(జరిగిన కథ - Part-1, Part- 2, Part-3.)
అతను మాట్లాడటం చూడటం అదే మొదటిసారి. నా వైపు ఎందుకు వచ్చాడో ఎందుకు అలా అన్నాడో అర్ధం అవ్వలేదు కాని ఆశ్చర్యం వేసింది. ఏదో చెప్పాలనుకున్నడా లేక ఏదోటి చెప్పి వెళ్ళాడా !? ఎక్కువ ఆలోచించలేదు లేదు నేను. అతని మాటలు అక్కడే వదిలేసి ఇంటికి బయలుదేరాను. దారిలో ప్రతి ఒక్కరు వింతగా ఆశ్చర్యంగా అర్ధంకాని చూపులతో నా వైపే చూస్తున్నారు. చాలా నెలల తర్వాత ఊరు వచ్చాను కదా అందులోను మబ్బు పట్టి ఉంది సాయంత్రం సమయం కదూ కరెంటు కూడా లేదు ముఖం సరిగా కనిపించక అలా చూస్తున్నారేమో అనుకున్నాను నేను. ఇంటికి వెళ్లి ముందరి గేటు తీస్తుండగా ఎవరూ అంటూ అడిగారు వరండాలో కూర్చున్న నాన్న. నేనే నాన్న అంటూ గేటు మూసి లోపలకి వెళ్ళాను నేను. “ఏంట్రా ఒక్క మాట కూడా చెప్పకుండా ఉన్నపళంగా వచ్చేసావ్ ఏమైనా సమస్యా” అని అడిగారు నాన్న. నాన్న కి టీ తీసుకువస్తున్న అమ్మ నన్ను చూడగానే “ఏరా ఎంత సేపయ్యింది వచ్చి సర్లే పో వెళ్లి స్నానం చేసి త్వరగా రా పకోడీలు చేస్తా తిందువు కాని వెళ్ళు” అనింది. ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్తే సమస్యలు ఏముంటాయ్ నేనేదో ఊరి నుండి ఇవ్వాలే వచ్చినట్టు ఇంతగా అడుగుతున్నారేంటి వీళ్ళకి మరీ చాదస్తం ఎక్కువ అయ్యింది అనుకుంటూ వెళ్లి స్నానం చేసి వచ్చాను నేను. ఈ లోపు కరెంటు కూడా వచ్చేసింది. టీవీ రూమ్ లో కూర్చొని పాటలు చూస్తుంటే పకోడీలు తీసుకొని అమ్మ వచ్చింది అమ్మ వెనుకాలే నాన్న కూడా. నాన్న నా పక్కనే కూర్చున్నారు అమ్మ బాత్రూమ్ లో నీళ్ళ చప్పుడు వస్తుందని ఆపటానికి వెళ్ళింది. “ఇప్పుడు చెప్పు ఏంటి ఇంత సడెన్ గా వచ్చావ్ ఏదైనా ఇబ్బందా ఆఫీసులో” మళ్ళీ అదే ప్రశ్న అడిగారు నాన్న. నేను ఎదో చెప్పేలోపు “ఏరా ఎక్కడ తిరిగి వచ్చావ్ ఇంత మురికిగా నల్లగా అయ్యాయ్ ఏంటి బట్టలు ? ఏసి రూములే అట కదా మీవన్నీ మరి బొగ్గు గనుల్లో పని చేసేవాడిలా ఇంతగా దుమ్ము బూజు పట్టిపోయాయ్, బ్యాగ్ కూడా ఇక్కడే ఏసావ్ ఇటు రా ఒకసారి” అని బాత్రూం నుండి అరుస్తుంది అమ్మ. బయట కూర్చున్నాం కదా కొద్దిగా దుమ్ము పడితే పట్టొచ్చు కాని బూజు పట్టటం ఏంటి ? నల్లగా ఎందుకు అవుతాయ్ అనుకుంటూ వెళ్లి చూసాను. నమ్మలేకపోయాను అలా ఎలా అయ్యాయో తెలీలేదు. వాళ్ళింట్లో ఎక్కడో బూజు అంటి ఉండొచ్చు అది సరే మరి ఈ నల్ల రంగు మాటేమిటి ఇది ఎక్కడినుండి వచ్చింది అని ఆలోచిస్తుంటే “గొంతు చించుకు అరుస్తుంటే మాట్లాడవేరా” అని కదిలించింది అమ్మ. ఆ...అదే మన ఊరి ఆయుర్వేద వైద్యులు లేరు “లేరుగా ఆయన ఎప్పుడో చనిపోయారు గా” అని అడ్డుగా మాట్లాడింది చెల్లి. పరిక్షలు దగ్గరలో పెట్టుకొని చదువుకోకుండా ఇక్కడేం పనే నీకు, పో పుస్తకం తీయ్ పావు గంటలో వచ్చి ప్రశ్నలు అడుగుతా అని చెల్లికి చెప్పి పంపించి, నేను వచ్చిన బస్సుపాతదిలే అందులో అంటుకొని ఉంటాయ్ అంతే అని అమ్మకు చెప్పి, సమస్యేం లేదు నాన్న మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను అంతే అని నాన్నకు సమాధానం ఇచ్చాను. అంతేనా అంటూ అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు వేగంగా నేను మేడపైకి వచ్చాను. నిజమే కదా ఆయుర్వేద వైద్యడు ఎప్పుడో చనిపోయారు మరి ఇంతసేపు నేను మాట్లాడింది ఎవరితో !? నాకు భయం కంటే ఆయన నిజం కాదేమో అన్న బాధ ఎక్కువయ్యింది. ఎందుకంటే ఆయన నిజం కాకపొతే నాకు రేపు ఆ హరిశ్చంద్ర వేదిక గురించి, రాధ గోవింద్ గురించి ఎవరు చెప్తారు అనే బాధ. వేగంగా కిందకు దిగి నాన్న దగ్గరికి వెళ్ళాను. ఆయనకు తెలీదని చెప్పారు. “నాకు అంతగా తెలీదు రా, మా అమ్మ వాళ్ళ చినప్పుడు బాగా తిరిగేవాడు. ఆయన చెయ్యి పట్టుకునే మనకేం ఇబ్బంది ఉందో చెప్పేవాడు, ఒక్క రూపాయి కూడా తీసుకునేవాడు కాదు చాల మంచి వ్యక్తి. మా అమ్మ వాళ్ళ చినప్పుడే చనిపోయాడు ఎలా చనిపోయాడో ఎవరికీ తెలీదు. ఆయన అకాల అకారణ మరణాన్ని తట్టుకోలేక ఉన్న ఒక్క కొడుకు పిచ్చివాడు అయ్యాడు. ఐనా ఇప్పుడు ఆయన గురించి నీకెందుకోయ్ పో అలసిపోయి వచ్చినట్టున్నావ్ కొద్దిసేపు నడుం వాల్చు భోజనానికి లేపుతాను” అంటూ చెప్పింది అమ్మ. మంచం మీద పడుకొని ఆలోచించటం మొదలెట్టాను. సెలవలని చెప్పి ఇంటికి రావటం, ఎవరో ఆయన రమ్మన్నారని పిలవటం, అమ్మకు చెప్పి వెళ్ళటం, గేటు తీయటం, ఆయన ఎదురు రావటం, ఇంట్లోకి వెళ్ళటం, పెరట్లో కూర్చోటం, టీ తాగుతూ కథ వినటం, బొండాం ఎగిరివచ్చి మా దగ్గరలో పడటం, పని వాళ్ళు కదలకుండా ఉండటం, ఆ పెద్దాయన నన్ను జాగ్రతగా ఉండమని చెప్పడం, ఈ రోజుకు చాలు రేపు రా అని చెప్పటం ఇవన్నీ నా భ్రమాలేనా లేక ఇప్పుడు భ్రమపడుతున్నానా ? అక్కడ జరిగింది అంతా అబద్ధమా ? అంటే ఆ ఇంటి ముందు నాతో మాట్లాడింది ఆయన కొడుకా ? వెంటనే లేచి వెళ్లి అమ్మని అడిగాను కొడుకు గురించి చెప్పమని. ముందు చెప్పను అన్నది కాని బతిమాలేప్పటికి చెప్పటం మొదలెట్టింది. “ ఆయనకు ఒక్కడే కొడకురా చిన్నప్పటి నుండి దేవుడు లేడు, రాళ్ళను పూజించకండి అంటూ ఊర్లు తిరిగి ప్రచారాలు చేసేవాడు. కొద్ది కాలానికి అందరూ అతన్నో పిచ్చివాడు కింద ముద్రేసి పట్టించుకోవటం మానేశారు. వాళ్ళ నాన్న చనిపోయియన తర్వాత నుండి నోరు తెరవలేదు. ఎప్పుడో ఒక సారి మన ఊరి వైపు వస్తుంటాడటా అది కూడా వాళ్ళ ఇంటి ఎదురుగా రోజంతా కూర్చొని వెళ్ళిపోతాడు”. ఇప్పటివరకు ఆయన ఎవ్వరితో మాట్లాడలేదా బాగా గుర్తుతెచ్చుకో. “ఆ అంటే ఒక్కసారి ఎప్పుడో మన ఊరికి కొత్తగా వచ్చిన ఓ అధికారితో మాట్లాడాడు అంటా ఆ తర్వాత రోజు నుండి ఆ అధికారి ఏం అయ్యాడో ఎవ్వరికి తెలీదు. అయినా వాళ్ళ గురించి నీకెందుకు ఇప్పుడు పో పడుకో పో నేను వంట చేసుకోవాలి”. పడుకొని ఆలోచిస్తున్నాను...నేనసలు మా ఊరు ఎలా వచ్చానో గుర్తురావటం లేదు నాకు.అది గురువారం పైగా హాలిడే కూడా కాదు మరి ఉన్నపళంగా ఎందుకు వచ్చాను మా ఊరు. పొద్దున్న ఇంటికి వచ్చినట్టు నాకు అనిపించింది కాని ఇంట్లో వాళ్ళు నన్ను ఇప్పుడే వచ్చినట్టు చూస్తున్నారు ఏం జరుగుతుంది గురువుగారు అని గోడ మీద ఉన్న బాబా ఫోటో ని అడుగుతున్నాను. బాబా ఫోటోలో నా మంచం పైన ఉన్న బ్యాగ్ కనిపిస్తుంది. వెంటనే వెళ్లి బ్యాగ్ మొత్తం చూసాను లాప్టాప్, కొన్ని పుస్తకాలు, రెండు చొక్కాలు, ఒక ప్యాంటు తప్ప ఇంకేం లేవు. అన్నీ లోపల పెడుతున్నాను అప్పుడు కనిపించింది నాకే తెలీని ఓ పుస్తకం చూడటానికి పాత కాలం నాటిదిలా ఉంది. మిగిలనవి అన్నీ లోపల పెట్టి ఈ డైరీ ని చదవుదాం అని తీశాను. వంట గదిలో పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే డైరీ పక్కన పడేసి ఏమైంది అంటూ వంటగదికి వెళ్లాను. అన్నం అంతా గది నిండా పడి ఉంది, అమ్మ చేతులు వణుకుతున్నాయ్ ఏం మాట్లాడలేక పోతుంది మాట్లాడాలంటే తడబడుతుంది దేన్నో చూసి భయపడుతుంది అని అర్ధం అవుతుంది. అమ్మను తీసుకెళ్ళి కూర్చోపెట్టి మంచి నీళ్ళు ఇచ్చి తాపిస్తూ పక్కనే కూర్చున్నాను. “నా కొడుకుని ఏమి చేయొద్దు, నా కొడుకుని ఏమి చేయొద్దు...నా కొడుకుని ఏమి చేయొద్దు” అని మెల్లిగా పదే పదే అదే మాట పలుకుతుంది అమ్మ. అమ్మని గట్టిగా కదిలించి తను తేరుకుంది అని తెలిసాక ఏమైంది అని అడిగాను. “ఎవరో నిన్ను చంపేస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు రా కిటికీ అవతలి వైపు నుండి” అని చెప్పింది అమ్మ. నన్నెందుకు చంపుతారే నువ్వు ఎదో భ్రమపడి ఉంటావ్. ఆ చెత్త సీరియల్స్ చూడకు అంటే వినకు కదా అని మాట మార్చేసి సర్లే కొద్దిసేపు నడుంవాల్చు పొద్దుటి నుండి చేసి చేసి అలసిపోయావ్ కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకపోతే ఇలానే అనిపిస్తుంది. అంత శబ్దం వచ్చినా చెల్లి నాన్న రాలేదేంటి అనుకుంటూ చెల్లి రూమ్ దగ్గరికి వెళ్ళాను తలుపు వేసి ఉంది. చదువుకుంటుందేమో అనుకోని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక వెళ్ళిపోతుండగా తన గదిలో లైట్ ఆఫ్ అయినట్టు అనిపించి తలుపు కొట్టాను. మూడు నాలుగు సార్లు కొట్టాను తీయలేదు లోపలి నుండి లాక్ చేసినట్టు ఉంది డోర్. వెంటనే వేరే కీ తీసుకువచ్చి తెరిచి చూసాను అంతా చీకటి. బిందు...బిందూ అంటూ లోపల కాలు పెట్టగానే కాలు కింద ఒక చేయి ఉనట్టు అనిపించింది లైట్ వేసి చూస్తే బిందు చేయిపైనే నేను కాలేసింది. తను చలనం లేకుండా పడుంది నాకు భీభత్సంగా భయమేసింది. తనని లేపి మంచంపై పడుకోపెట్టి నీళ్ళు చల్లాను. ఒక్కసారిగా ఉలిక్కిపడిలేచి “మా అన్నని చంపొద్దు... మా అన్నని చంపొద్దు... మా అన్నని చంపొద్దు” అని అరుస్తుంది. తను కూడా దేన్నో చూసి భయపడుతుంది, గట్టిగా కదిలించి ఏమైందే అని అడిగాను. “ఎవరో నిన్ను చంపేస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు రా కిటికీ అవతలి వైపు నుండి” అని చెప్పింది తను కూడా. నీ మొహం సరిగ్గా తినక పొద్దుటి నుండి సాయంత్రం వరకు చదివితే ఇలానే స్పృహ కోల్పోతావ్. ఐనా మనకు స్టేట్ రాంకులు ఏం అవసరం లేదు కాని పాస్ అవ్వు చాలు అంతకు మించి చదవకు కొద్ది సేపు పడుకో, పాలు తీసుకొస్తా అని మాట మార్చి తనని పడుకోమని చెప్పి వచ్చేసాను. నాన్న గురించి ఆలోచిస్తూ చెల్లి గది డోర్ మూసి వెనక్కి తిరగ్గానే ఎవరో ఉనట్టు అనిపించింది. దడుచుకొని వెనకున్న డోర్ మీద పడ్డాను. ఆ తర్వాత ఇల్లంతా వెతికాను నాన్న కనపడలేదు. వరండాలో నిలబడి ఎక్కడికి వెళ్లారు అనుకుంటుంటే నీటి బుడుగల శబ్దం గట్టిగా వస్తుంది. మా నాన్న మునిగిపోయారేమో అని ఖంగారుగా వెళ్లి చూసాను ఆ సింక్ పక్కనే పడి ఉన్నారు ఆయన. “నా కొడుకుని ఏమి చేయొద్దు, నా కొడుకుని ఏమి చేయొద్దు...నా కొడుకుని ఏమి చేయొద్దు” అని మెల్లిగా పదే పదే అదే మాట పలుకుతున్నారు ఆయన కూడా. పక్కనే ఓ లెటర్ పడి ఉంది దాంట్లో వెంటనే వెళ్లి డైరీ లో మొదటి పేజి చూడు అని రాసి ఉంది. నేను నాన్నని లేపి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుండబెట్టి పరుగున వెళ్లి ఆ డైరీ మొదటి పేజి ని చూసాను “ఇంతటితో మర్చిపో ఎక్కువ తెలుసుకుంటే నీకే ప్రమాదం” అని రాసుంది. డైరీ లో మరో పేపర్ తిప్పుతుంటే ఎవరో నా మెడని ఒక్కసారిగా పిసికనట్టు అనిపించింది ఊపిరాడటం లేదు ఒక్కసారిగా బకెట్ నీళ్ళు పడ్డాయ్ మొహం మీద ఉలిక్కిపడి లేచాను “నన్నేం చేయొద్దు... నన్నేం చేయొద్దు... నన్నే చేయొద్దు” అని నాకే తెలీకుండా పలుకుతున్నాను నేను. “ఏమైందిరా నీకు ఒళ్లంతా చెమట తో తడిసిపోయిందేంటి ఫ్యాన్ ఏసుకు చావచ్చు గా నిన్ను నేనేం చేస్తాను రా బాబు రా ఈరోజైనా అందరం కలిసి తిందాం” అని చెప్పి వెళ్ళిపోయింది చెల్లి. అంటే ఇదంతా కలా... అమ్మ ఆ పిచ్చివాడి గురించి చెప్పిన తర్వాత వచ్చి పడుకున్నప్పుడు వచ్చిన కలా ఇది నిజమేమో అని తెగ భయపడ్డాను. “రేయ్...ఆ మొహం కడుక్కొని రా త్వరగా” అని మధ్య రూమ్ నుండి చెల్లి పిలుస్తుంది. వస్తున్నా అని లేచాను నేను. నా మంచం పక్కగా ఉన్న బ్యాగ్ మీద డైరీ లో మొదటి పేజి ఓపెన్ చేసి ఉంది. కిటికీ నుండి వచ్చే గాలికి పేజీలు కదులుతున్నాయ్. కిటికీ బయట గేటు అవతల దూరంగా పిచ్చివాడు మా ఇంటివైపే చూస్తున్నాడు... మిగతాది వచ్చేవారం