్యంగా.
“అయ్యో ఇది తెలియదా? మా గురువు గారు, ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ రాశారు! అద్దంలో చూస్తే తను ఓ అమ్మాయి అని… భలే ఉంటుందిలే!” అని చెప్పింది’
“అంటే ఇది సినిమా పాటనా? ఏం సినిమా?”
“అనామిక”

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , ,