ఇంతింతై వటుడింతై – How KTR won the Hearts of Hyderabadis!

రిక్షా తొక్కే వ్యక్తి కొడుకు లాయర్ అయ్యే ఛాన్స్ ఉంది, టీచర్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఏదీ లేకపోతే మళ్ళీ అదే రిక్షా తొక్కి బతికేయగల ఆప్షన్ ఉండనే ఉంది. కానీ రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడే అవుతాడు, సినిమా స్టార్ కొడుకు సినిమా స్టారే అవుతాడు అది మన దౌర్భాగ్యం. ముఖ్యంగా భవిష్యత్తు రాజకీయాల్లో రాణింపజేయడం కోసం కావచ్చు పొలిటికల్ లీడర్ లు తమ పిల్లల్ని ఉగ్గుపాల రోజుల నుంచే అసెంబ్లీ, పార్లమెంట్ మెట్లు ఎక్కడం నేర్పిస్తారు. ముడ్డి కింద నలభై ఏళ్ళు వచ్చినా సరిగ్గా పార్లమెంట్ మెట్లు ఎక్కడం కూడా రాని గొప్ప వంశోద్ధారాకుడి సంగతి మనకి తెలిసిందే. రాకపోయినా ఆయన్నే దొర్లించి, పాకించి, దేకించి ఇతనే మీ నాయకుడు అంటూ దేశం మొత్తానికీ అంటగట్టే ప్రయత్నం గత పదిహేను సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. భవిష్యత్తు లో తమ కుటుంబాన్నే కాక యావత్ దేశాన్నో, రాష్ట్రాన్నో అత్యద్భుతంగా ఉద్దరించేస్తారు అని రాజకీయనాయకులు తమ వారసుల మీద విపరీతమైన నమ్మకం పెంచుకుంటారు. వారు చేస్తున్న పనిని పక్కన పెట్టి మరీ వీరి మనుగడ, ఉన్నతి, ఎదుగుదల కోసం జాతిని పణం గా పెట్టిన విశేషాలు కోకొల్లలు. అలాంటి రాజకీయ వారసులు వందల్లో వేలల్లో ఉన్న ఈ దేశం లో..

కొత్తగా ఒక వారసుడు తన సత్తా చాటి వారసత్వం కేవలం ఒక అవకాశం మాత్రమే అనీ మిగిలినది అంతా సొంతగా నిర్మించుకోవాల్సిన చైతన్యం అనీ నిరూపించాడు. అంతా వెళ్ళిన పాత సరళి ని పూర్తిగా విడిచి పెట్టకుండా అలాగని మరీ మోడుబారి పోనీ రాస్తా ని ఎంచుకుని తన తొలి ప్రయత్నం లోనే సూపర్ సక్సెస్ అయ్యాడు. అతనే కల్వకుంట్ల తారక రామారావు – ఆ పేరుని సైతం తన తండ్రి తన ఫేవరేట్ హీరో – ఎన్టీఆర్ – మీద అభిమానంతో పెట్టగా అదే వ్యక్తి ఇప్పుడు ఆ పెద్దాయన స్థాపించిన పార్టీ పెద్దలకే చెమటలు పట్టించి తుడుచుకోమని కర్చీఫ్ లు అందిస్తున్నాడు. ఇదేదో కేటీఆర్ కి పెట్టిన సన్మాన సభో, అర్ధం లేకుండా చేసే భజనో కానే కాదు. గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడిన తరవాత అంతటి అత్యుత్తమ మెజారిటీ తో 99 సీట్ లు అదీ విపరీతమైన పోటీ మధ్య గెలుచుకోవడం అంటే ఇదేదో వెల్ డన్ అని చేతులు దులిపెసుకునే విషయం అసలే కాదు. 2009 ప్రాంతం లో సున్నా సీట్లతో జీహెచ్ఎంసీ లో అట్టర్ ప్లాప్ అయ్యాం అని తెలిసి కూడా .. గ్రేటర్ ఎన్నికల బాధ్యత తన భుజాన వేసుకుని మరు క్షణం నుంచీ యూత్ వైపు ఆయన పూర్తి టార్గెట్ ని పెట్టాడు. ఎంతమందికి తెలుసో తెలీదో కానీ కేటీఆర్ తన తండ్రి లాగానే మంచి చదువరి. అతని స్పీచ్ లు నిక్కచ్చి గా, ఎదుటి పార్టీ నాయకులని వ్యంగ్యం చేస్తూనే వివరించాల్సిన అసలైన విషయాన్ని వివరిస్తూ, చెప్పాల్సిన అసలు సమాధానాన్ని దాటివేయకుండా సాగాయి. నోటి మాటతో ఆవేశాన్నీ, ఆలోచన నీ మేళవించగల గొప్ప వక్త అతనిలో కనిపించాడు జనాలకి. అతను మొదటి నుంచీ వచ్చిన ఉద్యమ నేపధ్యం అతనికి చక్కగా ఉపయోగపడింది ఈ విషయంలో. సాధారణంగా కొత్త నాయకుడు సమస్యల గురించి మాట్లాడతాడు, కానీ అతనికి ఉద్యమ నేపధ్యం కావచ్చు..ఇంకేదైనా కావచ్చు కేటీఆర్ చెప్పే దాంట్లో సమస్య తో పాటు దాన్ని పరిష్కరించగల అవకాశం దాన్ని సాకారం చేసే విధానం ఇలా ప్రతీదాన్నీ విడమర్చి మరీ చెప్పగల నేర్పరితనం జనాలకి బాగా కనక్ట్ అయ్యేలా చేసింది.

మాట తిరుగుబాటు, సంజాయిషీ, సమాధానం, స్పందన, సముదాయింపూ, హామీ వీటన్నిటినీ వక్త తన మాటలలో చూపించాలి, ఇతర సమయాల్లో నిశబ్దంగా ఉంటూ బ్యాక్ గ్రౌండ్ వర్క్ లో క్యాడర్ లో విశ్వాసం నింపగలగాలి. ఇది చేసి అది చేయకపోయినా అది చేసి ఇది చెయ్యకపోయినా రాత్రింబవళ్ళూ చేసిన కృషి విచ్చిన్నం అయ్యే ప్రమాదం ఉంది. నిజమే కేటీఆర్ చాలా సార్లు మాట తప్పిన సందర్భాలు లేకపోలేదు, కెసిఆర్ సైతం ఆంధ్రోళ్లు అంటూ ఆ మధ్య నెగెటివ్ గా మాట్లాడినా తరవాత అధికారం లోకి వచ్చిన తరవాత మాట మార్చిన మాట వాస్తవమే. ఇది రాజకీయం.. బ్ర‌హ్మం గారి మఠంలో ధ్యానం కాదు. మాట తప్పడాలు, తల పొగరు, పరాభవం, మొహం చాటూ ఇవన్నీ ఇక్కడ కామన్ విషయాలు. కుయుక్తులు వేసినా కుట్రలు పన్నినా అన్నీ జనాల కళ్ళముందే జరగాల్సిన రోజులు ఇవి. అన్నీ జాగ్రత్తగా గమనించిన జనాలు ” గాడిద కి గడ్డి వేస్తే ఆవు పాలు ఎలా ఇస్తుంది ? ” అన్న చిన్న లాజిక్ తో తెరాస వైపు మొగ్గు చూపారు. అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే తమ సిటీ కీ తమకీ మేలు చెయ్యగలదు అని దృడంగా నమ్మి తెరాస కి గుత్తాధిపత్యం కట్టబెట్టారు. వారు ఈ క్రమంలో నడిచిన తీరుకి కేటీఆర్ ఇచ్చిన ఊతం చాలా ముఖ్యమైనది. ఒక జాతికి, ఒక తెగ కి తెలంగాణా వోడు గా పిలిపించుకునే వ్యక్తి ఆంధ్రోళ్ళని మెప్పించి ఓటు బ్యాంకు ని భారీగా రాబట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా రెండు రాష్ట్రాల మధ్యనా విభేదాలు జీరో పర్సెంటేజీ కి రాబోతున్నాయి అని సంకేతం.

రాష్ట్రం ఇస్తే రెండు రాష్ట్రాల మధ్యనా చిచ్చు రేగుతుంది , హైదరాబాద్ లో ఆంధ్రా జనాలకి సేఫ్టీ ఉండదు, నరకం చవిచూస్తారు అంటూ భయపెట్టిన వారు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారో పెరుమాళ్ళ కే ఎరుక. ఓట్ల కోసమో, యూనిటీ కోసమో మనకి అనవసరం కానీ వారు భయపెట్టిన పరిస్థితి ఇప్పటి వరకూ తెలంగాణా ప్రభుత్వం తీసుకురాకపోవడం, అలాంటి చర్యలు ఎక్కడా తలెత్తక పోవడం.. పై పెచ్చు భారీ సెట్లర్ లూ, ఆంధ్రా జనాభా ఉన్న సిటీ ని వారే స్వయంగా తీసుకెళ్ళి కెసిఆర్ చేతిలో పెట్టడం చూస్తుంటే ఈ విశ్వాసాన్ని కెసిఆర్ – కేటీఆర్ లు కచ్చితంగా నిలబెట్టుకోవాల్సిందే. దీనికి ప్రత్యర్ధుల చేతకాని తనం, అర్ధం లేని ప్రచారాలూ, మూస పద్దతి లో హైదరాబాద్ అభివృద్ధి గురించి కొట్టిన డబ్బా ఇవన్నీ జనాలకి విసుగు తెప్పించి ఉండచ్చు. ముందుగా చెప్పినట్టు ఇది భజన కార్యక్రమం కానే కాదు కేవలం ఒక రాజకీయ వారసుడి సక్సెస్ ని మెచ్చుకునే ప్రయత్నం మాత్రమే.. ఇదే స్థానం లో ఎవరు ఇంత ప్రభావం చూపినా ఇలాగే స్పందిద్దాం. హైదరాబాద్ లోని లక్షల మంది మనస్పూర్తి గా, బేషరతు గా, హార్దికంగా, మతాతీతంగా, ప్రాంతీయ భేదాలు లేకుండా చూపించిన చొరవ కేటీఆర్ ని దేశం లోనే ప్రస్తుత అత్యుత్తమ రాజకీయ వారసుడిగా, భవిష్యత్తు లో తెలంగాణా కి అతిపెద్ద నాయకుడిగా నిలబెట్టే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. తేడా వస్తే ఓటర్ల సామూహిక నిశబ్దం ముంచుకుని వచ్చే సునామీ లాంటిదనీ, దాని ప్రభావం చెంపని ఎంత గట్టగా చెళ్ళుమని అనిపిస్తుందో తెలీయని పసిపిల్లోడు ఏమాత్రం కాదు తెలంగాణా ఐటీ మినిస్టరు.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments