Chai Bisket's Story Series - రాధే గోవింద (Part - 2)

Updated on
Chai Bisket's Story Series - రాధే గోవింద (Part - 2)
(జరిగిన కథ - Part 1) రాధా గోవింద్ గురించి చెప్పిన వ్యక్తి డెబ్బై ఏళ్ళ ముసలాడు, ఆయనో వైద్యుడు, ప్రస్తుతం అతనితో పాటు ఇద్దరు పని వాళ్ళు ఉంటున్నారు, పెద్ద ఇల్లు, భార్య ఈ మధ్యనే చనిపోయింది. పిల్లలు విదేశాల్లో ఉంటారు. ఈయన ప్రవర్తన కొద్దిగా వింతగా ఉంటుందని ఊర్లో అందరు అంటుంటారు, ఆయన్ని కలవటానికి మొదట నేను భయపడ్డాను ఎందుకంటే వాళ్ళ భార్యను చంపింది ఆయనే, అందుకే ఆయన పిల్లలు అతన్ని చూడటానికి కూడా రారు అని చాలా మంది అనుకునేవారు.ఇదంతా కల్పనే కాని అందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలీదు. సాధారణంగా ఎవ్వరితో కలవని ఆయన, ఒకసారి నేను ఊరికి వెళ్ళిన రోజు కలవమని పని వాళ్లతో కబురు చేసారు. మా చిన్నప్పటినుండి ఆ ఇల్లు చూస్తున్నాం, వాళ్ళ పిల్లలు కాని భార్య కాని కనీసం ఆయన ఎవ్వరితోనైనా మాట్లాడటం కాని మేము చూసింది లేదు. అలాంటిది ఆయన నన్ను ఎందుకు పిలిచారో అని ఆశ్చర్యం కలిగింది నాకు. కాని ఆ సమాధుల మిస్టరీ గురించి ఈయనకు తెలిసే అవకాశం ఉంటుందని వెళ్లాను నేను, ఎందుకంటే జబ్బు చేసిన వారికి వైద్యం చేసింది, ఆ సమాధుల చెరువు దగ్గరికి ఎక్కువ సార్లు వెళ్ళింది ఆయన ఒక్కడే. ఆయన దగ్గరికి ధైర్యం చేసి వెళ్ళాను, ఆయన్ని చూసిన తర్వాత అప్పటివరకు అందరూ అనుకునేవన్నీ తప్పని గ్రహించాను. ఆయన ఆతిధ్యం చాలా గొప్పగా ఉంది, గుమ్మం దగ్గర నన్ను చూడగానే ఆయనే లేచి వచ్చి లోపలకి తీసుకెళ్ళారు. చాలా శుభ్రంగా, ప్రశాంతంగా, గొప్పగా ఉంది ఆ ఇల్లు. ఇంట్లోని ఖరీదైన వస్తువులు చూస్తుంటే వాళ్ళ ఐశ్వర్యం గురించి తెలుస్తుంది. వాళ్ళ పెరట్లో జామ చెట్టు కింద రెండు కుర్చీలు వేయించారు మా వెనుకగా కొద్ది దూరంలో అరటి చెట్లు, నన్ను కూర్చోమని ఆయన ఎదురుగా కూర్చున్నారు. వెండిలా మెరిసిపోతున్న జుట్టు పెద్ద గడ్డం, చామనచాయ రంగు, ఆరడుగుల పైగా ఎత్తు, అంత వయసులో కూడా నిటారుగా నడుస్తున్నారు, గోధుమ రంగు ఖద్దరు చొక్కా, పంచె వేసుకున్న ఆయన్ని చూస్తుంటే మహర్షిలా అనిపించారు. వాళ్ళ పెరట్లో ఆయుర్వేదానికి సంబందించిన మొక్కలు, చిన్న రోలు, చిన్న చిన్న గాజు సీసాల్లో భద్రపరిచిన ఆకు రసాలు, నల్లటి మందు బిళ్ళలు, దేవుడి పటాలు, పెద్ద కొబ్బరి చెట్టు దాని కింద పెద్ద అరుగు, దాని మీద ఓ చాప, అటు పక్కగా పెద్ద గిరకల బావి, ఒక మూలగా మూడు గేదెలు రెండు ఆవులు, వాటికోసం తెచ్చిన గడ్డి మోపులు, చివరిగా పెద్ద జామ చెట్టు, దాని వెనుక కొన్ని అరటి చెట్లు చూస్తుంటే చాలా ఆహ్లాదంగా అనిపించింది మనసుకి. ఆ ఇంటి ముందు కన్నా వెనుక చాలా స్థలం ఉంది, అవన్నీ చూస్తుంటే ఆయనో పెద్ద ఆయుర్వేద వైద్యుడు అని అర్ధమయ్యింది. ఆ తర్వాత ఇద్దరికీ టీ తెప్పించారు, టీ తాగుతూ ఎందుకు పిలిచారో అడుగుదాం అనుకునేలోపు “హరిశ్చంద్ర వేదిక గురించి నీకెందుకు అంత ఆసక్తి ?” అని అడిగారు. ఆ సమాధుల చెరువుని హరిశ్చంద్ర వేదిక అనేవారట అప్పటివరకు ఎవ్వరూ చెప్పలేదు నాకు. ఎవ్వరి గురించి పట్టించుకోని మనిషికి నేను వాటి గురించి తెలుసుకుంటున్న విషయం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసింది. “ఊర్లో వాళ్ళు నీ గురించి మాట్లాడుకుంటుంటే తెలిసిందిలే, నీకెందుకు అంత ఆసక్తి ?”. ఈ సారి భయం వేసింది, నేను మనసులో అనుకునే మాటలకు ఆయన సమాధానం ఎలా చెప్తున్నాడని. మనిషేనా అన్న భయం వేసింది, కాళ్ళ వైపు చూసాను, ఆయన నీడ పడుతుందో లేదో చూసాను, చుట్టూ చూసాను పని వాళ్ళ కోసం దూరంగా ఉన్నారు వాళ్ళు ఏదో పనిలో, ఆంజనేయ మంత్రం మనసులో చదువుకుంటున్నాను ఇంతలో “హా హా హా... నేను మనిషినే బాబు. ఇంత భయస్తుడివి దాని గురించి చెప్తే తట్టుకోగాలవా మరీ” అన్నారు ఆయన. బాబోయ్ ఏంటి ఈ మనిషికి మనసును చదివే విద్య కూడా తెలిసినట్టు ఉందే, లాభం లేదు మనసులో కాదు మాటల్లో అడగాల్సిందే అనుకోని, ఎందుకు ఆసక్తి అంటే చెప్పలేనండి, కాని తెలుసుకోవాలనే కుతూహలం నాలో ఆసక్తిని రేపుతుంది, పైగా నేను ఇలాంటి విషయాల పైనే పరిశోధన చేస్తున్నాను, మీరు ఏమి అనుకోకపోతే ఆ చెరువు అదే హరిశ్చంద్ర వేదిక గురించి చెప్పే ముందు మీ గురించి కొంచెం తెలుసుకోవచ్చా అని అడిగాను నేను. “నేనో ఆయుర్వేద వైద్యుడిని, నాకు ఎదుటివాడి మనసును చదవటం తెలుసు, కాని అందరివి కాదు నాకు నచ్చిన వారి గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమె చదువుతాను, నువ్వు భయపడాల్సిన పని లేదు ఆ వేదిక గురించి నీకేం కావాలో అడుగు చెప్తాను”. ఇంకో చిన్న సందేహం, ఇంత కాలం ఎవ్వరితో మాట్లాడని మీరు నన్ను పిలిచిమరీ ఆ వేదిక గురించిన విషయాలు పంచుకోవటానికి కారణం ? “హా హా హా హా.... హరిశ్చంద్ర వేదిక గురించిన మొత్తం కథ చెప్పటం పూర్తయ్యే ముందు నీకు తెలుస్తుంది”. ఆయన మాట తీరు, నవ్వు చూస్తుంటే భయం అనిపించినా, ఆయనకు ఆ కథ తెలుసు కనుక ధైర్యం చేసి మీరు చెప్తాను అంటే నేను తెలుసుకోటానికి సిద్ధం అండి. ఆయన మొదలెట్టారు నేనో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యుడిని, మీ ఊరితో పాటుగా ఇంకో నాలుగు ఊర్లకు నేనే వైద్యం చేసేవాడిని. నేనొచ్చిన అప్పుడు మొదటగా విన్నది హరిశ్చంద్ర వేదిక గురించి. వెంటనే వెళ్లి చూసొచ్చాను. అందరూ చెప్పినట్టుగా అక్కడ అంత భయంకరమైన వాతావరణం మట్టుకు లేదు అప్పుడు. కేవలం జబ్బుతో అకస్మాత్తుగా చనిపోయిన వారిని వారి కుటుంబ సభ్యులతో సహా అక్కడ దహనం చేసేవారు. నేను ఎంతగా పోరాడినా ఒక్కరిని కూడా కాపాడలేకపోయాను. చాలా మందిని మందులతో నయం చేయగలిగాను, నయం చేసినప్పుడు నన్ను దేవుడిలా చూసేవారు, నయం చేయలేనప్పుడు హంతకుడిలా చూసేవారు. నేను వచ్చినప్పుడు ఇదే ఇంట్లో బస ఏర్పాటు చేసారు. ఈ పెరట్లోనే ఎంతో మందికి వైద్యం చేసాను. నాకు పెళ్లి అవ్వక ముందు దాదాపుగా ప్రతీ రోజు అర్ధరాత్రి తర్వాత “కాపాడండి అయ్యా, ఈ నరకం నుండి కాపాడండి” అంటూ బిగ్గరగా అరుస్తూ ఎవరో ఒకరు తలుపు కొడుతూ ఉండేవారు, చాలాసార్లు తలుపు తీసినప్పుడు ఎవ్వరూ కనపడేవారు కాదు వేసిన గేటు వేసినట్టే ఉండేది. నాకు దేవుడి మీద, దయ్యాల మీద పెద్దగా నమ్మకం ఉండేది కాదు, కుర్రతనం కదూ కంటికి కనపడనిది ఏది నమ్మేవాడిని కాదు. మీ ఊరు నా ఆలోచనలని నమ్మకాలను విశ్వాసాలను అన్నిటిని మార్చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ, భయం పరిచయం అయ్యింది ఇక్కడే. రాధ... మరి మీకు ఇప్పుడు దయ్యాలు దేవుడు అనే వాటిపైన నమ్మకం ఉందా ? అంటూ అడ్డుకున్నాను నేను. “ఇన్నేళ్ళ నా అనుభవంతో ఒక్కమాట చెప్పగలను కనిపించినంత మాత్రాన ఉనట్టు కాదు, కనపడనివన్నీ లేనట్టు కాదు. నీకు చూసేంత శక్తి, ఒప్పుకునే ధైర్యం, అర్ధం చేసుకొనేంత తెలివి ఉంటె తప్ప కొన్ని విషయాల అనుభవం పొందలేవు”. అర్ధం కాలేదు, క్షమించండి కొద్దిగా ఉదహరించి చెప్పగలరా. “నిరంతరం పీల్చే గాలి కనిపించిందా ఎప్పుడైనా, ప్రాణం ఉంది అంటారు కదా చూసావా ఒక్కసారైనా, ఎండమావుల్లో కనిపించే నీటిని తాకిన వారు కాని తాగిన వారు కాని ఉన్నారా !?”. ఆయన చెప్పిన ఉదాహరణల కన్నా చెప్పిన విధానం నచ్చింది నాకు. ఈయనతో కొన్ని రోజులు ప్రయాణం చేయగలిగితే నాకు ఎంతో లాభం కలుగుతుంది అనుకుంటూ, మధ్య మధ్యలో నాకొచ్చే సంకోచాలకు మీ నుండి సమాధానాలు కోరుతుంటాను క్షమించగలరు, ఇందాక రాధ అంటూ ఆపారు, పూర్తిచేయండి... ఆ రాధ... ఆయన రాధ పేరు చెప్పగానే ఒక్కసారిగా గాలి బలంగా వీచింది, ఇంటి ముందు గేటుని గట్టిగా వేసిన శబ్దం వచ్చింది నేను వచ్చే ముందు గేటు మూసే వచ్చాను, కొబ్బరి చెట్టు కింద ఉన్న గాజు సీసా పగిలిపోయింది పైనుండి బొండాం పడటం వలన, ఓ గాజు ముక్క ఎగిరివచ్చి మేము కూర్చున్న దగ్గరిలో పడింది, పని వాళ్ళు భయంగా చూస్తున్నారు నా వైపు. మీ మీద ఏం పడలేదు కదండీ అంటూ పగిలిన గాజు ముక్కలు తీసేసాను నేను, పని వాళ్ళు ఒక్క అడుగు కూడా కదపటం లేదు. ఇది రాధ గారి పని కాదు కదా అని నవ్వుతున్నాను నేను, ఆయన కూడా చిరునవ్వు నవ్వి చెప్పటం మొదలెట్టారు. నేను ప్రేమించిన అమ్మాయి రాధ, పాల నురుగు అంత తెల్లగా ఉండేది, గుండ్రటి మోము, చూడ చక్కనైన రూపు, పల్లెటూరి అమాయకత్వం అంతా తన చూపుల్లో కనపడేది. తనని మొదటి సారి చూడగానే ఎటువంటి మగాడైన కొద్దిగా చలించటం ఖాయం. అంతటి అందగత్తె. . రాధ గురించి చెప్పాలంటే ముందుగా గోవింద్ గురించి చెప్పాలి. (గోవింద్ పేరు చెప్పగానే గాలి నెమ్మదించింది) గోవింద్ రాధా వాళ్ళ బావ, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారో లేదో తెలీదు కాని, వీళ్ళ పెళ్లి మాత్రం వీళ్ళు పుట్టిన క్షణానే నిర్ణయించారు వాళ్ళ పెద్దలు. మిగిలిన కథ తర్వాత భాగంలో...