శేషాచల పర్వత చివరి భాగంలో రెండు కొండల మధ్య గండి పడినట్టుగా ఉండడం, మరియు ఇక్కడ వీరంజనేయులు కొలువై ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని గండి క్షేత్రం అని పిలుస్తారు. కడప జిల్లా కేంద్రం నుండి సుమారు 30కిలోమీటర్ల దూరంలో ఈ గండి క్షేత్రం వెలసిల్లుతుంది. ఈ క్షేత్రానికి స్థానికులు మాత్రమే కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడి శ్రీరాముడు చిత్రించిన వీరంజనేయ స్వామి వారి ప్రతిమను దర్శించుకుంటారు. ఇక్కడ ప్రవహిస్తున్న పాపాఘ్ని నదిని పరమ పుణ్యనదిగా భక్తులు భావిస్తారు.
కేవలం తండ్రికిచ్చిన మాటను నెరవేర్చుకోడానికి శ్రీరాముడు సీత, లక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తున్న సమయంలో రావణుడు సీతమ్మ తల్లిని అపహరిస్తాడు. ఆ సమయంలో రామ లక్ష్మణులు సీతమ్మ అన్వేషణలో ఈ గండి ప్రాంతం మీదుగా వెళ్ళడం జరుగుతుంది. ఆ కాలంలో ఈ ప్రాంతంలో వాయుదేవుడు తపస్సు చేసేవారట. ఇదే ప్రాంతానికి వచ్చిన రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇవ్వడానికి రావాలని వాయుదేవుడు కోరగ ఇది సరైన సమయం కాదని, తమ పరిస్థితిని వివరించి సీతను కాపాడి రావణ సంహారం చేసిన తర్వాత నీ కోరికను తప్పక నెరవేరుస్తామని రాముడు మాట ఇస్తాడు.
రావణ సంహారం చేశాక అయోధ్యకు తిరుగు ప్రయాణంలో ఉన్న శ్రీరాముడు సీత లక్ష్మణ సమేతంగా ఇదే క్షేత్రంలో వాయుదేవుని ఆతిథ్యం స్వీకరిస్తారు. సీత జాడ తెలుసుకోవడంలో మరియు రావణ సంహారంలో తనకు సహకరించినందులకు శ్రీరాముడు తన బాణంతో ఆ కొండమీద హనుమ రూపాన్ని చిత్రీకరించారట. ఆ చిత్రం పూర్తి కావస్తున్న సమయంలో లక్ష్మణుడు అయోధ్యకు వెళ్ళాలని తొందరపెట్టడంతో ఆ చిత్రం సరిగ్గా పూర్తిచేయలేదట. ఆ తర్వాతి కాలంలో ఓ శిల్పి సాయంతో శ్రీరాముడు చిత్రించిన రూపాన్ని ప్రతిమగా చెక్కించారట.. అలా శ్రీరాముడు చిత్రించిన చిత్రమే ఇప్పుడు పూజలందుకుంటున్న ప్రతిమని పురాణాల ద్వారా తెలుస్తుంది.
సీతరామ, లక్ష్మణులు తన ప్రాంతానికి వస్తున్నారని తెలిసి వాయుదేవుడు తూర్పు పడమర కొండల మధ్య "బంగారు తోరణాన్ని" కట్టారని పురాణం. ఈ బంగారు తోరణం కేవలం పుణ్యాత్ములకు మాత్రమే కనపడుతుందని భక్తుల నమ్మకం. ఒకసారి బ్రిటీష్ వారి కాలంలో బ్రిటీష్ దొర సర్ థామస్ మన్రో ఈ బంగారు తోరణాన్ని దర్శించానని ఆనందంతో చెప్పారు. ఆ తర్వాత కొంత కాలానికే ఆయన మోక్షం పొందారు. ఆ సంఘటనకు గుర్తుగా ఆలయంలో ఇప్పటికి సర్ థామస్ పేయింటిగ్ ఏర్పాటుచేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.