తన పక్కన ఎర్రగా పడి ఉన్న ఆకారాలు, రక్తమోడుతున్న తన శరీరం, చూడగానే ప్రసవించిన ఆవులాగా కనిపించింది శరణ్య. నాకు నోటి వెంట మాట పెగల్లేదు. ఏడుపు, వెక్కిళ్ళు, భయం, ఏమి అర్థం కాని తనం, తో తనని ఎత్తుకున్నాను. తను నా కాలరును నిస్సహాయంగా పట్టుకుంది. పక్కన పడి ఉన్న ఆ ఆకారాలను చూస్తుంటేనే వాంతి వచ్చేలా అనిపించింది. వాటి వైపు వేలు చూపిస్తూ ఒపికలేకున్నా తను చిన్నగా ఏడుస్తోంది. అవి తన శరీరం లోపలి భాగాలు అని నాకు అర్థమైంది! ఒళ్లంతా ఏవగింపు. ఒక్కసారి నా వెన్ను చల్లారిపోయింది. వాటిని తీసుకుని శరణ్య చున్ని లో వేసి తనను మోసుకుని పరిగెత్తాను. రోడ్డు మధ్యలోకెల్లగానే ఒక ఆటో కనపడింది. వాడు నన్ను చూడగానే ఆటో ఆపాడు. శరణ్యను నా వడిలో పడుకోబెట్టుకున్నాను." త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి పోనీ!" అని భయం,బాధ,కోపం, అన్ని కూడదీసుకుని అరిచాను. వాడెంత వేగంగా వెళ్ళాడో తెలియదు కాని, నా గుండె వేగం మాత్రం అప్పటికే హాస్పిటల్ చేరిపోయింది. శరణ్య చలికి మూలుగుతోంది. త్వరగా పోనీ భయ్యా అని ప్రాధేయపడుతూ ఏడ్చాను.” క్రిస్, క్రిస్” అని చిన్నగా తను అంటోంది.తన కళ్ళలో కళ్ళు పెట్టి, తన జుట్టుని నిమిరాను.తను నా collar ఇంకా వదలలేదు. మూసుకు పోతున్న తన కళ్ళతో నన్ను చూస్తూ ఉంది. ఇన్ని రోజులు తనకు నా మీద ఉన్న ప్రేమ అంత ఇపుడు తన కళ్ళలో కనపడుతున్నాయి.
“నిశ్శబ్దంలో నీ కళ్ళు నీ నోటి కంటే చాలా లోతుగా, ధృడంగా నాతో మాట్లాడుతున్నాయి. నీ కళ్ళు నన్ను నీ మనస్సు లోని భావాల దగ్గరికి తీసుకెళుతున్నాయి. ఎందుకంటే ఈసారి నీ భావాలకు నీ మాటలు అడ్డు తగలట్లేదు కనుక” హాస్పిటల్ రానే వచ్చింది. ఆటో లోనుండి దిగి లోపలికి పరిగెత్తాను. ఒకసారి డాక్టర్ చూడాలి. నా పరుగు చూసిన అక్కడి తీసుకుని ఆటో లో ఉన్న తన దగ్గరికి పరిగెత్తారు. సీటులో శరణ్య, పక్కనే తన అవయవాలు. ఒక భయానకమైన చిత్రం. తనను stercher పైన పడుకోబెట్టి త్వరత్వరగా లోపలికి తీసుకువెళుతున్నారు. దారి పొడుగునా రక్త ప్రవాహం. ”ఇది emergency case! త్వరగా కి తీసుకెళ్ళండి, fast!” అని అప్పుడే అక్కడికి చేరుకున్న ఒక wardboy కేక వేసాడు.నాడి పట్టుకుని pulse check చేసిన డాక్టర్, మౌనంగా నా వైపు చూశాడు. నాకు అర్థంకాలేదు. ”Sorry son, she is no more” అని బేలగా చెప్పాడు. నా తల గింగిరాలు తిరగడం మొదలుపెట్టింది. అసలు ఏంటి ఇదంతా? తనకు ఏమైంది? ఇలా ఎవరు చేసారు? కళ్ళలోనుండి నీళ్ళు తన్నుకుని వస్తున్నాయి. ఆ వార్త నా శరీరానికి సహించలేదో ఏమో, వాష్ బేసిన్ లో మొత్తం కక్కేసాను. వెక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తున్నాను.
జనవరి 12, 2015, హైదరాబాద్, I H S హాస్పిటల్
అవే తనను నేను చివరిసారిగా చూసిన క్షణాలు. ఇక నాకేది మిగలలేదు. ఎందుకంటే నాకెవ్వరు లేరు. ఉన్నదంతా శరణ్య మీద నాకున్న ప్రే…మ.
అది కాస్త ఇపుడు మాయ అని తేలింది. ప్రపంచమంతా ఒక్కసారి నిర్జీవంగా, శూన్యంలా కనపడింది. కాళ్ళలోని శక్తిని భూమి లాగేసుకున్తున్నట్లు అలా మోకాళ్ళ పై కూలబడిపోయాను. తనని బ్రతికించుకోవాలనే ఆరాటం వ్యర్తమైపోయింది. తనను మోసి రక్తమోడిన నా చేతులను అలా చూస్తూ ఉండిపోయాను. తన రక్తపు ఎరుపు నా చేతులలో ఇంకిపోతోంది. అలా నా రెండు చేతులను చూస్తూ ఉండిపోయాను. అందమైన శరణ్య కళ్ళు చూడటానికి అలవాటు పడ్డ నా కళ్ళు తన రక్తాన్ని చూడలేకపోయాయి. కన్నీటిని దుప్పటిలా పరుచుకుని బాధను నా మనసుకు అందకుండా చేయాలని అవి ప్రయత్నించాయి. కాని నా మనస్సు లోని బాధ ఒక అగ్ని పర్వతంగా మారి ఆ వేడి తో కన్నీటి పొరను చీల్చేస్తోంది. అలా ఆ వెచ్చని కన్నీరు నా ఎర్రని చేతుల పై రాలుతున్నాయి..తనను ఇక మరిచిపో అన్నట్లు ఆ నీరు తన రక్తాన్ని నా చేతుల నుండి కడిగేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కాని నా మనసుకి కూడా తెలుసు. అక్కడ అయ్యింది మానిపోయే గాయం కాదు. చచ్చే దాక వేధించే జ్ఞాపకం. తనతో గడిపిన క్షణాలు అన్ని ఇప్పుడు విషం పూసిన బాణాల్లా నా గుండెకి గాయం చేస్తున్నాయి. శరణ్య ఒక అందమైన కల అయ్యుంటే బాగుండేది. అక్కడున్నవారందరు ఏవేవో అడుగుతున్నారు. నాకేది అర్థంకాలేదు. జరిగింది జరిగినట్టు చెప్పాను. తన ఇంటి నెంబర్ ఇచ్చాను. నాకిక చేత కాలేదు .
తను చనిపోయిన ఆ హాస్పిటల్ లో నాకిక ఉండాలి అనిపించలేదు. అలా నడుచుకుంటూ ఏ గమ్యం లేని ఒక ప్రయాణం మొదలుపెట్టాను. కంటి నుండి నీరు ఆగకుండా కారుతూనే ఉంది. గుండెలు అలిసేలాగా ఏడ్చుకుంటూ రోడ్డు ఎటు వెళుతుందో కూడా లెక్కచేయకుండా నడుస్తున్నాను. నా ఏడుపు చూడటం ఇష్టం లేదో మరి ఏమో కాని పైన ఆకాశంలోని నల్లని మేఘాలు వాన ని కురిపించడం మొదలెట్టాయి. ఆ ఆకాశ గంగ నా కన్నీటిని ప్రపంచానికి కనపడనివ్వలేదు. శరణ్య అనవసరంగా నా జీవితంలోకి వచ్చింది. లేదు, నేనే రానిచ్చాను. పుట్టుక తోనే అనాథ అయిన నాకు తన ప్రేమలో తల్లిని పరిచయం చేసింది. తప్పు చేసినప్పుడు మందలించి ఒక తండ్రిలా మళ్ళీ దారి చూపించింది. నా బాధ, ఆనందం, కష్టం ,సుఖం, అన్ని తానై నా ఒంటరితనాన్ని మాయం చేసింది. ఇప్పుడు ఒక్కసారిగా అందనంత దూరానికి వెళ్ళిపోయి మళ్ళీ, మరోసారి నన్ను అనాథగా మిగిల్చింది. ఇక నేను దేనికోసం బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి?నన్ను పెంచినోడు నేను చెత్త కుండీలో దొరికానని చెప్పినపుడు కూడా ఇంత బాధ అనుభవించలేదు. శరణ్య లేని ప్రపంచం లో నాకేం చేయాలో తెలియట్లేదు. వాన ఎక్కువైంది. దానికి గాలి కూడా తోడై బలంగా వీస్తోంది. చీకటి, వాన, ఈదురుగాలి. ఇవి మూడు చాలవన్నట్టు రోడ్డు అంతా ఒకటే కార్లు, ఒకటే శబ్దం. శరణ్య ఇక లేదని నేనేడుస్తుంటే ఏంటి వీళ్ళ బాధ. అర్థమైంది, నన్ను చూసి ఈ లోకం వెక్కిరిస్తోంది. మరో దేవదాసు తయారయ్యాడురో అని బిగ్గరగా నవ్వుతోంది ఈ ప్రకృతి. నవ్వనీ, ఈ పాడు లోకం కోసం నేను ఏడవట్లేదు. నా శరణ్య కోసం, నా శరణ్య గోస్వామి కోసం నా మనసు ఒక ఎగిసిపడే నిప్పురవ్వలా కాలుతోంది, కరిగిపోతున్న మంచులా నా కళ్ళు ఏడుస్తున్నాయి. ఈ లోకం మొత్తం మట్టి కొట్టుకుపోని. నాకిక అనవసరం.
ఇంతలో ఒక ఎర్ర కారు వేగంగా వెళ్ళడమే కాకుండా నా మీద బురదనీరు పడేస్తూ వెళ్ళింది. నాకు ఒళ్లంతా కారం పూసినట్టు అనిపించింది. ఒక రాయి తీసుకుని రోడ్డు మధ్యలోకి పరిగెడుతూ రాస్కెల్!అని ఉక్రోషంతో దాని వైపుగా విసిరాను. ఇంతలో వెనుక నుండి గెట్టిగా హారన్ వినబడింది. తిరిగి చూశాను. అలా చూడగానే కళ్ళలో పెద్ద లైటు పడింది. చేతులు అడ్డు పెడుతుండగానే మీదికొచ్చేసింది.. అది గుద్దగానే అలా ఎగిరొచ్చి రోడ్డు పై పడిపోయాను. చాలా నీరసంగా అనిపిస్తోంది. కళ్ళకు మబ్బులు కమ్ముతున్నాయి.“శరణ్యా!నన్నూ తీసుకుపోవే, నీతో లాకునిపోవే” అని గుండెలు అదిరేలా అరిచాను, ఏడ్చాను. కారు హెడ్ లైట్ కళ్లపై బలంగా పడుతోంది. “Oh my God! Is he all right? Shit, he is bleeding damn it! త్వరగా ఎత్తండి హాస్పిటల్ కి తీసుకువెళదాం…..” అని ఒక ఆడ గొంతు లీల గా వినపడుతోంది .నోటి నుండి ఏదో కారుతోంది. మెల్లిమెల్లిగా ఒళ్లంతా తెలికైపోతోంది. కాని శరణ్య మాత్రం ఇంకా నవ్వుతూనే కనపడుతోంది. అంతే, ఇక అంతా నిశ్శబ్ధమే. నిర్జీవమే.