జరిగిన కథ: (Part - 1)
సూపర్ మార్కెట్ దగ్గర రాధలా కనిపించిన అమ్మాయి దగ్గరికి వెళ్లి అడిగాను, ఏవండీ మీరు రాధ గారు కదా అని. “సారీ...నా పేరు మీకెలా తెలుసు ?”. సృష్టించినదే నేను కదా అని నాలో నేను నవ్వుకుంటున్నాను. మీకో బావ ఉండాలి, అతని పేరు గోవింద్ కదా. “బావ కాదు, భర్త. అతని పేరు గోవింద్ రాజు. మీకెలా తెలుసు మా గురించి ?”. ఎలా తెలుసంటే...అని చెప్పబోతుంటే వెనుక నుండి ఎవరో కదిలించారు. “మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది” అని అడుగుతున్నాడు ఓ పోలీస్ ఆఫీసర్. యస్ ఐ అనుకుంటా, నడుము పక్కగా తుపాకీ ఉంది. ఈ పాత్రని నేనెప్పుడు రాయలేదే, పోలీస్ నాకోసం ఎందుకు వచ్చుంటాడు అని నాకు మొదట భయం వేసింది, ఏదైనా తప్పు చేసానేమో అని. అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కాని గుర్తురావటం లేదు. భయంగా తడబడుతున్న మాటలతో, అవును సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అన్నాను కొద్దిగా కంగారుతో కూడిన స్వరంతో. “మీది స్థంభాద్రి కదా ?”. అవునండి, మీది అక్కడేనా ? “కొత్త తరంగం జూనియర్ కాలేజి కదా నువ్ చదివింది ?” అని మొహం లో ఓ విధమైన నవ్వుతో కూడిన ఆనందంతో అడుగుతున్నాడు.
కొద్దిసేపు మాట్లాడకుండా ఆలోచిస్తున్నాను, ఎక్కడో చూసిన మొహమే, చాలా దగ్గరివాడిలా అనిపిస్తున్నాడు కాని గుర్తుకురావటం లేదు. ఇందాక వచ్చేప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ చూడకుండా వచ్చేసాను, డబ్బులకోసం వచ్చుంటాడా అంటే ట్రాఫిక్ పోలీస్ కాదు, మరి ఎందుకు వచ్చుంటాడు. పైగా కాలేజి గురించి కూడా అడుగుతున్నాడు, అతని డ్రెస్ కి ఉన్న పేరు చూసాను అప్పుడు తెలిసింది. ఓహో...నాకు గుర్తోచ్చేసింది, వీడు ఇంటర్ లో నా సీనియర్. నాతో లవ్ లెటర్స్ రాయించుకున్న వారిలో వీడు నెంబర్ వన్. వీడికి నాకు ఓ మరిచిపోలేని మధుర జ్ఞాపకం ఒకటి ఉంది. వాడు ఓ లెటర్ రాయమని నా దగ్గరికి వచ్చాడు, అదే సమయంలో నేనూ ఓ అమ్మాయికి ప్రపోస్ చేద్దాం అని లెటర్ రాస్తున్నా. వాడు పక్కనే కూర్చొని ఏం రాస్తున్నావో చెప్పు...చెప్పు అంటూ చెవుల తుప్పోదిలేలా చావకొడుతుంటే తట్టుకోలేక నేను రాసిన లెటర్ మొత్తం చదివి వినిపించా. “సూపర్ ఉంది బా... ఇంతకీ ఎవరికి రా” అన్నాడు. అదే రా అమ్మాయిల బి సెక్షన్ లో అని నేను పేరు చెప్పేలోపు, “బా...నాకు ఇంకో లెటర్ రాసివ్వాలి రా, రాయటమే కాదు ఈసారి నా పేరు చెప్పి నువ్వే తనకి ఇవ్వాలి. లేపోతే నా మీద ఒట్టే” అని నాకు అవకాశం ఇవ్వకుండా ఒట్టు వేయించుకున్నాడు. సర్లే రా, ఇంత చిన్న విషయానికి ఒట్లు అట్లు ఎందుకులే కాని, నేను నీ పోరికి ఇస్తా, నువ్వు నా పోరికి ఇవ్వాలి ఓకే నా అన్నాను. మేము ఇష్టపడ్డ అమ్మాయిలు ఇద్దరు సాయంత్రం సమయంలో కాలేజి కింద ఉన్న బేకరికి వస్తారని అక్కడ ఎదురుచూస్తున్నాం. ముందు వాడు ఇష్టపడిన అమ్మాయి వచ్చింది, నేను వెళ్లి...ఆర్మీ లో సీక్రెట్ ఏజెంట్ లా ఏమి చెప్పకుండా, లెటర్ మా వాడు ఇవ్వమన్నాడు, చదువుకో అని కళ్ళతోనే సైగ చేసి ఇచ్చి వచ్చాను. ఈలోపు నేను ఇష్టపడిన అమ్మాయి వస్తుంది, బా... ఆ అమ్మాయే రా అని చేయెత్తి చూపించా. ఆలోపు వాడు ఇష్టపడిన అమ్మాయి వచ్చి లెటర్ నాకిచ్చి, చాలా బాగా రాసావ్, కాని నాకంటే చిన్నోడివి కదా బావోదు అని చెప్పి, వాడి వైపు చూస్తూ ఓ చిరునవ్వు ఇచ్చి వెళ్ళిపోయింది.
అప్పటివరకు టూత్ పేస్ట్ ప్రకటనలో హీరొయిన్ లా పల్లికలించి నవ్వుతున్న మా వాడు, ఒక్కసారిగా పళ్ళు కొరకటం మొదలెట్టాడు కోపంగా. వాడి లవర్ కి ఇచ్చిన లెటర్ లో నా పేరు రాసాను గా అదే కోపం అనుకున్నాను నేను, కాని అది కాదు అసలు కారణం. నేను ఇష్టపడిన అమ్మాయి వాడి చెల్లెలు. అప్పటి వరకు తను వాడి చెల్లి అని నాకు తెలీదు, వాడు ఎప్పుడూ చెప్పలేదు. మరీ ఇంట్లో అందరి గురించి తెలుసుకునేంత దగ్గరి స్నేహం కాదనుకోండి. నాకంటే పెద్దోడే అయినా, ప్రేమలేఖల మూలాన నాకు బాగా దగ్గరివాడు అయ్యాడు. తను వాడి చెల్లి అని తెలిసిన తర్వాత క్షణంలో నేను అక్కడి నుండి మాయం అయ్యాను. ఆ తర్వాత రెండో రోజో, మూడో రోజో వాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు అనుకోండి, వాడి చెల్లివైపు చూడొద్దు అని. ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత లెటర్స్ కోసం కాని, మరే విషయం కోసమనికాని వాడు నేను మాట్లాడుకున్నది లేదు. ఇంటర్ తర్వాత మళ్ళీ ఇప్పుడే వాడిని చూడటం. అప్పుడు వాడి చెల్లికి లైన్ వేశానని ఇప్పుడు లాకప్ లో వేసి కుమ్ముతాడా ఏంటీ అని ఖంగారుగా ఉంది మనసులో ఓ పక్క.
నాకు గుర్తొచ్చినా కూడా తెలీనట్టు మాట్లాడుతూ ఎలా తప్పించుకుందామా అని ఆలోచిస్తుంటే, “ఏ మాత్రం మారలే బా నువ్వు, అదే ఖంగారు, అవే తప్పించుకునే మాటలు, అదే ఎధవ నవ్వు !”. హమ్మయ్య... బా అన్నాడంటే కోపం ఏం లేదన్నమాట, మాట్లాడొచ్చు. ఎలా ఉన్నావ్ బా... ఏంటి యస్ ఐ ఆ ?. “అవును బా... ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు.” చాలా మారిపోయావ్ రా, అప్పుడు బక్కగా బిస్కెట్ లా ఉండేవాడివి, ఇంతకీ హరిణి ఎలా ఉంది. పెళ్లి జరిగింది అంట కదా, కనీసం మాటవరసకు కూడా పిలవలే కదా బా. “బా... నీకు తెలీదు రా, మా ఇంట్లో వాళ్లకి కులం అంటే ఎంత పట్టింపో. నువ్వు మా చెల్లిని లవ్ చేస్తున్నావ్ అంటే నాకు హ్యాపీనే బా... కాని ఇంట్లో వాళ్ళు పెద్ద గొడవ చేస్తారు. ఐనా నా చెల్లికి కూడా నీమీద ఎటువంటి అభిప్రాయం లేదు. అందుకే అప్పుడు అలా చేయాల్సి వచ్చింది. మంచి మిత్రుడ్ని కోల్పోవటం ఇష్టం లే బా నాకు.” మంచి మిత్రుడు అనగానే వెనక్కి, పక్కకి చూసాను, ఎవరైనా వచ్చారేమో అని. ఓస్...అది నేనేనా. సరేలే రాసిలేకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారులే. ఏంటి సంగతులు మరి. “నా పెళ్లి బా...” అని చెండాలంగా సిగ్గు పడుతూ ఆహ్వాన పత్రిక తీసి నా చేతిలో పెట్టాడు. ఎవరు బా... ఆ దురదృష్టవంతురాలు అనుకుంటూ పత్రిక తెరిచి చూసాను. అనసూయ, ఏంటి ఆ అమ్మాయేనా? అదే రా, నీకోసం లెటర్ రాసి ఇస్తే, నన్ను మెచ్చుకున్న అమ్మాయి తనే కదా. పాపం నేను ఇలా అంటుంటే వాడి మొహం చిన్నబోయింది. ఏదైనా సంతోషం బా... అప్పుడు దక్కకపోయినా ఇప్పుడు నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. వచ్చే వారమే కదా, తప్పకుండా వస్తా. “రావద్దు...నీకు చూపించాలని వచ్చా బా అంతే. నువ్ పెళ్ళికి వచ్చావనుకో...నువ్వు మా చెల్లిని చూస్తూ తనని ఇబ్బంది పెడతావ్, అనసూయ నిన్ను చూస్తూ నన్ను ఇబ్బంది పెడుతుంది, నేను ఎవర్ని చూడాలో తెలీక, దిక్కులు చూడలేక ఇబ్బంది పడాలి అప్పుడు నువ్వు ఎటువంటి ఇబ్బంది, సిగ్గు, మానం, అభిమానం లాంటివి ఇసుమంత కూడా లేకుండా కడుపు పగిలేలా దొబ్బితిని మరీ వెళ్తావ్. అర్ధమైంది అనుకుంటా !!!”.
ఆరి చెండాలుడా!... మంచి మిత్రుడు అంటే ఇదేనేట్రా, నువ్వు ఆ రోజు జరిగింది ఏది మర్చిపోలేదు రా. సర్లే ఇద్దరూ సుఖంగా బతకండి, నేను రాన్లె. “నువ్వు వచ్చినా ఆపేయమని మా వాళ్ళకి చెప్తాలే బా...”. ఛీ! అంతగా చెప్పాక కూడా వచ్చే ఎదవ లా కనపడుతున్నానా. “రేయ్...ఓ రోజు మా చెల్లివైపు చూడను అని ప్రమాణం చేసి, ఆ తర్వాత రోజు తనతో మాట్లాడటానికి ప్రయత్నించావ్, నిన్ను నమ్మలేను బా... అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్న.” ఆహా... మరి అంత జాగ్రత్త పడే జింకవి నాకు పత్రిక ఇవ్వటం ఎందుకో!... “అను ని నేను పెళ్లి చేసుకుంటున్నా అని తెలిస్తే నీ మొహం ఎలా ఉంటుందా అని చూడాలనిపించింది బా... సర్లే కాని ఇందాక ఏంటి ఒక్కడివే ఎదో మాట్లాడుకుంటున్నావ్ ?” నువ్ వచ్చేముందా, రాధ అని నాకు తెలిసిన అమ్మాయ్ లే. “రేయ్...నేను వచ్చేప్పటికి నీ ఎదురుగా ఒక్కరు కూడా లేరు రా. దూరం నుండి చూసి వస్తున్నా, నీలో నువ్వే ఎదో మాట్లాడుకుంటున్నావ్”. ఓహ్...అంటే రాధ రాలేదా, నేనే ఊహించుకున్నానా అంతసేపు అని మనసులో అనుకుంటూ, అది ఎదో పాట పడుతున్నా బా... హి హి హి. “ఆ నికృష్టపు నవ్వు ఆపరా బాబు, సర్లే మరి నాకు పనుంది వెళ్తున్నా. ఇది నా నెంబర్, ఏదైనా పనుంటే కాల్ చెయ్. పెళ్ళికి రావద్దు చెప్తున్నా !”. నీకో దండంరా వెళ్ళు బాబు, సిగ్గున్నోడు ఎవడైనా వస్తాడా ఇంతగా చెప్పాకా. వెళ్ళు రానులే.
వాడు వెళ్తున్నాడు నేను వాడినే చూస్తూ నాలో నేను...నిజానికి హరిణి మీద నాకున్నది ప్రేమ కాదు ఆకర్శన, అనసూయ మీద వాడికి కూడా అంతే అనుకున్నాను. కాని పెళ్లి చేసుకుంటున్నారు అంటే వాడిది ఆ రోజుల్లోనే ప్రేమ అన్నమాట. బడికి, కాలేజికి మధ్యన వారధి ఇంటర్. బడిలో చదువులు, ఆటలు, అలకలు, పితురులతో జీవితం గడిచిపోతే; ఇంటర్ లో కి వచ్చేప్పటికి ఓ కొత్త అనుభూతి పరిచయం అవుతుంది. ఆ దేవుడు భలే చిలిపివాడండి బాబు, యుక్త వయసులో ఎదో మరిచిపోలేని మాయని పరిచయం చేస్తాడు. ఆ మాయ పంచే మైకంలో అమ్మాయిని చూడగానే అప్పటివరకు తెలీని ఓ ఆకర్షణ లాగేస్తుంటుంది. అప్పటివరకు చదివిన బౌతిక శాస్త్ర నియమాలన్నిటికి నిదర్శనాలు కనిపిస్తుంటాయ్. గురుత్వాకర్షణ శక్తిని మించినది అయస్కాంత శక్తి అని తెలుస్తుంది. గణిత శాస్త్ర సిద్ధాంతాలు తప్పనిపిస్తుంటాయ్, ముఖ్యంగా ఒకటికి ఒకటి తోడైతే రెండు కాదు...ఒక్కటే కదా అనే సందేహం మొదలవుతుంది. రెండేళ్ళు క్షణం తీరిక లేకుండా పుస్తకాలతో మల్ల యుద్ధాలు చేసినా కూడా, మరిచిపోలేని గురుతులను ఎన్నిటినో గుండెల్లో దాచుకునేలా అందిస్తుంది. వీడు రావటంతో ఒక్కసారిగా నా ఇంటర్ రోజులు గుర్తోచ్చేసాయ్. మొహం మీద నవ్వొచ్చేసింది. తర్వాత కొద్దిసేపటికి ఇంటికి వెళ్లాలని గుర్తొచేసింది.
అవి తలుచుకుంటూ సరుకులు తీసుకొని ఇంటికి వెళ్లాను. అమ్మ హాల్ లో ఎవరితో మాట్లాడుతుంది, ఇంతకు ముందు చూసినట్టు గుర్తులేదు వాళ్ళని. ఎవరు? అని కనుసైగతో అమ్మని అడిగాను. మా ఇంటి పైకి అద్దెకి కొత్తగా వచ్చిన వాళ్లట. సోఫా కూడా కనపడనంత దిట్టంగా ఉన్నాడు ఒకతను, అతని భార్య పాపం అతనిలో సగం కూడా లేదు. నన్ను చూడగానే ఓ చిన్న నవ్వు నవ్వారు ఇద్దరు. మా అమ్మ పక్కగా కూర్చున్నాను, ఈ లోపు టీ తీసుకోండి అని అడుగుతుంది ఓ అమ్మాయి. మొహం సరిగ్గా చూడకుండానే ఈ కొత్త పనమ్మాయి ని ఎప్పుడు పెట్టావే ? ఖరీదైన బట్టలు వేసుకొని మరీ పని చేస్తుంది అని అడిగాను అమ్మని. “హా హా హా...పనమ్మాయి కాదు! తను వాళ్ళ అమ్మాయి, నేను చేస్తాను అని చెప్పినా వినకుండా చేసుకోచ్చింది, చాలా మంచి పిల్లలా ఉంది, శైలజ అంట పేరు, మీ కాలేజి లోనే ఫైనల్ ఇయర్ చదువుతుంది” అని చెప్పింది అమ్మ. అప్పుడు చూసాను తనని, నా కనులు రెప్పవేయటం మరిచిపోయి తన కనులను సూటిగా చూస్తుంటే, తన కనులు ఎటూ తప్పించుకునే దారిలేక బిత్తరపోయి చూస్తున్నట్టు ఉన్నాయి. ఆ క్షణం నాకు తెలీదు, కృష్ణుడికి రాధలా, మీరా భాయ్ కి కృష్ణుడిలా నాకు తను అవుతుందని.
మిగిలిన కథ తర్వాతి భాగంలో...