జరిగిన కథ – రాధే గోవింద, GREP01
"ఏంటండీ! ఇట్టా వచ్చారు?" ఆ మాట, ఆ స్వరం వినగానే నా శరీరం జలదరించిపోయింది, మెదడులో న్యూరాన్లు లక్ష మైళ్ళ వేగంతో subconscious part వైపు పరిగెడుతున్నట్టు, నా చుట్టూ నా కనులకు కనిపించని మరో ప్రపంచం ఉన్నట్టనిపించింది. ఆ స్థితిలో, గోవిందుని చూడాలని ఆతురుతలో, అంతుపట్టలేని ఆనందంతో, ఎదో సాధించాననే ఉద్వేగంతో జట్కాలోపలికి చూసాను. అద్భుతం, అప్పటివరకు కనిపించిన రాధ, వినిపించిన గోవింద్, కదిలొచ్చిన జట్కా, నిల్చున్న స్థలం అన్నీ మాయం అయిపోయి అంతులేని శూన్యం లో నిల్చున్నాను. "రాజ్... రాజ్... రాజ్..." అంటూ లీలగా అరుస్తున్నట్టుగా అను గొంతు, ప్రతీ క్షణానికి తీవ్రత పెరుగుతూ వినిపిస్తుంది ఆ శూన్యంలో. అను గొంతు ఆగిపోయిన రెండు క్షణాల తర్వాత, ఉన్నపళంగా పెను ఉప్పెనలా ఒక్కసారిగా అన్ని వైపుల నుండి నీరు ఆ శూన్యంలో నన్ను ముంచేస్తుండగా, "రాజ్" అంటూ అను అరవడం వినిపించింది. చూపు ఒక్కసారిగా ఈ ప్రపంచంవైపుకు మరలింది. ఖాళీ వాటర్ జార్ పట్టుకొని, ఆందోళనగా, ఆవేశంగా, కన్నీళ్లు నిండిన కళ్ళతో నిస్సహాయంగా బెడ్ పక్కన నిల్చొని ఉంది అను.
మొదటిసారి గోవింద్ నాతొ మాట్లాడాడు అను అంటూ ఆనందంగా చెప్తుంటే, కోపం జారి జాలిగా చూస్తుంది అను. 'నేను రాధ వెనుకనే వెళ్ళానా, అప్పుడు ఒక జట్కా వచ్చి ఆగింది, రాధని అందులోకి లాగాడు గోవింద్, నేను ఎవరా అని చూసేలోపు...' ఇలా నేను గుక్కతిప్పుకోకుండా జరిగింది చెప్తుంటే, అను జార్ పక్కన పెట్టి, తను నా పక్కన కూర్చొని, నన్ను దగ్గరికి తీసుకొని, గట్టిగ హత్తుకొని, నా చెవిదగ్గరగా... "రాజ్..." అనగానే... నేనేం పట్టించుకోకుండా అప్పటివరకు జరిగినది చెప్పబోతుంటే, అను ఇంకా గట్టిగ హత్తుకొని, "రాజ్... రాజ్... నేను చెప్పేది విను, ప్లీజ్ ఒక్క రెండు నిమిషాలు, నేను చెప్పేది విను, ప్లీజ్" అంటూ ఏడుస్తూ అడిగింది. నాకేం అర్ధం అవ్వలేదు. హే! ఏమైంది. "ఒక్క రెండు నిమిషాలు, ఏమి మాట్లాడకుండా ఇలానే ఉండవా, ప్లీజ్". కాని, అను... "ప్లీజ్!". తనడిగిన రెండు నిమిషాలు కాస్త అరగంట పైన అలానే హత్తుకొని ఉండిపోయింది, ఏమి మాట్లాడకుండా. ఆ తర్వాత... ఏంట్రా అను. హ్యాపీ నా. ఇంకో గంట ఇలానే ఉండిపోదామా ? ఏంటి చెప్పు, ఏమైంది. "మనం ఇంకోసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి". ఎందుకమ్మా, అతను ఏమి లేదని చెప్పాడు కదా. "ఒక్కసారి, చివరిసారి, నాకోసం". వెళ్దాం కానీ, నీ భయమేంటి ? "ముందు పదా!" ఇప్పుడా ? "ఇప్పుడే".
అను...కార్ కీస్ తీసింది, డోర్ లాక్ చేసింది, కార్ డోర్ తీసింది, ఇంజిన్ స్టార్ట్ చేసింది, రేసర్ కు పోటిగా డ్రైవ్ చేసింది, సాధారణంగా అరగంట పట్టే దూరాన్ని ఆరు నిమిషాల్లో దగ్గర చేసింది. తన పెదాలు కదలకపోయినా, పదాలు పలకకపోయినా, ముఖం ఏదో చెప్పాలని ఆరాటపడుతుంటే, ఆనందం తప్ప మరోటి తెలీని తన కంటి వెలుగుని ఆందోళన కమ్మేసింది, చిరునవ్వును నిర్దాక్షణ్యంగా గెంటేసిన బాధ పెదాలను ఆక్రమించింది, చక్కనైన చెక్కిలి చికాకు చెరలో బందీ అయ్యింది. అలాంటి అనుని చూడలేదు నేనింతవరకు, తనెందుకు బాధపడుతుందో తెలుసుకోవడానికే అవసరం లేకపోయినా సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చాను. రిషి(సైకియాట్రిస్ట్), మమ్మలని చూడగానే ప్రత్యేకంగా పలకరించి లోపలకి పిలిచాడు. రిషి "హాయ్! ఎలా ఉన్నారు ? స్టొరీ ఎక్కడివరకు వచ్చింది, నేనే వచ్చి కలుద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడండి హాస్పిటల్ లో క్షణం తీరిక ఉండటం లేదు. ఏం తీసుకుంటారు, టీ ? కాఫీ ? ..." మా ప్రతిస్పందనతో సంబంధం లేకుండా రిషి మాటల ప్రవాహం సాగుతూనే ఉంది అను ఆపేంతవరకు. అను "డాక్టర్...!". రిషి "సారీ అమ్మా, మిమ్మల్ని చూడలేదు. రైటర్ గారితోనే మాట్లాడేస్తున్నాను. మీరెలా ఉన్నారు." నన్నుఓ ఐదు నిమిషాలు బయటకు వెళ్ళమని అడిగింది అను. నేను వచ్చి బయట కూర్చున్నాను, తను ఓ మూడు నిమిషాల తర్వాత బయటకు వచ్చింది. ఆ వెంటనే రిషి నన్ను లోపలకు రమ్మన్నాడు.
నేను లోపలకు వెళ్ళగానే కూర్చోమని "మీ స్టొరీ ఎక్కడివరకు వచ్చిందండి ?" అని అడిగాడు రిషి. కథైతే ఈపాటికి ఐపోయుండేది రిషి, జీవితం కదా. "అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు మీరు రాసేది ఎప్పుడో జరిగిన కథని ?". నాకు ఊహ తెలిసిన దగ్గరినుండి జరిగిందని వింటున్న విషయం కనుక. "మీకెందుకు ఆ విషయం గురించి అంత ఆసక్తి ?". తెలీదు, చిన్నప్పటినుండి వింటూ పెరిగిన విషయం కదా. ఊర్లో అందరికి తెలిసిన పేర్లు, అందరూ భయపడే విషయం, పూర్తిగా ఎవ్వరికి తెలీని కథ. ఎవ్వరిని అడిగినా అలా జరిగిందట, ఇలా జరిగిందట అని చెప్పడమే కాని ఇదీ జరిగిందని చెప్పగా వినలేదు. ఎందుకింత ఆసక్తి అంటే, ఇందుకు అని చెప్పలేను."సరే కానీ, దయ్యాలున్నాయంటారా ?". తెలీదు. లేవని చెప్పలేను, ఉన్నాయని చెప్పకూడదు కదా. "అదేంటి ?". లేవని చెప్తే, నువ్వెవరు చెప్పడానికి అనే వాదన. ఉన్నాయంటే, నువ్వు చెప్తే నమ్మేయ్యాలా అనే ప్రశ్న. అందుకే తెలీదు. "హా హా...సరే, ఇంతకీ మీరు రాధ కలల నుండి బయటపడ్డారా ? నిద్ర పడుతుందా సరిగా ?". లేదండి, ఆ కలకు నాకేదో సంబంధం ఉనట్టు అనిపిస్తుంది. ఏదో తెలియచేయాలని నా మనసు ప్రయత్నిస్తునట్టు, నా గురించి నాకే తెలీని విషయాలు ఉనట్టు, నా నుండి నేనే ఏదో దాస్తునట్టు అనిపిస్తుంది రిషి. "ఔనా! అసలు ఈ కథలు రాయడం కాకుండా ఇంకేం చేస్తుంటారు ?". మనకు ఇది తప్ప ఇంకేం తెలీదు కదా. "అంటే, రోజంతా ఈ కథల గురించే ఆలోచిస్తుంటారా?". అంతేకదా మరి. "ఎన్ని రోజుల నుండి రాస్తున్నారు ఈ కథ ?". గత సంవత్సరం నుండి. "రాధే గోవింద అయిపోయిందని విన్నాను". నేనూ అయిపోయిందనే అనుకున్నాను. కానీ, రాధ గురించి రాసిన మూడు నెలల తర్వాత నుండి ఈ కలలు మొదలయ్యాయి. చెప్పను కదా, ఏదో విషయం నేను పూర్తిగా రాయలేదు. అది ఇప్పుడు నన్ను పట్టుకుంది, రాసేంత వరకు వదిలేల లేదు ఈ ఆలోచన. "రాధ జరిగినది మొత్తం చెప్పింది కదా, మళ్ళీ దేని గురించి మీ ఆలోచన ?". గోవిందరాజులు గురించి. "మళ్ళీ అదే కధని గోవిందరాజులు వైపు నుండి చెప్పాలనా ?". కాదు, గోవిందరాజులు గురించి, అతని చావు వెనుకున్న అసలు నిజం గురించి అనుకుంట, నాకు ఇంకా పూర్తి అవగాహన రావడం లేదు నేనేం తెలుసుకోబోతున్నానో." రాధే గోవింద లో చెప్పారు కదా, గోవింద్ ని డాక్టరే మందు పెట్టి చంపేసాడని." అదే, గోవింద్ ఎలా చనిపోయాడో తెలుసు. ఎందుకు అనేది ఓ ప్రశ్న. "అతని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా బతికున్నారా ?". వందేళ్ళ క్రితం జరిగిన కథ కదా, నాకు తెలిసి ఎవ్వరు బతికి ఉండే అవకాశం లేదు. "మరి ఎలా తెలుసుకుంటారు ?". నాకు అదే తెలీడం లేదు."పోనీ రాధకు ఉనట్టు అతనికి గురించి చెప్పే ఆధారాలు ఏమైనా ఉన్నాయేమో ? డైరీలు గట్రా...". రాధ చెప్పిన ప్రకారం ఉండకపోవచ్చు. ఎందుకంటే గోవింద్, చదువుకోలేదు కదా.
"మీకు వచ్చిన కల గురించి చెప్పండి ?". నాకు అప్పటివరకు కలలో జరిగిన అనుభవం మొత్తం చెప్పాను. ఇంతకీ ఏంటి రిషి, ఎందుకు ఇదంతా అడుగుతున్నారు. నాకేదైనా సమస్యా ? "No, No... అలాంటిదేం లేదు. నిజానికి నాకు కూడా ఏమి అర్ధం అవ్వడం లేదు." ఇంకేవైన పరిక్షలు చెయ్యలా? ఏవైనా సరే, చేయించండి. అను అలా ఉండడం నాకు మనస్కరించడం లేదు. అది కూడ నా వలన తనలా బాధపడడం నన్ను తొలిచేస్తుంది. "మీరేం బాధపడకండి, ఈ రోజు మీ పరిస్తితికి కారణం తెలుసుకోకుండా పంపించను. మీ కలలకు కారణం తెలుసుకోవాలంటే ముందు మీరు నాకో సాయం చెయ్యాలి". చెప్పండి. "మిమ్మలని హిప్నోటిక్ స్టేట్ లోకి తీసుకెళ్ళడానికి మీ సాయం కావాలి". నా గురించి మొత్తం తెలుసుకొని, మా ఆవిడకు చెప్పారు కదా!."హా హా, సినిమాల్లో చూపించినట్టు కాదు లెండి. హిప్నోటిక్ స్టేట్ లో మీరు పూర్తి స్పృహలోనే ఉంటారు, మీరు చెప్పే ప్రతీది, మీరు చేసే ప్రతీది మీకు తెలుస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీ mind లోని subconscious part తో contact అవుతాం అంతే". అలా అయితే పర్లేదు. మీరేం చేయమన్న చేస్తాను. "ఈ డాలర్ ని చూస్తూ ఉండండి...ఏమి ఆలోచించొద్దు...హాయిగా నిద్రపోండి....నా మాటలు తప్ప మీకేమి వినిపించడం లేదు..."
"ఇప్పుడు మీకు ఆరేళ్ళు..."
బాగా ఏడుపొస్తుంది. మామిడి తోటలో మేము ఆడుకునే చెట్టు మొదట్లో రక్తం కక్కుకోని తాతయ్య చనిపోయాడు. అంతకుముందు రోజే, తోట చివర స్మశానం దగ్గరగా ఎవరో ప్రేమ జంట చనిపోయారు. మొదటిసారి స్మశానం గురించి వింటున్నాను. దయ్యాలు తిరుగుతున్నాయ్, ఎవ్వరు ఆ తోటవైపు, స్మశానం పరిసర ప్రాంతాల వైపు వెళ్ళొద్దని సుబ్బిగాడు దండోరా వేసాడు. అమ్మ నన్ను తోటవైపు వెళ్ళనివ్వడం లేదు.
"ఇప్పుడు మీకు ఎనిమిదేళ్ళు..."
"మీ పేరేంటి ? " గోవింద్ రాజ్.
అమ్మకు తెలీకుండా బాలు, శీను, చందు, మురళి తోటలోకి వెళ్లాం. దాదాపు రెండేళ్ళ తర్వాత తోటవైపు వచ్చాను. పండ్లన్నీ పాకానికి వచ్చాయి. మంచి మంచి పండ్లు కోసుకొని తిన్నాం. చందు గాడు వద్దన్నా వినకుండా, తోట చివర కంచె దాటి స్మశానం మొదలు వరకు వెళ్దాం అని అందరిని తీసుకెళ్ళాడు. మొదటిసారి తోట చివరికి రావడం, అక్కడికి వెళ్ళగానే ఉన్నపళంగా భీకరమైన వర్షం కురిసేలాగా నల్లగా మబ్బు కమ్మేసింది, అంతా చీకటిగా అయిపొయింది, అక్కడి నుండి ఇంటికి ఎలా వెళ్ళామో గుర్తులేదు. తను వద్దని చెప్పినా వినకుండా తోటకి వెళ్ళినందుకు అమ్మ కొట్టిన దెబ్బలు మర్చిపోలేను.
"ఇప్పుడు మీకు పదేళ్ళు..."
"మీ పేరేంటి ? " గోవింద్ రాజ్.
చాలా సంవత్సరాల క్రితం మూసేసిన గ్రంధాలయాన్ని పునఃప్రారంభించారు. అమ్మ నన్ను గ్రంథాలయానికి తీసుకెళ్ళింది. పేరుకే పునఃప్రారంభం కానీ, గ్రంథాలయం లో అన్నీ పాతవాటినే దుమ్ము దులిపి పెట్టారు. అమ్మ, నేను అడుగుపెట్టగానే గ్రంధాలయం మొత్తం దట్టపు గంధపు వాసనతో నిండిపోయింది. అది ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ అంతుచిక్కలేదు. గోడల మీద ఫోటోలలో ఒక అమ్మాయి కుర్చీలో కూర్చోనుంటే, ఒకాయన వెనుక నిల్చొని ఉన్న ఫోటో తప్ప మిగతావి అన్ని పాడైపోయి ఉన్నాయి. ఎందుకో ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి నాకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించింది, ఆమె పక్కనున్న వ్యక్తి ముఖం కనిపించకుండా పెన్నుతో గీకేసి ఉంది. వాళ్ళిద్దరి ఫోటో కిందుగా ఓ కిటికీ ఉంది, అందులో నుండి చూస్తుంటే ఆ గ్రంధాలయం వెనుక భాగం కనపడుతుంది. వెనక్కు వెళ్లకుండా కంచె వేశారు, కిటికీ లో నుండి చూస్తుంటే ఆ గ్రంధాలయం వెనుక పాడు బడిన ఆయుర్వేద మందులు, కాషాయాలు గాజు బుడ్డిల్లో బూజు పట్టి ఉన్నవి కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, వాటి కింద రెండు కుర్చీలు, వాటికి కాసింత దూరంలో ఎడ్ల కొట్టం ఇవన్నీ చూస్తుంటే నేనింతకు ముందెప్పుడో అక్కడకి వచ్చినట్టు అనిపిస్తుంది.
"ఇప్పుడు మీకు పన్నెండేళ్ళు..."
"మీ పేరేంటి ? " గోవింద్ రాజ్.
గ్రంథాలయం తెరిచిన దగ్గరినుండి ఊర్లో కొంతమంది చనిపోయారు. ఉన్నపళంగా రక్తం కక్కుకోని చనిపోయేవాళ్ళు. ఆ గ్రంథాలయం లో ఒకప్పుడు ఉండే వైద్యుడే అలా చేస్తున్నాడని, మళ్ళీ ఒకప్పటిలా జరుగుతుందేమనని భయంతో గ్రంథాలయాన్ని మూసేశారు. ఆ తర్వాత ఎవరు ఆ విధంగా చనిపోలేదు. ఆ డాక్టర్ గురించి చెప్పమని అమ్మను చాలా సార్లు అడిగాను. ఏమి లేదు చెప్పడానికి అంటూ చెప్పేదికాదు. కానీ, ఊర్లో అందరు ఏవేవో మాట్లాడుకునే వాళ్ళు ఆ గ్రంథాలయం ఉన్న ఇంటి గురించి, అక్కడ జరిగిన విషయాల గురించి. ఎందుకో ఒక రోజు అమ్మ నాతో ఆ గ్రంధాలయం వైపు ఎప్పుడూ వెళ్ళొద్దని ప్రమాణం చేయించుకుంది.
"ఇప్పుడు మీకు పదమూడేళ్ళు..."
"మీ పేరేంటి ? " గోవింద్ రాజ్.
ఊరి చివర ఉన్న బావిలో ఈత కొట్టడానికి వెళ్లాను. నాకు ఈత రాదని చెప్తున్నా వినకుండా వెనుక నుంచి నీటిలోకి తోసేసాడు చందు. దాదాపు 30 అడుగుల ఎత్తు నుండి నాలుగడుగుల లోతున్న నీళ్ళలో పడ్డాను. నీటిలో ఓ మూడడుగుల లోతుకు వెళ్ళగానే నెత్తికి ఏదో బలంగా తగిలింది. ఊపిరాడడం లేదు.
ఆ తర్వాత...హిప్నోటిక్ స్టేట్ లో ఉన్న గోవింద్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ మాట రావడం లేదు. ఊపిరి పోతున్నట్టుగా కొట్టుకుంటున్నాడు. నరాలు బిగుసుకుంటున్నాయి, దేనినుండి తప్పించుకోడానికి శతవిధాల ప్రయత్నం చేస్తునట్టు కనిపిస్తున్నాడు. ఓ ఐదు నిమిషాల తర్వాతా నెమ్మదించి, స్థిరంగా కదలకుండా ఉన్నాడు. ఒంటి నిండా చెమటలు పడుతున్నాయి. రిషికి ఏమి అర్ధం అవ్వలేదు. గోవింద్ ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
"ఆ తర్వాత ఏం జరిగింది ?" అని అగిడాడు రిషి. గోవింద్ ఏమి మాట్లాడకుండా చలనం లేకుండా ఉన్నాడు. కొద్దిసేపు ఏమి చెయ్యాలా అని తీక్షణంగా ఆలోచించాడు రిషి. ఆ తర్వాత...
"మీ వయసెంత ?" పదమూడు. "మీ పేరు ?" గోవిందరాజులు.
మిగిలిన కథ తర్వాతి భాగంలో 09 10 2016