Recap: Part - 1, Part - 2
తన పేరు శైలు. నాకంటే మూడేళ్ళు చిన్నది. అంటే నా కాలేజ్ అయ్పోయి మూడేళ్ళు దాటిపోతుంది అన్నమాట. తను వచ్చాక ఓ ఆరు నెలలు తనతో గడిచిపోయాయ్. మా ఇంటి పైనే కాబట్టి, తనతో మాట్లాడటం, కలవటం పెద్దగా ఇబ్బంది ఏం పడలేదు నేను. తనకీ నేనంటే ఇష్టమే. నా ఇష్టాన్ని చెప్పాను ఒకరోజు, వెంటనే ఒప్పుకుంది. చాలా ప్రేమ ఒకరంటే ఒకరికి. ఆలోచనలు, ఇష్టాలు, బాధలు, అనుభవాలు, జ్ఞాపకాలు, ఇబ్బందులు, కష్టాలు, ఆనందాలు ఇలా అన్నీ పంచుకున్నాం. పెళ్లి గురించిన ఆలోచన వచ్చింది, తనని చేసుకోవటం కంటే ఆనందం ఏముంటుంది నాకు, కాని నాకు కొంత సమయం కావాలి అని అడిగాను. ఎందుకంటే ప్రేమించే సమయంలో ప్రేమొక్కటి ఖర్చు చేస్తే చాలు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు సంపాదించుకోవచ్చు. కాని పెళ్లికి ప్రేమ ఒక అర్హత మాత్రమె, అవసరాలు చాలా ఉంటాయి కదా. అవసరాలు తీరాలంటే ప్రేమ ఖర్చు చేస్తే సరిపోదు, డబ్బు ఖర్చు చేయాలి. డబ్బు ఖర్చు చేయాలంటే ముందు సంపాదించాలి కదా. కాలేజి తర్వాత ఇంట్లో కూర్చొని ఏవేవో రచనలు చేయటం తప్ప, ఉద్యోగం గురించి ఆలోచించలేదు నేను. ఎప్పటికైనా ఓ పెద్ద రచయితను అవుతానని తెలుసు కాని అదెప్పటికో తెలీదు. రచనలైతే చేశాను కాని వాటి వలన నాకు పైసా రాలేదు. తనకి ఇదంతా చెప్పాను, మొదట్లో తనూ ఒప్పుకుంది. వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఓ రెండు సంబంధాలు ఎలాగో తన ప్రమేయం లేకుండా కుదరలేదు. తనకి ఆ తర్వాత కొద్దిగా భయం మొదలైంది ఏమో! నాతో కష్టం అనుకుందో, వాళ్ళ తల్లితండ్రులను కష్టపెట్టకూడదు అనుకుందో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని కష్టపెట్టారో ఏమో తెలీదు కాని, మూడో సంబంధం ఒప్పేసుకుంది. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో చెప్పలేదు కాని మా వాళ్ళని ఇబ్బందిపెట్టలేను అని చెప్పి వెళ్ళిపోయింది. నేనూ తనని ఇబ్బంది పెట్టాలనుకోలేదు.
తనంటే నాకు చెప్పలేనంత ప్రేముంది నిజమే, కాని ప్రాధాన్యతలు ఉంటాయి కదా. తనకి నా మీద ప్రేమే, కాని వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే ప్రాణం. ప్రాణం, ప్రేమ దేనికి ప్రాధాన్యత ఎక్కువ అనేది నేను చెప్పాల్సిన పనిలేదు కదా. నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టె రకం కాదు, తను నేనంటే ఇష్టం అన్నప్పుడు ఆనందించాను, నా కోసం ఎదురుచుస్తా అన్నప్పుడు మురిసిపోయాను, మా వాళ్ళని బాధపెట్టలేను అన్నప్పుడు గౌరవించాను, తన పెళ్లి అని తప్పకుండ రావాలి అన్నప్పుడు నరకం అనుభవించాను. తనకి పెళ్ళైపోయింది, వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోయింది, వాళ్ళు మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, నా ఆనందం నన్ను వదిలి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయాక తెలిసింది శోకం అంటే ఏంటి అనేది. శోకం ముందు ఏడుపు చిన్నగా అనిపించిది. నొప్పి కూడా ఏడిపిస్తుంది మనల్ని, భరించలేని బాధ మాత్రమె శోకం లోకి నెడుతుంది. శోకం చాలా నిశబ్దంగా ఉంటుంది, తట్టుకోలేకపోయాను. వద్దన్నా వచ్చేస్తున్నాయ్ కన్నీళ్లు. చెవులకు పట్టిన నిశబ్దాన్ని కన్నీళ్ళతో కడిగేద్దాం అనుకున్నట్టున్నాయ్ కనులు, వాటికేం తెలుసు పాపం. మనసు మతిస్తిమితం కోల్పోయిందేమో, పని చేయటం లేదు. ఇంతకు ముందులా మందలించటం లేదు, ఆశపెట్టటం లేదు, ఆలోచించటం లేదు, అస్సలు పట్టించుకోవటం లేదు నన్ను. మనసుతో ఎప్పుడూ పోట్లాడే తెలివి ఏం చేయాలో తెలీక బిత్తరపోయింది. ఓ మూడు నెలలు ఏం చేయలేదు, ఏం చేయాలనిపించలేదు. లేస్తున్నా, తింటున్న, పడుకుంటున్నా అంతే. మధ్యలో ఏం జరుగుతుందో తెలీదు.
ఈ పరిస్తితిలో ఉన్న నన్ను, మళ్ళీ మాములు లోకం లోకి తీసుకొచ్చింది శ్రీని. చీకటి కౌగిట్లో సేదతీరుతున్న నన్ను, వెలుగు వైపు నడిపించింది. మొదట్లో తట్టుకోలేకపోయాను, తనని తిట్టాను, ఇబ్బందిపెట్టాను, హింసించి ఉంటాను కూడా. కాని తను నన్ను వదలలేదు, నేను మాములుగా అయ్యేంతవరకు తోడుగా ఉంది. ఎలా వదలగలదు, స్నేహం అంటే అంతే మరి. ప్రేమ, స్నేహం రెంటిలో ఏది గొప్ప అంటే, స్నేహం అనే అంటాను నేను. శైలు నన్ను వదిలేసి వెళ్లిందని అని కాదు. స్నేహమే గొప్ప, ఎందుకంటే చాలా మందికి ప్రేమ శోకాన్నే మిగులుచుతుంది కాని ఒక్కరికి కూడా స్నేహం బాధని పరిచయం చేయదు. ప్రేమ వేసే శోకం అనే సంకెళ్ళని తెంచగల ఏకైక అస్త్రం స్నేహమే. శోకం చెరలో బందీగా ఉన్న నా సంకెళ్ళు తెంచిన స్నేహమే శ్రీని...శ్రీనిధి. శైలు గురించి తలుచుకున్న ప్రతీసారి కన్నీళ్లు వచ్చేస్తే, శ్రీని గురించి ఆలోచించిన ప్రతీసారి ధైర్యం వస్తుంది. నేను బాధపడితే ఓదర్చటానికి, నేను ఏడిస్తే ఊరడించటానికి, నేను ఓడిపోతుంటే ధైర్యం చెప్పటానికి, నా కోపాన్ని చల్లార్చటానికి, నా విజయాన్ని అభినందించటానికి, నా ఆలోచనని అర్ధంచేసుకోటానికి మా అమ్మ ఒక్కతే సరిపోదు అనుకున్నాడేమో దేవుడు అందుకే శ్రీని ని పంపించాడెమో అనిపిస్తుంది నాకు. నాకున్న ఒకే ఒక్క క్లోజ్, బెస్ట్, తొప్, డీప్, జాన్ జిగిరి జబ్బ...ఇంకేవైన పదాలు ఉంటె అవన్నీ వాడగల స్నేహితురాలు శ్రీని. శైలు పరిచయం అవ్వటానికి సంవత్సరం ముందు, నా చదువు అయిపోయిన సంవత్సరం తర్వాత పరిచయం అయ్యింది శ్రీని.
“మొదటిసారిగా నా ఫ్రెండ్ గాడిని తిడుతున్నప్పుడు చూసాను తనని. పాప చూడటానికి బావుందని...చాలా మర్యాదగా ప్రపోజ్ చేసాడట వాడు పాపం. నాకు వాడు అలా చెప్పాడు కాని, నిజానికి తన దగ్గర పిచ్చిగా వాగాడంటా, మనకి అస్సలు విషయం తెలీక నా ఫ్రెండ్ని తిడుతుందా అని కోపంగా వెళ్లి, ఏంటండీ...మావాడు మర్యాదగా మాట్లాడుతుంటే మీరలా తిట్టడం ఏం బాలేదు అన్నాను నేను. “ఏయ్...వాడేమన్నాడో తెలీకుండా వాగకు. అయినా నువ్వేవడ్రా మధ్యలో”. రా... రా నా ఇది టూ మచ్ అమ్మాయ్, పోనీలే అమ్మాయి కదా అని మర్యాదగా మాట్లాడుతున్నా, అదే అబ్బాయ్ ఐతే వేరేలా ఉండేది విషయం. “ఆహా!... ఏం చేస్తావ్ రా, ముందు మీ వాడు ఏమన్నాడో తెలుసుకోవోయ్, పో...” అని తను బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మావాడ్ని గట్టిగా అడిగితె చెప్పాడు, చాలా చెండాలంగా మాట్లాడాడు వాడు తనతో. “చాలా రోజులనుండి తిరుగుతున్నా రా దాని వెనుక, అస్సలు పట్టించుకోట్లే. అందుకనే కొద్దిగా కోపం వచ్చి అనుకోకుండా ఎదో అనేశా మామ.” నీ అయ్యరేయ్...ఇదే విషయం నాకు చెప్పాలి కదా మరి. ఎదో పొటుగాడిలా ఆ అమ్మాయి మీదకు వెళ్ళాను కదరా పాపం. అసలు నువ్ ఆ అమ్మాయ్ వెనుక పడుతున్నట్టు తనకు తెలుసా ?. తెలీదు అన్నాడు వాడు. చూడటానికి బావుందని చెప్పి లవ్ చేద్దాం, టైం పాస్ చేద్దాం అనుకున్నాడు వాడు. ఇలాంటివి నాకు నచ్చవు, అందుకే వాడికి ఆ అమ్మాయిని మరచిపోమని చెప్పాను. ఆ తర్వాత రోజు నేను వెళ్లాను తనని కలవటానికి.
క్షమాపణలు చెప్పాను, తెలీక జరిగిపోయింది అని. నేను ఫ్రెండ్స్ అని హ్యాండ్ షేక్ కోసమని చేయి చాచాను, తను ok అని చెప్పింది. అదేంటండి పుసుక్కున ఒప్పేసుకున్నారు, ఇంకా ముక్కూ మొహం తెలీని వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటని తిడతారేమో అనుకున్నా. “నువ్వు నాకు తెలుసోయ్, నాకు ఎన్ని లెటర్స్ రాసావో నీకే తెలీదు.” అదేంటి !? తనేం చెప్తుందో అర్ధంకాక అడిగాను నేను. “కాలేజి లో నేను మీ జూనియర్ బాబు.” ఓహ్...అర్ధమైంది. కాలేజిలో నిన్ను ఎప్పుడూ చూడలేదే !? “నీకు లెటర్స్ రాయటానికి సమయం ఉండేది కాదు, ఇంకా మమ్మల్ని ఎక్కడ చూస్తావ్ లే. కాని నీకు గుర్తుందా, ఎవడికోసమో నాకు రాసిన లెటర్ లో... హుస్సేన్ సాగర్ కంపుకోడుతుందని ట్యాంక్ బండ్ మీద నడవకుండా ఉంటామా!. మీ అన్నయ్య దిట్టంగా ఉన్నాడని నిన్ను లవ్ చేయకుండా ఉంటామా! అని రాశావ్. నువ్ రాసిన లెటర్స్ అన్నిటిలో ఇదే బిస్కెట్ లైన్ అనుకుంటా. ఆ పోలికేంటి బాబోయ్ !! ” అని నవ్వుతుంది తను. నేనూ మొహమాట పడుతూ నవుతున్నాను. ఆ తర్వాత...రోజూ కలిసే వాళ్ళం, బాగా కలిసిపోయాం. తను చాలా ముక్కుసూటి మనిషి, లోపలోకటి బయట ఒకటి టైపు కాదు. నాకు అలా ఉండేవాళ్ళంటే చాలా అభిమానం. తనకు నాకు ఆలోచనల స్థాయిలో ఎన్నో సారుప్యాలు, అన్నిటికంటే బాగా కనెక్ట్ చేసిన విషయం ఏంటంటే నేను విపరీతంగా అభిమానించే హీరో కి తనూ అదే స్థాయి అభిమాని.
మన దేశంలో రెంటికే లాజిక్లు, రీజన్లు, నిజాలతో కూసంత కూడా అవసరం లేదు. అవి ఒకటి అనుమానం, రెండోది అభిమానం. అనుమానం ఎంత దగ్గరి వాళ్ళని ఐనా ఇట్టే దూరం చేసేస్తుంది. అభిమానం పరిచయం లేని వాళ్ళని కూడా ఆ..ట్టే దగ్గర చేసేస్తుంది. అందులోనా మన తెలుగు వాళ్ళకి హీరోల మీద ప్రేమ మాములుగా ఉండదు కదా, మా వాడి అభిమాని అని తెలిస్తే చాలు అలా! కనెక్ట్ అయిపోతాం. మా క్లోజ్ నెస్ చూసి, మా ఫ్రెండ్ ఒకడు, “ఏంట్రా విషయం” అని వెకిలిగా నవ్వుతూ అడిగాడు. నేను ఏం లేదు ఫ్రెండ్ రా, అని చెప్పినా వినకుండా విసిగించాడు. “అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఏంట్రా, అమ్మాయిలంటే అది తప్ప ఇంకేం ఉండదు రా అబ్బాయిలకు, అది కూడా తనలాంటి మాంచి ఫిగర్ జస్ట్ ఫ్రెండ్ అంటే ఎలా నమ్మమంటావ్ !?” అని వేరే ఉద్దేశ్యం వచ్చేలా అడిగాడు. మామా...తను నా ఫ్రెండ్, అంటే ఫ్రెండ్ అంతే. మంచి స్ట్రక్చర్ ఉన్న ప్రతీ అమ్మాయిని అలానే చూడాలా ? తప్పటంలేదు తప్పుగా మాట్లాడుతున్న క్షమించు!...మీ అక్కో చెల్లో ఎంతో సూపర్ గా ఉన్నా తనని వేరేలా చూడలేవ్ గా. ఇది కూడా అంతే రా, తోడపుట్టినవాళ్ళు తప్ప మిగతా అందరిని అలానే చూడాలా?. నీ బూతు బుర్రకి ఆ ఒక్క ఫీలింగ్ ఏ తెలుసేమో, దాన్ని మించినవి, నీకు ఆనందాన్ని ఇచ్చేవి చాలా ఉన్నాయి. వాటి గురించి తెలిసిన వాళ్ళకు నీకు తెలిసిన ఆ ఒక్క ఫీలింగ్ తుచ్చంలా అనిపిస్తుంది. వాటి గురించి నీకు చెప్పాలని నాకూ ఉంది, కాని అర్ధం చేసుకునే తెలివి నీకులేదు. నువ్వు యాభై ఏళ్ళ తర్వాత కలిసినా మేము ఇలాగే క్లోజ్ గా ఉంటాం. ఫ్రెండ్ అంటేనే అది రా.... వాడికి అర్ధం అయినట్టు లేదు, నేను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను. తను దూరంగా ఉండి విన్నట్టు ఉంది “థాంక్స్ రా బాబు. నువ్వు కూడా అందరిలా చేప్తావేమో అని భయమేసింది” అని కంట్లో లైట్ గా కనీళ్ళతో చెప్పింది తను. హేయ్...మా శ్రీనిగాడు కూడా మాములు అమ్మాయిలా ఫీల్ అవుతున్నాడే అని నవ్వుతూ అంటుంటే తనూ నవ్వుతుంది. ”
శైలు కలిసే సమయానికి శ్రీని పై చదువులకోసం వేరే దేశం వెళ్ళింది. శైలు గురించి శ్రీనికి అన్నీ తెలుసు. ఆ దేవుడికి అన్నీ తెలుసు కదా, అందుకే నేను బాధలో ఉన్నానని తనకి సెలవలు ఇప్పించి ఇక్కడికి పంపించాడేమో. నన్ను మళ్ళీ మామూలుగా మార్చేసి వెళ్ళిపోయింది తను. ఆ తర్వాత శైలు గురించి మర్చిపోయి, సెట్టిల్ అవ్వాలని నిశ్చయించుకున్నాను. సీరియస్ గా సినిమాల కోసం కథలు రాయటం మొదలెట్టాను. సినిమా కథల ప్రయాణం అటువంటి గమ్యానికి చేరుస్తుందని కలలో కూడా ఊహించలేదు నేను.
మిగలిన కథ తర్వాతి భాగం లో