Chai Bisket’s Story Series – రుద్ర (Part - 1)

Updated on
Rudra
“జీవితం అనుకొని వచ్చిన వ్యక్తి ప్రాణం కావాలా ? ప్రాణం పణంగా పెట్టి కన్న కొడుకు జీవితం కావాలా ?” అని... మోకాళ్ళ మీద నిల్చొని, ఒళ్లంతా రక్తంతో తడిసి, కనురెప్పలు కదిలించే శక్తి కూడా లేనంత నీరసం కళ్ళలో కనిపిస్తున్న భర్త రెండు కనురెప్పల మధ్యగా తుపాకీని పెట్టిన వ్యక్తి అడుగుతున్నాడు ఆమెని. ఆమెకు ముందుగా అడుగు దూరంలో మోకాళ్ళ మీద కొన ఊపిరితో ఉన్న భర్త, వెనుక కొద్దిదూరం లో దివాన్ మీద పడుకున్న ఆరేళ్ళ కొడుకు. “ఏ ఒక్కరూ నీతో జీవించాలన్నా, నువ్వు నాతో జీవించాల్సిందే. నీకు ఒక్క నిమిషం మాత్రమే సమయం ఉంది, ఆలోచించుకో.” ఆ నిశబ్దంలో, తుపాకి పట్టుకున్న వ్యక్తి కంట్లోని కోరిక ఆమెని కాల్చేస్తుంది, క్షణాల కదలికకు కణాలు కంగారుపడుతున్నాయి, భర్త కనురెప్ప మీదుగా కారి కిందపడుతున్న ప్రతీ రక్తపు బొట్టు శబ్దం ఆమె రక్తాన్ని మరిగిస్తుంది, ఆమె గుండెల్లో శోఖ పర్వతం పేలి కన్నీళ్ళ లావా పొంగుకొస్తుంది, ఆలోచనల సునామీలో మనసు కొట్టుకుపోయింది, భర్తతో గడిపిన అద్భుత క్షణాలు, కొడుకు పుట్టినప్పటి అపురూప క్షణం, అమ్మా అనే మాట విన్న మొదటి సారి... ఇలా గుండె లోయల్లో దాగున్న జ్ఞాపకాలు ఉన్నపళంగా ఉప్పెనలా ముంచెత్తాయి. జీవితమా ? ప్రాణమా ?, భర్తా ? కొడుకా ?... భర్తా ? కొడుకా ?... “భర్తా ? కొడుకా ? ఎవరు కావాలో చెప్పు...చెప్పూ”. ఆయనే... ఆయనే... అని మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంది. “వాః! అసలు సిసలైన పతివ్రత అనిపించుకున్నావ్. ఐతే నీ కొడుకుని చంపెయోచ్చు.” వద్దూ... నీ కాళ్ళు పట్టుకుంటాను. నా కొడుకుని ఏం చేయొద్దు అని ఏడుస్తూ బతిమాలుతుంది. “రెండూ కావాలంటే ఎలా బంగారం. నీ మొహం చూస్తుంటే ఈ పని చేయ్యలనిపించట్లా. హ్మ్...సరే నువ్ కోరినట్లే నీకు ఇద్దరూ ఉండేట్టు చేస్తా.” అంటూ భర్తని కాల్చేస్తాడు. ఆమె పెద్దగా అరుస్తూ, నెల మీద పడబోతున్న భర్త శవాన్ని పట్టుకుంటుంది. ఈ శబ్దానికి, పడుకున్న కొడుకు లేస్తాడు. అమ్మా... అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంటాడు. ఆమె ఏడుస్తుంటుంది. తుపాకి కాల్చిన వ్యక్తి వచ్చి ఆ కుర్రాడిని ఒడిలో కూర్చోపెట్టుకొని ఆమె పక్కన కూర్చుంటాడు. “ఇదిగో నువ్వు కోరినట్టే, నీకు కావల్సినట్టే ఇద్దరినీ ఇస్తున్నా నీకు. ఇదిగో నీ కొడుకు, నీతోనే ఉంటాడు. ఇదిగో నీ భర్త ” అంటూ భర్త రక్తంతో ఆమె నుదుటున బొట్టు పెడతాడు. ఒక్కసారిగా ఏడుపు ఆపేసి, నిశ్చేష్టురాలై షాక్ లో చూస్తుంది ఆమె. “అప్పుడు నిన్ను ప్రాణంగా ప్రేమించాను, వీడు కావాలని వెళ్లిపోయావ్, ఇప్పుడు నువ్వు కోరినట్టుగా చేస్తున్నా. ఈ సారి నేను చెప్పినట్టు వినాల్సిందే. నీ నుండి వచ్చాడు కాబట్టి ఈ రోజునుండి వీడు నా కొడుకు. పదా, మనింటికి పోదాం. నీ కళ్ళలో నీటిని చూడలేక నా గుండె పగిలిపోతుంది. ఇక నాతో రాకతప్పదు.” ఒక్కసారిగా తేరుకొని, నిజంగా నన్ను నువ్వు ప్రేమిస్తే, నాకోసం ఒక పని చేస్తావా? అని అడుగుతుంది ఆమె. “నీకోసం ఏమైనా చేస్తాను, ఒక్క ప్రాణం తప్ప ఏదడిగినా ఇస్తాను.” మా కొడుకుని నీ కొడుకులా చూసుకుంటావా ? “వీడు నా కొడుకు ఈ రోజు నుండి.” మాట తప్పవు కదా. “ప్రాణం సమానంగా చూసుకుంటా.” నవ్వుతూ, అతని తుపాకి తీసుకొని కాల్చుకుంటుంది. “ఎంత పని చేసావ్, నువ్వు నాతో ఉండను అనుంటే ఒప్పుకునేవాడ్ని. నన్ను కాల్చేసినా ఆనందించేవాడ్ని కాని ఇలాంటి పరిస్తితి ఊహించలేదు.” అంటూ భర్తని చంపినా వ్యక్తి ఏడుస్తుంటాడు. ఆమె నా కొడుకుని జాగ్రత్తగా పెంచు అంటూ కొన ఊపిరితో ఆఖరి శ్వాసలో కొడుకుని ముద్దుపెట్టుకొని చనిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత... బిజీగా ఉన్న మార్కెట్ రోడ్డులో, నూనూగు మీసాలు ఉన్న నలుగురు కుర్రాళ్ళు సరదాగా నడుస్తూ వస్తుంటారు. ఒక్క అణా ధర్మం చేసి పుణ్యం కట్టుకోండి బాబు అని ఆ నలుగురి ఎదురుగా వచ్చి అర్దిస్తుంటాడు ఒక ముసలాయిన. ఆ నలుగురిలో ముగ్గురు చిల్లర లేదు తాత అంటూ దాటేసి వెళ్ళిపోతారు, ఒక కుర్రాడు(రుద్ర) తప్ప. మోసం చేసే తెలివి లేనోడే ధర్మం చేయమని చేయి చేస్తాడు అని వెళ్తున్న గణాకి చెప్తూ 100 రూపాయలు ఆ ముసలాయనకి ఇస్తాడు రుద్ర. “పావలా వేసుంటే సరిపోయేది కదా, 100 రూపాయలు అవసరమా కన్నా”. మన దగ్గర ఉన్నప్పుడే సాయం చేయాలి, ఎవరైనా అడిగిన వెంటనే ఇచ్చేయాలి. అదిమానేసి ఇలా ఆ క్షణం దాటిపోయాక ఆలోచించటం వృధా. ఐనా అవేం చమటోడ్చి సంపాదించినవి కావుగా అంటూ ఓ బార్ లోపలకి వెళ్తారు అందరూ. ఎదురుగా క్యాబిన్లో కూర్చున్న బార్ ఓనర్ ని చూస్తూ “బాబాయ్... ఎలా ఉన్నావ్ ? ఓహ్...ఆరు కాకముందే మొదలెట్టేసారా! బాగా తాగండి...తాగి తాగి తగలడిపొండి పనికిమాలిన యదవల్లారా!! ” అని రుద్ర అంటుంటే క్యాబిన్ లో నుండి లేచి రుద్ర దగ్గరికి వచ్చాడు బార్ ఓనర్. ఓనర్ వచ్చింది చూడకుండా... “రేయ్! లైటింగ్ ఏది రా ? ఏం కనపడట్లే, లైట్స్ ఏసి సావండి. బాబాయ్... రాజు గాడు క్లోజ్ చేసే టైం కి వస్తాడు వాడికిచ్చేయ్ డబ్బులు.” అంటాడు రుద్ర. “ఇవ్వటం కుదరకపోతే ?” అని ఓనర్ సమాధానం ఇవ్వగానే, రుద్ర ఓనర్ వైపు చూస్తూ ఆ టైం కి కుదరదా ? అస్సలు ఇవ్వటమే కుదరదా ?. “అస్సలే కుదరదు. ఇక మీరు వెళ్ళొచ్చు.” నీకు ఇవ్వటం కుదరకపోతే నాకు వెళ్ళటం కూడా కుదరదు. “పిల్ల బచ్చావి, నువ్వు బెదిరిస్తుంటే నేను బయపడాలా. రేయ్! బుడ్డోడ్ని ఎత్తుకెళ్ళి బయట దించిరండి.” ఓ నలుగురు ధృడంగా ఉన్న వస్తాదులు వచ్చి రుద్ర ఎదురుగా నిల్చుంటారు. రుద్రతో పాటు గణ, మణి, శివ ఒకరివైపు ఒకరు చూసుకుంటారు. రుద్ర మిగిలిన ముగ్గురి వైపు చూస్తూ ఏరా! ఏం చేద్దామంటారు ? గణా...వీళ్ళని మనం కొట్టగలమా ? “వాళ్ళలో ఒక్కోడే మన నలుగుర్ని మడతెట్టేస్తాడు.” మణి...వీళ్ళు కొడితే తట్టుకోగలమా ? “చాలా రోజులు పడుతుందేమో కోలుకోటానికి.” శివా... ఏం చేద్దాం అంటావ్ రా ? శివ ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళే తలుపు వైపు చేయి చూపిస్తాడు. హా హా హా... శబ్భాష్ రా శివ. మొదటి సారి నువ్వు చెప్పింది చేయాలనిపిస్తుంది. శివ గాడు చెప్పాక వెళ్లిపోవాలి, వస్తాం బాబాయ్ మరి. “మొహం కనపడకుండా గుడ్డ మూసుకొని వెళ్ళటం తప్ప నువ్వేం పీకలేవ్ లే. వెళ్ళు” అంటూ వెటకారంగా ఓ ఎక్స్ప్రెషన్ పెడతాడు షాప్ ఓనర్. బార్ నుండి వెళ్తూ దారిలో పార్క్ ఎదురుగా ఉన్న బల్లా మీద కూర్చుంటారు నలుగురు. “మీ నాన్న కి ఏమని చెప్తాం రుద్ర ?” అని గణ అడుగుతాడు. ఏముంది జరిగిందే చెప్దాం. అరేయ్ శివా!...నా పక్కన కూర్చొని సిగిరెట్ కాల్చోద్దని ఎన్నిసార్లు చెప్పాను. అటు తగలడి తగలబడు. ఇటు కాదు, అటు... ఆ బజ్జీల బండి వైపు అంటూ చేయి చూపిస్తుంటే ఆ బండి వైపు నుండి నుదుటన బొట్టు లేకుండా, తెల్ల చీర కట్టుకున్న పాతికేళ్ళ అమ్మాయి వస్తుంటుంది. బండి దాటి, వాళ్ళ ముందు నుండి వెళ్తున్న ఆమెని కన్నార్పకుండా అలానే చూస్తూ ఉండిపోతాడు రుద్ర. మీరు ఇంటికి వెళ్ళిపొండి అని సైగ చేసి, ఆమె వెనకాలే నడుచుకుంటూ వెళ్తుంటాడు. చాలా దూరం నడుస్తాడు తన వెనుకాలే. వాళ్ళ ఇంటి గేటు వేయటం కోసం వెనక్కి తిరిగినప్పుడు ఆమె కళ్ళవైపు కళ్ళార్పకుండా చూస్తూ ఎదురుగా నిల్చుంటాడు రుద్ర. “ఎవరు మీరు ?, ఏం కావాలి ? ఎవరికోసం వచ్చారు ?” ఆమె ఇలా ఆపకుండా ప్రశంలు గుప్పిస్తుంటే ఊపిరి తీసుకోటం కూడా గుర్తులేనట్టుగా కొయ్యాల నిలబడిపోయి చూస్తుంటాడు రుద్ర. “ఎవరు మీరు ?” అని ఈ సారి గట్టిగా అరిచేప్పటికి స్పృహలోకి వస్తాడు. “మిమ్మల్నే, ఎవరు మీరు ? ఏం కావాలి ?” మీరు నాతో పడుకుంటారా అని అడుగుతాడు రుద్ర. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడితే, ఆమె కొట్టిన దెబ్బకి రుద్ర చెంప ఎర్రబడుతుంది. చెంప పగలకొట్టి, గేటుకి తాళం వేసి లోపలకి వెళ్ళిపోతుంది ఆవిడ. ఆవిడ వైపు కనురెప్ప వేయకుండా అలానే చూస్తూ నిలబడిపోతాడు రుద్ర. చుట్టు పక్కల వాళ్ళంతా నెమ్మదిగా “కొట్టిందా ? ఎందుకు కొట్టుంటుంది ? ఈ కుర్రాడికి ఆమెకి ఏంటి సంబంధం ? మొగుడు చచ్చాక బాగా బరితెగించేసింది, ఇంకా ఎంతమందిని చూడాలో ఆ గడప ముందు...” ఎవరికి తోచింది వాళ్ళు గొణుగుతూ ఉంటారు. రుద్రకి బాగా కోపం వస్తుంది. మొదటి సారి ఒక ఆడదాని చేతిలో భంగపడిన కోపం కంటే, మొదటిసారి ఇష్టపడ్డ వ్యక్తి నిరాకరించిందన్న బాధే తొలిచేస్తుంది అతన్ని. కోపం కంటికి రంగుని తెస్తే, బాధ కన్నీళ్లు తెచ్చి కడిగేయ్యాలని చూస్తుంది. దించిన తల ఎత్తకుండా సరాసరి బార్ కి వచ్చి కూర్చున్నాడు. తర్వాతి రోజు పొద్దున్న... నువ్వు చెప్పిందే నిజమోయ్ చలం. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే తట్టుకోలేరు ఈ మనుషులు. మొదటిసారి ఒక ఆశపుట్టింది, తనని కలవాలనే కోరిక జనించినప్పుడు తనని కాక ఇంకెవరిని అడగమంటావ్. నువ్వేమంటావ్... తొందరపడ్డానా ? అందరూ నీలా, నాలా ఆలోచించలేరు కదా. కొద్దిగా సరళంగా అడిగుండాల్సింది అంటావా ? ఏదోటి చెప్పవోయ్! అలా శూన్యం లోకి చూస్తూ బస్తాల నిండుగా దస్తాలు నింపుతావే కాని, ఒక్కసారైనా ఒక్క సలహా పడెయ్యవే అంటూ ఇంట్లో మంచం మీద కూర్చొని, చలం పుస్తాకాన్ని పట్టుకొని దానితో మాట్లాడుతుంటాడు రుద్ర. ఈ లోపు రుద్ర చెల్లెలు శోభ పరిగెత్తుకుంటూ “అన్నయా, రాత్రి ఏం చేసావ్ రా? నాన్నని అడుగుతున్నారు పోలీసులు నీ గురించి.” అంటూ రుద్ర గదిలోకి వస్తుంది. రుద్రని చూసి “అయ్యో! మోహం అంతా కమిలిపోయింది, చేతికి ఆ దెబ్బెలా తగిలింది రా.” శోభ అడిగేంతవరకు రుద్ర కూడా గమనించడు. నిజమేనే, ఈ దెబ్బెలా తగిలింది ? నాకు గుర్తులేదు. “ముందు లేచి మొహం కడుక్కొని త్వరగా రా...నాన్న రమ్మంటున్నారు.” మొహం కడుక్కోని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళగానే, అప్పటికే అక్కడ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్న పోలీసులు ఇద్దరూ... రుద్రని చూసి ఆశ్చర్యపడి లేస్తారు. “శంకరన్నా, ఇతనేనా మీ పెద్ద కొడకు రుద్ర?” అని పోలీసులు రుద్ర వాళ్ళ నాన్న శంకర్ ని అడుగుతారు. ఔను, నేనే రుద్ర, ఏంటి విషయం ? శంకరన్న వైపు చూస్తూ పోలీసులు “అన్నా, మీరు అనుమతిస్తే మీ అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఆ బార్ షాప్ ఓనర్ రుద్ర మీద కేసు పెట్టాడు.” గణ, మణి, శివ వైపు చూస్తూ శంకరన్న “ఏరా! గొడవేం జరగలేదు అన్నారు. మరి ఇదేంటి ? నువ్వొక్కడివే ఏమైనా చేశావా ?” అని రుద్రని అడుగుతాడు. అయ్యయో, నేనేం చేయలేదు నానా. వస్తాదుల్ని కొట్టేంత పెద్దోడ్ని కాలేదు. శంకరన్న ఎదో అడిగేలోపు పోలీసులు “రుద్రని చూస్తే వాళ్ళని కొట్టేలా లేడు, కాని నిన్న రాత్రి చూసిన వాళ్ళు ఓ ఇద్దరు ముగ్గురు రుద్రానే అని చెప్తున్నారు. అన్నా మీరు ఒప్పుకుంటే స్టేషన్ కి అలా తీసుకెళ్ళి, ఇలా తీసుకొస్తాం జాగ్రత్తగా.” రుద్ర వైపు చూస్తూ శంకరన్న “ఏంటి మరి వెళ్ళొస్తావా ఒకసారి ?” వెళ్ళొస్తా, రాత్రి ఏం జరిగిందో నాకూ తెలియాలి కదా.... మిగిలిన కథ తర్వాతి భాగం లో