జరిగిన కథ: Part - 1, Part - 2, Part - 3, Part - 4
సినిమాలకు పనిచేయటం నావల్ల కాదండీ అని, నాకు ఎంతో సహాయం చేసిన ఆ దర్శకుడికి చెప్పి ఇంటికి వెళ్లాను. వెళ్ళగానే అమ్మకి చెప్పాను...ఎందుకూ అని అడగలేదు, తర్వాత ఏం చేస్తావ్ అని ఆరాలు తీయ్యలేదు, ఎమన్నా తిన్నావా ఏం చేయమంటావ్ అంది. అప్పుడే నాన్న వచ్చారు, ఇంత బాధ్యతా రాహిత్యంగా ఉంటె ఎలా, ఇప్పుడు ఏం చేస్తావ్ ఇంట్లో కూర్చొని, సినిమాలకు ఏమైంది బాగానే సంపాదిస్తున్నావ్ కదా, అసలు ఎందుకు వచ్చావ్, వచ్చేసావా పంపించేసారా ? నీకు నచ్చిన పనే కాదా? ఇలా ప్రశ్నల వర్షం కురిపించారు నాన్న. నేనేం మాట్లాడలేదు, ఆయనా ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత చాలా కాలం ఆయన నాతో మాట్లాడలేదు. నేను ఎవ్వరితో మాట్లాడలేక పోయాను. సరిగ్గా ఏడాది ఏమి చేయకుండా ఉండిపోయాను. చాలా రోజులు ఏం చేయాలో తెలీలేదు. ఒకరోజు అర్ధరాత్రి మెలుకువ వచ్చింది. కిటికీ లో నుండి ఆకాశాన్ని చూస్తూ కూర్చున్నాను. ఏమైందో తెలీలేదు కాని అసలు నీ లక్ష్యం ఏంటి అని అడిగినట్టు అనిపించింది. చుట్టూ చూసాను ఎవరూ లేరు. మళ్ళీ తదేకంగా అంతులేని శూన్యాన్ని దాచుకున్న ఆకాశంలో, శూన్యానికి మూలాన్ని వెతుకుతున్నాను. మళ్ళీ అదే ప్రశ్న వినిపించింది, నీ లక్ష్యం ఏంటి అని. గది మొత్తం చూసాను ఎవ్వరూ లేరు, కిటికీ లో నుండి చూసాను, బయట కూడా ఎవ్వరూ కనిపించటం లేదు. గుండె బరువుగా అనిపిస్తుంది, లోపల నుండి ఎవరో బయటకి రావాలని తాపత్రేయ పడుతునట్టు తెలుస్తుంది. కళ్ళు మూసుకున్నాను, మంచం మీద పడుకున్నాను, అప్పుడు అర్ధం అయ్యింది ఆ ప్రశ్న బయట ఎక్కడ్నుండో వస్తుంది కాదు, నా లోపలి నుండే వస్తుంది. నన్ను నేను ప్రశ్నించుకుంటుంన్నాను. సమాధానం చెప్పకుండా దాటేద్దాం అనే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అడిగేది నేనే, అడుగుతుంది నన్నే, చెప్పాల్సింది నేనే, చెప్పేది నాకే. నాకేం సమాధానం చెప్పాలో తెలీదు, ఎందుకంటే అప్పటివరకు ఆ ప్రశ్న నాకు ఎప్పుడూ ఎదురవ్వలేదు, నన్ను నేను ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. మొదటిసారి కలిగింది, వదలకుండా మెదులుతూనే ఉంది.
కొన్ని రోజులకు ఆ ప్రశ్నకు సమాధానం వెతకటం మానేసి, నన్ను నేను వెంబడించటం మొదలెట్టాను. నేనో పెద్ద రచయితను అవ్వటమే నా లక్ష్యం అని నన్ను నేను సమాధాన పరుచుకున్నాను. ఆ వెంటనే ప్రశ్నల పరంపర అసలు నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావ్, ఎక్కడ ఉన్నావ్, ఎక్కడికి వెళ్తున్నావ్, ఎక్కడికి వెళ్ళాలి...అంటూ నా మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయ్. ఏమవుతుంది నాకు అనే భయం, పిచ్చోడ్ని అవుతున్ననేమో అన్న బాధ, నేనెవరో తెలుసుకోవాలన్న కుతూహలం, ఏమి చేయలేని నిస్సహాయత అన్ని భావాలు ఒకేసారి దండయాత్ర చేస్తున్నాయ్ నా పైన. ఆలోచనల అంతు చూస్తే కాని నాకు మనశాంతి ఉండదని నిశ్చయించుకున్నాను. ఆలోచనల వెనుక అలుపులేని ప్రయాణం సాగించాను. ఊపిరి తీసుకోవటం మర్చిపోయి ఊహల ఊసులకు ఊ కొడుతూ కూర్చున్నాను. అంతరిక్షం చూసాను, పాతాళానికి వెళ్లాను నాలో నేను. తిరిగాను కొన్ని వేల మైళ్ళు...కాలు కదపకుండానే నాలో నేను, వెతికాను అంతులేని సమాధానాలు...ప్రశ్నలు తెలీకుండానే నాలో నేను, చూసాను వర్ణించలేని అద్భుతాలు...కళ్ళు తెరవకుండానే నాలో నేను, విన్నాను నాకే తెలీని ప్రవచనాలు...పెదాలు పలకకుండానే నాలో నేను, స్పర్శించాను సుందరమైన స్వప్నాలు...చేతులకు చెప్పకుండానే నాలో నేను. ఎదుటివారికి కనిపించేలా ఏమి చేయాలేదు, నాకే కనిపించకుండా ఎన్నో చేసాను నాలో నేను. నాలోకి నేను ప్రయాణం మొదలెట్టిన మొదట్లో చాలా వింతగా అనిపించింది, అంతా గాడాంధకారం. అంతర్మధనం మొదలింది, పూర్తయ్యేప్పటికి మొత్తంగా మారిపోయింది నేను అనుకునే మూలం. చిన్నప్పటి భయాల దగ్గరినుండి, చేసిన తప్పులు, చెప్పిన అబద్దాలు, చేసిన చెడ్డ పనులు, విన్న చెడు మాటలు, కలిగిన చెడ్డ కోరికలు, గుర్తుచేసుకోవటానికి కూడా ఇష్టపడని విషయాలు పలకరిస్తున్నాయ్ నన్ను, అసహ్యం కలిగించే ఆలోచనలు ఎదురవుతున్నాయ్ నాకు. ఇవన్నీ చూస్తుంటే నేనేనా ఇవన్నీ చేసింది, ఇంత దిగజారుడు మనిషినా నేను, అంత మూర్కత్వం ఉందా నాలో అనిపించింది. వీటిని తట్టుకొని దాటి ముందుకు వెళ్ళిన తర్వాత నేను చేసిన మంచి పనులు, గడిపిన ఆనంద క్షణాలు, తలుచుకొని మురిసిపోయే జ్ఞాపకాలు ఇవన్నీ ఎదురయ్యాయి. వాటిని చూసినప్పుడు ఇంత మంచివాడినా, ఇంత ఆనందంగా ఉన్నది నేనేనా అనిపించింది. కొన్నిసార్లు గొప్పవాడిగా, మరికొన్నిసార్లు పిరికివాడిగా కనిపించాను నాకు నేను. వీటి మత్తులోకి జారిపోకుండా తప్పించుకొని ముందుకు వెళ్తుంటే, నేనెవరు అనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతూనే ఉన్నాను, ఇప్పటికీ దొరకలేదు. ఒక్క ప్రశ్న నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది. నన్నే నాకు కొత్తగా పరిచయం చేసింది. నేనెవరు అంటే...
నేనో మనిషిని, జంతువుని, చెట్టుని, పుట్టని, నీటిని, నేతిని, స్మశానాన్ని, దేవాలయాన్ని, చలనం లేని రాతిని, అచంచలమైన ఆలోచనని, అంతులేని ఆశని, చావులేని కోరికని, ఆపలేని ఆవేశాన్ని, పనికిరాని విద్వేషాన్ని, తోడురాని రక్తసంబంధాన్ని, కానరాని ప్రాణాన్ని, చూడలేని భావాన్ని, వీడిపోని భయాన్ని, కాదనలేని మొహమాటాన్ని, వద్దనకూడని ఆశీసుని, లాభంలేని లోభాన్ని, ఉపయోగంకాని ద్వేషాన్ని, అంటరాని అంతరాన్ని, నిజంకాని ప్రపంచాన్ని, అనుచుకోలేని కామాన్ని, దాచుకోలేని ప్రేమని. అన్నీ నేనే, అన్నిటా నేనే, అందరిలో నేనే, అంతటా నేనే, ఆది నేనే, అంతం నేనే, జీవం నేనే, శవం నేనే, ప్రాణం నేనే, చావు నేనే, దైవం నేనే, దయ్యం నేనే. నీటి బుడగని, ఏటి పరుగుని, ఓటి కుండని, ఉట్టి బండని, పగటి వెలుగుని, చీకటి నలుపుని, సాటి మనిషిని, తోటి వ్యక్తిని, కాటి సొత్తుని, మేటి మత్తుని, నిన్నటి గుర్తుని, రేపటి ఆశని, నేటి నిజాన్ని. నేనో సముద్రాన్ని, తీరం వెంబడి నడిచేవాడికి అల్లకల్లోలం లా కనిపించే అలలు తప్ప ఇంకేం తెలీనట్టు, నా గురించి దూరంగా ఉండి చూసేవాడికి ఏమి తెలీదు. సముద్రం మధ్యలో కి వచ్చినప్పుడు అలల తాకిడి తగ్గినా ప్రశాంతమైన గంభీరాన్ని తట్టుకోలేనట్టు, నాతో తిరుగుతున్నంత మాత్రాన నా అసలు స్వరూపం తెలుసుకోలేరు. సముద్రం అసలైన అందం లోపలకి వెళ్తే కాని అర్ధంకానట్టు, నా గురించి అసలు నిజం నా ఆలోచనల లోతు తెలిస్తే కాని అర్ధం చేసుకోలేరు. నేనో అడవిని, చూడటానికి ప్రశాంతంగా కన్పిస్తున్నా క్రూర మృగాలు, సాదు జంతువులు రెంటిని కలిగి ఉనట్టు, నాలోనూ ఇద్దరు మనుషులు ఉంటారు. నేను పట్నాన్ని, అందమైన బాహ్య అలంకారాలతో ఊరిస్తునట్టు, నా రూపం ఆకర్షిస్తుంది. నేను పల్లెని, కపటం తెలీని అమయాకత్వం వెల్లివిరిచినట్టు, నా అంతరంగం అంత సుందరంగా ఉంటుంది. నేనెవరు అనే ప్రశ్నకోసం నన్ను నేను మదించి, శోధించి, వేధించి, చేధించగా వచ్చిన సమాధానం అది. అన్నీ నేనే అన్న ఊహే ఎంతో ఉల్లాసంగా అనిపించింది. అన్నీ నేనే అయినప్పుడు, నాది కాదన్న బాధ ఉండదు, నాకు దక్కదన్న ఏడుపు లేదు, నన్ను వీడిపోతుందేమో అనే భయం కలగదు.
నాలో నేను చేసిన ఈ ప్రయాణంలో ఎన్నో మర్చిపోలేని మజిలీలు, జ్ఞాపకాలు, భయాలు, అనుభూతులు సంపాదించుకున్నాను. అన్నిటికంటే చావు గురించి ఆలోచిస్తుంటే నాలో నేను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. మనషుల మధ్య లేనిపోని అంతరాలు, కానరాని కంచెలు, పనికిరాని విద్వేషాలు ఎందుకు అనిపించింది. ఖాళీ కడుపుని చూసి కన్నీరు కార్చని కులం, మాడిపోతున్న బతుకులని బతికించలేని మతం ఎవ్వరికోసం. చచ్చిపోతే అన్న తలపే మనిషిని మళ్ళీ పుట్టిస్తుంది, కొత్త ఆలోచన కలుగుతుంది. ఒక్క ఆలోచన...కులాల కంపుని సంప్రోక్షణ చేసి మరీ కడిగేస్తుంది, మతాల మత్తుని మడికట్టుకొని మరీ తుడిచేస్తుంది. మనిషికి మించిన మతం లేదు, కలిమిని తుంచేది కులం కాదు అని తెలిసేలా చేస్తుంది. ద్వేషాలు, ఆరాటాలు, విద్వేషాలు, ఆవేశాల అర్ధంలేని ఉద్దేశాలను ఆవిరి చేసేస్తుంది. బతకటం మానేసి జీవించేలా చేస్తుంది, ఫిర్యాదులు మానేసి ప్రేమించటం నేర్పిస్తుంది. మనిషికి మరో మనిషే తోడు తప్ప...అంతకు మించిన ఆస్తి, సంపద, గౌరవం, పరువు, ప్రతిష్ట, బలం, దైర్యం ఏదీ లేదని తెలుసుకొని సిగ్గుపడేలా చేస్తుంది. ఒక్క మాటలో మనిషిని మనిషిగా చూడాలే తప్ప ఇంకోలా కాదు అనే నిజాన్ని తెలుసుకున్నాను. ఆలోచనా స్థాయిలో వైరుధ్యం స్పష్టంగా తెలిసొచ్చింది నాకు. నేను దేనికోసం వెతుకుతున్నానో మర్చిపోయి ఏదేదో తెలుసుకున్నాను. నాకు మనుషులతో విభేదాలు లేవు, ఆలోచనలతోనే. అందుకే వేరే వారి ఆలోచనలకు తగ్గట్టుగా నేను ఆలోచించలేను కాబట్టి సినిమాలు నాకు నప్పవు అని ఏడాది క్రితం తీసుకున్న నిర్ణయానికి కారణం కనుకున్నాను. ఊరికే కూర్చుంటే కొండలైనా కరుగుతాయ్, బండలైన నలుగుతాయ్ అని ఎవరన్నారో తెలీదు కాని, నా మీద ఉన్న గౌరవం మాత్రం చాలా తగ్గిపోయింది ఇంట్లోవాళ్ళకు. ఏమి చేయనివాడంటే ఎవ్వరికైనా లోకువే కాదా, తేరగా కూర్చొని తింటాం అంటే ఎంతకాలం అని పెడతారు ఎవరైనా, అది తల్లితండ్రులైన సరే ఇంకెవరైనా సరే. ఎవ్వరికి బరువు కాకూడదు నేను అనుకున్నాను.
ఆలోచించటం, ఆలోచనలని కాగితం మీద పెట్టటం తప్ప ఇంకేం తెలీని వాడిని ఏం చేయగలను అని ఆలోచిస్తే అప్పుడు అనిపించింది, ఒక పుస్తకం ఎందుకు రాయకూడదు అని. నేనెప్పుడు పుస్తకాలు చదవలేదు, పుస్తకం ఎలా రాయాలో తెలీదు, అందుకే కొన్ని పుస్తకాలు చదవటం మొదలెట్టాను. కథ రాయటం అంటే ఏదోటి రాయటం కాదు, చదవటం పూర్తయ్యేప్పటికి ఒక్క పాత్రైన గుర్తుండిపోయేలా రాయాలి అనుకున్నాను. రాయాలంటే పాత్రలు కావలి, పాత్రలంటే నా అనుభావాల్లోంచే పుట్టుకువస్తారు, కాబట్టి నా అనుభవం పెరగాలి. పెరగాలంటే నేను తిరగాలి అని నిశ్చయించుకున్నాను. దేశంలో మంచి ప్రదేశాలు, అక్కడి మనుషులు, పరిస్తితులు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పద్దతులు, కట్టుబాట్లు, సాంఘీక అంతరాలు, మానసిక సంఘర్షణలు, స్థల పురాణాలు, పండుగలు, విధానాలు, వ్యవస్థలు ఇలా ప్రతీ దానిగురించి నాకు తెలిసుంటే బావుంటుంది అనుకున్నాను. “జీవనది” అనే పేరుతొ ఓ కథ రాయాలి అని సంకల్పించుకొని, దానికోసం ముందు దేశం అంతా తిరగాలి అని తీర్మానించుకున్నాను. మొదటి గమ్యం కంచి, ఎందుకంటే కథలన్నీ కంచికే చేరుతాయ్ అంటారు కదా అందుకే అక్కడికి వెళ్తే అన్ని ప్రాంతాల కథలు దొరుకుతాయ్ కాబట్టి దేశం మొత్తం తిరగాల్సిన పని ఉండదు అనిపించింది. అమ్మకి చెప్పాను, ఇలా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను అని. భయపడింది...ఎక్కడికి వెళ్ళినా, ఎప్పటికైనా మళ్ళీ తిరిగి ఇంటికే వస్తాను అని ప్రమాణం చేయించుకుంది. నాన్నకు చెప్పాను, నిర్ణయం తీసుకున్నాక ఆపటానికి నాకేం అధికారం లేదు కదా కాని మళ్ళీ వస్తావు కదా అని అడిగారు ఆయన కూడా. తప్పకుండా అని చెప్పి, సామాన్లు అన్నీ కూడగట్టుకొని చెన్నై ఎక్ష్ప్రెస్స్ సెకండ్ క్లాస్ టికెట్ కొనుక్కొని, ట్రైన్ కదలటం చూసి పరిగెత్తుకుంటూ మొదటి ప్లాట్ఫారం నుండి ఆరవ ప్లాట్ఫారం వరకు వెళ్లాను...
మిగిలిన కథ తర్వాతి భాగం లో...