This Honest Introspection Of A Telugu Guy Studying In America Will Definitely Move You!

 

ఓ పార్క్ లో.. దొరికిన ప్రతి చిన్ని ఆహారాన్ని నిశ్శబ్దంగా అందుకుంటున్న చీమలను, వర్షానికి ముందు వచ్చే గాలికి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయో, భయపడుతున్నాయో తెలియనట్టుగా కదులుతున్న మొక్కలను చూస్తూ తనతో తాను మాట్లాడుకుంటున్న ఒకానొక సందర్భంలో..

 

5-05-2012..
ఇప్పటికి సరిగ్గా ఐదు సంవత్సరాలు నేను అమెరికాకు వచ్చి.. ఐదు సంవత్సరాలు.. ఇంజినీరింగ్ కన్నా ఎక్కువ కాలం, ఒక డిగ్రీ, ఒక పీజి చేసుకునే విలువైన కాలం.. గవర్నమెంట్, ప్రైవేటు ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్స్ పొందే సరైన కాలం, ప్రజలు ఒక పార్టీకి నమ్మకంతో తమని పాలించమని ఇచ్చే నమ్మకమైన కాలం. మరి ఈ కాలాన్ని నేను ఎలా ఉపయోగించుకున్నా..? నాకు నచ్చే కెరీర్ కు ఉపయోగపడని చదువు, ఇప్పటికి స్థిరత్వం లేని ఉద్యోగం, సొంత ఇంటిని కొనలేని జీతం.. ఛా!! ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి రా నీది!!

చిన్నతనంలో మానసికంగా, పరీక్షలలో మార్కుల విషయంలో ఎంత అపరిపక్వతతో ఉండేవానిని.! ఐనా గాని 2 మార్కుల నుండి 94 మార్కులకు ఎదిగాను. ఏ టీచర్ ఐతే నన్ను హేళనగా మాట్లాడారో ఆ టీచర్ యే ఒకానొక దశలో నాతో మాట్లాడడానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడంతో భయపడే స్థాయికి ఎదిగాను.. ప్రతి లక్ష్యంలోను గెలుస్తున్నాను కదా, ప్రతి విషయంలోనూ, నా కదిలికలకు Appreciations వస్తున్నాయి కాదా, ప్రతి ఒక్కరి మీద రివేంజ్(నా ఎదుగుదలతో) తీర్చుకుంటున్నాను కదా అలాగే నా బంధువుల మీద రివేంజ్ తీర్చుకోవడానికి(నేను అమెరికాకు వస్తే వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడుస్తురాని) అని అమెరికాకు వచ్చాను.. అమెరికా రావడమే గెలుపు అనుకున్నాను.. కాని ఏం జరిగింది, చేసిన తప్పుకు నా మీద నేనే పగ తీర్చుకుంటున్నాను.

 

నాన్న.. నాకు తెలుసు నువ్వు “నా కొడుకు అమెరికాకు వెళ్ళాడు అక్కడ చదువుకోని ఉద్యోగం చేస్తున్నాడు” అని ఎంతోమందికి నా గురించి చెబుతూ గర్వపడుతున్నావని.. కాని నాన్న చదువుకునేటప్పుడు ఇంట్లో నుండి తెచ్చుకున్న డబ్బులు ఐపోయాక పార్ట్ టైం జాబ్స్ వెతికితే ఎక్కడా దొరకలేదు. గత్యంతరం లేక ఒక ఇంట్లో పనిమనిషిగా చేరా, కాలేజ్ ఫీజు, రూం రెంట్ కట్టడానికి మరో చోట బాత్రూంలు కడిగా, బీఫ్ షాప్ లో పనిచేశా, కూలిపని చేశా.. “నా కొడుకు అమెరికాలో ఉంటున్నాడు అని చెప్పుకోడానికి బాత్రూంలు కడిగా, మా అన్నయ్య అమెరికాలో ఉంటున్నాడు అని చెప్పుకోడానికి బీఫ్ కొట్టులో పనిచేశా, నా ఫ్రెండు అమెరికాలో ఉంటున్నాడు అని చెప్పుకోడానికి కార్లు క్లీన్ చేశా, పెట్రోల్ బంక్ లో పనిచేశా.. చివరికి ఏదో ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం దొరికింది. దాని కాంట్రాక్ట్ కూడా పుర్తికాబోతుంది. తర్వాత నా పరిస్థితి ఎంటో, నా జీవితం ఎటు పోతుందో.!! నాన్న చిన్నప్పుడు నాకు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడివి. “తప్పు చెయ్యకూడదు.. ఏనాడు తెలిసి తప్పు చెయ్యకూడదు, చేస్తే తల దించుకోవాల్సి ఉంటుంది, భయపడాల్సి ఉంటుంది. నా కొడుకు అలా ఏనాడు భయపడకూడదు” అని చెప్పేవాడివి. కాని ఇక్కడా ఏ తప్పు చెయ్యకుండానే భయపడుతున్నాను. “ఎవడు వచ్చి కాల్చి చంపుతాడో, ఎవడు వచ్చి డబ్బులు లాక్కుంటాడో అని బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నాను” నాన్న.

 

మన ఇండియన్స్ ని చూసినప్పుడల్లా నన్ను నేను వారిలో చూసుకుంటాను వారి అమ్మను మా అమ్మలా ఊహించుకుంటాను “ఏ తల్లికి పుట్టారో.. చిన్నప్పటి నుండి ఎంతో గారాబంతో, అల్లారు ముద్దుగా అమ్మ దగ్గర పెరిగి ఉంటారు ఈరోజు ఇక్కడ ఇంత కష్టపడుతున్నారు.. ఇక్కడ వీళ్ళ పరిస్థితిని చూసి వారి అమ్మ నాన్నలు తట్టుకోగలరా.? ఈ బాధల నుండి రిలీఫ్ కోసం ఎప్పుడైనా ఇండియాకి వద్దామనుకుంటే ఎక్కడ ఇండియాకు వెళ్తే ఈ ట్రంప్ గాడు ఏం చేస్తాడోనని భయంతో చచ్చిపోతున్నా. కిందటి నెల అక్క పెళ్ళిని చూడలేకపోయా.. మొన్న నా ప్రాణ మిత్రుడు రాము గాడు యాక్సిడెంట్ లో చనిపోతే కనీసం కడసారి కూడా చూడలేక ఇక్కడే ఏడుస్తూ చచ్చా.. ఈ ట్రంప్ గాడు సైకో గాడు ఎందుకు ఓట్లు వేసి గెలిపించార్రా!! హిల్లరి గెలిస్తే బాగుండు సైకో అమెరికన్స్ మరో సైకో గాడికి ఓటేశారు..

ఐనా ఇందులో ట్రంపు గాడిది, అమెరికన్స్ ది ఏం తప్పుంది లే.? వాళ్ళ దేశం వాళ్ళిష్టం. వాళ్లకి మొదటి Priority అమెరికన్స్ మీద ఉంటుంది కాని విదేశీయుల మీద ఎందుకుంటుంది.? ఐనా నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను..? బహుశా నాలో దేశ భక్తి చచ్చి ఉంటుంది.. నాలో నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాట స్పూర్తి మాయమైనట్టుంది. ఎవ్వడికైనా కాలదా వాళ్ళ అవకాశాలను ఒక విదేశీయుడు కొల్లగొట్టి ధనవంతుడు అవుతున్నాడంటే. అది వారి దేశభక్తి స్పూర్తి. భారతదేశాన్ని వదిలి ఇక్కడికి వచ్చానంటే దీనంతటికి కారణం భారత ప్రభుత్వాల విధానాలే. అవును.. 75% వచ్చిన తెలివైనవాడికి ఉద్యోగం రాదు కాని 40% వచ్చిన వాడికి దర్జాగా ఉద్యోగం తెప్పిస్తున్న ఈ రిజర్వేషన్లే కారణం. పేదరికం, అంగ వైకల్యం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలి కాని ఈ కులాల్ని బట్టి ఉండడమేంట్రా!! అనుభవించండ్రా.. అందుకే మాలాంటి తెలివైన వారందరమూ విదేశాలకు వెళ్ళిపోతున్నాం అంతంతమాత్రం తెలివితేటలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఈ ప్రభుత్వం ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. రిజర్వేషన్ పోయేంత వరకు ఈ మేధో వలసలు ఉంటూనే ఉంటాయి. అనుభవించండి. మీకిది కావాల్సిందే!!

ఏంటిది నేను ఇంత దారుణంగా కక్ష చూపిస్తున్నాను.. “భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను” అంటూ చిన్నతనంలో ప్రతిజ్ఞ చేసిన నేను ఈరోజు నా మాతృభూమి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నానా..?! స్వార్ధంతో ఎంతగా దిగజారిపోయాను నేను.. నిజంగా నా దేశం ఎంత గొప్ప దేశం. ప్రపంచానికి జ్ఞానం, ఆరోగ్యం, మేధస్సు అందిస్తున్న దేశం. అడుక్కుతినే వాడు కూడా మూడు పూటలా కడుపునింపుతుంది. ఒక్క జన్మకు జన్మకు ఒక్కతే తల్లి ఒక్కడే తండ్రి అలాగే ఒక్కరే జీవిత భాగస్వామి అంటూ జీవించే గొప్ప సాంప్రదాయాలకు నెలవు నా దేశం.. ప్రపంచంలోనే గొప్ప దేశమైన అమెరికా రాజ్యానికి వచ్చి, వారి దేశంలో వారికే అవకాశాలు సన్నగిల్లేలా చేస్తున్నారంటే నా భారతీయులలో ఎంతటి శక్తి సామర్ధ్యాలున్నాయి.

నన్ను నా సొంత కొడుకులా చదువు నేర్పించిన మా రఘు మాష్టారు నా భారతీయుడే, నాకు ఆరోగ్యవంతమైన భోజనం అందించి నా సరైన ఎదుగుదలకు కారణమైన రైతు ఓ భారతీయుడే, నా స్కూల్, నా కాలేజి, భారతదేశంలోని ప్రతి వ్యక్తి ప్రతి ప్రాణి నన్ను మోసిన ప్రతి ఇసుక రేణువు నా ఈ ప్రస్తుత ఉన్నతికి కారణమే. అలాంటి నా తల్లిలాంట దేశాన్ని ఇప్పుడు రెక్కలు రాగానే పట్టించుకోవడం మానేస్తున్నానా.. మరి ఈ రిజర్వేషన్ వ్యవస్థ, కులాల మతాల కుంపులాటలు, వ్యక్తిపూజలు, దిక్కుమాలిన సెంటిమెంట్స్ వీటి సంగతేంటి. ఈ రొచ్చు నాకెందుకులే అని నా పని నేను చుసుకోనా.? ఒకవేళ మహాత్మ గాంధీ నాకెందుకులే నా లాయర్ వృత్తి నా జీవితం అంతే అనుకుంటే ఈరోజు ఇలా ఉండేదా.? భగత్ సింగ్ ప్రాణ త్యాగం, బోస్ పటిష్టమైన సైనిక ప్రణాళికలు తయారుచేయకుండుంటే నా దేశం ఇంకా పంజరంలోనే మగ్గేది. మరి ఈ ప్రస్తుత పరిస్థితులకు సమస్యలకు నాకెందుకులే నాకెందుకులే అని నేను కూడా అనుకుంటే నా లాంటి భరతమాత పిల్లలు ఇంకో వంద సంవత్సరాల పాటు(ఇంకా ఎక్కువే కావచ్చు) ఇలాగే విదేశాలకు వెళ్ళిపోతారు. నా తల్లికి ఎంతటి పుత్ర శోకం, అన్నిటికి మించి విదేశాలలో ఇన్ని కష్టాలు!! అమ్మా.. నువ్వు బాధపడకు నువ్వు కన్న గాంధీలా, భగత్ సింగ్ లా నేను నా జీవితాన్ని ప్రస్తుత సమస్యలపై పోరాటానికి త్యాగం చేస్తున్నాను. ఇంకెప్పుడూ నాలంటి పిల్లలు విదేశాలలకు వెళ్ళే దౌర్భగ్య పరిస్థితులు రానివ్వను.. వాటిని రూపుమాపుతాను అమ్మా.. నేను వచ్చేస్తున్నా..

 

ఇది కేవలం ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కథ, అంతేకాని అమెరికాకు వెళ్ళిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలానే ఉంటుంది అని జడ్జ్ చేయడం లేదు..

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,